Thursday, May 16, 2013

హత్య...!

రేయ్.....రేయ్.... అని కంగారుగా, భయం గా ఆయాసపడుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనిల్. కాని మాటలు రావడం లేదు.. మంచి నీళ్ళ బాటిల్ వాడి చేతికిచ్చి ఏమైందిరా? ఎందుకంత కంగారు పడుతున్నావ్ అని అడిగాను. అది..అది..సందీప్ గాడిని.. అని ఆపేసి కాస్త ఊపిరి తీసుకుని చెప్పాడు 'సందీప్ గాడిని పోలీసులు అరెస్ట్ చేసారు రా.. అరెస్ట్ ఆ ఎందుకు? ఏమైంది? అని అయోమయం గా అడిగాను... ఎవరితోనైనా గొడవపడ్డాడా? అన్నాను. కాదురా హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు అని బాంబు పేల్చాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నవ్ హత్య ఏంట్రా...అసలేమైంది సరిగ్గా చెప్పు...అని గదమాయించాను... నిన్న రాత్రి సందీప్ గాడు అపర్ణ ని కలవడానికి వాళ్ళ హాస్టల్ కి వెళ్ళాడు తన పుట్టిన రోజుకి గిఫ్ట్ ఇచ్చి వస్తా అని. తెల్ల వారుతున్నా వాడు ఇంకా రూం కి రాలేదని అపర్ణ కి ఫోన్ చేస్తే విషయం తెలిసింది. రాత్రి అపర్ణ వాళ్ళ హాస్టల్ లో ఎవరో అమ్మయిని హత్య చేసారంట. వీడు సరిగ్గా అదే టైం కి అక్కడ ఉండటం తో అందరూ వాడినే హంతకుడు అనుకుని పోలీసులకి అప్పగించారంటా అని చెప్పాడు. వాడు చెప్పేది నమ్మ బుద్ది కాలేదు వెంటనే టి.వి.9 చానెల్ పెట్టాను. హాస్టల్ లో యువతి దారుణ హత్య అని పెద్ద పెద్ద హెడ్ లైన్స్ వస్తున్నాయి. పోలీసుల అదుపులో హంతకుడు అని సందీప్ ఫోటో ని వేసారు. అప్పటికి కాని అర్ధం కాలేదు నిజంగా సందీప్ గాడు ప్రమాదం లో ఉన్నాడని. వెంటనే అపర్ణ కి ఫోన్ చేసి నేను అనిల్ కలిసి తనని కలవడానికి బయల్దేరాము. మేము వెళ్ళే సరికి అపర్ణ ఇంకొంత మంది తన స్నేహితురాళ్ళు మాకోసం ఎదురు చూస్తున్నారు. నన్ను, అనిల్ ని చూడగానే అపర్ణ భోరుమని ఏడ్చేసింది. తనని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. తనని ఎలా సముదాయించాలో కూడా నాకు తెలియడం లేదు. అపర్ణ సందీప్ కి జూనియర్. రెండేళ్ళ నుండి ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అపర్ణ, సందీప్ ఇద్దరూ వేరే ఊరి నుండి ఇక్కడికి చదువుకోడానికి వచ్చి హాస్టల్ లో ఉంటున్నారు. కాలేజి దగ్గరలో ఉన్న లేడీస్ హాస్టల్ లో అపర్ణ ఉంటుంది. అక్కడికి కొంచెం దూరం లో అనిల్, సందీప్ రూం తీసుకుని ఉంటున్నారు. జాబ్ రాగానే ఇద్దరూ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ప్రేమ విషయం చెప్పి పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనల్లో ఉన్నారు. ఇద్దరూ కాలేజీ మానేసి సినిమాలకి షికార్లకి బాగా తిరిగే వాళ్ళు, కానీ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు, అనిల్ గాడికి మాత్రమే తెలుసు. సందీప్ గాడు అపర్ణ ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వాళ్ళ హాస్టల్ కి దొంగతనంగా వెళ్ళి తనని కలిసి వచ్చేవాడు. ఆ హాస్టల్ వాచ్ మెన్ కి యాభై, వంద ఇచ్చి మేనేజ్ చేసేవాడు. సందీప్ గాడు ఎప్పుడు వెళ్ళినా ఎవరూ చూడకుండా గేట్ తీసి లోపలికి పంపించేవాడు. ఇక్కడి వరకు మాకు తెలిసిన విషయమే. కాని నిన్న ఏం జరిగిందో అనిల్ కి నాకు ఇద్దరికి తెలియదు. అపర్ణ ని ఓదార్చి అసలేం జరిగిందో చెప్పు అని అడిగాను. ఈ రోజు నా పుట్టిన రోజు అని అర్ధరాత్రి 12 అవగానే మొట్టమొదట నేనే శుభాకాంక్షలు చెప్పాలి మీ హాస్టల్ కి వస్తాను అని చెప్పాడు. వద్దు మా ఫ్రెండ్స్ అందరూ మెలుకువగా ఉంటారు నా పుట్టిన రోజు అని, వాళ్ళు చూస్తే బాగోదు ఫోన్ చేసి విష్ చేయమని చెప్పాను. లేదు మొట్టమొదట నేనే విష్ చేయాలి నీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను అది నీకు ఇచ్చి వెళ్ళిపోతాను వెంటనే అని చెప్పాడు. సరే ఎవరూ చూడకుండా రమ్మని చెప్పాను. రాత్రి 11.45 కి ఫోన్ చేసి నేను మీ హాస్టల్ కిందనే ఉన్నాను, పైకి రమ్మంటావా అని అడిగాడు. సరే ఎవరూ చూడకుండా టెర్రస్ పైకి రమ్మని చెప్పి, ఫోన్ వచ్చిందని మా రూం మేట్స్ కి చెప్పి నేను కూడా టెర్రస్ పైకి వెళ్ళాను. సరిగ్గా 12 అవగానే తనే మొదట విష్ చేసి ఈ రింగ్ ఇచ్చాడు అని తన వేలికి ఉన్న రింగ్ తీసి నాకు చుపించింది. ఇంతలో మా రూం మేట్స్ నా కోసం వెతుకుతూ ఫోన్ చేసారు. నేను సందీప్ ని పైనే ఉండమని చెప్పి మా రూం లోకి వచ్చేసాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మేము రూం లో కేకు కట్ చేస్తుండగా పెద్దగా అరుపు వినిపించింది. అందరం కంగారుగా ఏమైందో అని బయటకి వెళ్ళడానికి డోర్ తీస్తుంటే డోర్ రాలేదు. ఎవరో అవతలి వైపు నుండి గడియ పెట్టారు. మా రూం కే కాదు అన్ని రూం లకి గడియ పెట్టారు. మేము అందరం బిగ్గరగా అరుస్తూ తలుపులు బాదితే మా వార్డెన్, వాచ్ మాన్ వచ్చి గడియ తీసారు, బయటకొచ్చి చూస్తే మెట్ల ప్రక్కన బాత్ రూంస్ దగ్గర మా పక్క రూం మేట్ ఆషా రక్తపు మడుగులో పడి ఉంది. పక్కనే సందీప్ ఉన్నాడు. అతన్ని మా వార్డెన్ వాళ్ళ భర్త వెనక నుండి గట్టిగా పట్టుకుని ఉన్నాడు. సందీప్ విడిపించుకోడానికి పెనుగులాడుతున్నాడు, నేను తన దగ్గరకి వెళ్ళబోతుంటే రావద్దన్నట్లు సైగ చేసాడు. అని జరిగింది మొత్తం చెప్పింది అపర్ణ.
ఈ హత్య కి సందీప్ కి ఖచ్చితంగా సంబంధం లేదు, ఇందులో అనుకోకుండా ఇరుక్కున్నాడు. వాడిని ఎలాగైనా కాపాడాలి అని నిశ్చయించుకున్నాం. అక్కడి నుండి పోలీస్ స్టేషన్ కి బయల్దేరాం. అప్పటికే రాష్ట్రమంతా ఆ వార్త  సంచలనం అయ్యింది. మహిళా సంఘాల వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి హంతకుడిని ఉరి తీయాలి అని నినాదాలు చేస్తున్నారు. టి.వి. చానెల్స్ వాళ్ళు వాళ్ళ T.R.P రేటింగ్స్ కోసం రకరకాల కధలు అల్లేసి ప్రసారం చేసేస్తున్నారు. సందీప్ ఆషా ని ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడనీ, తను కాదనేసరికి ఉన్మాదిలా మారి తనని హతమార్చాడని ఒకరు, సందీప్, ఆషా ఇద్దరూ ప్రేమికులని, కాని ఆషా సందీప్ ని మోసం చేసి ఇంకో అబ్బాయిని ప్రేమించడం తో తట్టుకోలేక ఆమెని అత్యంత దారుణంగా చంపాడని ఇంకొకరు ఇలా ఇష్టం వచ్చినట్లు వాళ్ళ చానెళ్ళలో ప్రసారం చేస్తున్నారు. ఇవన్నీ చూసి సందీప్ వాళ్ళ అమ్మ,నాన్న  కృంగిపోయారు. వాళ్ళ అమ్మ నాన్న లతో కలిసి సందీప్ తో మాట్లాడడానికి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాము.మమ్మల్ని చూడగానే సందీప్ చిన్న పిల్లాడిలా  ఏడ్చేసాడు. వాడిని ఓదార్చి అసలు అప్పుడు ఏం జరిగిందో చెప్పమని అడిగాము.
అపర్ణ నేను టెర్రస్ మీద ఉన్నప్పుడు అపర్ణ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే కిందకి వెళ్ళింది నన్ను అక్కడే ఉండమని ఒక 15 నిమిషాలలో వస్తాను అని. అరగంట అయినా తను ఇంకా రాలేదు, తనకి ఫోన్ చేస్తుంటే సిగ్నల్ కలవలేదు. చాలా సేపు ఎదురు చూసి తను వస్తుందో లేదో చూడడానికి మెట్ల మీద నుండి కొంచెం కిందకి దిగి తొంగి చూసాను. కాని అప్పుడే ఒక అమ్మాయి మెట్ల పక్కన ఉన్న బాత్ రూం వైపు రావడం చూసి కంగారు పడి అక్కడే దాక్కున్నాను, ఇంతలో గ్రౌండ్ ఫ్లోర్ నుండి మొదటి అంతస్థులో ఉన్న రూంస్ కి రావడానికి మధ్యలో ఉన్న గ్రిల్స్ కి ఉన్న గేట్ తీస్తున్న శబ్ధం అయ్యి ఎవరో వస్తున్నారని అర్ధమయ్యి వెంటనే టెర్రస్ పైకి వెళ్ళి వాటర్ ట్యాంక్ వెనక దాక్కున్నాను, కొంచెం సేపటికి ఒక అమ్మాయి గట్టిగా అరుస్తున్న శబ్ధాలు వినపడుతున్నాయి, కాని కిందకి వెళ్ళి చూసే ధైర్యం సరిపోలేదు, కాని ఆ అరుపులు పెద్దవి అయ్యాయి, ఎవరో ప్రాణం పోతున్నట్లు అరుస్తున్నట్లు ఉంది, నాకు అపర్ణ గుర్తుకు వచ్చింది,  భయమేసింది వెంటనే మెట్ల మీద నుండి కిందకి వస్తున్నాను, ఈ లోపు ఏదో అద్దం పగిలిన శబ్ధం వినపడింది, వెంటనే కిందకి తొంగి చూసాను, ఎవరూ కనపడలేదు, కిందకి దిగి బాత్ రూంస్ వైపు వెళ్ళాను, అక్కడ అంతా చీకటిగా ఉంది, ఒకే ఒక బాత్ రూం లో మాత్రం లైట్ వెలుగుతుంది, కిందకి చూస్తే ఒక అమ్మాయి కాళ్ళు కనపడ్డాయి, ఏదో పెనుగులాడుతున్నట్లు విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు కాళ్ళని గట్టిగా ఆడిస్తుంది.
నేను గట్టిగా ఎవరు, ఎవరూ అని అరిచి బాత్ రూం దగ్గరకి పరిగెత్తాను, ఒక్కసారిగా ఆ అమ్మాయి పెద్దగా అరిచింది, అంతే ఆ తర్వాత నిశ్శబ్ధం, తన కాళ్ళు కదలడం ఆగిపోయింది. ఆ బాత్ రూం దగ్గరకి చేరుకొని డోర్ తీయబోతున్నాను, ఇంతలో ఎవరో లోపలి నుండి బలంగా డోర్ ని తోసారు, అడ్డంగా నిలబడిన నా మీదకి ఒక్కసారిగా దాడి చేసాడు, తన చేతిలో ఉన్న పగిలిన అద్దం తో నా గొంతు కోయబోయాడు, నేను అతనిని బలంగా తోసేసాను, ఆ అద్దం నా భుజం లో దిగింది, ఇంతలో అందరూ రూం లలో తలుపు బాదడం విని వెంటనే పరిగెత్తి గోడ దూకేసి పారిపోయాడు, నేను ఆ బాత్ రూం దగ్గరే కుప్ప కూలిపోయాను, డోర్ తెరిచి ఉంది, లోపలికి చూడగానే నాకు కళ్ళు తిరిగిపోయాయి, మా క్లాస్ మేట్ ఆషా బాత్ రూం లో వెల్లకిలా పడి ఉంది, ఆషా చేతులు వాటర్ ట్యాప్ కి కట్టేసి ఉన్నాయి, తన మెడ సగం కోసేసినట్లు వేలాడుతుంది. ఆ బాత్ రూం మొత్తం రక్తపు మడుగులా ఉంది, తన ఒంటి మీద బట్టలు లేవు, తన తలని గోడకేసి బాది తల పగలగొట్టినట్లు నుదురు మొత్తం చిధ్రమయి ఉంది. ఇంకా దారుణం ఏంటంటే ఆ పగిలిన అద్దం ముక్కతో తన చాతి మీద I Love U అని తన శరీరాన్ని చీల్చి రాసి ఉంది. తనని చూడగానే నాకు మాట పడిపోయింది, ఏం చేయలో తెలియని పరిస్థితి, ఇంతలో గేటు తీసుకుని వాచ్ మెన్, వార్డెన్, వార్డెన్ వాళ్ళ భర్త పరిగెత్తుకుంటూ పైకి వచ్చారు, వార్డెన్ భర్త పరిగెత్తుకుంటూ నా దగ్గరకి వచ్చి నన్ను ఒడిసి పట్టుకున్నాడు, నేను ఆ హత్య చేయలేదని చెబుతున్నా వినిపించుకోలేదు, ఇంతలో అపర్ణ వాళ్ళందరూ బయటకి వచ్చారు, నేను ఇందులో ఇరుక్కుపోయాను అని అర్ధమయిపోయింది, అనవసరంగా అపర్ణ ని కూడా ఇందులోకి లాగడం నాకు ఇష్టం లేదు, అందుకే తనని ఏం మాట్లడవద్దని సైగ చేసాను, అని తను కళ్ళారా చూసినదంతా చెప్పాడు. సందీప్ వాళ్ళ తల్లితండ్రులతో మాట్లాడి వాళ్ళకి తెలిసిన లాయర్ని సంప్రదించాము, జరిగినదంతా ఆయనకి చెప్పాము.
హత్య జరిగిన సమయానికి ఆ ప్రదేశంలో అతను ఉన్నాడు కాబట్టి అందరూ ఖచ్చితంగా సందీప్  హత్య చేసాడని నమ్ముతున్నారు, పైగ చనిపోయిన అమ్మాయి సందీప్ వాళ్ళ క్లాస్ మేట్. కాబట్టి ఆషా కోసమే సందీప్ వెళ్ళినట్లు అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ కేసు నుండి బయట పడాలంటే అపర్ణ ఒక్కటే దిక్కు, ఆ సమయంలో తన కోసమే సందీప్ అక్కడికి వచ్చాడని తను కోర్టులో చెప్పాల్సి ఉంటది అని లాయర్ గారు చెప్పారు. సందీప్ కోరుకున్నట్లు అపర్ణ ని ఇందులో లాగకూడదనుకున్నాము. కాని సందీప్ బయటపడాలంటే తను బయటకి రావడమే పరిష్కారం అని భావించి అపర్ణ ని కలిసి లాయర్ చెప్పింది అంతా చెప్పాను, తను నాకు సందీప్ ముఖ్యం నా పేరు చెడిపోతుందని నాకేమి భయం లేదు నేను ఎప్పటికైనా సందీప్ నే పెళ్ళి చేసుకుంటా నేను కోర్టు లో జరింగింది చెప్పడానికి సిద్ధం అని చెప్పింది. కోర్టులో జరిగింది మొత్తం చెప్పింది, తన కోసమే వాళ్ళ హాస్టల్ కి వచ్చాడని ఆష కి సందీప్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. అపర్ణ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని సందీప్ కి బెయిల్ మంజూరు చేసారు, సందీప్ ని నేరస్థుడిగా కాక ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్నట్లు ప్రకటించింది. అసలు నేరస్థులు ఎవరో తేలే వరకు సందీప్ మీద కేసు అలాగే నడుస్తుంది అని చెప్పింది.
సందీప్ కి బెయిల్ దొరికినందుకు మేమందరం సంతోషించాం, కాని సందీప్ మాత్రం తన కళ్ళ ముందే ఆష చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, పైగా తన తప్పు లేకుండా తను ఈ హత్యలో ఇరుక్కున్నాడని బాధ పడుతున్నాడు, ఎలాగైనా హంతకుడు ఎవరో తెలుసుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు, నేను హంతకుడిని చూసాను, మొహం సరిగ్గా కనపడకపోయినా హంతకుడిని  చూస్తే గుర్తు పడతాను. హాస్టల్ కి ఆ రోజు నేను కాకుండా ఇంకెవరో వచ్చారు, అది కూడా నా లాగ దొంగతనం గా వెనక నుండి కాకుండా కింద నుండి పైకి రావడనికి మధ్యలో ఉన్న గేట్ తీసుకుని దర్జాగా వచ్చాడు అంటే వాడెవడో వాచ్మెన్ కి కాని వార్డెన్ వాళ్ళకి కాని ఖచ్చితంగా తెలిసే ఉండాలి అని చెప్పాడు. వెంటనే నేను సందీప్ అనిల్ కలిసి వాచ్మెన్ ని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సందీప్ ని చూడగానే వాచ్మెన్ భయపడిపోయాడు, ఎవరికో ఫోన్ చేయబోయాడు, అతడి దగ్గర ఫోన్ లాక్కుని నెంబర్ చూస్తే అది వార్డన్ వాళ్ళ భర్త నెంబర్. వాచ్మెన్ ని నాలుగు తన్ని అసలు ఆ రోజు ఎవరెవరు హాస్టల్ కి వచ్చారని అడిగాము, అతనికి ఇంక చెప్పక తప్ప లేదు, మా వార్డెన్ సారు వాళ్ళ బంధువు ఒకాయన రోజూ రాత్రి పూట మందు తాగడానికి మా హాస్టల్ కి వస్తాడు, ఆ రోజు కూడా నువ్వు రావడానికి ఒక గంట ముందు ఆ సారు వచ్చాడు, నేను మందు తీసుకొచ్చి ఇచ్చాను, వాళ్ళు మందు తాగుతుంటే ఇంక నేను బయటకొచ్చేసాను, ఆ తర్వాత కాసేపటికి నువ్వు వచ్చావు, వాళ్ళు చూడకుండా నిన్ను పైకి పంపించాను, అంత వరకే నాకు తెలుసు ఆ తర్వాత ఏం  జరిగిందో నాకు తెలీదు, పోలీసులు నిన్ను తీసుకెళ్ళాక మా సారు నన్ను పిలిచి రాత్రి మా బంధువు వచ్చిన సంగతి ఎవరికీ చెప్పకు, చెప్తే నీ ప్రాణాలు తీస్తాను అని బెదిరించి నాకు కొంత డబ్బు ఇచ్చారు. అంతే అంతకు మించి నాకేమి తెలియదు అని చెప్పాడు. వాడు చెప్పిన దాని బట్టి ఆ రోజు హాస్టల్ లో సందీప్, వాచ్ మెన్, వార్డెన్ భర్త కాకుండా ఇంకో మగాడు ఉన్నాడు, ఆ హత్య చేసింది వాచ్ మెన్ కాదు, వార్డెన్ మొగుడు కాదు అంటే కచ్చితం గా ఆ వార్డెన్ బంధువే అయ్యుంటాడు అని మేము ఒక నిర్ణయానికి వచ్చాము.
ఆ రోజు నేను హాస్టల్ దగ్గరకి వెళ్ళినప్పుడు గేటు ముందు ఒక కారు ఉంది, నన్ను పోలీసులు అరెష్ట్ చేసి కిందకి తీసుకొచ్చినప్పుడు ఆ కారు లేదు అంటే పోలీసులు వచ్చే లోపే హంతకుడు ఆ కారు వేసుకుని వెళ్ళిపోయాడు. వార్డెన్ మొగుడికి ఈ హత్య గురించి తెలుసు, అందుకే వాడు పైకి రాగానే బాత్ రూం దగ్గరే నేను ఉన్నట్లు ముందే తెలిసినట్లు సరాసరి నా దగ్గరకి వచ్చి నన్ను పట్టుకున్నాడు, వాడు చేసిన హత్య నుండి బయట పడడానికి అదృష్టం కొద్దీ వాళ్ళకి నేను కనిపించాను, తెలివి గా నన్ను ఇరికించి వాళ్ళు తప్పించుకున్నారు, ఆ కారు నెంబర్ తెలుసుకుంటే వాడు ఎవడనేదీ తెలిసిపోతుంది అని సందీప్ చెప్పాడు. వాచ్ మెన్ ని అడిగి ఆ కారు నెంబర్ తీసుకున్నాము. నన్ను అనిల్ ని కారు నెంబర్ ద్వారా ఆ కారు ఎవరిదో కనుక్కు రమ్మని చెప్పి సందీప్ ఎక్కడికో వెళ్ళాడు. మేము ట్రాన్స్పోర్ట్ ఆఫీసు లో మాకు తెలిసిన ఒకాయన ద్వారా అడ్రస్ కనుక్కుని ఆ అడ్రస్ కి వెళ్ళాము, ఆశ్చర్యం, అది అపర్ణ వాళ్ళ హాస్టల్ ఉంటున్న ఏరియా కార్పొరేటర్ గారి కారు. అతని పేరు జగదీష్. అతను స్వయానా ఆ ఊరి M.L.A కి బావమరిది. అతనికి హాస్టల్ ఓనర్ కి సంబంధం ఏంటని వాకబు చేస్తే ఆ హాస్టల్ వార్డెన్ భర్త ఇతనికి వరసకి మావయ్య అవుతాడు అని తెలిసింది.
ఇంతలో సందీప్ నుండి ఫోన్ వచ్చింది తను ఉన్న చోటు చెప్పి త్వరగా రమ్మని చెప్పాడు. మేము తన దగ్గరకి వెళ్ళే సరికి ఒంటి నిండా గాయాలతో ఉన్నాడు. ఏమైందని కంగారుగా అడిగాము. సందీప్ జరిగినదంతా చెప్పాడు. నేను మిమ్మల్ని పంపించి అపర్ణ వాళ్ళ హాస్టల్ దగ్గరకి వెళ్ళాను, ఆ వార్డెన్ వాళ్ళ భర్త ని నిలదీసాను. మొదట భయపడి నిజం చెప్పేసాడు. ఆ రోజు వాళ్ళ మేనల్లుడు జగదీష్, వాడు మందు తెప్పించుకుని తాగారు, జగదీష్ మందు బాగా ఎక్కువై ఎంత చెప్తున్నా వినకుండా పైన హాస్టల్ రూం లకి వెళ్ళబోయాడు, ఇంతలో ఆష బాత్ రూం కి వెళ్ళడం చూసి తన వెనకాలే వెళ్ళాడు, ఎక్కడ తను గోల చేస్తే మిగతా వాళ్ళందరూ లేస్తారేమో అని వార్డెన్ మొగుడు అన్ని రూం లకి బయట నుండి గడియ పెట్టాడు, ఆష జగదీష్ ని చూసి భయపడి గొడవ చేయబోతుంటే ఆష నోరు నొక్కి తల గోడకేసి బలంగా బాదాడు. తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడు, ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా గోడకి ఉన్న అద్దం పగల గొట్టి  ఒక సైకోలా పైశాచికం గా తన ఒంటి నిండా గాయాలు చేసాడు. ఇంతలో నేను వాళ్ళ వైపు రావడం గమనించి ఆష మెడ కోసేసి నా మీద దాడి చేసి నన్ను చంపాలనుకున్నాడు, కాని కుదరక తప్పించుకు పారిపోయాడు. అని జరిగింది మొత్తం వాడు నాకు చెప్పాడు. ఇంతలో వాడి భార్య  ఎవరికో ఫోన్ చేసింది, నేను వాడితో మాట్లాడుతుండగానే ఒక నలుగురు మనుషులు కారు లో వచ్చి నన్ను బాగా కొట్టారు. ఇంకోసారి ఆ హాస్టల్ వైపు వస్తే చంపేస్తామని బెదిరించారు, ఇక నేను అక్కడి నుండి తప్పించుకుని వచ్చేసాను అని జరిగింది చెప్పాడు. సందీప్ కి మేము తెలుసుకున్నది మొత్తం చెప్పాము. అంటే ఆ కార్పొరేటరే ఈ హత్య చేసాడు, నన్ను కొట్టింది కూడా వాడి మనుషులే, ఈ విషయం వెంటనే పోలీసులకి చెప్పాలి అని సందీప్ మమ్మల్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు, పోలీస్ స్టేషన్ లో మీడియా ఎదుట జరిగినదంతా చెప్పాడు. ఒక కార్పొరేటర్ అందునాM.L.A గారి బావ మరిది పేరు ఈ కేసులో వినబడేసరికి ఆషా హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం అయ్యింది, ప్రతి పక్ష పార్టీలు కొన్ని సందీప్ కి మద్దతుగా నిలిచాయి. జగదీష్ ని అరెష్ట్ చేయాలని డిమాండ్ చేసాయి.
ఇక జగదీష్ బయటకి రాక తప్పలేదు. తనకి ఆ హత్య కి అసలు ఏ సంబంధం లేదని తనని రాజకీయం గా దెబ్బ తీయాలని ప్రతి పక్షం వాళ్ళు సందీప్ చేత అలా నాటకమాడిస్తున్నారని అసలు హంతకుడు సందీపే అని చెప్పాడు. మేము ఆష తల్లిదండ్రులని కలిసాము, జరిగింది మొత్తం వాళ్ళకి వివరించాము, వాళ్ళు సందీప్ ని పూర్తిగా నమ్మారు, సందీప్ కి తమ కూతురి హత్య కి సంబంధం లేదని అర్ధం చేసుకున్నారు, ఆష తల్లి కోర్టులో సందీప్ కి ఈ హత్య తో సంబంధం లేదనీ, తనకి జగదీష్ మీదనే అనుమానం ఉన్నదని చెప్పింది. ఆష పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆషని బలవంతంగా మానభంగం చేసారని, తన నుదురు చిట్లిపోయేలా బలంగా తలని గోడకేసి బాదారని, తన గొంతు కోయడం వలనే చనిపోయిందని, తను చనిపోయాక కూడా తన మీద అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసారని తేలింది. ఆష వంటి మీద దొరికిన D.N.A సందీప్ D.N.A తో సరిపోవట్లేదని, అలాగే ఆష శరీరం మీద ఉన్న గుర్తులు కూడా సందీప్ వి కాదని పోస్ట్ మార్టంలో తేలింది. కోర్టు సందీప్ ని నిర్దోషిగా ప్రకటించింది. అలాగే ఆరోపణలు ఎదుర్కుంటున్న జగదీష్ ని విచారించవలిసిందిగా పోలీసులని ఆదేశించింది. మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు  జగదీష్ కి నార్కో ఎనాలసిస్ పరీక్ష చేయాలని పట్టుబట్టాయి.M.L.A  బావమరిది కావడం తో ఆ సెగ ఆ M.L.A కి కూడా తగిలింది. ప్రతిపక్షాలుM.L.A   రాజీనామా చేయాలని పట్టుబట్టాయి.
ఇక జగదీష్ ని అరెస్ట్ చేయడమే తరువాయి అని అందరూ అనుకుంటుండగా అకస్మాత్తుగా పోలీసులు మీడియా ముందు ఆషా ని హత్య చేసిన హంతకుడు అని సత్యన్నారాయణ అనే ఒక వ్యక్తి ని నిలబెట్టారు. అతను కూడా నేనే హంతకుడిని అని మీడియా సాక్షి గా ఒప్పుకున్నాడు. ఆషని తను ప్రేమించాడని, కాని ఆష ఒప్పుకోలేదని అందుకే తన హాస్టల్ కి వెళ్ళి తనని హత్య చేసానని ఏదో పాఠం అప్పచెప్పినట్లు చెప్పాడు. మేము ఆశ్చర్యపోయాం. వాడేంటి హంతకుడేంటి. ఎక్కడో చిల్లర దొంగతనాలు చేసుకునే సత్యన్నరాయణకి ఆషా కి సంబంధం ఏమిటి. ఐనా అసలు సరిగ్గా నిలబడడమే చేత కాని ఇతను ఆషని  హత్య చేయగలడా అని మాకు అనిపించింది. మాకే కాదు రాష్ట్రంలో ఈ హత్య గురించి తెలిసిన వాళ్ళందరికీ అలానే అనిపించింది. ఇది
జగదీష్ ని ఈ కేసు నుండి బయట పడేయడానికి పోలీసులు ఆడుతున్న నాటకం అని, ఆ సత్యన్నారాయణ వాళ్ళ ఆటలో డబ్బులు పెట్టి కొనుక్కున్న బలి పశువని అందరికీ అర్ధమయ్యింది. కోర్టులో కూడా అతను మీడియా ముందు చెప్పిన పాఠమే అప్పచెప్పాడు. ఆ కేసు రేపిన సంచలనం, ఆ కేసు యొక్క తీవ్రత దృష్ట్యా కోర్టు అతనికి ఉరి శిక్ష విధించింది. అది విని అతను కంగారు పడిపోయాడు, వెంటనే తను ఈ హత్య చేయలేదని గగ్గోలు పెట్టాడు.
పోలీసులు సత్యన్నారాయణ కి మతిస్థిమితం సరిగ్గా లేదని, అతనొక సైకో అని అందుకే ఇలా మాట మారుస్తున్నాడని చెప్పారు. కోర్టు అతనికి రిమాండ్ విధించి తీర్పు వాయిదా వేసింది. ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు  M.L.A పోలీసులని ప్రభావితం చేసాడని కేసుని పోలీసులు తప్పు దోవ పట్టించి అమాయకుడిని ఇందులో ఇరికించారని ఆరోపించాయి. ఆషా తల్లి కూడా సత్యన్నారాయణ  ఒక బలి పశువు మాత్రమే అని అసలు దోషులు తప్పించుకోవడానికి అతడిని వాడుకున్నారని ఆరోపించింది. సత్యన్నారాయణ తల్లి కూడా తన కొడుకు అమాయకుడని అతను ఈ హత్య చేయలేదని, కేవలం డబ్బు కోసమే తన కొడుకు మొదట నేరం తన మీద వేసుకున్నాడని, 2 లేదా 3 సంవత్సరాలలో వదిలేస్తారని నా కొడుకు ని నమ్మించి డబ్బు ఆశ చూపించి అతని చేత అలా చెప్పించారని,  తీరా కోర్టు లో ఉరిశిక్ష వేసేసరికి సత్యన్నారాయణ  భయపడి తను ఈ హత్య చేయలేదని నిజం చెప్పాడని ఆమె మీడియా కి చెప్పింది.  ఆషా తల్లి తన కూతురిని చంపిన జగదీష్ ని అరెష్ట్ చేసి న్యాయాన్ని కాపాడాలని నిరాహార దీక్ష మొదలు పెట్టింది. తనకి మద్దతుగా రాష్ట్రం మొత్తం నిలిచింది. పోలీసులు ఆమెని అరెష్ట్ చేసి హాస్పిటల్ కి పంపించారు.
తర్వాతి రోజు పేపర్ లో మొదటి పేజీలో ఆషా హత్య కేసులో నిందితుడు సత్యన్నారాయణ ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసారని పెద్ద అక్షరాలతో ఒక వార్త కనపడింది. సత్యన్నారాయణ ని వేరే జైలుకి పంపిస్తుండగా మధ్య దారిలో పారిపోబోయాడని రివాల్వర్ తీసుకుని తమ మీద దాడి చేయబోతే తామే ఎదురు దాడి చేసి తనని కాల్చి చంపేసామని పోలీసులు ఒక అద్భుతమైన కథ ని చెప్పారు. ప్రధాన నిందితుడు చనిపోవడం వల్ల కేసుని మూసేస్తున్నామని మీడియాకి సెలవిచ్చారు. భద్రత సరిగ్గా లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్లని మూసివేయాలని ప్రభుత్వం ఒక చిన్న ఆర్డరు పాస్ చేసి చేతులు దులుపుకుంది, జగదీష్ మిష్టర్ పర్ఫెక్ట్ అని కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. సదరుM.L.A గారు ఆష మృతికి  సంతాపం తెలుపుతూ చిన్న ప్రెస్ మీట్ పెట్టి నాలుగు కన్నీటి బొట్టులు రాల్చారు. మహిళా సంఘం వాళ్ళు, మానవ హక్కుల సంఘం వాళ్ళు ఇక చేసేదేమీ లేక రాష్ట్రం లో బాగా ప్రాచుర్యం పొందిన ఇంకో కేసులో బాధితులకి మద్దతివ్వడానికి వెళ్ళిపోయారు.సందీప్, అపర్ణ M.S చేయడానికి అమెరికా వెళ్ళిపోయారు. M.L.A గారు ఈ సారి M.P సీటు కి పోటీ చేస్తున్నారు, మన కార్పొరేటర్ జగదీష్ ఈ హత్య కేసు వల్ల బాగా పాపులర్ అయిపోవడంతో కార్పొరేటర్ నుండి ప్రమోషన్ పొంది M.L.A సీటు కి పోటీ చేస్తున్నాడు, ఆషా తల్లి మాత్రం ఇంకా నా కూతురికి న్యాయం చేయండి అని ప్రభుత్వానికి పిటీషన్ లు పెట్టుకుంటూనే ఉంది. పాపం పిచ్చి తల్లి...