Friday, February 22, 2013

(స్నేహం + ప్రేమ)²= జీవితం - Part-II


Please click here for Part-I  .......!

నేను క్లాసు లోకి అడుగుపెట్టగానే డోర్ ప్రక్కన మొదటి బెంచ్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. డోర్ ప్రక్కన బెంచుల్లో అమ్మాయిలు కూర్చొని ఏం చేస్తారు. ఏం చేయగలరు. అసలు అక్కడ కూర్చునే అర్హత అబ్బాయిలకి మాత్రమే ఉంది. అవును మరి, అబ్బాయిలైతే డోర్ ప్రక్కనే ఉంటే లెక్చరర్ కళ్ళుగప్పి క్లాస్ మధ్యలో నుండి వెళ్ళిపోగలరు. క్లాస్ జరుగుతుండగా ఎవరూ చూడకుండా లోపలికి వచ్చేయగలరు. పరీక్షల్లో క్లాస్ బయట నుండి లోపలికి కాపీలు అందించుకోగలరు. వీటిలో ఏ ఒక్కటైనా అమ్మాయిలు చేయగలరా? మరి ఏం చేద్దామని అక్కడ కుర్చున్నారు.? ఇలా అలోచిస్తూ వాళ్ళని దాటుకుని అటు ప్రక్క వరుసలో మొదటి బెంచ్ లో కూర్చున్నా.
 అప్పటికే అక్కడ ముగ్గురు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ముగ్గురూ పుస్తకాలు తీసి తెగ చదివేస్తున్నారు. కాలేజ్ మొదటి రోజు, ఇంకా క్లాసే మొదలవలేదు, వీళ్ళేంట్రా బాబు అప్పుడే ఏదో ఆఖరి పరీక్షలు అన్నట్లు చదివేస్తున్నారు అనిపించింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసాను. ఏదో ఫ్లాపు అయిన సినిమా కి వచ్చినట్లు అక్కడో ఇద్దరు, అక్కడో ముగ్గురు కూర్చుని ఉన్నారు. కొందరు పుస్తకాలు తిరగేస్తుంటే ఇంకొందరు పరిచయాలు చేసుకుంటున్నారు.
 ఒక పావు గంటలో క్లాస్ మొత్తం నిండిపోయింది. ఒక పది నిమిషాలకి లెక్చరర్ వచ్చారు. ఆమె తనని తాను పరిచయం చేసుకుంది. తను మాకు చెప్పబోయే సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఆమెకి దాదాపు 35 సంవత్సరాల వయసు ఉంటది. చామంచాయ రంగు, ఒక 5 అడుగుల ఎత్తు ఉండొచు. మేకప్ కొంచెం ఎక్కువైనట్లుంది. సినిమాల్లో ఇంగ్లీష్ లెక్చరర్ అంటే ఏదో అప్సరసల్ని చూపించినట్లు చూపిస్తారు. కాని తను అలా లేదు. మేకప్ లేకపోతే మాములుగా అయినా ఉండేదేమో కాని మేకప్ వల్ల కొంచెం ఎబ్బెట్టుగా కనపడుతుంది. తను ఒక్కొక్కర్ని లేపి క్లాస్ కి పరిచయం చేసుకోమంది. మొదటి బెంచ్లో మొదటి వ్యక్తిని నేనే. నాతో మొదలు పెట్టమంది. పైకి లేచి నా పేరు బి.చరణ్ కృష్ణ అని చెప్పాను. వెంటనే ఆమె బి అంటే? అని అడిగింది. నా ఇంటిపేరుతో ఆమెకేం పని కాలేజ్ బిల్డింగ్ కి మా ఇంటి పేరేమైనా పెట్టుకుంటారా అని మనసులో తిట్టుకుని బలుపు అని  చెప్పా. వెంటనే క్లాస్ మొత్తం ఘొల్లుమని నవ్విన శబ్ధం. ఆ నవ్వు కి నా మొహం చిన్నబోయింది. మా లెక్చరర్ వెంటనే 'ఎంతుందేంటి?' అని ఒక కుల్లు జోక్ వేసింది. మళ్ళీ ఘొల్లుమన్న శబ్ధం. ఈ సారి నా మొహం ఎర్రబడింది. వెంటనే 'అరవై కెజీలు ఉంది. మీకు కావాలంటే ఒక పావు కిలో పొట్లం కట్టిస్తా' అన్నా. ఆ సమాదానం వినగానే మా లెక్చరర్ మొహం మాడిపోయింది. అవును నీకు నిజంగానే ఒళ్ళంతా బలుపే అర్ధమవుతుందిలే, సర్లే తమరి ర్యాంకు ఎంతో అని అదిగింది. ఆ ప్రశ్న కి నేను సమాధానం చెప్పలేకపోయాను. మౌనం గా నిల్చున్నాను. ఆమె కి విషయం అర్ధమైనట్లుంది. నా పిలక దొరికిందని లోపల్లోపల సంబరపడిపోయింది. తమర్నే సార్! మీ ర్యాంకు చెప్పండి అని మళ్ళీ రెట్టించి అడిగింది. ఇక తప్పక 'ర్యాంకు రాలేదు మేనేజ్ మెంట్ కొటాలో సీటు వచ్చిందీ అని చెప్పాను. అంతే ఇక అందుకుంది 'అవును మరీ, అన్నేసి కిలోలు బలుపు ఉంటే ర్యాంకులు ఎలా వస్తాయి. అమ్మా బాబు లక్షలు తగలేసి సీటు కొంటారులె అని బలుపు అని ఇష్టమొచ్చినట్లు వాగింది. ఇంక నేనేం మాట్లాడలా. మౌనంగా కూర్చున్నా అవమాన భారంతో. ఆమె అహం సంతృప్తి పడింది. ఇంక నన్ను వదిలేసి మిగతా వాళ్ళని తగులుకుంది. 
 ఆమె క్లాస్ అయిపోయాక మ్యాథ్స్ లెక్చరర్ వచ్చాడు. ఆయన రావడం రావడమే పేరు కూడా అడగకుండా ఫార్ములాలు అడిగేస్తున్నాడు. మొదటి బెంచ్ లో కూర్చోవడం పాపమైపోయింది. మొట్టమొదటిగా నేనే కనపడుతున్నా అందరికి. ఈయన గారు కూడా నన్నే లేపాడు. ఏదొ ఫార్ములా అడిగాడు. తెలీదన్నాను. వెంటనే ర్యాంకు ఎంత అని అడిగాడు. ఖాళీగా తిరిగేవాడ్ని ఏం చేస్తున్నావ్ అని, నాలా డొనేషన్ కట్టి చేరిన వాడ్ని ర్యాంకు ఎంత అని అడగకూడదు. అడిగితే కాలుతుంది. నాకు కూడా ఎక్కడో బాగా కాలింది. ఆయన వంక తినేసేలా చూశా. ఆయనకి కుడా అర్ధమైపోయింది. ఏంటి డొనేషన్ బాపతా అని అడిగి సర్లే కూర్చో అని నా పక్కన వాడ్ని మళ్ళీ అదే ఫార్ములా అడిగాడు. వాడు గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పేసాడు. వాడు ఖచ్చితంగా ర్యాంకు వచ్చినోడే అని అర్ధమైంది. ఎక్కడైనా డబ్బులు ఎక్కువ ఖర్చుపెడితే మన స్ఠోమత తెలుస్తుంది. కాని చదువుకోడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే మన అసమర్ధత తెలుస్తుంది.
క్లాస్ అయ్యాక ఆయనే హాజరు పట్టిక తీసుకోచ్చి అందరి రోల్ నంబర్లు పిలుస్తున్నాడు. క్లాస్ మొత్తం హాజరయ్యారు ఒక్క రోల్ నెం.9 తప్ప. వీడెవడ్రా బాబు కాలేజ్ మొదటి రోజే ఎగ్గొట్టాడు అనుకున్నా. ఆయన వెళ్ళిపోయాక ఒక అరగంట వరకు ఏ క్లాస్ జరగలేదు. ఒకసారి క్లాస్ మొత్తాన్ని పరీక్షగా చూసా. నా చూపు ఒక చోట ఆగిపోయింది. ఒకడు ఎత్తుగా లావుగా మాంచి దిట్టంగా ఉన్నాడు. వాడి పక్కనే నల్లగా, బక్కగా ఒక చిన్న పిల్లాడు కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దర్నీ పక్క పక్కన చూస్తుంటే తండ్రీ కొడుకుల్లా ఉన్నారు. నాన్న కాలేజ్ కి వెళ్తుంటే నేను కూడా వస్తా అని ఆ బుడ్డోడు మారాం చేస్తే సంకనెక్కించుకుని వచ్చేశాడెమో అన్నట్లు ఉన్నారు ఆ ఇద్దరు. ఆ బుడ్డోడు కూడా మా క్లాస్ మేట్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. వాడి పేరు నవీన్ అంట. మంచి కామెడీ పీస్ లా ఉన్నాడు. ఇంతలో ఒకడు నా దగ్గరకి వచ్చి హాయ్ నా పేరు దినేష్. నీ పేరేంటి అని అడిగాడు. ఇద్దరం మాటలు కలిపాం. ఇంకో ఇద్దరు కూడా మాతో మాటలు కలిపారు. ఇంతలో వెనక బెంచ్ నుండి మాకో కాగితం (సర్క్యులర్) వచ్చింది. కాలేజ్ వాళ్ళు పంపిన సర్క్యులర్ ఏమో అనుకున్నాం.  అందులో పేరు,కులం ఈ రెండు మాత్రమే ఉన్నాయి. అదేమిటో అర్ధం కాలేదు. ఏమిటిది అని అడిగితే అందరి పేర్లు కులాలు రాసివ్వమని సీనియర్లు పంపించారు అని సమాధానం వచ్చింది. మాకేమి అర్ధం కాలేదు. రాసి ఇచ్చేశాం. మన క్లాస్ అమ్మాయిల్ని చూసావా ఎలా ఉన్నారు అని దినేష్ అడిగాడు. అప్పటికి కాని మా క్లాస్ అమ్మాయిల్ని నేను ఇంతవరకు పట్టించుకోలేదు అన్న విషయం గుర్తు రాలేదు. నిజానికి చిన్నప్పటి నుండి నేను అమ్మాయిలకి దూరంగానే పెరిగాను. అమ్మాయిల్ని చూస్తే కొత్త పెల్లి కూతురిలా తెగ సిగ్గు పడిపోయే వాడిని. అమ్మాయిలు నా వంక చూస్తున్నారంటేనే ఎందుకో అసౌకర్యం గా అనిపించేది నాకు. ఇంటెర్లో అయితే అసలు ఆడ గాలే తగిలేది కాదు. అమ్మాయిల క్యాంపస్ వేరు, అబ్బాయిల క్యాంపస్ వేరుగా ఉండేవి. అమ్మాయిల గురించి ఇంత వరకు అసలు ఆలోచించనే లేదు. కాని ఇప్పుడు ఇంజినీరింగ్ కి వచ్చేసాను. నేను పెద్దోడిని అయిపోయాను. అందుకే నాకు తెలియకుండానే అమ్మాయిలంటే ఆకర్షణ మొదలయిపోయింది.
తల తిప్పి ఒక్కొక్కర్ని పరిశీలనగా చూసాను. దాదాపు ఒక పాతిక మంది ఉన్నారు. అందులో నలుగురు అయిదుగురు మాత్రం కళ్ళకి బాగా ఆనుతున్నారు. వాళ్ళు కూడా మరీ అందగత్తెలు అని చెప్పుకునే స్థాయిలో ఏమి  లేరు. కాని అందంగానే ఉన్నారు. అదేంటో అబ్బాయిలకి ప్రపంచంలో అందరు అమ్మాయిలూ అందంగానే కనపడతారు, వాళ్ళ క్లాస్ అమ్మాయిలు తప్ప. బాగున్న ఆ నలుగురిని చూపించాను. వాడు వెంటనే వాళ్ళ పేర్లు, ఇంటి పేర్లు, వాళ్ళ  పుట్టు పూర్వత్రాలు మొత్తం చెప్పేస్తున్నాడు. వామ్మో వీడి దగ్గర చాలా కళలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నా. తర్వాత వరుసగా ఒక నాలుగు క్లాసులు జరిగాయి. మొదటి రోజు కావడం వల్ల అందరూ పరిచయం చేసుకుని వెళ్ళిపోతున్నారు. సాయంత్రం కాలేజ్ అయిపోయాక నేను చందు కలిసి ఇంటికి వెళ్తున్నాం. ఇంతలో అకస్మాత్తుగా దినేష్ వచ్చి ఒకసారి వెనక్కి రమ్మన్నాడు. ఎందుకు అని అడిగాను. సీనియర్లు పిలుస్తున్నారు అన్నాడు. ఆ మాట వినగానే చందు గాడికి నూటొకటి కొట్టుకుంది వాడి గుండె. అరే నేను బస్ స్టాప్ లో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కాలేజి వెనక బైక్ పార్కింగ్ స్థలంలో కాచుకుని కూర్చున్నారు దినేష్ గాడు చెప్పిన సీనియర్లు.
కొంచెం భయంగానే ఉంది. అయినా ధైర్యం నటిస్తూ వాళ్ళ దగ్గరకెళ్ళి నిల్చున్నా. 'ఏరా సీనియర్లు కనపడితే విష్ చేయాలని తెలీదా?' అన్నాడు అందులో ఒకడు. నేను "హాయ్ అన్నా..."  అని మర్యాదగా పలకరించాను. వెంటనే ఇంకొకడు "ఏంట్రా...ఏదో నీ గాల్ ఫ్రెండ్ ని పలకరించినట్లు పలకరిస్తున్నావ్. అయినా అన్న ఏంట్రా,గౌరవం ఎక్కడ?" అని గదమాయించాడు. నన్ను ఎవడైనా పరిచయం లేని వాడు "రా" అని సంభోదిస్తే నచ్చదు. వీడు మాట కి రెండు సార్లు "రా.." అంటున్నాడు. అస్సలు నచ్చట్లా కాని ఏం చేస్తాం సీనియర్ కదా. ఈ సారి బాగా వినయం గా 'గుడ్ ఈవినింగ్ సార్' అని చెప్పాను. వాడు నా వినయ విధేయతలు చూసి ముచ్చట పడినట్లున్నాడు. ఈ సారి కొంచెం నిదానంగా మాట్లాడుతున్నాడు. ఎస్.డి చెప్పరా అన్నాడు ఇంకొకడు. 'ఎస్.డి అంటే?' అని అమాయకంగా అడిగాను."ఎస్.డి అంటే తెలియకుండానే ఇంజినీరింగ్ లో చేరిపోయావా? ఏ ఊర్రా మనది?" అన్నాడు వెటకారంగా. దినేష్ గాడు పక్కకొచ్చి చెవిలో చెప్పాడు ఎస్.డి అంటే సెల్ఫ్ డబ్బా అని. సెల్ఫ్ డబ్బా నా అంటే? ఇంకో అమాయకపు ప్రశ్న. ఎవడ్రా వీడు మరీ బొత్తిగా లోక జ్ఞానము తెలీనోడిలా ఉన్నాడు. ఇలాంటి మబ్బు గాళ్ళందర్ని ఎక్కడ పట్టుకొస్తారు రా అని విరక్తిగా మాట్లాడాడు. నీ గురించి చెప్పరా బాబు అని అసలు విషయం ఏడిచాడు. ఓర్ని ఇదేదో  ముందే అడిగితే ఈ పాటికి చెప్పేసి ఇంటికి కూడా వెళ్ళిపోయే వాడ్ని కదా. దీనికి మళ్ళీ ఒక కోడ్ బాష. వీళ్ళూ వీళ్ళ పైత్యం అని తిట్టుకుని నా గురించి చెప్పాను. వాళ్ళ మొహాల్లో ఏదో వెలితి. ఏదో అడగాలా వద్దా అని తటపటాయిస్తున్నారు. ఇంక సిగ్గు వదిలేసి అడిగేసారు నువ్వు కాలేజ్ చేరిన శుభ సందర్భంలో మా అందరికి పార్టీ ఇవ్వాలి. రేపు సాయంత్రం ఇక్కడే ఉంటాం. కాలేజ్ అవ్వగానే రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. 
చందు గాడు బస్ స్టాప్ లో ఎదురు చూస్తున్నాడేమో అని కంగారుగా వెళ్ళాను. కాని వాడు అక్కడ లేడు. అప్పటికే వెళ్ళిపోయినట్లున్నాడు. నేను కూడా ఇంటికెళ్ళిపోయాను.  తర్వత రోజు, చందు బైక్ తీసుకుని మా ఇంటికొచ్చాడు. పర్లేదులే ఎవరు ఏమనరులే అన్నాడు. వీడికేంటి ఒక్కసారి గా ఇంత ధైర్యం వచ్చింది అనుకున్నా. బైక్ ఎక్కి కూర్చున్నాను. నిన్న క్లాస్ ఎలా జరిగిందో మాట్లాడుకుంటున్నాం. వాడు మాటల మధ్యలో ఉన్నట్లుండి మీది ఏ కులం రా? అని అడిగాడు. నాకు ఆశ్చర్యమేసింది. మేము చిన్నప్పటి నుండి స్నేహితులం. కలిసే చదువుకున్నాం. కలిసే తిరిగాం. పరీక్షలైతే మా ఇంట్లొనే ఉండి చదువుకునే వాళ్ళం. కాని ఇంతవరకు మా మధ్య కులం అనే ప్రస్తావన ఎప్పుడు రాలేదు. కాని వాడు అలా అడిగేసరికి నాకు కొత్తగా అనిపించింది. ఏదో అవసరముండి అడిగుంటాడులే అని చెప్పాను. వాడి మొహం లో కొంచెం నిరాశ. ఏమైంది రా అని అడిగాను. అప్పుడు చెప్పాడు నిన్న సాయంత్రం వాడు బస్ స్టాప్ లో ఉన్నప్పుడు ఒక సీనియర్ తో పరిచయమయ్యింది. అతను వాళ్ళ బ్యాచ్ దగ్గరకి తీసుకెళ్ళాడు. మేమంతా ఒకే కులం అంట. చాల బాగా  మాట్లాడారు. ఏం అవసరమైనా వాళ్ళ దగ్గరకి రమ్మన్నారు. ఎవరికీ భయపడనవసరం లేదని చెప్పారు. నిన్ను కూడా పరిచయం చేద్దామనుకున్నా, కాని నువ్వు మా కులం కాదుగా అన్నాడు. మొదటిసారి మా మధ్య మన బదులు మా, మీ, అన్న మాటలు వినపడుతున్నాయి. నాకెందుకో వాడు నా చందు కాదేమో అనిపించింది. నేను మౌనం గా ఉండిపోయాను. కాలేజ్ లోకి వెళ్ళగానే వాళ్ళ సీనియర్ (అంటే వాళ్ళ కులపు సీనియర్) వాడ్ని పిలిచాడు. నేను ఇంక మా క్లాస్ కి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళగానే అందరు గ్రూపులు గా విడిపోయి కూర్చోవడం గమనించాను. దినేష్ గాడు కూడా  ఏదో గ్రూపు ని నిర్వహిస్తున్నట్లున్నాడు. నన్ను చూసి రమ్మని సైగ చేసాడు. వెళ్ళి వాడి పక్కన కూర్చున్నా. ఏమైంది అన్నట్లు చూసాను వాడి వంక. నా అయోమయాన్ని అర్ధం చేసుకున్నట్లున్నాడు. మొదటి రెండు బెంచ్ లు కూర్చున్నారు కదా, వాళ్ళంతా ఒక కులం. తర్వాత రెందు బెంచ్ లు ఒక కులం. ఆ తర్వాత.. అంటూ బెంచ్ కొక కులం పేరు చెప్పుకుంటు వచ్చాడు. మనం ఈ బెంచ్ లో కూర్చుందాం అన్నాడు. అప్పుడు అర్ధమయ్యింది వాడు నేను ఒకటే కులం అని. ఇలా విడతీయటానికే నిన్న సర్క్యులర్ వచ్చింది అని. నాకు అసలు ఆ వాతావరణం నచ్చలా. నిన్నటి వరకు వీళ్ళందరికీ ఈ తేడాలు తెలియవు. సీనియర్లు చెప్పారు కనుక గ్రూపులు గా విడిపోతున్నారు. మిగతా వాళ్ళందరి నుండి వాళ్ళని వాళ్ళే వెలి వేసుకుంటున్నారు. సీనియర్లకి ఎందుకు ఈ కులాల పిచ్చి. వాళ్ళకీ వాళ్ళ సీనియర్లు అంటించి ఉంటారు. వీళ్ళు మాకు అంటిస్తున్నారు. కొందరు ఈ కొత్త పిచ్చి నచ్చి దాని మీద మోజు పెంచుకుంటున్నారు. ఇంకొందరు సీనియర్లు చెప్పారు కనుక మోజు పెంచుకుంటున్నారు. 
నాకు అక్కడ ఉండబుద్ది కాలేదు. అసలు ఆ కాలేజినే నచ్చట్లేదు. ఇంట్లో చెప్పి మానేద్దామా అనిపించింది. డొనేషన్ సంగతి గుర్తొచ్చి అడిగితే చెప్పు తీసుకుని కొడతారు అని అర్ధమయ్యి ఇంక చేసేదేమి లేక క్లాసులు ఎప్పుడు అవుతాయా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. సాయంత్రం క్లాసులు అవ్వగానే ఇంటికి వెళ్ళబోతూ సీనియర్లు పార్టీ ఇవ్వమన్న సంగతి గుర్తొచ్చింది. ఇవ్వకపోతే బాగోదు అని వాళ్ళ దగ్గరకి వెళ్ళాను. వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఎదురు చూస్తున్నారు నాకోసం. నన్ను చూడగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. వెంటనే నా దగ్గరకొచ్చి 'పద బార్ కి వెళ్దాం' అన్నారు. ఆ మాట వినగానే గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పార్టీ అంటే రెండు సమోసాలు ఒక కూల్ డ్రింక్ ఇప్పిస్తే సరిపోతుందనుకున్నా. వీళ్ళు ఏకంగా బార్ అంటున్నారు. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. అదే విషయం చెప్పా వాళ్ళకి. మొదట కొంచెం కంగారు పడ్డారు ఎక్కడ పార్టీ ఉండదో అని, తర్వాత వాళ్ళలో వాళ్ళు చర్చించుకుని ఏదో ఏర్పాటు చేసుకున్నారు. నా దగ్గరకొచ్చి 'పర్లేదులే, నీతో పాటు ఇంకొకడు కూడా పార్టీ ఇస్తా అన్నాడు. నువ్వు వాడు కలిపి ఇవ్వండి సరిపోతుంది అన్నారు. నేను సరే అన్నాను. ఆ రెండో బకరా ఎవరా? అని ఆసక్తిగా చూశాను. ఆ బకరా పేరు ప్రసాద్. వాడు కూడా మా క్లాసే. అందరం కలిసి బార్ కి బయల్దేరాం. కాలేజి నుండి రెండు కి.మీ.ల దూరం లో ఒక బార్ ఉంది. నేను ఇంతవరకు బార్ ని బయట నుండి చూడడమే కాని లోపల అడుగుపెట్టిన పాపాన పొలేదు. నా జీవితంలో మొదటి సారి బార్ లో అడుగు పెట్టాను.
అక్కడ వాతావరణమే తేడాగా ఉంది. ఏదో జూ లోకి వెళ్తున్నట్లుంది. అక్కడ ఎవడి లోకం లో వాళ్ళున్నారు. కొందరు ఒక్కళ్ళే కూర్చుని తాగుతున్నారు, కొందరు స్నేహితులతో కలిసి తాగుతున్నారు. కొందరు గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఇంకొందరు పోట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు,నవ్వుకుంటున్నారు. వాళ్ళందరిని చూస్తుంటే నిజంగా జూ లో జంతువుల్లానే ఉన్నారు(తాగుబోతులు క్షమించాలి). మేము కూడా ఒక టేబుల్ చూసుకుని కూర్చున్నాం. అసలు నేనెందుకు ఇక్కడ? వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు కదా అనుకున్నా. కాని ఏం చేయలేక అలాగే కూర్చున్నా. ప్రసాద్ నా పక్కనే కుర్చున్నాడు. వాడి వాలకం చూస్తుంటే వాడు కూడా బార్ కి మొదటి సారి వచ్చినట్లే ఉంది. దినేష్ గాడు సీనియర్ల పక్కన కూర్చుని ఏ బ్రాండ్ మందు తాగాలో చర్చించుకుంటున్నారు. చివరకి ఒక బ్రాండ్ ఎంచుకుని ఆర్డర్ చేసారు. గ్లాసుల్లో పోసి మా ముందు కూడా గ్లాసులు పెట్టారు. ఇద్దరం ఒకేసారి వద్దు సార్ అలవాటు లేదు అన్నాం, పుట్టుకతోనే ఎవరికి ఏది అలవాటు అవదు, మనమే అలవాటు చేసుకోవాలి అని ఏదో మందు వేదాంతం చెప్పాడొకడు. అయినా మీరు పార్టీ ఇస్తూ మీరు తాగకపోతే ఎలా? తాగాల్సిందే అని గ్లాసులు మా చేతుల్లో పెట్టారు. మేము ఎంత బ్రతిమాలినా వినలేదు. చివరకి ఒకే ఒక పెగ్ అని ఒప్పందం చేసుకుని తాగమన్నారు. నాకేం చేయాలో అర్ధం కావట్లేదు. తాగకపోతే వీళ్ళు ఊరుకునేలా లేరు. అనవసరంగా వీళ్ళకి దొరికిపోయాను అని నన్ను నేను తిట్టుకుంటూ ప్రసాద్ గాడి వంక చూసాను. వాడు ఎవరూ చూడకుండా ఒక ఖాళీ గ్లాసు కాళ్ళ దగ్గర పెట్టుకుని తాగుతున్నట్లు నటిస్తూ అందులో కొంచెం కొంచెం పోసేస్తున్నాడు. నేను చూసేసరికి కొంచెం కంగారు పడ్డాడు. ఎవరికి చెప్పొద్దన్నట్లు సైగ చేసాడు. నేను సరే అని వాడి ఇడియానే అనుసరించాను. సీనియర్లు గమనిస్తున్నప్పుడు మాత్రం గ్లాసు నోటి దగ్గర పెట్టుకుంటు నటిస్తున్నాం.  దినేష్ గాడు మాత్రం చాలా శ్రద్ధగా తాగుతున్నాడు. ఒక నాలుగు పెగ్గులు తాగేసరికి అందరికి బాగ ఎక్కేసింది.ఏదేదో వాగుతున్నారు. అందులో ఒకడు ఏరా మీకు గాల్ ఫ్రెండ్స్ ఉన్నారా. ఏమైనా లవ్ ఎఫైర్లు ఉన్నాయా? ఉంటే చెప్పండి ఏమైనా ప్రాబ్లంస్ ఉంటే మేము చూసుకుంటాం అన్నాడు. వాడి మాటలకి నాకు నవ్వొచింది. వాడు ప్రాబ్లంస్ ని చూసుకుంటా అన్నాడో లేక మా గాల్ ఫ్రెండ్స్ ని చూసుకుంటా అన్నాడో అర్ధం కాలేదు. నేను ప్రసాద్ గాడు అలాంటివి ఏమి లేవని తలూపాము. దినేష్ గాడు మాత్రం ఆ మాట అనేసరికి 'గుక్క పెట్టి ఏడవడం మొదలెట్టాడు. వాడు అలా ఏడిచేసరికి మేము ఏమైందో అని కంగారు పడ్డాం. విషయమేంటని అడిగితే ' మా క్లాసులో లలిత అనే ఒక ఫిగరు ఉంది అన్నా. ఆ అమ్మాయిని మొధటిసారి చూడగానే ప్రేమించేసాను. వెంటనే ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసాను. కాని తనకి అంతకు ముందే లవర్ ఉన్నాడంట . నిన్న సాయంత్రం వాడే వచ్చి తనని ఎక్కించుకుని వెళ్ళాడు. తను వాడికి నేను ఐ లవ్ యూ చెప్పిన విషయం చెప్పినట్లుంది. వాడు నా దగ్గరకి వచ్చి ఇంకోసారి ఆ అమ్మాయితో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడన్నా. నేను ఆ అమ్మాయిని గాఢం గా ప్రేమిస్తున్నాను.' అని వాడి ప్రేమ కథ ని చెప్పాడు. నిన్న కాలేజి మొధలయ్యింది. అప్పుడే ప్రేమించేయడం అది కూడా గాఢం గా ప్రేమించేయడం, చెప్పేయడం, తను ఒప్పుకోకపోవడం, తన లవర్ వార్నింగ్ ఇవ్వడం, వీడు ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం. బాబోయ్ అనిపించింది. సీనియర్లు నువ్వేం బాద పడకురా, రేపు వెళ్ళి ఆ అమ్మాయికి మల్లీ  ఐ లవ్ యూ చెప్పు. వాడి సంగతి మేము చూసుకుంటాం అని భరోసా ఇచ్చారు. ఇంకో రెండు పెగ్గులు తాగి బిల్ చెప్పారు. బిల్ తీసుకొస్తుంటే వాళ్ళకేం సంబంధం లేదన్నట్లు మా వైపు చూపించారు. నేను, ప్రసాద్ ఇద్దరం కలిపి బిల్ కట్టి ఇంటికి బయల్దేరాం. ఆ రోజు వాళ్ళకి బిల్ కట్టడానికి ఇద్దరు బకరాలు దొరికుండొచ్చు. కాని నాకు ఆ పార్టీ వల్ల ప్రసాద్ అనే స్నేహితుడు దొరికాడు.

Monday, February 11, 2013

(స్నేహం + ప్రేమ)²= జీవితం

హాయ్ ఫ్రెండ్స్..!  నా బ్లాగ్ ని వీక్షించి నా  రాతల్ని ఓర్పుగా చదువుతున్న మీ అందరికీ ధన్యవాదాలు.  మీరు అందించిన ప్రోత్సాహంతో నాకు ఇంకా మంచి మంచి కథలు రాయలన్న ఉత్సాహం పెరిగింది. నా రచనల్ని చదవడానికి ఒక రెండు వందల మంది ఉన్నారన్న ధైర్యంతో ఒక అడుగు ముందుకేసి కొంచెం పెద్ద ప్రయోగమే చేయబోతున్నాను....
రామాయణాన్ని ఒక మహా గ్రంధంగా చదువుకోవచ్చు. కట్టే, కొట్టే, తెచ్చే అని మూడు ముక్కల్లోను చదివేయొచ్చు. మూడు ముక్కల్లో నా కథని చెప్పాలంటే ఒక ఇంజినీరింగ్ విద్యార్ధి జీవితం ప్రేమ,స్నేహం వల్ల ఎలాంటి మలుపు తిరిగిందో, చివరికి ఎక్కడికి చేరిందో అన్నదే నా కథాంశం. ఎందుకు? ఏమిటి? ఎలా? అన్న ప్రశ్నలకి సమాధానం కావాలంటే మాత్రం కొంచెం ఓపికగా చదువుకోండి. ఇది కథ అనుకోండి, నవల అనుకోండి, లేదా సీరియల్ అనుకోండి. కాని చదవండి........
ఈ ప్రపంచం లో అమ్మా నాన్నలు లేకుండా పెరిగిన అనాధలు ఎంతో మంది ఉండి ఉండొచ్చు. కాని స్నేహితుడు అంటూ లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని నా అభిప్రాయం. అలాగే ప్రతి వ్యక్తి జీవితం లో ప్రేమ అనే చాప్టర్ కచ్చితంగా ఉండి ఉంటది.
                                        ప్రేమ, స్నేహం ఈ రెండిటి సమాహారమే జీవితం.
-------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------

పేరు               : చరణ్ కృష్ణ బలుపు
నాన్న             : బలుపు వీరభద్రం
అమ్మ             : బలుపు భాగ్యలక్ష్మి
విద్యార్హత        : ఇంజినీరింగ్ పాస్
మార్కులు % : ఇలాంటివన్నీ అడగకూడదు
ఉద్యోగం          : అమ్మ లాయర్, నాన్న డాక్టర్
ఆస్తిపాస్థులు   : ఇంకం ట్యాక్స్ ఇబ్బందుల కారణంగా గోప్యంగా ఉంచుతున్నాను
పెళ్ళి              : ఒకటి అయ్యి పెటాకులయ్యింది, ఇంకొకటి సంప్రదింపుల దశలో ఉంది
ఎందుకని       : తర్వాత చెప్తాను

మీరు చదువుతున్న బయోడేటా నాదే. నా పేరు చరణ్. ఇష్టమైన వాళ్ళు ముద్దుగా చెర్రీ అంటారు.
నేనంటే పడని వాళ్ళు బలుపు (ఇంటి పేరు) అని పిలుచుకుంటారు.
అమ్మ నాన్నలకి నేను ఒక్కడినే కొడుకుని.. ఒక్కడే కొడుకు అనగానే అల్లారు ముద్దుగా పెరగడం, నా ఇష్టారాజ్యంగా ఉండటం, ఏది కోరుకుంటే అది నా ముందు ప్రత్యక్షమవడం.... ఇలాంటివన్ని ఊహించుకోకండి. అంత బొమ్మ లేదిక్కడ.. అంటే గారాభంగా పెంచలేదని కాదు..కాకపోతే ఒక్కడినే కావడం వల్ల మ వాళ్ళకి అతి జాగ్రత్త ఎక్కువై నా విషయంలో ఏం చేయాలన్నా ఆచితూచి మంచి చెడు లెక్కలు కట్టి చేస్తారు... నేను ఏం అడిగినా కాదనకుండా కొనిస్తారు కాని నేను అడిగింది మాత్రం కొనివ్వరు. నాకు ఏది పనికొస్తదో అదే కొనిస్తారు. స్కూల్ కి వెళ్ళాలంటే కేసులు లేనప్పుడు అమ్మో, పేషంట్లు లేనప్పుడు నాన్నో తీసుకెళ్తారు, ఇద్దరికి తీరిక లేకపోతే స్కూల్ మానిపించి వాళ్ళతో కోర్టుకో లెదంటే క్లినిక్ కో తీసుకెళ్ళేవారు. రబ్బరు బాలుతో క్రికెట్ ఆడడానికి హెల్మెట్, గార్డు పెట్టి పంపించే వాళ్ళు. అందరూ నవ్వుతుంటే సిగ్గుతో చచ్చిపోయేవాడ్ని. స్కూల్లో అందరూ విహారయాత్రలకి వెళ్తుంటే నేను కూడా వెళ్తా అని మారాం చేస్తే అమ్మో ఒక్కగానొక్క కొడుకువి నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తాం అనేవాళ్ళు. కనీసం ఆడుకోడానికి పక్కింటికి కూడా పంపించేవాళ్ళు కాదు.
అమ్మ కి నన్ను లాయర్ గా చూడాలని కోరిక. అందుకే నా ప్రతి పుట్టిన రోజుకి నల్లకోటు నే కొనిస్తది.
నాన్న కి నన్ను డాక్టర్ ని చేయాలని ఆశయం. ఎక్కడ తెలంగాణ ఇచ్చేస్తారో ఎక్కడ స్థలాల దరలు పెరిగిపోతాయొ అని నేను 10వ క్లాస్ లో ఉండగానే వాళ్ళ ఊరిలో హాస్పిటల్ కట్టడానికి స్థలం కొనేసాడు.
చిన్నప్పుడు మా అమ్మ నాతో భాగవతం బదులు లా పుస్తకాలు చదివించేది.
మా నాన్న ని ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళమంటే సైన్స్ ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళి శవాలు, శరీర భాగాలు చూపించే వాడు
ఇలా నా చిన్నతనం అంతా డాక్టర్ కావాలా లేక లాయర్ కావాలా అన్న అయోమయంలోనే గడిచిపోయింది. చూస్తుండగానే 10వ క్లాస్ కూడా పూర్తి అయిపోయింది.
బ్రతకాలంటే ఈ రెండు ఉద్యోగాలే చేయాలేమో అనే భ్రమలో బ్రతుకుతుండగా నా స్నేహితుడొకడు ఇంటర్లో ఎం.పి.సి తీసుకుని ఇంజినీరింగ్ చేస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే ఎక్కడ లేని ఉత్సాహం ముంచుకొచ్చింది.
జీవితంలో తెలుపు నలుపు రంగులే చూసిన నాకు ఇంజినీరింగ్ ఒక రంగుల హరివిల్లు లా కనిపించింది. నేను కూడా ఇంజినీరింగ్ చేయాలని నిర్ణయించేసుకున్నాను.
ఇదే విషయం మా అమ్మ నాన్న కి చెప్పాను. నా నోటి నుండి వినకూడని బూతు మాటలేవో వినపడినట్లు ఇద్దరు నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకుని చెడామడా తిట్టారు. అయినా నేను వినలేదు. కుదరదన్నారు. నేను ఇంట్లొ నుండి పారిపోయి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కాయిన్ బాక్స్ నుండి ఇంటికి ఫోన్ చేసి ఇంజినీరింగ్ చేయడానికి ఒప్పుకుంటే ఇంటికి తిరిగొస్తాను లేదంటే అస్సామో బీహారో వెల్లిపోతాను అని బెదిరించాను.
ఇక చేసేదేమి లేక సరే నీ ఇష్టం ఇంటికి రమ్మన్నారు.అలా ఇంజినీరింగ్ చేసే ప్రయత్నంలో మొదటి విజయం సాధించాను.
అయిష్టంగానే ఒక మంచి కాలేజిలో (మంచి అంటే మార్కులు ఎక్కువ తెప్పించే కాలేజి) ఎం.పి.సి లో చేర్పించారు.
ఆ కాలేజిలో ఫీజు కట్టి ఒక గాడిదని చేర్పిస్తే రెండేళ్ళలో ఆ గాడిదని కనీశం 80% మార్కులతో బయటకొచ్చేలా రుద్దుతారు. నన్ను కూడా బాగా రుద్దారు. రాత్రనక పగలనక బట్టీ వేయిస్తూనే ఉండేవారు. వాళ్ళ రుద్దుడుకి నేను తట్టుకోలేకపోయాను. నా జీవితంలో ఆ రెండు సంవత్సరాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలీకుండా గడిచిపోయాయి.
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా అయిపోయాయి. ఇక మిగిలింది ఎంసెట్. అమ్మ నాన్న ముందే చెప్పారు తెచ్చుకుంటే ర్యాంకు తెచ్చుకుని సీటు తెచ్చుకో లేదంటే డొనేషన్ కట్టే ప్రసక్తే లేదన్నారు.
సరే నా ప్రయత్నం నేను చేయాలని కష్టపడి చదివాను. ఫలితంగా చాలా పెద్ద ర్యాంకు వచ్చింది. మా ఊర్లో కాలేజీలలో సీటు రాదని అర్ధమయిపోయింది. వేరే ఊరు వెళ్ళడానికి మా ఇంట్లో ఒప్పుకోరు ఒక్కడినే కొడుకుని కదా మరి.
మా ఇంట్లో వాళ్ళని ఏ మొహం పెట్టుకుని డొనేషన్ కట్టమని అడగాలో తెలియక నా మొహాన్నే కొంచెం దీనంగా పెట్టి అడిగేసాను. సమాదానం ఊహించినదే. కట్టను పొమ్మన్నారు. అవును మరి, వాళ్ళు చెప్పినట్లు విని ఉంటే ఎన్ని లక్షలైనా తగలేసేవారు.
వెంటనే నిరాహార దీక్ష మొదలు పెట్టాను. ఒకటిన్నర రోజు చేసేసరికి నీరసమొచ్చి జ్వరమొచ్చింది. అధిష్టానం దిమ్మ తిరిగింది. నా డిమాండ్లకి తలొగ్గింది. వెంటనే నేను ఇంజినీరింగ్ చదవడానికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ఒప్పుకున్నారు. నాతో నిమ్మరసం తాగించి నా దీక్ష విరమింపచేసారు.
మా ఊర్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలలో కాస్త మంచి కాలేజీ ఎంచుకుని, ఆ కాలేజీ వాళ్ళతో బేరాలు ఆడి, బేరం కుదరక తెలిసిన పెద్దమనిషితో రికమండ్ చేయించి చివరికి కంప్యూటర్ సైన్స్ లో నాకో సీటు కొనిచ్చాడు మా నాన్న. ఇప్పటి వరకు మా నాన్న నాకు కొనిచ్చిన బహుమతుల్లో అత్యంత ఖరీధైనది ఇదే.
నాకు మనుషులు ఒక పట్టాన నచ్చరు. నాకు స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. నాకు నచ్చాలంటే వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలకి దగ్గరగా ఉండాలి. కాని ఒకసారి నచ్చితే తర్వాత అవతలి వ్యక్తి ఎంత వెధవని తెల్సినా వాళ్ళని వదులుకోలేను. నాతో ఒకసారి స్నేహం చేస్తే ఇంక జీవితాంతం నా స్నేహితుడిగా ఉండిపోవాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు నచ్చిన ఆ కొద్ది మంది వల్లే నా జీవితం రకరకాల మలుపులు తిరిగిపోయింది. ఇప్పుడు నేను ఇంజినీరింగ్లో చేరుతుంది కూడా నాకు నచ్చిన ఒక స్నేహితుడి వల్లే. పైన చెప్పాను కదా నా స్నేహితుడొకడు ఇంజినీరింగ్ చేరతాను అన్నాడని. వాడి కోసమే నేను కూడా ఇంజినీరింగ్లో, వాడు చేరిన కాలేజిలోనే చేరాను. కాకపోతే వాడు సీటు తెచ్చుకుని చేరాడు, నేను సీటు కొనుక్కుని చేరాను. కాని ఇద్దరికి ఒకటే గ్రూపు రాలేదు. వాడు మెకానికల్ లో చేరాడు. వాడి పేరు చందు.
ఇప్పటి వరకు నా జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అందులో చెప్పుకునే గొప్ప సంఘటనలు ఎమీ జరగలేదనే చెప్పాలి. కాని ఇంజినీరింగ్లో చేరాక ఎన్నో కొత్త అనుభూతులు.కొన్ని మరపు రాని సంఘటనలు,కొందరు మర్చిపోలేని వ్యక్తులు,బాధలు,ఆనందాలు,కష్టాలు, సుఖాలు, పాఠాలు,గుణపాఠాలు, ఇవన్ని నా జీవితంలోకి ప్రవేశించాయి.
నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నా కాలేజి మొదటి రోజు....
చందు, నేను ఉదయాన్నే లేచి గుడికెళ్ళాం. వాడికి బైక్ ఉంది. కాని కాలేజీకి బస్ లోనే వెళ్ళాలని ముందే నిర్ణయించుకున్నాం. మొదటి రోజే బైక్ పైన వెళ్ళి సీనియర్ల దృష్టిలో పడొద్దని మాకు తెల్సిన అన్నయ్య ఒకతను సలహా ఇచ్చాడు. ఇద్దరం బస్ ఎక్కి కాలేజీ స్టాప్ లో దిగాం. ఎందుకో తెలియని భయం, ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. ఇద్దరి మొహాల్లో ఆందోళన స్పష్టంగా కనపడుతుంది. మౌనంగా ముందుకు అడుగులేసాం. రెండు అడుగులు వేయగానే కాలేజీ గేటు ప్రత్యక్షమైంది. దాని పైన "వెల్కం టు ఫ్రెషర్స్" అని ఒక బ్యానర్ కట్టి ఉంది. చందు వంక చూశాను. వాడు వెళ్ళిపోదామా రెపు వద్దాంలే అన్నాడు. నాకు కూడా వెళ్ళిపోవాలనిపించింది. కాని మా నాన్న" కాలేజీలో ఇంక కొంచెం దబ్బులు కట్టాలి. కాలేజి తెరిచాక కడతా అని చెప్పాను. నాకు రావడం కుదరదు నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, నువ్వే కట్టేయి" అని నా చేతిలో డబ్బులు పెట్టారు. అందుకే ఇక తప్పక ధైర్యం చేసుకుని గేటు లోపల అడుగుపెట్టాం.

క్యాంపస్ మెయిన్ గేటు నుండి కాలేజ్ బిల్డింగ్ కి కనీశం అర కిలో మీటర్ దూరం ఉంటుంది. దారి మొత్తం తారు రోడ్డే. ఆ రోడ్డు ని రెండుగా విభజిస్తూ మధ్యలో ఒక డివైడర్. ఆ డివైడర్ పైన చిన్న చిన్న పూల మొక్కలు. దారి కి రెండు ప్రక్కల పెద్ద పెద్ద చెట్లు. మద్య మద్యలో కూర్చుని సేద తీరడనికి అక్కడక్కడా సిమెంట్ బెంచ్ లు. ఆ వాతావరం చాలా ఆహ్లాదంగా ఉంది. ఏదో పార్క్ లో నడిచి వెళ్తున్న అనుభూతి. అప్పుడే ఒక విషయం గమనించా. అబ్బాయిలందరూ ఒక వైపు నడుస్తున్నారు. అమ్మాయిలు డివైడర్ కి అవతలి వైపు నడుస్తున్నారు. అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్యన పరదా పరిచినట్లు డివైడర్ పైన గుబురుగా పెరిగిన మొక్కలు. ఆ మొక్కల మధ్య చిన్న చిన్న సందుల్లో నుండి కనపడీ కనపడనట్లు కనిపిస్తున్నారు. ఎవరి ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. దాదాపు అన్నీ చుడీదార్లే, అక్కడక్కడా జీన్స్ లు, కనీశం ఒక్క లంగా ఓణీ అయినా కనపడుతుందేమో అని ఆశగా చూసాను. కాని నా ఆశ అత్యాశే అని అర్ధమయ్యింది.
కాలేజ్ లోకి ప్రవేశించగానే నోటీస్ బోర్డ్ దగ్గర జనాలు గుమిగూడి ఉండటం గమనించి చందు,నేను అటు వెళ్ళాం. ఎవరి క్లాస్ రూం లు ఎక్కడో నోటీస్ అంటించారు. చందు వాళ్ళ క్లాస్ వేరే బ్లాక్ లో ఉంది. నాది వేరే బ్లాక్ లో ఉంది. సాయంత్రం కాలేజ్ అయ్యాక మా క్లాస్ దగ్గరకి రమ్మని చెప్పి ఎవరి క్లాసుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయాం.
                       Continue reading   Part - II