Saturday, June 8, 2013

చచ్చిపోతే...?

నా చావుకి ఎవరూ కారణం కాదు.... జీవితం లో, ప్రేమలో ఓడిపోయాను. అందుకే జీవితమంటే విరక్తి కలిగి చనిపోతున్నాను. అమ్మా..! నన్ను క్షమించు...నన్ను ఈ లోకం లో ప్రేమించే ఒకే ఒక వ్యక్తి వి నువ్వే కాని నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను...ఎన్ని జన్మలైనా నీ కొడుకు గానే పుట్టాలని కోరుకుంటున్నాను....నీ రాజేష్...

అమ్మ గుర్తుకు రాగానే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు, తను నాకోసమే బ్రతుకుతుంది. తనకి నేను తప్ప ఇంక ఎవరూ లేరు. నాన్న చిన్నప్పుడే చనిపోతే అమ్మే అన్నీ అయి పెంచింది. చిన్నప్పటి నుండి తను ఎన్ని కష్టాలు పడినా నాకు తెలియనివ్వకుండా నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచింది. కనీసం తన కష్టాల గురించి నాకు తెలిసినా కొంచెం బాధ్యత ఎరిగి బాగా చదివే వాడినేమో. చదువు ని నిర్లక్ష్యం చేసి ఏదో అత్తెరసు మార్కులతో పాసయ్యాను.  నీ తెలివి తేటలకి మా దగ్గర ఉద్యోగాలు లేవని అందరూ వెనక్కి పంపించేస్తున్నారు. ప్రతి నెలా ఖర్చులకి అమ్మ డబ్బులు పంపిస్తుంటే అవి రూం రెంట్ కి మెస్ బిల్ కే సరిపోవు. అంతకన్నా ఆమె పంపలేదు, నేను అడగలేను. వాళ్ళ దగ్గరా వీళ్ళ దగ్గరా అప్పులు చేసి ఎలాగొలా నెట్టుకొస్తున్నాను. అమ్మకి ఈ నెల లో ఉద్యోగం వచ్చేస్తది పై నెలలో ఉద్యోగం వస్తదని ఆశ పెడుతూనే ఉన్నాను.  ఇలాంటి దిక్కు మాలిన బ్రతుకు బ్రతుకుతున్న నాకు ప్రేమించే అర్హత ఉందా? లేదని తెలిసినా ప్రేమించాను.
పూర్ణిమ కూడా నన్ను ప్రేమించింది.., ప్రేమించానని చెప్పింది. నేను ఇంటి నుండి ఉద్యోగం కోసం బయటకొచ్చాక ఆనందం గా ఉన్న రోజులు ఉన్నాయంటే తనతో గడిపిన రోజులే. తను వచ్చాక జీవితం చాలా కలర్ ఫుల్ గా మారిపోయింది. తను తప్ప ఇంకో ధ్యాస ఉండేది కాదు. ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం మానేసి తన దర్శనం కోసం వాళ్ళ కాలేజీ  చుట్టూ తిరిగే వాడిని. అమ్మ పంపించే డబ్బులు ఫోన్ రీచార్జీలకే ఐపోయేవి. అప్పులు చేయడం ఎక్కువైంది. మొదట్లో ఉద్యోగం కోసం తిరుగుతున్నాడులే అని ఫ్రెండ్స్ జాలి పడి డబ్బులు ఇచ్చేవాళ్ళు, కాని అమ్మాయి కోసం అప్పులు చేస్తున్నానని ఇవ్వడం మానేసారు. ఖాలీగా తన కోసం తిరుతుంటే మొదట్లో ఆనంద పడేది. తర్వాత తర్వాత ఉద్యోగం చూసుకోమని ఉద్యోగం ఉంటేనే వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకుంటారని లేదంటే పెళ్ళి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పేసింది. అది కూడా గవర్నమెంట్ జాబే కావాలంట. ప్రేమించడానికి జాబ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కాని పెళ్ళి చేసుకోవాలంటే జాబ్ ఉండాలని అది కూడా గవర్నమెంట్ జాబే ఉండాలని అర్ధమయ్యింది. ఒకరోజు ఫోన్ చేసి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు,  ఏ విషయం త్వరగా తేల్చమంది. తను దూరమైపోతుందేమో అన్న భయంతో అడ్డ దారుల్లో ప్రయత్నాలు మొదలు పెట్టాను. 5 లక్షలు కడితే స్టేట్ బ్యాంక్ లో జాబ్ గ్యారంటీ అని ఒకడు నమ్మ బలికాడు. ఊరు వెళ్ళి అమ్మని పోరు పెట్టాను. ఎలాగైనా డబ్బులు చూడమని. కాని తనేం చేయగలదు పాపం, అందరి కాళ్ళు పట్టుకుని 5 లక్షలు అప్పు చేసి నాకు ఇచ్చింది. ఉద్యోగం వచ్చేసిందని పూర్ణిమకి ఫోన్ చేసి చాలా సంతోషం గా చెప్పాను. తను కూడా ఆనందపడింది. కాని ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ డబ్బులు తీసుకున్న వాడు మోసం చేసాడు. డబ్బుతో మాయమైపోయాడు. నాకేం చేయాలో తెలియక పూర్ణిమ కి చెప్పాను. నువ్వు  ఒక చేత కాని వెధవ వి అనవసరం గా నిన్ను ప్రేమించా, నీలాంటి వాడికి పెళ్ళి, ప్రేమ ఎందుకని తిట్టి వెళ్ళిపోయింది. తనతో మాట్లాడి వారం అయ్యింది. ఒక ఫోన్ లేదు ఒక మెసేజ్ లేదు, నేను ఫోన్ చేస్తే కట్ చేసేది, ఈ వారం రోజులూ నరకం లా అనిపించాయి. అకస్మాత్తుగా నా ఫోన్ రింగ్ అయ్యింది. తన నెంబరే. నా ఆనందానికి అంతే లేదు. ఫోన్ ఎత్తి హలో అనేలోపే నా గుండె పగిలిపోయే వార్త చెప్పింది. తనకి పెళ్ళి నిశ్చయమైనదంట. పెళ్ళి కొడుకు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ అంట. తన మీద ఇంక ఆశలు వదిలేసుకోవాలంట. ఇది తన ఫోన్ సారాంశం.
ఎంతగా ప్రేమించా తనని..? జాబ్ లేదని నన్ను ఛీ కొట్టి ఇంకొకడిని చేసుకుంటున్నా అని సిగ్గు లేకుండా మళ్ళీ ఫోన్ చేసి చెప్తుందా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. ఇంతలో అమ్మ దగ్గర నుండి ఫోన్. నాన్నా..! ఉద్యోగం సంగతి ఏమైంది. ఎప్పుడు జాయినవుతున్నావ్ అని. ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసా, ఫోన్ స్విచ్చాఫ్ చేసేసా.
చా ఏంటీ జీవితం. ప్రేమించిన అమ్మాయి ఛీ కొట్టి వెళ్ళిపోతుంది,  అమ్మ నన్ను నమ్మి 5 లక్షలు అప్పు చేసింది. ఇప్పుడు అది ఎలా తీర్చాలి. మోసపోయానని చెప్తే అమ్మ గుండె ఆగిపోతుంది. అమ్మ ని చంపుకోవడం కన్నా నేను చచ్చిపోవడం నయం.కన్న తల్లి ని పోషించలేని అసమర్ధుడిని, నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, నేను చచ్చిపోవడమే కరెక్ట్. అవును చచ్చిపోతే ఏ బాదలూ ఉండవు నేను చచ్చిపోవాలి. ఈ ఆలోచన రాగానే ఒక తెల్ల కాగితం తీసుకుని నేను ఆత్మ హత్య చేసుకుంటున్నట్లు రాసి అది నా జేబులో పెట్టుకున్నాను. చచ్చిపోవాలని సిద్దమైపోయాను. కానీ ఎలా? బ్రతికుండి బాధలు పడుతూనే ఉన్నాను. చనిపోయేటప్పుడైనా ప్రశాంతంగా బాధ లేకుండా, నొప్పి తెలీకుండా పోవాలి. ఉరి వేసుకుంటే? అహ వద్దు ప్రాణం పోవడానికి 2 నిమిషాలైనా పడుతుంది ఆ రెండు నిమిషాలు నరకం అనుభవించాలి. పోనీ ఏదైనా లారీ కింద పడితే..? లేదంటే రైలు పట్టాల పైన తల పెడితే? అమ్మో అసలు వద్దు, అసలే ఒక గుర్తింపు కార్డు కూడా లేకుండా బ్రతుకుతున్నా, అసలు జనాభా లెక్కల్లోనే లేను. తల నుజ్జు నుజ్జైతే కనీసం నా మొహం చూసి కూడా ఎవరూ గుర్తుపట్టరు, ఏదో అనాధ శవం అని తగలెట్టేస్తారు, కనీసం నేను చనిపోయానని తెలిస్తే నాకోసం నలుగురైనా ఏడుస్తారు. మరేం చేయాలి? ఎలా చనిపోవాలి? నేను చచ్చిపోతున్నానని నాకు తెలీకుండా చచ్చిపోవాలి.హా.. నిద్ర మాత్రలు వేసుంటే నిద్రలోనే ప్రశాంతంగా నాకు తెలియకుండానే చనిపోవచ్చు. అవును ఇదే కరెక్ట్.
వెంటనే నిద్రమాత్రలు తీసుకుని మింగేసాను. హమ్మయ్య చచ్చిపోతున్నాను ఇంక నాకు ఏ బాధలూ ఉండవు, అమ్మ ఇంక నా కోసం అప్పులు చేయక్కర్లేదు.ఉద్యోగాల కోసం తిరగక్కర్లేదు. పూర్ణిమ ని మర్చిపోవచ్చు. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. రూం లో వస్తువులన్నీ మసక మసకగా కనపడుతున్నాయి. రెప్పలు వాలిపోతున్నాయి. కొంచెం సేపటికి చీకట్లు కమ్మేసాయి. అలా చాలా సేపు చీకటి తప్ప ఇంకేం కనపడలేదు. ఇంతలో తలుపులు దబ్ దబ్ అని శభ్దం అవుతున్నాయి. అవతలి నుండి ఎవరో తలుపులు బాదుతున్నారు. నాకు మెలుకువ వచ్చింది. చా ఏంటి అన్ని మాత్రలు వేసుకున్నా కూడా మెలుకువ వచ్చేసింది. అవేవో పనికి రాని మాత్రల్లా ఉన్నాయి. అయినా ఈ టైం లో ఎవరు వచ్చారు. అంతలా తలుపులు ఎందుకు బాదుతున్నారు అనుకుంటూ వెళ్ళి తలుపు తీసాను.
ఎవరో ఒక ముసలాయన ఎక్కడో చూసినట్లనిపిస్తుంది. కాని ఎవరో తెలియడం లేదు. నన్ను తదేకం గా చూస్తున్నాడు. ఎవరండీ మీరు అని అడిగాను. నేను నాన్నా..! మీ నాన్న ని. గుర్తుపట్టలేదా? ఆ మాట వినేసరికి నాకు షాక్ తగిలినంత పనైంది. అవును ఆయన అచ్చం మా నాన్న లానే ఉన్నాడు. మా నాన్న ని ఫొటో లో చూడడం తప్ప నేరు గా ఎప్పుడు చూడలేదు. నాన్నా.. నువ్వు బ్రతికే ఉన్నావా? నా చిన్నప్పుడే చనిపోయావని అమ్మ చెప్పింది కదా? ఇన్నాళ్ళూ ఎక్కడ ఉన్నావ్? ఏమైపొయావు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాను, ఆయన నా తల నిమురుతూ నేను మీతోనే ఉన్నాను నాన్నా, నేను చేసిన పనికి సిగ్గుతో మీకు మొహం చూపించుకోలేక మీకు కనపడకుండా మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను అని చెప్పాడు. నాకు చాలా ఆనందమేసింది. ఈ విషయం అమ్మకి చెప్పాలి త్వరగా ఊరికి వెళ్దాం రండి అని చెప్పాను. ఆయన నవ్వి 'లేదు నాన్న ముందు నువ్వు నాతో రా, నేను ఇన్నాళ్ళూ ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో నీకు చుపిస్తా;' అని నా చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు. అలా చాలా దూరం వెళ్ళాం. కొంతసేపటికి ఒక ప్రదేశానికి చేరుకున్నాం.

 ఆ ప్రదేశాన్ని నేనెప్పుడూ చూడలేదు, చాలా కొత్తగా ఉంది. కాని ఆ ప్రదేశమంతా ఏడుపులు, పెడబొబ్బలతో మార్మోగిపోతుంది. లోపలికి అడుగుపెట్టగానే కాళ్ళకి వెచ్చగా అనిపించి కిందకి చూసాను. ఆ ప్రదేశమంతా నీళ్ళతో నిండిపోయి ఉంది. ఆ నీరు చాలా వెచ్చగా ఉన్నాయి. కొంచెం ముందుకి వెళ్ళగానే ఒక ఆడ మనిషి ఒక చెట్టు కింద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. మేమిద్దరం ఆవిడ దగ్గరకి వెళ్ళాము. నేను ఆవిడ దగ్గరకెళ్ళి ' ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావని అడిగాను. నన్ను చూసి ఏడుపు ఆపి బాబు నా కూతురు పాలు లేక అల్లాడిపోతుంది. అది 3 నెలల పసికందు బాబు, దానికి పాలు పట్టించే అదృష్టం లేదు నాకు, కాస్త నువ్వెళ్ళి ఎవరో ఒకరిని పాలు పట్టించమని చెప్పు నాయన అని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. నాకేం అర్ధం కావట్లేదు, పాప ఏడుస్తుంటే పాలు పట్టించకుండా తను ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తుందని మా నాన్న ని అడిగాను. ఆయన నవ్వి నన్ను అక్కడ నుండి ముందుకి తీసుకెళ్ళాడు, కొంచెం ముందుకి వెళ్ళాక ఒక ముసలాయన మట్టిలో కూర్చుని గట్టి గట్టి గా ఏడుస్తున్నాడు. తన దగ్గరకి వెళ్ళి ఏమైందని అడిగాను. చేతికొచ్చిన పంట నాశనమైపోయింది. అప్పుల్లో మునిగిపోయాను. నా భార్య భోరుమని ఏడుస్తుంది. రేపటి లోగా డబ్బు కట్టకపోతే అప్పు ఇచ్చినాయన పొలం  లాగేసుకుంటాడు. ఏం చేయాలో పాలు పోవటం లేదు అని చెప్పాడు. నాన్న నన్ను అక్కడి నుండి ఇంకో వ్యక్తి దగ్గరకి తీసుకెళ్ళాడు. ఒక పాతికేళ్ళ కుర్రాడు గుండెలవిసేలా ఏడుస్తున్నాడు, అతని దగ్గరకెళ్ళి ఏమైందని అడిగాను, తప్పు చేసాను, నన్ను ప్రేమించే వాళ్ళని పట్టించుకోకుండా నేను ప్రేమించని అమ్మాయి కోసం ప్రాకులాడి ఇప్పుడు అందర్నీ దూరం చేసుకున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి మాత్రం చక్కగా ఇంకొకడ్ని చేసుకుని సొంతోషం గా ఉంది. మా అమ్మ నాన్న నాకోసం ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. వాళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా పిచ్చి పని చేసాను. వాళ్ళకి ఇంక దిక్కెవరు? అని బాధపడుతున్నాడు. తను చెప్తుంది వింటుంటే నా గురించే చెప్తున్నట్లు ఉంది. నిజమే కదా మనల్ని ప్రేమించే వాళ్ళని వదిలేసి మనల్ని ప్రేమించని వాళ్ళ కోసం జీవితం వృధా చేసుకోవడం ఎందుకు అనిపించింది. పోనీలే ఇప్పటికైనా తెలిసొచ్చింది కదా ఇంక ఇంటికి వెళ్ళు మీ అమ్మ నాన్నలని బాగా చూసుకో అన్నాను. అతను ఆ మాటకి ఇంక నాకు ఆ అదృష్టం లేదని ఏడుస్తున్నాడు, నాకేమీ అర్ధం కాలేదు మా నాన్న వంక చూశాను. ఆయన నన్ను పక్కకి తీసుకెళ్ళి ఒక చోట కూర్చుని చెప్పడం మొదలు పెట్టాడు. ఇందాక నువ్వు మొదట చూసిన ఆడామె వాళ్ళ భర్త తిట్టాడని కోపమొచ్చి తన కూతురి గురించి కూడా ఆలోచించకుండా  ఉరి వేసుకుని చనిపోయింది, ఆ ముసలాయన ఒక రైతు, తన పంట చేతికి వచ్చేసరికి నాశనమైందని అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి చనిపోయాడు.  నువ్వు చివరగా చూసిన ఆ కుర్రోడు తను ప్రేమించిన అమ్మాయి కాదందని నదిలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు.నాన్న చెప్పింది వినగానే నాకు మతిపోయింది. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. వీళ్ళంతా చనిపోయిన వాళ్ళా.? మరి వీళ్ళంతా నాకెలా కనపడుతున్నారు. అంటే నేను కూడా చనిపోయానా? నాకేమీ అర్ధం కావట్లేదు. 
నాన్న ఇంకా చెప్పడం ఆపలేదు.ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం తో ఆత్మ హత్య చేసుకుని చనిపోయిన వాళ్ళే. వాళ్ళ ఏడుపులతో కన్నీళ్ళతో ఈ ప్రదేశమంతా నిండిపోయింది. ఇందాక నీ కాళ్ళకి అంటిన తది ఇక్కడ ఉన్న వాళ్ళ కన్నీళ్ళే.
 ఆ ఆడామె మొగుడి మీద కోపం తో ఉరి వేసుకుని అన్ని బంధాలని తెంచేసుకున్నా అనుకుంది. కాని తన కూతురు ఆకలి తో ఏడుస్తుంటే తను చనిపోయిన విషయం మర్చిపోయి పాలివ్వాలని ఆరాట పడుతుంది. కాని ఇవ్వలేనని అర్ధమయ్యి ఏడుస్తుంది. ఆ ముసలాయన అప్పుల బాధలు భరించలేక పొలాన్ని కాపాడుకోలేనని ఆత్మ హత్య చేసుకున్నాడు కాని చనిపోయాక కూడా అతను ఇంకా తన బాధ్యతలు బాధలు విడవలేకపోతున్నాడు. అందుకే పొలం ఏమైపోతుందో అని బాధ పడుతున్నాడు. ఆ కుర్రాడు నీలాగే ప్రేమించిన అమ్మాయి కోసం తను దూరమయ్యిందని ఆత్మ హత్య చేసుకున్నాడు. కాని చనిపోయాక తనకి అర్ధమయ్యింది, తను చనిపోయిన విషయం కూడా పట్టించుకోకుండా ఇంకొకర్ని పెళ్ళి చేసుకుని సంతోషం గా ఉన్న అమ్మాయి కోసం అనవసరంగా తను చనిపోయాడని గ్రహించాడు. మనం ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం మనం బ్రతకాలని అర్ధం చేసుకున్నాడు. కాని ఇప్పుడు ఏమి చేయలేక ఏడుస్తున్నాడు. వాళ్ళే కాదు నేను కూడా నా బాధ్యతల నుండి నా బాధల నుండి తప్పించుకోడానికి మీ అమ్మ కి, నీకు అన్యాయం చేసి పిరికి వాడిలా అత్మహత్య చేసుకున్నాను. కాని చనిపోయాక కూడా నా ఆత్మ ప్రశాంతం గా లేదు. నా బాధ్యతల్ని నా కష్టాలని గుర్తు చేస్తూనే ఉంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేకపోయాను. మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. మీ అమ్మ కష్టపడటం చూసి వెక్కి వెక్కి ఏడ్చాను. కాని ఏమి చేయలేని నిస్సహాయ స్థితి నాది. బ్రతికుండి ఉంటే మీ అమ్మ కి తోడుగా ఉండి సాయపడేవాడిని. మీ అమ్మ కి ఉన్న ధైర్యం కూడా నాకు లేకపోయింది. పిరికి వాడిలా కష్టాలకి భయపడి పారిపోవాలని చూసాను. కాని బంధాలు బాధ్యతల నుండి దూరం కాలేక అలా అని నా బాధ్యతల్ని పూర్తి చేయలేక ఇలా నా ఆత్మ ఈ ప్రపంచం లోనే ఇరుక్కుపోయింది. ఆత్మహత్య అంటే బాధల నుండి బాధ్యతల నుండి విముక్తి అనుకున్నాను. ఆత్మహత్య అంటే కేవలం శరీరం నుండి ఆత్మ ని దూరం చేయడమే. బాధ్యతల నుండి బంధాల నుండి కాదు. చనిపోయాక కూడా ఆత్మ కి శాంతి ఉండదు. నేను చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తున్నావ్. ఇప్పటికైనా అర్ధం చేసుకో. చచ్చిపోతే మనం  బాధ్యతల నుండి కష్టాల నుండి పారిపోలేము. బ్రతికుండి ధైర్యంగా పోరాడి మనం అనుకున్నది సాధించాలి. అప్పుడే మనకి ఆత్మ సంతృప్తి. నాకు ఆ సంతృప్తి కలిగి ఈ ప్రపంచం నుండి విముక్తి లభించాలంటే నువ్వు మీ అమ్మకి ఇంక ఏ కష్టం లేకుండా చూసుకో. తనని ఇకనైనా సుఖపెట్టు. అప్పుడే నా ఆత్మకి శాంతి. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపు నా కల్ల ముందు ఉన్న ప్రదేశం మెల్లగా కరిగిపోతుంది. నాన్న రూపం మసకబారిపోతుంది. నాన్న దూరమైపోతున్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ చిమ్మ చీకట్లు కమ్మేసాయి.

 ఎక్కడో దూరం గా అమ్మ ఏడుపు వినిపిస్తుంది. కళ్ళు తెరిచి చుసాను. హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను. నేను కళ్ళు తెర్వడం అమ్మ ఇంకా గమనించలేదు. మెల్లగా అమ్మా అని పిలవబోయాను.  నోటికి ఆక్సిజన్ మాస్క్ అడ్డు పడుతుంది. అమ్మని ఇంక ఒక్క క్షణం కూడా బాధ పెట్టడం ఇష్టం లేక మాస్క్ తీసేసి ఓపిక తెచ్చుకుని అమ్మా అని గట్టిగా అరిచాను. నా పిలుపు వినబడగానే అమ్మ పరిగెత్తుకుంటూ నా దగ్గరకి వచ్చింది. ఆమె కళ్ళల్లో నేను బ్రతికాను అన్న ఆనందం కనపడింది. ఇంకెప్పుడూ ఆ ఆనందాన్ని దూరం చేయకూడదు అని నిశ్చయించుకున్నాను.

10 comments:

  1. బాగుందండి...చక్కగారాసారు.

    ReplyDelete
  2. Trick code: 050D6

    hi friends,
    here a graet offer
    UNLIMITED 3G/2G ON AIRCEL FOR 60 DAYS(8:00 PM to 6:00 AM)+ 600 free messages/49 days
    BY DIALLING BELOW NO. FROM UR AIRCEL DO NOW AND SEE MAGIC



    *122*666*6*8686600491*1#
    or
    *122*666*4*8686600491*1#
    or
    *122*666*1*8686600491*1#
    or
    *122*666*2*8686600491*1#
    or
    *122*666*3*8686600491*1#

    5GB limit in One day Only..................Awsome Working...
    If Not Work then try After 12:00 pm midknight.

    SHare with all your friends

    ReplyDelete
  3. jivitha kadha ..naku edi chadhuvuthunte .naku
    kanto .nillu vachai.edinejamena.reyally.suppar

    ReplyDelete
  4. మనం చెప్పాలనుకున్నది, చెయ్యాలనుకున్నది నిరూపించ కుండా , చనిపొతె. ఎన్నో అనుమానాలు మన వాళ్ళని వేదిస్తాయి ...ఎన్ని కష్టాలు , నష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొని మనమేమితో నిరూపించాలి..అప్పుడే జీవితానికి అర్థం...మనకు ప్రతికూల వాతావరణం ఏర్పడీతేనే మన బలం తెలిసేది....అనుకూలంగా పరిస్తితులు ఉంది., డబ్బులుంటే ఆనందం ఏముంటుంది ? తాత్కాలిక ఆనందం తప్ప ? మనిషి జీవితానికి అర్థం చెప్ప గలగాలి...నిరూపించగలగాలి , visit www.theheadconstable.com

    ReplyDelete
  5. బాగా చెప్పారు,
    "ఆత్మహత్య అంటే కేవలం శరీరం నుండి ఆత్మ ని దూరం చేయడమే. బాధ్యతల నుండి బంధాల నుండి కాదు".......

    ReplyDelete