Thursday, October 24, 2013

అనామిక@జీమెయిల్.కాం - PART - II

[[[[ మొదటి భాగం కొరకు Part - I ని క్లిక్ చేయండి...]]]

వెంటనే నేను 'అయ్యో ఆ అమ్మాయి మెయిల్ నుండి మెయిల్స్ వస్తున్నాయని కంప్లైంట్ ఇచ్చింది నేనే కావాలంటే అంకుల్ ని అడగండి అని ఆయన వంక చూసాను. ఆయన అయోమయం గానే అవునని చెప్పారు. ఆ పోలీస్ కి మతిపోయింది. అదేంటి? నువ్వే హ్యాక్ చేసి నీకే మెయిల్స్ పంపించుకుని మళ్ళీ నువ్వే ఎందుకు కంప్లైంట్ ఇచ్చావ్ అన్నాడు. బాబోయ్ నేను హ్యాక్ చేస్తే చనిపోయిన అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఎందుకు వీళ్ళ ఇంటికి వెళ్తాను. నేనే అంకుల్ ని తీసుకుని ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాను అని తిరిగి ప్రశ్నించాను. కల్పన వాళ్ళ నాన్న గారు నన్ను నమ్మారు. పోలీసులతో ఈ అబ్బాయి అయ్యుండడు ఇతనికి ఏం సంబంధం లేదు. అంతగా అవసరమైతే కేసు వెనక్కి తీసుకుంటాం అని చెప్పాక ఇక చేసేదేమీ లేక ఆయనతో పాటు పోలీసులు కూడా వెళ్ళిపోయారు.

నేను ఇంకా అయోమయం లోనే ఉన్నాను. అసలు ఇదెలా జరుగుతుంది? మా ఇంట్లో నేను తప్ప నా కంప్యూటర్ ఎవరూ వాడరు. మరలాంటప్పుడు కల్పన మెయిల్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు? అదీ మా ఇంట్లో నుండి. ఏం అర్ధం కావట్లా ఇలా అనుకుంటూ నా రూం లోకి వెళ్ళాను. నా కంప్యూటర్ ఆన్ చేయడానికి బటన్ నొక్కాను. ఆన్ కాలేదు. తీరా చూస్తే వెనకాల వైర్ తీసేసి ఉంది. నేనెప్పుడూ కంప్యూటర్ ఆఫ్ చేస్తా కాని వెనకాల వైర్ తీయను. అనుమానమొచ్చి వెంటనే మా అమ్మ ని పిలిచి అడిగాను. నేనే తీసాను రా, నువ్వు దాన్ని కట్టేయకుండా వెళ్ళిపోతున్నావు, నాకేమో దాన్ని ఎలా ఆఫ్ చేయాలో తెలీదు అందుకే వెనకాల ప్లగ్ లో నుండి వైర్ లాగేస్తున్నా అని చెప్పింది. నేను కంప్యూటర్ ఆఫ్ చేయకపోవడమేంటి? నేను ఎప్పుడు బయటకెళ్ళినా ఆఫ్ చేసే వెళ్తాను కదా పోని ఒకసారి అంటే మరిచిపోయా అనుకోవచ్చు మా అమ్మ రోజూ వైరు తీసేస్తున్నా అంటుంది కదా రోజూ ఎలా మరిచిపోతా? అంటే నేను లేనప్పుడు ఎవరో ఆన్ చేస్తున్నారు కాని ఎవరు? ఇలా ఆలోచిస్తూ మా అమ్మ ని  'అమ్మా నేను లేనప్పుడు ఎవరైనా నా కంప్యూటర్ ఆన్ చేస్తున్నారా? అని అడిగాను. నువ్వు కాకుండా ఇంట్లో ఇంకెవరు వాడతారు రా. ఎవరూ ఆన్ చేయరు అని చెప్పి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయాక వైర్ కనెక్ట్ చేసి కంప్యూటర్ ఆన్ చేసా. వెంటనే ప్లగ్ బాక్స్ లో నుండి నిప్పులు వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యి నా రూం వరకు వైరింగ్ మొత్తం కాలిపోయింది. ఫ్యాన్లు, లైట్లూ ఏమీ పని చేయట్లా. కంప్యూటర్ కి ఏమైనా అయ్యిందేమో చూద్దామని కంప్యూటర్ ని ఇంకో రూం లోకి మార్చి వైర్ పెట్టి ఆన్ చేసాను. బానే పని చేస్తుందని ఊపిరి పీల్చుకున్నాను. ఎలెక్ట్రిషియన్ వచ్చి బాగు చేసే వరకు నా మకాం ఈ రూం లోకి మార్చేసాను.


తన నుండి ఏమైనా మెయిల్స్ వచ్చాయేమో చూసుకున్నాను. కానీ ఏమీ రాలేదు. ఇంక స్నానం చేద్దామని కంప్యూటర్ ని ఈ సారి ఆఫ్ చేయడాన్ని గుర్తుపెట్టుకుని మరీ ఆఫ్ చేసి  స్నానానికి వెళ్ళాను. స్నానం పూర్తి అయ్యాక తిరిగి వచ్చి చూస్తే వింతగా కంప్యూటర్ ఆన్ అయ్యి ఉంది. నాకేమీ అర్ధం కాలేదు. మళ్ళీ కంప్యూటర్ ని షట్ డౌన్ చేసాను. కాని కంప్యూటర్ ఆఫ్ అవ్వటం లేదు రీస్టార్ట్ అవుతుంది. ఎన్ని సార్లు ఆఫ్ చేసినా రీస్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఒకవేళ ఆఫ్ బటన్ పనిచేయడం లేదేమో ఆఫ్ చేసినా రీస్టార్ట్ అవుతుందని నాకు తెలిసిన  కంప్యూటర్లు బాగు చేసే అతనిని ఇంటికి పిలిపించి చూపించాను. అతను వచ్చి చెక్ చేసి ఆఫ్ చేసి చూసాడు. ఆశ్చర్యం. అతను ఆఫ్ చేయగానే మామూలుగానే ఆఫ్ అయిపోయింది.విచిత్రం గా  ఉందే? నేను ఎన్నిసార్లు ఆఫ్ చేసినా ఆఫ్ అవ్వనిది ఇప్పుడు మామూలుగా ఆఫ్ ఐపోయిందే అన్నాను. అతను మీరు షట్ డౌన్ నొక్కబోయి రీస్టార్ట్ నొక్కుతున్నట్లున్నారు అని అంతా బానే ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. నాకేదో అనుమానం గా ఉంది. 


రాత్రి బోజనం చేసి నా రూం లో కరెంట్ లేనందు వల్ల కంప్యూటర్ పెట్టిన గదిలోనే పడుకున్నా. డోర్ లాక్ చేసి లైట్ ఆప్ చేసి పడుకున్నా. సరిగ్గా నిద్ర పట్టటం లేదు కానీ కళ్ళు మూసుకునే ఉన్నాను. రాత్రి ఒంటి గంట దాటాక ఏదో శబ్ధాలు అవుతుంటే మెలుకువ వచ్చింది కాని కళ్ళు తెరవలేదు. టక టక అని  నా కంప్యూటర్ కీ బోర్డ్ లో చాలా వేగం గా ఎవరో టైపు చేస్తున్నట్లు ఒకటే శబ్ధం. నాకు భయం మొదలయ్యింది. కళ్ళు తెరిచి చూడడానికి ధైర్యం సరిపోలేదు. అలానే కళ్ళు మూసుకుని అటు వైపు తిరిగి పడుకున్నా. కాని కళ్ళ మీద వెలుగు పడుతుంది. నేను పడుకున్నప్పుడు బెడ్ లైట్ కూడా వేసుకోను. కాని ఈ వెలుగు ఎక్కడిది? ఇంక లాభం లేదని ధైర్యం చేసి కళ్ళు తెరిచి చూసాను. కంప్యూటర్ ఆన్ అయ్యి ఉంది. ఛా..! మళ్ళీ ఇది ఆన్ అయ్యి చచ్చినట్లుంది అని ఆఫ్ చేయడానికి లేచాను. అంతే నా గుండె ఒక్కసారి ఆగినంత పనయ్యింది. స్క్రీన్ మీద జీమెయిల్ ఓపెన్ చేసి ఉంది. కీబోర్డ్ లో  ఒక్కొక్క కీ దానంతట అదే ప్రెస్ అవుతుంది. ఒక్కొక్క అక్షరం స్క్రీన్ లో టైపు అవుతుంది. నాకు ముచ్చెమటలు పట్టేసాయి. వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. వెనక్కి తిరిగి చూడకుండా గడియ తీసి బయటకొచ్చి మా అమ్మ నాన్న ని పిలిచి జరిగింది చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ముగ్గురం కలిసి ఆ రూం కి వచ్చి లైట్ ఆన్ చేసాము. కాని కంప్యూటర్ ఆన్ చేసి లేదు. మా నాన్న వెటకారం గా 'నిద్ర లో ఏదో కలగని ఉంటాడు. అయినా ఇంత పిరికి నా కొడుకు నా కొడుకుగా ఎలా పుట్టాడే? నేను చిన్నప్పుడు స్మశానాల్లో పందేలు కాసి మరీ వెళ్ళి పడుకుని వచ్చే వాడిని. దెయ్యాలే నన్ను చూసి భయపడి పారిపోయేవి అని ఆయన భాగవతం మొదలు పెట్టాడు. 'బాబూ నీ వీర గాధలు వినే ఓపిక నాకు లేదు. నేను పడుకుంటున్నా అని వచ్చి లైట్ వేసుకుని పడుకున్నాను.

 తెల్లారి లేచాక టిఫిన్ చేసి ఒకసారి మెయిల్ చూసుకుందామని జీమెయిల్ ఓపెన్ చేసాను. కల్పన నుండి ఈమెయిల్. అంతే నా గుండె ఝల్లుమంది. ఓపెన్ చేయాలంటేనే భయం గా ఉంది. ధైర్యం చేసి ఓపెన్ చేసా.  'ప్లీజ్ హెల్ప్ మీ.. నాకు నీ సాయం కావాలి. దయ చేసి నీ రూం లో ఉన్న గాయత్రీ యంత్రాన్ని తీసేయ్. కంప్యూటర్ ని ఎప్పుడు ఆఫ్ చేయకు. నీతో మాట్లాడాలి. దయచేసి నాకు సహాయం చెయ్యి. అని ఉంది. అంతే నాకు ఏమీ అర్ధం కాలేదు. వెంటనే నా రూం కి వెళ్ళి చూసాను. లోపల గోడకి డొర్ పైన గాయత్రీ యంత్రం ఉంది. అది అంతకు ముందు అక్కడ లేదు. వెంటనే మా అమ్మ ని పిలిచి అది ఎప్పుడు పెట్టారు? ఎవరు పెట్టారు? అని అడిగాను. మా అమ్మ నేనే పెట్టాను రా. మొన్న గురువు గారు ఇంటికి వచ్చినప్పుడు ఆయన నీ రూం లో పెట్టమని ఈ యంత్రం ఇచ్చారు అని చెప్పింది. మా అమ్మ కి జరిగింది మొత్తం చెప్పాను. మా అమ్మ భయపడిపోయింది. వెంటనే గురువు గారి దగ్గరకి వెళ్దామని తీసుకెళ్ళింది. ఆయనకి జరిగింది మొత్తం చెప్పాను. చివర్లో గాయత్రీ యంత్రం గురించి ఆ అమ్మాయి మెయిల్ పంపిన సంగతి చెప్పాను. ఆయన నవ్వి నీకు ఇవాళ మెయిల్ పంపక ముందు ఎప్పుడు చివరగా మెయిల్ పంపింది అని అడిగారు. రెండు వారాల క్రితం పంపింది. ఆ తర్వాత నుండి మళ్ళీ ఇవాళే వచ్చింది అని చెప్పాను. ఆయన రెండు వారాల క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు నాకెందుకో నీ రూం లో ఏదో అదృశ్య శక్తి ఉన్నట్లనిపించింది. అందుకే మీ అమ్మ కి ఆ యంత్రం ఇచ్చి నీ రూం లో పెట్టమనాను. అప్పటి నుండి మళ్ళీ నీకు ఏమి మెయిల్స్ రాలేదంటున్నవు. నిన్న నీ రూం లో కరెంట్ పోయాక నీ కంప్యూటర్ని నీ రూం నుండి బయటకి తీసుకొచ్చి ఇంకో రూం లో పెట్టాక మళ్ళీ నీకు మెయిల్ వచ్చింది. రాత్రి ఏవో శభ్దాలు, కంప్యూటర్ ఆన్ అవ్వడం జరిగాయి అని చెప్పావు. దీన్ని బట్టి నీ కంప్యూటర్ లోనే ఏదో అదృశ్య శక్తి ఉంది అని చెప్పారు. అదృశ్య శక్తి అంటే ? అని అడిగాను. అంటే గాలి, ఆత్మలు ఇలాంటివి అన్న మాట అని చెప్పారు. నేను నవ్వి ఎక్కడైనా దెయ్యాలు ఆత్మలు కంప్యూటర్ వాడతాయా? అని వెటకారం గా అడిగాను. ఆయన శాంతం గా అది నీకు కంప్యూటర్. కాని ఆ ఆత్మ కి అది ఒక మాధ్యమం(Medium). ఆత్మలకి శరీరం ఉండదు. శబ్ధం చేయలేవు. కాని అవి తమ ఉనికి చాటుకోడానికి ఏదో ఒక మాధ్యమాన్ని ఆశ్రయిస్తాయి. ఉదాహరణకి కొందరికి గాలి సోకిందని అంటారు అంటే ఆత్మ ఒక మనిషి ని మాధ్యమం గా వాడుకుని తన ఉనికి చాటుకుంటుందని అర్ధం. కొన్ని చోట్ల బొమ్మలు విచిత్రం గా ప్రవర్తిస్తున్నాయని వింటూ ఉంటాం. అలాగే నీ ఇంట్లో ఉన్న ఆత్మ నీ కంప్యూటర్ ని మాధ్యమం గా వాడుకుంటుంది. దాని ద్వారా తన ఉనికి చాటుకుంటుంది. లేదా దాని ద్వారా తను అనుకున్నది సాదించడానికి ప్రయత్నిస్తుండవచ్చు అని వివరం గా చెప్పారు. ఆయన చెప్పింది విన్నాక ఆలోచించాను. కల్పన చనిపోయింది. తను చనిపోయాక కూడా తన మెయిల్ నుండి మెయిల్స్ వస్తున్నాయి. అది కూడా నా కంప్యూటర్ నుండే. తనని ఆన్ లైన్ కి ఎప్పుడు రమ్మన్నా నువ్వు ఇంట్లో ఆన్ లైన్ లో ఉండగా నేను ఆన్ లైన్ లో ఉండలేననే చెప్పేది. అంటే కల్పన ఆత్మే నా కంప్యూటర్ ద్వారా నాకు మెయిల్స్ పంపి నాతో కమ్యూనికేట్ అవుతుంది. కానీ ఎందుకు? తను ఏదో చెప్పాలనుకుంటుంది. తనకి సహాయం చేయమంటుంది.

ఇప్పుడేం చేయమంటారు అని అడిగాను ఆయనని. ఆ ఆత్మ ని ఆ కంప్యూటర్ నుండి వేరు చేద్దాం. రేపే మీ ఇంటికి వస్తాను. పూజ మొదలు పెడతాను అని చెప్పారు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళమన్నారు. ఇద్దరం ఇంటికి వచ్చేసాం.  నాకు ఆ రూం లోకి వెళ్ళడానికి భయం గా ఉంది. కాని ఎందుకో వెళ్ళాలనిపించింది. నెమ్మదిగా డోర్ తీసాను. కంప్యూటర్ ఆఫ్ చేసే ఉంది. లోపలికి వెళ్ళాను. ఒక్కసారి గా డోర్ లాక్ పడిపోయింది. నాకు గుండె ఆగినంత పనయ్యింది. కంగారుగా డోర్ తెరవడానికి ప్రయత్నిస్తున్నాను. కంప్యూటర్ ఆన్ అయ్యింది. నాకు భయం తో ఊపిరి ఆగిపోయిద్దేమో అన్నట్లుంది. అప్పుడు కీ బోర్డ్ నుండి శబ్ధాలు మొదలయ్యయి. స్క్రీన్ మీద ఒక్కో అక్షరం ప్రత్యక్షమవుతుంది. నాకు సహాయం చెయ్యి. Please Help me. అని టైపు చేసింది. నేను భయం తో గట్టిగా కేకలు పెట్టాను. మా అమ్మ అవతలి వైపు నుండి డోర్ తీసింది. నేను చెమటలు కక్కుతూ బయటకి పరిగెత్తాను. అమ్మ నన్ను అరిచింది అసలు ఆ రూం లోకి ఎందుకు వెళ్ళావ్ అని. నేను మా అమ్మ వాళ్ళ రూం లో పడుకున్నాను. ఆ సంఘటనే గుర్తొస్తుంది. తను నాకు హాని చేయాలని ప్రయత్నించటం లేదు. ఏదో సహాయం కోరుతుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. అదేమిటో తెలుసుకోవాలి. తనతో ముఖాముఖీ మాట్లాడడం ఎలా? ఇలా ఆలోచిస్తుండగా తను ఒకసారి నేను మా ఫ్రెండ్ రూం లో జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు నాతో ఆన్ లైన్ లో మాట్లాడిన సంగతి గుర్తొచ్చింది. నేను ఇంట్లో కంప్యూటర్ లో కాకుండా వేరే కంప్యూటర్ లో ఆన్ లైన్ లో ఉంటే తనతో డైరెక్ట్ గా మాట్లాడడం కుదిరిద్ది అన్న మాట. ఇలా ఆలోచన రాగానే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి వెంటనే వాడి లాప్ టాప్ తీసుకుని మా ఇంటికి రమ్మన్నాను. లాప్ టాప్ తీసుకుని వాడిని కూడా ఆ రూం లోకి తీసుకెళ్ళాను. డోర్ లాక్ చేసాను. వాడికి ఏమి అర్ధం కాక ఏంట్రా డోర్ లాక్ చేస్తున్నావ్. రొమాంటిక్ సినిమా సిడి ఏమైనా ఉందా అని ఆత్రం గా అడిగాడు. రొమాంటిక్ కాదు హారర్ మూవీ చూపిస్తా ఉండు అని చెప్పాను. వాడు నా వంక అయోమయం గా చూస్తున్నాడు. ఏదో తెలియని ధైర్యం ఆవహించింది. కంప్యూటర్ వంక చూసాను. ఆఫ్ చేసి ఉంది. వెంటనే బిగ్గరగా  'కల్పనా నీతో మాట్లాడాలి ఆన్ లైన్ కి రా అని అరిచాను. ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావ్ రా. ఎందుకు అరుస్తున్నావ్ అని అడిగాడు వాడు. వాడిని నోరు ముయ్యమని ఇంకోసారి గట్టిగా కల్పనా నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. ఇవాళ నీ విషయం తేలిపోవాలి ఆన్ లైన్ కి రా అని అరిచాను. అంతే టక్కున కంప్యూటర్ ఆన్ అయ్యింది. ఆ ఊహించని సంఘటన కి మా వాడికి మూర్చ వచ్చినంత పనయ్యింది. బాబోయ్ అని ఒక కేక పెట్టి బయటకి పరిగెత్తబోయాడు. అరవకు. నీకేం కాదు ఇక్కడే కూర్చో అని వాడికి ధైర్యం చెప్పాను. ఇంతలో కీ బోర్డ్ నుండి శబ్ధాలు మొదలయ్యాయి. స్క్రీన్ మీద జీమెయిల్ ఓపెన్ అయ్యింది. నేను హాయ్ అని పంపాను. నేను పంపిన మెసేజ్ ఆ కంప్యూటర్ లో కనపడుతుంది. వెంటనే తన నుండి రిప్లై వచ్చింది. హాయ్ అని. అది చూడగానే మా వాడు కళ్ళు తిరిగి అక్కడే కుప్పకూలిపోయాడు.


నువ్వు చనిపోయావని నాకు తెలుసు. నేను మీ ఇంటికి వెళ్ళాను. మీ నాన్న గారిని కలిసాను. జరిగింది మొత్తం తెలుసుకున్నాను. చాలా బాధ వేసింది. కాని నాకు ఒక్కటి అర్ధం కావటం లేదు. నువ్వు నా వెనక ఎందుకు పడుతున్నావ్? నాకు ఎందుకు మెయిల్స్ పంపుతున్నావ్? అసలు నీకేం కావాలి? అని అడిగాను. తన నుండి రిప్లై వచ్చింది. అవును నేను చనిపోయాను. ఆ విషయం నీకు తెలుసని కూడా నాకు తెలుసు. నువ్వు మా ఇంటికి వెళ్ళడం. మా నాన్న ఇక్కడికి రావడం మొత్తం నాకు తెలుసు. కాని మీరంతా అనుకుంటున్నట్లు నేను ప్రమాదవశాత్తు చనిపోలేదు. నన్ను చంపేసారు. ఆ నలుగురూ కలిసి నన్ను చంపేసారు అని పంపింది. అంతే అది చూసి నాకు ఒక్క నిమిషం ఆశ్చర్యంతో చేయి కదలలేదు. షాక్ లో ఉండిపోయా. మళ్ళీ తన నుండే మెసేజ్ వచ్చింది. ఈ నిజాన్ని దాచేసి నా మరణాన్ని ఒక సాధారణ మృతి కింద మార్చేసారు. ఈ నిజం ఎవరికీ తెలియకుండా సమాధి కాకూడదనే ఎవరో ఒకరి ద్వారా ఈ నిజాన్ని బయటపెట్టలనుకున్నాను. అందుకు నాకు దొరికిన ఒకే ఒక్క మాధ్యమం నీ కంప్యూటర్. ఇందులో నుండి వాళ్ళకి మెయిల్స్ పంపి భయపెట్టాను. వాళ్ళతో పాటు నీకు మెయిల్స్ పెట్టాను. నీ ద్వారా ఈ నిజం బయటి ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాను. అందుకే ఇదంతా చేసాను అని పంపింది. నేను తేరుకుని అసలు ఏం జరిగింది తనని ఎవరు చంపారని అడిగాను.


కాలేజ్ వాళ్ళతో టూర్ కి వెళ్ళడానికి నాన్న ని ఒప్పించి బయల్దేరాను. మొత్తం వారం రోజుల పాటు ప్లాన్ చేసారు. మొదటి రోజు అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అడుతూ పాడుతూ అసలు టైమే తెలియలేదు. సాయంత్రం అయ్యక దారిలో ఒక హోటల్ లో బస ఏర్పాటు చేసారు. రూం కి అయిదుగురు ఉండాలని చెప్పారు. మా స్నేహితురాళ్ళందరూ రెండు రూముల్లో సరిపోయారు. నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. నన్ను సోనాలి వాళ్ళ రూం లో వేసారు. నిజానికి నాకు వాళ్ళతో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళకి కాలేజీలో చాలా చెడ్డ పేరు ఉంది. వాళ్ళ గ్యాంగ్ కి చాలా పొగరు. వాళ్ళంతా చాలా హైటెక్ గా ఉంటారు. అలాంటి వాళ్ళతో నేను అడ్జస్ట్ కాలేనని తెలిసినా తప్పక వాళ్ళతో రూం పంచుకోడానికి ఒప్పుకున్నా. కాని వెళ్ళిన దగ్గర నుండి నరకం. వాళ్ళ వెకిలి చేష్టలు చూడలేకపోయా. అయినా తప్పక అలాగే రూం లో ఉన్నా. వచ్చిన దగ్గర నుండి నన్ను ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నారు.  వాళ్ళకి డ్రగ్స్ అలవాటు కూడా ఉంది. నా ముందే డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న దగ్గర నుండి వాళ్ళ ప్రవర్తన మరీ విపరీతం గా మారింది. నన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టారు. నేను కోపం తో రూం లో నుండి వెళ్ళిపోబోతుంటే నా జుట్టు పట్టుకుని ఈడ్చి కింద పడేసారు. నాకు బలవంతం గా డ్రగ్స్ ఎక్కించారు. పైశాచికంగా ప్రవర్తించారు. సొనాలి కెమెరా తో వీడియో తీస్తుంటె మిగతా ముగ్గురూ నన్ను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. నా డ్రస్ తీసేసారు. నేను వాళ్ళని ప్రతిఘటించే స్థితిలో లేను. నన్ను వివస్త్ర ని చేసి అది వీడియో తీసారు. తర్వాత వాళ్ళు చెప్పినట్లు వినకపోయినా, అక్కడ జరిగిన విషయాలు ఎవరితో అయినా చెప్పినా ఆ వీడియో ని మా కాలేజీ అబ్బాయిలందరికి MMS పంపిస్తా అని బ్లాక్ మెయిల్ చేసారు. ఆ రోజు నుండి నన్ను వాళ్ళ బానిసలా ఇష్టమొచ్చినట్లు హింసించారు. వాళ్ళ లగేజీ నాతో మోయించేవాళ్ళు.  టూర్ ఎప్పుడైపోతుందా ఎప్పుడు వీళ్ళ చెర నుండి బయటపడతానా అని ఎదురు చూసేదాన్ని. రేపటితో టూర్ ముగుస్తుందనగా ఆ రోజు అందరూ బోటింగ్ కి వెళ్దామని నిర్ణయించుకున్నారు. నేను రాను అని చెప్పినా వినకుండా రాకపోతే అందరికీ MMS పంపించేస్తామని బెదిరించి బలవంతం గా ఎక్కించారు. అప్పటికే బోటులో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. బోట్ బయల్దేరాక నా ముందే వాళ్ళకి నా వీడియో చూపించారు. వాళ్ళు నాతో అసభ్యం గా ప్రవర్తిస్తుంటే సోనాలి వీడియో తీస్తూ ఆనందపడుతుంది. తట్టుకోలేక తిరగబడ్డాను. అందరూ నన్ను కొట్టడానికి మీదకి వచ్చారు. ఆ పెనుగులాటలో నేను బోటులో నుండి జారి నీళ్ళలో పడిపోయాను. నేను మునిగిపోతుంటే వాళ్ళు నన్ను రక్షించకుండా నేను మునిగిపోవడాన్ని మొత్తం వీడియో తీసి ఆనందించారు. తర్వాత నేను కాలు జారి నీళ్ళలో పడిపోయినట్లు అందరినీ నమ్మించారు. అందుకే వాళ్ళని వదలకూడదని నిర్ణయించుకున్నా, కాని నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. నాకు సాయం చేసే వారికోసం వెదికాను. చివరికి నాకు దొరికిన ఒకే ఒక్క మార్గం నీ కంప్యూటర్. దీని ద్వారా ఆ నలుగురికీ రోజూ మెయిల్స్ పంపి బెదిరించాను. వాళ్ళు భయపడ్డారు కాని నిజాన్ని మాత్రం బయటకి చెప్పలేదు. అందుకే నీతో పరిచయం చేసుకున్నా. నీకు నా గురించి తెలిసేలా చేసా అని జరిగింది మొత్తం చెప్పింది.
అదంతా విన్నాక తన మీద జాలేసింది. తనకి సాయం చేయాలనిపించింది. కాని వాళ్ళ వళ్ళే నువ్వు చనిపోయావని అందరినీ నమ్మించడం ఎలా? నువ్వు నాకు చెప్పావంటే ఎవరూ నమ్మరు. సరైన సాక్ష్యం లేకుండా వాళ్ళని శిక్షిండం కుదరదు కదా అని అడిగాను. నేను వాళ్ళతో గొడవపడుతున్నప్పుడు నేను నీళ్ళల్లోకి పడిపోయినప్పుడు  సోనాలి కెమెరా ఆన్ లోనే ఉంది. అది మొత్తం రికార్డ్ అయ్యింది. దాని ద్వారా వాళ్ళని పట్టించవచ్చు అని వాళ్ళని పట్టించే దారి కూడా చెప్పింది. వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళ నాన్న గారికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాను. ఇద్దరం కలిసి సోనాలి మరియూ వాళ్ళ ఫ్రెండ్స్ మీద కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు సోనాలి కంప్యూటర్ లో దాచుకున్న వీడియో ని కనుక్కున్నారు. సోనాలి ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసారు.


నేను ఇంటికి వచ్చాను. ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. గురువు గారు పూజ మొదలు పెట్టినట్లున్నారు. నేను నా రూం లోకి వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేసాను.
కల్పన దగ్గర నుండి మెయిల్. ఓపెన్ చేసాను. THANK YOU FRIEND.. GUD BYE..అని ఉంది. నా కళ్ళు చెమ్మగిల్లాయి మా ఇంట్లో ఒక మనిషి దూరం గా వెళ్ళిపోతున్నట్లనిపించింది. కాని మనసుకి ప్రసాంతం గా ఉంది నా వల్ల ఒక అమ్మాయికి మనశ్శాంతి కలిగినందుకు. గురువు గారు లోపలికి వచ్చారు. ఏవో మంత్రాలు చదివారు. ఇంకేం భయం లేదు ఆ ఆత్మ ఇంక ఈ దరిదాపుల్లోకి రాదు. ఇంకెప్పుడూ నీకు మెయిల్స్ పంపించదు అని చెప్పాడు. అవును ఇంకెప్పుడు నా కంప్యూటర్ వాడుకోదు.
తను నాకు మెయిల్స్ పంపించదు. కాని చివరి సారిగా తనకో మెయిల్ పంపించాలని మెయిల్ ఓపెన్ చేసాను. నువ్వెప్పుడూ నాకు బెస్ట్ ఫ్రెండ్వి.  miss you. అని తనకి మెయిల్ పంపించాను.

Tuesday, October 22, 2013

అనామిక@జీమెయిల్.కాం

చాలా రోజులైంది జీమెయిల్ ఓపెన్ చేసి మెయిల్స్ చూసుకుని. ఆ..! అయినా నా మొహానికి అంత ముఖ్యమయిన మెయిల్స్ 
ఏమొస్తాయిలే. బజాజ్ ఫైనాన్స్ వాడు లోన్ తీసుకోమనో, ICICI వాడు ఇన్సూరెన్స్ తీసుకోమనో లేదంటే EBAY వాడు 
కూపన్ పంపిస్తున్నాం ఏదో ఒకటి కొని తగలడమనో వచ్చి ఉంటాయి అంత కన్నా ఏముంటాయిలే? నాకేమయినా గాల్ ఫ్రెండ్స్ 
గట్రా ఉన్నారా రోజుకొక గుడ్ మార్నింగ్ మెయిల్ పెట్టడానికి. అప్పుడెప్పుడో ఇంజినీరింగ్ లో దేనికో ఈమెయిల్ అడ్డ్రెస్ 
కావాలి అంటే కొత్తది క్రియేట్ చేసుకున్నా. క్రియేట్ చేసుకున్నందుకు గూగుల్ వాడు పంపిన మెయిల్ తప్పితే మల్లీ 
ఒక్క మెయిల్ కూడా రాలేదు. నా మెయిల్ ఐడి మా ఫ్రెండ్స్ కి ఇచ్చి మెయిల్ పంపమన్నా ఒక్కడు కూడా పంపే వాడు 
కాదు. ఒక్క మెయిల్ అయినా రాకపోదా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే వాడిని. ఆ కాయలు పండ్లై రాలిపోయేవి 
కాని మెయిల్స్ మాత్రం వచ్చేవి కావు. ఒక రోజు అకస్మాత్తుగా నా జీమెయిల్ కి ఒక మెయిల్ వచ్చింది. నా కోరిక 
నెరవేరింది అని ఆనందం తో ఉబ్బి తబ్బిబ్బైపోయి మెయిల్ ఓపెన్ చేసా. కంగ్రాచ్యులేషన్స్..! You are the 
luckiest winner ( మీరు అదృష్టం వరించిన విజేతలు) మీరు గెలుచుకున్నారు అక్షరాలా యాభై లక్షల 
పౌండ్లు అని ఉంది. అది చదువుతుంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఇది కలా నిజమా అని గిల్లి చూసాను. 
నా పక్కనే ఉన్న బక్కోడు గట్టిగా కేక పెట్టాడు. నేను గిల్లింది వాడి తొడనే. వాడు అరిచాడంటే ఇది నిజం. అహా 
ఒక్క బాల్ కే సెంచరీ కొట్టేసినంత ఆనందం. 50 లక్షల పౌండ్లని మన దేశ కరెన్సీ లో లెక్కలు కట్టేసి గాల్లో 
మల్టీప్లక్సులు కట్టేస్తున్నా ఒక్క దెబ్బతో కోటీశ్వరుడ్ని అయిపోయా అనుకుంటూ.
వెంటనే నా యాభై లక్షల పౌండ్లని నాకు అర్జెంట్ గా పంపించేయండి అని మా ఇంటి డోర్ నెంబర్ తో సహా అడ్రస్ 
మొత్తం మెయిల్ పెట్టాను. తెల్లారి మల్లీ మెయిల్ తెరిచి చూస్తే 'తప్ప కుండా మీ డబ్బులు మీకు పంపిస్తాం. 
కాకపోతే మొదట మీరు ఈ క్రింద ఉన్న ఎకౌంట్ లో ఒక పాతిక వేలు సెక్యూరిటీ డిపాసిట్ కోసం కట్టండి. రెండు 
రోజుల్లో మీ డబ్బులు మొత్తం మూటలు కట్టి మీ ఇంటికి పంపిస్తాం' అని ఒక ఎకౌంట్ నెంబర్ పంపాడు. పాతిక 
వేలా? ఎలా ఇస్తాం అయినా నాకు రావాల్సిన యాభై లక్షల పౌండ్లలో ఒక పాతిక వేలు తీసుకుని మిగతావి పంపిచొచ్చుగా 
అని ఆలోచిస్తుండగా మా బక్కోడు పరిగెత్తుకుంటూ వచ్చి అరేయ్ నీకో రహస్యం చెప్తాను ఎవరికీ చెప్పకు. నాకు 
లాటరీలో యాభై లక్షల పౌండ్లు వచ్చాయి రా. ఇప్పుడే మెయిల్ వచ్చింది. నాకేం చేయాలో అర్ధం కావట్ల అన్ని 
డబ్బులు. నీకు ఒక 100 పౌండ్లు ఇస్తాలేరా అన్నాడు దాన కర్ణుడిలా. అంతే నాకు దిమ్మ తిరిగి బొమ్మ మొత్తం 
చాలా స్పష్టం గా కనిపించేసింది. నా మల్టీ ప్లక్సులు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. ఒక అయిదు నిమిషాల 
తరువాత తేరుకుని వాడికి కూడా బొమ్మ చూపించేసాను.
అలా నా మొదటి మెయిల్ తోనే కోటీశ్వరుడిని అవబోయి కొద్దిలో మిస్స్ అయ్యిపోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క 
మెయిల్ కూడా రాలేదు. అయినా మెయిల్ తెరిచి ఒకసారి చెక్ చేసుకోడం మాత్రం అలవాటు అయిపోయింది. అందుకే ఇవాళ 
కూడా తెరిచి చూసా. తెరవగానే ఒక అద్భుతం జరిగింది. 'హాయ్ ఫ్రెండ్' అని ఒక మెయిల్ కనపడింది. పంపింది 
ఎవరా అని చూస్తే ఇంకో అద్భుతం. ఒక అమ్మాయి పేరు ఉంది. నేను నా మెయిల్ ఓపెన్ చేయబోయి పొరపాటున వేరే 
వాళ్ళ మెయిల్ ఓపెన్ చేసేసానా అని కొంచెం సేపు అనుమానమొచ్చింది. నాకు నా మెయిల్ ఓపెన్ చేయడమే సరిగ్గా రాదు ఇంక 
వేరే వాళ్ళ మెయిల్స్ ఓపెన్ చేసే అంత ప్రతిభా పాటవాలు లేవని గుర్తొచ్చింది. వెంటనే ఆలస్యం చేయకుండా. 'హాయ్ 
ఫ్రెండ్.. మీరెవరో తెలుసుకోవచ్చా అని మెయిల్ పెట్టాను. ఎంతకీ రిప్లై రాకపోయేసరికి కంప్యూటర్ ఆఫ్ చేసి 
పడుకున్నాను.
తెల్లారి లేచి పళ్ళు కూడా తోముకోకుండా కంప్యూటర్ దగ్గరకి వెళ్ళాను. కంప్యూటర్ ఆన్ చేసే ఉంది. రాత్రి 
సరిగ్గా ఆఫ్ చేయలేదనుకుంటా అనుకుని మెయిల్ ఓపెన్ చేసా.
తన దగ్గర నుండి రిప్లై వచ్చింది. నా పేరు కల్పన. మాది ఖమ్మం అని అడగకుండానే తన పూర్తి వివరాలు 
చెప్పేసింది. నా పేరు, మా వూరు ఎక్కడని అడిగింది. ఇదంతా ఒక్క మెయిల్ లోనే అడిగేసింది. నేను నా వివరాలు 
చెప్పి తను ఆన్ లైన్ కి ఎప్పుడొస్తదో చెప్పమని, ఆన్ లైన్ లో ఉంటే వివరం గా మాట్లాడుకోవచ్చు అని అడిగాను. 
తను తర్వాతి మెయిల్ లో నువ్వు ఆన్ లైన్ లో ఉన్నప్పుడు నాకు కుదరదు. నాకు కుదిరినప్పుడు నువ్వు 
ఉండవులే. పర్లేదు మెయిల్ లోనే మాట్లాడుకుందాం అని చెప్పింది. అలా పరిచయం స్నేహం మొత్తం మెయిల్స్ లోనే 
జరిగిపోయాయి. తను ఎప్పుడయినా ఆన్ లైన్ కి వస్తదేమో అని ఆశగా ఎదురు చూసే వాడిని కాని తను వచ్చేది కాదు. 
ఒక రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూం కి వెళ్ళి వాడి లాప్ టాప్ లో నా మెయిల్ ఓపెన్ చేసాను. ఆశ్చర్యం తను ఆన్ 
లైన్ లో ఉంది. వెంటనే క్షణం కూడా ఆగకుండా తనకి హాయి అని పంపాను. వెంటనే రిప్లై వచ్చింది. ఎక్కడున్నావ్ 
అని అడిగింది. మా ఫ్రెండ్ రూం లో ఉన్నా. ఏ ఎందుకు అలా అడిగావ్ అని పంపాను. నువ్వు ఇంట్లో ఉంటే 
నేను ఆన్ లైన్ లో ఉండను కదా అని పంపింది. నాకేం అర్ధం కాలేదు. తర్వాత చాలా సేపు ఏదో పిచ్చా పాటి 
మాట్లాడుకున్నాం. ఆ సమయం లో తను నువ్వు ఒకసారి మా ఊరు రావొచ్చు కదా కలుద్దాం అంది. నిజానికి నేనే 
తనని అడుగుదామనుకున్నా కాని తనే అడిగేసరికి ఆనందమేసింది. తప్పకుండా వస్తా అని మాట ఇచ్చా. తర్వాత 
యధావిధిగా మెయిల్స్ పంపించుకుంటూనే ఉన్నాము.
కాని ఒకసారి తను అకస్మాత్తుగా మెయిల్స్ పంపించడం ఆపేసింది. నేను ఎన్ని మెయిల్స్ పెట్టినా రిప్లై వచ్చేది కాదు. 
అలా వారం రోజులు గడిచిపోయాయి. తనకేమైంది ఎందుకు రిప్లై ఇవ్వట్లా. ఏమైనా ప్రాబ్లం ఆ. పోనీ ఒకసారి నేరుగా 
తనని కలిస్తే? అవును ఎలాగో తను కలుద్దాం అంది కదా. ఒకసారి తనని కలిసినట్లు కూడా ఉంటది. ఇలా 
ఆలోచన రావడమే ఆలశ్యం వెంటనే ఖమ్మం బయల్దేరాను. తను చెప్పిన అడ్రెస్ ప్రకారం వాళ్ళ ఇంటి దగ్గరకి 
వెళ్ళాను. వాళ్ళ నాన్న గారి పేరు అడిగి అదే ఇల్లు అని తెలుసుకున్నాను. తను బయటకి వస్తుందేమో అని చాలా 
సేపు ఎదురు చూసాను. ఎంతకీ రాకపోవడం తో ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను. కొంత 
సేపటికి వాళ్ళ నాన్న గారు వచ్చి తలుపు తీసారు. ఆయన పేరు అడిగి ఆయనే కల్పన వాళ్ళ నాన్న గారు అని 
ధృవీకరించుకుని 'నమస్తే అంకుల్, నేను కల్పన వాళ్ళ ఫ్రెండ్ ని అని నా పేరు చెప్పాను. కల్పన ఫ్రెండా ? 
కల్పన కి అబ్బాయిలు ఎవరూ ఫ్రెండ్స్ లేరే అని నా వంక అనుమానం గా చూసారు. లేదు అంకుల్ నేను తనకి 
ఆన్ లైన్ ఫ్రెండ్ ని. ఇదే మొదటిసారి తనని కలవడానికి రావడం. మాది విజయవాడ అని చెప్పాను. కల్పనని కలవడానికి 
వచ్చావా అని ఆశ్చర్యపోయారు. లోపలికి రమ్మన్నారు. అసలు నీకు కల్పన ఎలా తెలుసు? ఎప్పటి నుండి పరిచయం 
అని అడిగారు. తను నాకు ఒక నెల క్రితం నుండే పరిచయం అని. ఆన్ లైన్ లో ఫ్రెండ్స్ అయ్యాం అని చెప్పాను. 
నువ్వు మాట్లాడింది మా కల్పన తో కాదనుకుంట. నీకు ఏ ఈమెయిల్ ఐ డి నుండి మెయిల్స్ వచాయి అసలు అని 
అడిగారు. కల్పన జీమెయిల్ ఐ డి చెప్పాను ఆయనకి. ఆయన నిర్ఘాంతపోయారు. అవును అది మా కల్పనదే. కాని తను 
ఎలా పంపుతుంది. కల్పన చనిపోయి ఆరు నెలలు అయ్యింది. నెల క్రితం తన మెయిల్ ఐడి నుండి నీకు మెయిల్స్ 
ఎలా వస్తున్నాయి అన్నారు. అంతే నా కాళ్ళ కింద భూమి కంపించినట్లనిపించింది ఆయన చెప్పింది విని. ఆశ్చర్యం 
తో నాకు నోట మాట రాలేదు. ఆయన చెప్పేది ఇంకా నమ్మ బుద్ది కావట్లేదు. రెండు నిమిషాల తరువాత తేరుకుని 
ఏంటి అంకుల్ మీరు చెప్పేది కల్పన చనిపోయిందా ఎలా చనిపోయింది. ఎప్పుడు చనిపోయింది అని అడిగాను. ఆరు 
నెలల క్రితం కాలేజ్ వాళ్ళతో టూర్ కి వెళ్ళింది. ఆ టూర్ లో ఫ్రెండ్స్ తో బోటింగ్ కి వెళ్ళినప్పుడు 
ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయింది అని చెప్పారు. అవునా ఆరు నెలల క్రితమే చనిపోతే మరి తన మెయిల్ నుండి 
ఎవరు నాతో మాట్లాడుతుంది. తన మెయిల్ ఎవరైనా హ్యాక్ చేసారా..? తన మెయిల్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది 
అని అడిగాను. ఎందుకైనా మంచిది మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పాను. ఇద్దరం అక్కడి నుండి పోలీస్ 
స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసారు. ఏమైనా అవసరమైతే ఫోన్ చేస్తామని నా 
ఫోన్ నెంబర్ తీసుకున్నారు.
నేను తన గురించే ఆలోచిస్తూ తిరిగి ఇంటికి బయల్దేరాను. కల్పన వాళ్ళ ఇంటిలో వాళ్ళ నాన్న గారు తన ఫోటోలు 
చూపించారు. ఎంత అందం గా ఉంది తను. అంత అందమైన అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి దేవుడికి మనసెలా 
వచ్చింది. అసలు నాతో మాట్లాడుతుంది ఎవరు. తన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. 
అయినా నాతో ఎందుకు మాట్లాడుతున్నారు ? తనకి నాకు అసలు సంభందం ఏంటి? ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను 
తనని కలిసిన దగ్గర నుండి. మళ్ళీ ఏమైనా మెయిల్స్ వస్తాయేమో అని ఎదురు చూసాను. కాని ఒక్క మెయిల్ కూడా 
రాలేదు. రెండు రోజుల తర్వాత నేను ఇంట్లో ఉండగా కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్ళి తలుపు తీసాను. 
ఆశ్చర్యం కల్పన వాళ్ళ నాన్న గారు ఇద్దరు పోలీసులతో వచ్చారు. నన్ను చూడగానే ఆశ్చర్యం తో ఆయన 
నువ్వా? అని నివ్వెరపోయారు.నేను అంతే ఆశ్చర్యం తో 'ఏంటి అంకుల్ ఏమయ్యింది? మా ఇంటికి వచ్చారేంటి? 
అసలు మా ఇంటి అడ్రెస్ మీకు ఎలా తెలిసింది? నాకు ఫోన్ చేస్తే నెనే దగ్గరుండి తీసుకొచ్చే వాడిని కదా అన్నాను. 
మా ఇంట్లో వాళ్ళకి ఏం అర్ధం కాక అయోమయంగా చూస్తున్నారు. ఆయనతో వచ్చిన పోలీస్ 'వీళ్ళ అమ్మాయి చనిపోయి 
ఆరునెలలు అయినా తన మెయిల్ ఎవరో హ్యాక్ చేసి ఒకతనికి మెయిల్స్ పంపుతున్నారని కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి 
మెయిల్ ఓపెన్ చేసిన ఐపి అడ్రస్ కనుక్కున్నాం. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ఐపి వాడుతున్న అడ్రస్ కి వచ్చాం. 
అంటే మీ ఇంటికి వచ్చామన్న మాట. ఇప్పుడు అర్ధమయ్యిందా మొత్తం. ఆ అమ్మాయి మెయిల్ ఎందుకు హ్యాక్ చేసావురా? 
అసలు ఆ అమ్మాయికి నీకు సంభందం ఏంటి ?' అని గదమాయించాడు ఆ పోలీస్. వెంటనే నేను 'అయ్యో ఆ అమ్మాయి 
మెయిల్ నుండి మెయిల్స్ వస్తున్నాయని కంప్లైంట్ ఇచ్చింది నేనే కావాలంటే అంకుల్ ని అడగండి అని ఆయన వంక 
చూసాను. ఆయన అయోమయం గానే అవునని చెప్పారు. ఆ పోలీస్ కి మతిపోయింది. అదేంటి? నువ్వే హ్యాక్ చేసి నీకే 
మెయిల్స్ పంపించుకుని మళ్ళీ నువ్వే ఎందుకు కంప్లైంట్ ఇచ్చావ్ అన్నాడు.
 [[[మిగతాది రెండవ భాగంలో... PART - II  ని క్లిక్ చేయండి]]]