Monday, March 25, 2013

స్పిరిట్ గేమ్

మా టి వి లో మర్రిచెట్టు సినిమా వస్తుంది. ఇంట్లో అందరూ చాలా శ్రద్ధగా చూస్తున్నారు. రాం గోపాల్ వర్మ సినిమాల్లో సీన్ల కన్నా సైలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ నిశ్శబ్ధం తోనే భయపెడతాడు. నిజానికి హార్రర్ సినిమాలు భయపడేవాళ్ళే ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఒక వ్యసనం. నేను కూడా చాలా పిరికి వాడిని. ఇంట్లో ఒక్కడినే ఉండాలంటే అన్ని లైట్లు వేసి టి వి ఆన్ చేసి సౌండ్ పెట్టుకుని పడుకుంటాను లేదంటే భయంతో నిద్రే పట్టదు. కాని నాకు భయాన్ని అనుభవించడం అంటే చాలా ఇష్టం. దయ్యాలు భూతాలు ఇలాంటివన్నీ పగటి పూట ఒట్టి అబద్దం అని వాదిస్తాను. రాత్రైతే తాయత్తుల్ని మొలతాడుకి కట్టుకుని పడుకుంటాను. సినిమాని కళ్ళప్పగించి చూస్తున్నాం అందరం. బాగా నిశ్శభ్దంగా ఉంది. తర్వాత ఏం జరగబోతుందో అని అందరం భయం భయం గా ఉత్కంఠగా చూస్తున్నాం. ఇంతలో పెద్దగా శబ్ధం చేస్తూ ఫోన్ రింగ్ అయ్యింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. రింగ్ అవుతుంది నా ఫోనే అని తెలిసి నవ్వుకుని ఫోన్ లిఫ్ట్ చేసాను.అనిల్ గాడి దగ్గర నుండి ఫోన్. ఫోన్ ఎత్తగానే ఏరా ఏం చేస్తున్నావ్. ఖాళీయేనా? అని అడిగాడు. 'హా ఖాళీనేరా చెప్పు ఏంటి సంగతి అన్నాను. ఏం లేదు ఇవాళ రాత్రి మా ఫ్రెండ్ రూం లో పార్టీ ఉంది రా. నువ్వు కూడా వస్తావేమో అని ఫోన్ చేసా అన్నాడు. పార్టీ అనేసరికి నాలుక పీకేస్తుంది. కాని ఎవడో తెలియని వాడి పార్టీ కదా అని మొహమాటం అడ్డొస్తుంది. వద్దులేరా నేను రానులే నువ్వు వెళ్ళు అని అన్నాను కాని వాడు ఇంకోసారి రమ్మని పిలిస్తే వెళ్ళిపోదామని సిద్దమయిపోయాను. అనుకున్నట్లే వాడు పర్లేదు రా రా ఏం కాదు మా వాళ్ళు ఏం అనుకోరు అని చెప్పాడు.
సరే రా... నేను రెడీ గా ఉంటాను ఇంటికొచ్చి పికప్ చేసుకోమని చెప్పాను. ఒక అరగంటలో ఇద్దరం బయల్దేరాం. 
విజయవాడ నుండి ఒక 15 కి.మీ ల దూరం లో  హై వే నుండి లోపల కి దారి ఉంది. చీకటి పడ్డాక బయల్దేరడం వల్ల దారి సరిగ్గా కనపడడం లేదు. బండి హెడ్ లైట్ ని నమ్ముకుని ముందుకు వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు చేరుకున్నాం. రెండంతస్తులు ఉంటాయి. చుట్టూ అన్నీ పొలాలే. దూరం గా రెండు మూడు ఇళ్ళు ఉన్నాయి అంతే. పైన పెంట్ హౌస్ లో అనిల్ గాడి ఫ్రెండ్స్ ఉంటున్నారు. పైకి వెళ్ళేసరికి అందరూ మాకోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు. అనిల్ గాడిని చూసి ఎంత సేపు బే, ఈ పాటికి నాలుగు పెగ్గులు అయిపొయేయి అని తిట్టబోతూ నన్ను చూసి ఆగిపోయారు. మా వాడు నన్ను వాళ్ళందరికి పరిచయం చేసాడు. మొత్తం ఆరుగు ఉన్నారు. మాతో కలిపి మొత్తం ఎనిమిది మంది. కాని అందులో రూం లో ఉండే వాళ్ళు ఇద్దరే. మిగతా వాళ్ళందరు మాలాగే పార్టీ కి వచ్చారు.నరేష్, రాజు రూం లోనే ఉంటారు. వాళ్ళతో పాటు కిరణ్ అని ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటాడు కాని వాడిది మధ్యాహ్నం షిఫ్ట్. రాత్రి ఎప్పటికో వస్తాడు అని అనిల్ ఆ రూం లో ఉండే వాళ్ళని పరిచయం చేసాడు. ఇక ఆలశ్యం చేయకుండా ఎవరి గ్లాసులు వాళ్ళు పట్టుకుని రౌండ్ గా కూర్చుని చీర్స్ కొట్టి మొదటి పెగ్గు తాగాము. మొదటి పెగ్గు తాగేటప్పుడు బుద్దిమంతుల్లా ఉన్నారు అందరూ. కానీ మూడో పెగ్గు పూర్తయ్యే సరికి ఒక్కొక్కడిలో ఉన్న కళాకారులు బయటకొస్తున్నారు. ఎవరి ఇష్టమొచ్చిన విషయం మీద వాళ్ళు తెగ లెక్చర్లు చెబుతున్నారు.
ఇంతలో రాజు ఆత్మల గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు. అందరికీ ఆ టాపిక్ బాగా నచ్చింది. అందరు మౌనం గా వాడు చెప్పేది వింటున్నారు. నేను చాలా సార్లు దెయ్యాలని చూసాను, అవి రాత్రి పూట తిరుగుతాయి, మాది పల్లెటూరు కాబట్టి అర్ధ రాత్రి సమయం లో ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒంటరిగా వెళ్ళే వాడిని. మా ఊరి మొదట్లోనే స్మశానం ఉంది. ఊరిలోకి ప్రవేశించాలంటే ఆ స్మశానం దాటుకుని రావాలి. రాత్రి పూట ఆ స్మశానం దగ్గర్లో నేను చాలా సార్లు దెయ్యాలని చూసాను. నేనే కాదు మా ఊరి వాళ్ళు చాలా మంది చూసారు. మా ఊరిలో చాలా గొర్రెలు రాత్రి సమయాల్లో మాయమైపోయేవి. పొద్దున్న వెతికితే వాటి కళేబరాలు స్మశానం మొదట్లో పడి ఉండేవి. అప్పటి నుండి మా ఊరిలో ఎవరూ రాత్రి సమయాల్లో బయట తిరగడం మానేసారు, ఆరు బయట కూడా పడుకోరు, మా ఊరిలో దాదాపు ప్రతి ఇంటి గోడ పైనా ఓ స్త్రీ రేపు రా.. అని రాసి ఉంటది అని చెప్పాడు. మేమందరం ఆశ్చర్యపోయాం. అలా ఎందుకు రాసి ఉంటది అని అడిగాము. మా ఊరిలో ఒక పెళ్ళి కాని అమ్మాయి స్మశానం పక్కన ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తను ఎందుకు చనిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత నుండి మా ఊరి అమ్మాయిలకి గాలి సోకడం, అనారోగ్యం పాలు అవ్వడం ఎక్కువయ్యాయి. అందరూ కలిసి ఒక మంత్రగాడిని పిలిచి పూజలు చేయించాక ఆ మంత్రగాడు బావిలో దూకిన అమ్మాయే అందరి ఇళ్ళకి వెల్తుంది, నచ్చిన వ్యక్తిలోకి ప్రవేశిస్తుంది అని చెప్పాడు. ఆ దయ్యం ఎవరి ఇంట్లోకీ ప్రవేశించకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి గోడల మీద ఓ స్త్రీ రేపు రా.. అని రాయమని చెప్పాడు. అందుకే దాదాపు మా ఊరిలో అందరి ఇంటి గోడల మీదా అలాగే రాసి ఉంటది అని చెప్పాడు. అందరరి మొహాల్లో ఆశ్చర్యం. అంతలో నరేష్ అనే వాడు ఒరేయ్ వాడేదో పల్లెటూరి నా కొ**..ఎదో చెప్తాడు..మీరంతా ఏంట్రా వాడు చెప్పే సొల్లు వింటున్నారు, దెయ్యాలు లేవు గియ్యాల్లేవు అని తిట్టాడు. వెంటనే అనిల్ గాడు లేదు రా దెయ్యాల సంగతేమో కాని ఆత్మలు నిజం గానే ఉంటాయి రా...కోరికలు తీరకుండా చనిపోతే ఆత్మలు అలాగే తిరుగుతాయి రా అని చెప్పాడు. అంత సీన్ లేదు..నిజంగా ఉన్నాయని నిరూపించగలవా అని వాదించాడు నరేష్. వెంటనే రాజు లేచి అరే నువ్వెప్పుడైనా స్పిరిట్ గేమ్ ఆడావా? అని అడిగాడు. అదేం ఆట రా అని అడిగాడు అనిల్ గాడు. ఆత్మల్ని ఈ లోకం లోకి పిలిచి వాటితో మాట్లాడడానికి ఇదొక మార్గం రా అని చెప్పాడు. నాకు ఎలా ఆడాలో తెలుసు అని చెప్పి బొమ్మలు గీయడానికి వాడే చార్ట్ తీసుకుని వచ్చి మద్యలో పరిచాడు. అందరం ఆశ్చర్యం గా చూస్తున్నాం. ఆ చార్ట్ పైన 'A' నుండి 'Z' వరకు అక్షరాలని , 0 నుండి 9 వరకు అంకెలని రాసి ఒక్కో అక్షరం చుట్టూ గుండ్రం గా గీసాడు. అక్షరాలన్ని చిందర వందరగా ఒక క్రమం లేకుండా రాసాడు. ఆ చార్ట్ కి నాలుగు మూలలా నాలుగు గుండ్రటి సున్నాలు గీసి ఒక దానిలో 'YES' అని , రెండో దానిలో 'NO' అని , మూడో దానిలో హలో అని నాలుగో దానిలో గుడ్ బై అని రాసాడు. మద్యలో ఒక కాయిన్ పెట్టి దాని చుట్టూ గుండ్రం గా గీసాడు. అందరం వాడు చేసే దాన్ని మౌనం గా చూస్తున్నాం. ఒక కొవ్వొత్తి తీసుకొచ్చి ఆ చార్ట్ కి ఎదురుగా పెట్టి వెలిగించాడు. మాలో ఒకరిని వెళ్ళి లైట్ ఆపు చేయమన్నాడు. అనిల్ వెళ్ళి లైట్ ఆపు చేసాడు. రూం లో ఆ కొవ్వొత్తి వెలుతురు తప్ప ఇంకే వెలుతురు లేదు. అందరు ఆ చార్ట్ చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ కొవ్వొత్తి వెలుగులో అందరి మొహాలు ఎర్రగా మండుతున్నట్లు కనపడుతున్నాయి. తర్వాత ఏం చేస్తాడో అని అందరూ రాజు వంక చూస్తున్నారు. నరేష్ వంక చూసి నువ్వు ఆడతావా? లేదంటే మళ్ళీ తర్వతా నేను మోసం చేసా అంటావ్ అని అడిగాడు. వాడు కంగారు పడిపోయి లేదు లేదు నువ్వే ఆడు, నాకు ఎలా ఆడాలో తెలీదు కదా అని సమాదానమిచ్చి కొంచెం వెనక్కి జరిగాడు. రాజు ఒక బ్లేడు తీసుకుని తన బ్రొటన వేలిని కొంచెం తెగేలా కోసాడు. చార్ట్ మద్యలో ఉన్న కాయిన్ తీసి తన రక్తం లో అద్దాడు. అదంతా చూస్తుంటే అక్కడేదో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు అనిపించింది. భయమేసి అనిల్ గాడి చేయి పట్టుకుని కూర్చున్నాను. రాజు ఆ కాయిన్ తీసి మద్యలో ఉన్న సర్కిల్ లో పెట్టి దాని మీద తన వేలు ని అంటీ అంటనట్లు ఆనించాడు. ఎవరి ఆత్మ ని పిలవమంటారు అని అడిగాడు. ఇందులో ఇలాంటి చాయిస్ లు కూడా ఉంటాయా అనిపించింది నాకు. నరేష్ గాడు కొంచెం ధైర్యం నటిస్తూ సౌందర్య ఆత్మ ని పిలువ్ అని వెటకారం చేసాడు. అందరం ఒక్కసారిగా నవ్వాము. మమ్మల్ని చూసి రాజు కోపం గా ఇక్కడ ఉన్న వాళ్ళకి సంభందించిన వాళ్ళ అత్మలు లేదంటే ఈ చుట్టు పక్కల ఉన్న ఆత్మలు అయితేనే త్వరగా మనతో కమ్యూనికేట్ అవుతాయి, మీలో ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళని పిలవాలనుకుంటున్నారా? అని అడిగాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. సరే ఈ దగ్గరలో ఉన్న ఏదైనా ఆత్మని పిలుద్దాం అన్నాడు. అందరూ సరే అన్నట్లు తలలూపారు. రాజు ఆ కాయిన్ పైన తన వేలు ని పెట్టి, తనతో పాటు నరేష్ ని కూడా ఆ కాయిన్ మీద వేలు ని పెట్టమన్నాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. రాజు మా అందరికి ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా ఒక్కరే ప్రశ్నలు అడగాలి, అందరూ అడిగితే సమాధానం ఇవ్వవు ఆత్మలు అని చెప్పి ప్రశ్నలు అడగడానికి నన్ను నియమించారు. నేను అడగను నాకు భయం గా ఉంది అని చెప్పాను. పర్వాలేదు, ప్రశ్నలు అడిగే వాళ్ళని ఆత్మలు ఏమీ చేయవు. ఒకవేళ వాటికి కోపం వచ్చినా ఆ కాయిన్ ని పట్టుకున్న వాళ్ళనే ఏమైనా చేస్తాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే నరేష్ గాడు వేలికేదో షాక్ కొట్టినట్లు తీసేసాడు.
రాజు వెంటనే తీయకూడదు అని వారించాడు. నరేష్ ని కూడా కళ్ళు మూసుకోమన్నాడు. రాజు కళ్ళు  మూసుకుని గట్టిగా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు సమాధానం కావాలి అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. మాకందరికీ గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. నరేష్ గాడి పరిస్థితి ఐతే మరీ దారుణం. చెమటలతో ఒళ్ళంతా తడిచిపోయింది. పది నిమిషాలు అవుతుంది. కాయిన్ లో ఎటు వంటి కదలికా లేదు. రాజు ఈ సారి స్వరం ఇంకొంచెం పెంచుతూ చివరి సారిగా అడుగుతున్నాను. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుస్తుంది. మాతో మాట్లాడు. నువ్వున్నావని సమాదానం చెప్పు అని గదమాయించినట్లు అడిగాడు. అప్పుడు చిన్నగా కాయిన్ కదలడం మొదలయ్యింది. రాజు కళ్ళు తెరవకుండా అలానే ఉన్నాడు. నరేష్ కూడా కళ్ళు తెరవకూడదని ముందే చెప్పడం వల్ల తను కూడా అలాగే ఉన్నాడు. నేను నువ్వు ఇక్కడే ఉంటే హలో చెప్పు అని అడిగాను. కాయిన్ మెల్ల మెల్లగా ముందుకు జరుగుతుంది. అలా జరిగి జరిగి హలో అని రాసి ఉన్న సర్కిల్ లోకి వెళ్ళి ఆగింది. అందరికీ వెన్నులో వణుకు మొదలయ్యింది. నేను ఎవరు నువ్వు? నీ పేరు చెప్పు అని ముందుగా రాసి పెట్టుకున్న ప్రశ్నలనే అడుగుతున్నాను. వెంటనే కాయిన్ మెళ్ళగా పక్కకి జరిగి మొదట 'R' అనే అక్షరం దగ్గరకి వెళ్ళింది అక్కడి నుండి 'A'' దగ్గరకి జరిగింది. నిదానంగా 'V' దగ్గరకి జరిగింది, ఆ తర్వాత ''I' దగ్గరకి వెళ్ళి ఆగింది. ఆశ్చర్యం. అందరం ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. 'R', 'A' , 'V', 'I' అంటే రవి. తన పేరు రవి అని చెప్తుంది.
నేను ఆశ్చర్యం నుండి తేరుకుని 'ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావ్? అని నా తర్వాతి ప్రశ్న ని అడిగాను. కాయిన్ మెల్లగా నో దగ్గరకి వెళ్ళి ఆగింది. అంటే తనకి చెప్పడం ఇష్టం లేదు అని అర్ధం.
ఆత్మ ఏదైనా ప్రశ్న కి సమాధానం చెప్పడం ఇష్టం లేదు అంటే మనం మళ్ళీ ఆ ప్రశ్న ని అడిగి విసిగించకూడదు అని రాజు ముందే చెప్పాడు. అందుకే నేను వెంటనే తర్వాతి ప్రశ్న ని అడిగాను. నువ్వెందుకు ఇక్కడే తిరుగుతున్నావ్? అని అడిగాను. అప్పుడు కాయిన్ చిన్నగా 'H' దగ్గరకి వెళ్ళి అక్కడి నుండి 'O' దగ్గరకి తర్వాత 'M' దగ్గరకి ఆ తర్వాత 'E' దగ్గరకి వెళ్ళి ఆగింది. 'HOME' అంటే ఇల్లు. ఆ ఆత్మ ఇది తన ఇల్లు అని చెప్తుందా?  వెంటనే ఇది నీ ఇల్లా? అని అడిగాను. ఆ ప్రశ్న మేము ముందే రాసుకున్న ప్రశ్నల్లో లేదు. అయినా కుతూహలం కొద్దీ అడిగేసాను. కాయిన్ తిన్నగా 'YES' దగ్గరకి వెళ్ళి ఆగింది. నాకేమి అర్ధం కావట్లేదు. తర్వాత మేము రాసుకున్న ప్రశ్నల్లో తర్వాతి ప్రశ్నని అడిగాను. నీకు ఎవరి మీదైనా కోపం గా ఉందా? అని అడిగాను. వెంటనే 'YES' అన్న సమాధానం. ఎవరి మీద అని అడిగాను. కాయిన్ కదలడం లేదు. మళ్ళీ అదే ప్రశ్నని రెండో సారి అడిగాను. 'NO' అని సమాధానం. ఇంక అడగడానికి ఏం ప్రశ్నలు రాసుకోలేదు. సరే ఇక వెళ్ళిపో అని చెప్పాను. కాయిన్ వెళ్ళి NO దగ్గర ఆగింది. అంతే అందరికీ గుండెల్లో దడ మొదలయ్యింది. రాజు మాకు ముందే చెప్పాడు. కొన్ని ఆత్మలు మన దగ్గరకి వచ్చాక తిరిగి వెళ్ళమంటే వెళ్ళవు. అవి కోరికలు తీరకుండా చనిపోయిన ఆత్మలు. అవి మొండిగా ప్రవర్తిస్తాయి. కాని మనమే వాటికి ఏదొకటి చెప్పి పంపించేయాలి అని చెప్పాడు. ఇక నేను ధైర్యం తెచ్చుకుని నీకు ఇక్కడ ఏం పని లేదు వెళ్ళిపో అని గదమాయించాను. అయినా సరే మళ్ళీ NO అన్న సమాధానమే. నాకు ఇంక పిచ్చి పిచ్చిగా భయమేసేస్తుంది. ఏం చేయాలో ఆ రాజు గాడు చెప్పలేదు. దయ చేసి వెళ్ళిపో. గుడ్ బై గుడ్ బై అని గట్టిగా అరిచాను. కాయిన్ చిన్నగా గుడ్ బై అని రాసి ఉన్న సిర్కిల్ లోకి వెళ్ళి ఆగింది. అందరం ఊపిరి పీల్చుకున్నాం. నరేష్ గాడిని అడిగాము. కాయిన్ నిజంగానే కదిలిందా అని. వాడు అవును రా, నా వేలు దాని పైనే ఉంది. ఎవరో లాగుతున్నట్లు కాయిన్ ముందుకు కదిలిపోతుంది రా. ఏరా నీకు కూడా అలాగే అనిపించిందా అని రాజు ని అడిగాడు. వాడు అవును అని చెప్పాడు. నరేష్ గాడు వెంటనే రాజు ని ఇంకో సారి ఇలాంటి ఆటలు ఆడించకు రా బాబు. గుండె నూటొకటి కొట్టుకుంటుంది చూడు అని రాజు చేయి వాడి గుండె పైన పెట్టి చూపించాడు. ఇప్పటికైనా నమ్ముతావా ఆత్మలు దెయ్యాలు ఉన్నాయని అని అడిగాడు రాజు. నమ్మానులేరా బాబు...ముందు ఒక రెండు పెగ్గులు వేద్దాం రండి అప్పుడు కాని ఈ భయం పోదు అని నరేష్ గాడు అందరి గ్లాసుల్లో పోసాడు.
రెండు పెగ్గులు పడగానే అందరికీ ఎక్కువయిపోయింది. పావు గంటలో అందరూ నిద్రపోయారు. నాకు కూడా బాగా నిద్ర పట్టేసింది. ఆదమరిచి నిద్రపోతున్నాను. సుమారు రెండు గంటల సమయం లో ఎవరో తలుపు కొడుతున్నట్లు శబ్ధమయ్యింది. వాళ్ళ రూం మేట్ కిరణ్ నైట్ షిఫ్ట్ నుండి వచ్చుంటాడులే ఎవరో ఒకరు తీస్తారులే అని అలాగే పడుకున్నాను. కానీ మిగతా వాళ్ళందరూ కోమా లో ఉన్నారు. ఎవ్వరూ లేచి తలుపు తీయట్లా. ఇక తప్పక నేనే లేచి తలుపు తీశాను. ఒక కుర్రాడు గుమ్మం బయట నుంచుని ఉన్నాడు. మా వయసు కుర్రాడిలాగే ఉన్నాడు.  మంచి హైట్ దిట్టం గా ఉన్నాడు. లోపలికి రాకుండా నన్ను అలానే చూస్తు నిలబడిపోయాడు. మీరు కిరణ్ ఆ? అని నేనే అడిగాను. తను అవును అన్నట్లు తల ఊపాడు. నేను అనిల్ వాళ్ళ ఫ్రెండ్ ని. ఏంటి పార్టీ కి రాలేదు. ఇప్పటి దాకా వర్క్ ఉందా? అని అడిగాను. తను నా వంక చూసి నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ టైం లో నిద్ర లేచే సరికి నాకు ఇంక నిద్ర పట్టలేదు. బయటకొచ్చి నిలబడ్డాను. నా వెనకే కిరణ్ కూడా వచ్చి నిలబడ్డాడు. తనని చూసి బాస్.. అక్కడ మందు ఉంది. తాగుతారా? కావాలంటే నేను కంపెనీ ఇస్తాను అని అడిగాను. అతను నాకు అలవాటు లేదు అని చెప్పాడు. నా ఎదురుగా నిలబడి నన్నే చూస్తున్నాడు. నేను అతని వంక చూసినప్పుడు అతని కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి. అదేంటి మీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి అని అడిగాను. నేను నిద్రపోయి 14 రోజులు అవుతుంది అన్నాడు. అవునా అన్ని రోజుల నుండి నిద్ర లేకుండా ఎలా ఉన్నారు ఏమైనా ప్రాబ్లమా అని అడిగాను. అతను వెంటనే ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది. దాని వల్లే నాకీ పరిస్థితి. దాన్ని వదలను అని చాలా కోపం గా ఏదేదో మాట్లాడుతున్నాడు . నాకేం మాట్లాడాలో అర్ధం కాలేదు. తనని శాంతపరుద్దామని బాస్ అలా బయటకెళ్ళి వద్దామా అని అడిగాను. అతను సరే ఒక చోటికి వెళ్ళాలి తీసుకెళ్తావా అని అడిగాడు.  ఇద్దరం కలిసి కిందకి దిగాము. నాకు మత్తుగా ఉండటం వలన తనని బైక్ నడపమని అడిగాను. లేదు నువ్వే నడుపు అని చెప్పాడు. ఇద్దరం రోడ్ పైకి వచ్చాము. తను దారి చూపిస్తున్నాడు. తను చెప్పిన రూటులోనే వెళ్తున్నాం. మైన్ రోడ్ నుండి కొండ పైకి వెళ్ళే దారిలోకి పోనివ్వమన్నాడు. ఈ టైం లో కొండ పైకి ఎందుకు? అక్కడ ఎవరూ ఉండరూ ,అది ఘాట్ రోడ్ కదా, పైగా లైట్లు కూడా ఉండవు వద్దు అన్నాను. తను లేదు వెళ్ళాలి తీసుకెళ్ళు అని ఆఘ్నాపించినట్లు చెప్పాడు. ఇక తప్పక ఆ రోడ్ లోకి బండి తిప్పాను. కొంచెం దూరం వెళ్ళాక ఘాట్ రోడ్ ప్రారంభమైంది. రోడ్ మొత్తం చిమ్మ చీకటి. అసలేం కనపడట్లేదు. రోడ్ కి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, గాలికి ఆ చెట్లు ఊగుతూ చేసే శబ్ధం భయంకరం గా ఉంది. కొంచెం ముందుకి వెళ్ళాక నాకు భయం మొధలయ్యింది. వెనక్కి వెళ్ళిపోదామా అని అడిగాను. లేదు ఇంకొంచెం దూరమే అన్నాడు. కొంచెం ముందు కి వెళ్ళాక రోడ్ మలుపులో ఆపమన్నాడు. బండి ఆపి ఇంజిన్ ఆన్ లోనే ఉంచాను హెడ్ లైట్ వెలుతురు కోసం. ఆ వెలుతురు లో దూరం గా రోడ్ నుండి కిందకి చూస్తే చిన్న చెరువు కనపడుతుంది. కిరణ్ ఆ చెరువు దగ్గరకి వెళ్దామన్నాడు. నేను వద్దని వారించాను. అయినా వినకుండా కిందకి దిగి ఆ చెరువు దగ్గరకెళ్ళాడు. నేను ఒక్కడినే ఉండటానికి భయమేసి తనతో పాటు కిందకి దిగాను. తను ఆ చెరువు వంకే తదేకం గా చూస్తున్నాడు. కొంచెం సేపటికి బిగ్గరగా ఏడుస్తున్నాడు. తనని చూస్తుంటే నాకు భయమేస్తుంది. కిరణ్ ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాను. నేనూ ,శ్వేతా వారానికి ఒకసారైనా ఇక్కడికి వచ్చే వాళ్ళం. తనకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం.తనని నేను ప్రాణం గా ప్రేమించా, కాని తను నన్ను మోసం చేసింది. అది చేసిన మోసం తట్టుకోలేక ఇక్కడే ఇదే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నా అని బిగ్గరగా ఏడుస్తూ చెప్తున్నాడు, ఆ చివరి మాటలు నాకు సరిగ్గా అర్ధం కాలేదు. ఏంటి ఏమన్నావ్ అని అడిగాను. ఇక్కడే ఇక్కడే దానికోసం ప్రాణాలు తీసుకున్నా. అది మాత్రం ఇంకొకడితో హాయిగా కాపురం చేస్తుంది అని అన్నాడు. ఆ మాటలకి ఒక్క క్షణం నిర్ఘాంతపోయా. కాళ్ళు వణుకుతున్నాయి. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, ఏమైంది ఇతనికి, అసలెవరు ఇతను అనుకుని ఎవరు నువ్వు? అని అడిగాను. నేను రవి ని అన్నాడు. అంతే కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లైంది. ముచ్చెమటలు పోసేసాయి. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. నేనేం చేస్తున్నానో నాకు అర్ధం కావట్లేదు. అక్కడి నుండి పరిగెత్తాను. తను నా వెనకే పరిగెడుతున్నాడు. పరిగెత్తి పరిగెత్తి బైక్ దగ్గరకొచ్చాను. బైక్ స్టార్ట్ చేసి ముందుకి కదలబోయాను. అంతే ఎవరో ఈడ్చి కొట్టినట్లు బైక్ పై నుండి ఎగిరి  కింద పడ్డాను. పడటం పడటం రోడ్ మీద నుండి జారి చెరువు దగ్గరకి వెళ్ళడానికి కిందకి దిగే మార్గం లో పడ్డాను. అంతే ఎవరో నా కాళ్ళని పట్టుకుని కిందకి లాగేస్తున్నారు. నేను విడిపించికోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. ఆ చీకట్లో ఏమి కనపడటం లేదు. చేతికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను. ఒక చెట్టు కొమ్మ దొరికింది దాన్ని పట్టుకుని విడిపించుకోడానికి కాళ్ళు ఆడిస్తున్నాను. కాని ఒక్కసారిగా నాకన్నా వెయ్యి రెట్లు బలం తో గట్టిగా కిందకి లాగినట్లనిపించింది.చేయి కోసుకుపోయింది కొమ్మ కి. చేతి నిండా రక్తం. ఇంక నా వల్ల కావట్లేదు, నా ఓటమిని అంగీకరించేసి ప్రతిఘటించడం మానేసాను. అంతే ఎవరో నన్ను లాక్కుంటూ చెరువులోకి తీసుకెళ్ళిపోయారు.
ఒక్కసారి గా కళ్ళు తెరిచి చూసాను. అనిల్ గాడు ఎదురుగా కనపడుతున్నాడు. ఏరా తాగింది దిగిందా? చేతికి దెబ్బ తగిలినా కూడా అంత సోయ లేకుండా పడుకున్నావేంట్రా? అని అడిగాడు. వెంటనే చేయి చూసుకున్నాను. చేతికి కట్టు ఉంది. ఏమైంది అని అడిగాను. రాత్రి తాగింది ఎక్కువై గ్లాస్ పగలకొట్టావు. అది కోసుకుపోయింది అన్నాడు. అంటే ఇప్పటి దాక జరిగింది కలా? చా నిజం గా జరిగినంత భయమేసింది ఏంటి అనుకున్నాను. రెడీ అయ్యి వెళ్ళబోతూ రాజు దగ్గరకి వెళ్ళి రాజు నిజం చెప్పు. రాత్రి మనం స్పిరిట్ గేం ఆడాం కదా అదంతా నిజమేనా? కాయిన్ నిజం గా కదిలిందా అని అడిగాను. తను నవ్వి లేదు మామ.. ఆ నరేష్ గాడు రోజు నన్ను పల్లెటూరి వాడినని ఆటపట్టిస్తూ ఉంటాడు. అందుకే వాడిని భయపెట్టడానికి అలా చేసా. కాయిన్ నేనే జరిపాను, నేను కాయిన్ లాగుతుంటే నిజం గా ఆత్మే లాగుతుందని భయపడి చచ్చాడు వాడు అన్నాడు. మరి నువ్వు రాత్రి పేరు అడిగితే రవి అని చెప్పావు కద అది ఎవరి పేరు అని అడిగా. అది మా ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి పేరు. తను మొన్నే చనిపోయాడు, ఆత్మ హత్య చేసుకుని చనిపోయాడు లవ్ ఫైల్యూర్. అందుకే అతని పేరు చెప్తే ఈ నరేష్ గాడు దడుచుకు చస్తాడని అలా చెప్పా అని చెప్పాడు,
తను చెప్తుంటే నాకంతా అయోమయం గా ఉంది. నిన్న ఆడిన స్పిరిట్ గేం అబద్దమా. రాత్రి నిజం గా ఆత్మ రాలేదా? అలా ఐతే నిన్న రాత్రి నాతో మాట్లాడింది ఎవరు. తను ఆత్మహత్య చేసుకున్నాడు అని రాజు నాకు ఇప్పుడేగా చెప్తున్నాడు, మరి రాత్రి వచ్చింది కల ఐతే తను ఆత్మ హత్య చేసుకుని చనిపోయిన విషయం రాత్రే నాకెలా తెలిసింది? వెంటనే రాజు ని ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అని అడిగాను. ఇక్కడి నుండి కొంచెం దూరం లో ఆ ఘాట్ రోడ్ దగ్గర చెరువుంది ఆ చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు. నాకు ఆ మాట వినగానే ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. ఇప్పుడు రాజు నాకు చెప్తుంది అంతా నాకు రాత్రే తెలుసు కదా? అంటే నిజం గానే నేను ఆ చెరువు దగ్గరకి వెళ్ళానా? అలా ఐతే నేను ఈ పాటికి చనిపోయి ఉండాలి కదా? చేయి కి దెబ్బ తగిలింది గ్లాస్ వల్ల, కాయిన్ కదిలింది రాజు వల్ల ఐతే మరి ఇవన్నీ నాకెలా తెలిసాయి. ఇలా ఆలోచించుకుంటూ కిందకి దిగుతున్నాను. రాజు కూడా మాతో పాటే కిందకి వచ్చాడు. మొదటి అంతస్థు కి వచ్చాక రాజు నన్ను పిలిచాడు. అదిగో అతనే చనిపోయింది అని వరండాలో గోడకి వేలాడ తీసిన ఫోటో వంక చూపించాడు, ఆ ఫోటో చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. రాత్రి నేను చూసిన రూపమే అది. అతనే రవి. ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా పరుగు పరుగున కిందకి దిగి బైక్ స్టార్ట్ చేసాను.మళ్ళీ ఇప్పటి వరకు వాళ్ళ రూం దరిదాపుల్లోకి వెళ్ళలేదు. జన్మలో స్పిరిట్ గేమ్ ఆడలేదు...

Friday, March 15, 2013

యాక్సిడెంట్

ఆఫీస్ కి ఇంకా 5 నిమిషాలే ఉంది. ఈ లోపు వెళ్ళకపోతే లేట్ రిపోర్టింగ్ పడుతుంది. అసలే ఈ నెలలో చాలా లేట్ రిపోర్టింగ్ లు ఉన్నాయి. అని మనసులో అనుకుంటూ బైక్ వేగం పెంచాను. నా ముందు వెళ్తున్న లారి ని దాటి ముందుకి వెళ్తుండగా ఎక్కడి నుండి దూరాడో ఒక ఆటో వాడు అడ్డంగా పెట్టాడు ఆటో ని.  అరవై స్పీడ్ లో ఉన్నాను. పక్కకి జరగడానికి  లారీ ఉంది. ఎదురుగా ఆటో. ఏం చేయాలో తెలియక సడెన్ గా బ్రేక్ వేసాను. వెనక వస్తున్న కార్ ని గమనించలేదు. చచ్చాను రా దేవుడా అనుకున్నా. పాపం ఆ కార్ వాడు ప్రమాదాన్ని ఊహించి బ్రేకు వేసాడు. కిర్ర్ర్ర్ మని పెద్ద శబ్ధం. కార్ సర్రున జారుకుంటూ వచ్చి నా బైక్ కి రెండు సెంటీ మీటర్ల దూరం లో ఆగింది. గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ కార్ వాడు అడ్డమైన బూతులు తిట్టాడు. తప్పు నాది కాదు ఆటో వాడిది అని చెప్పే అవకాశం లేకుండా వాడు వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఇంకా నేను మింగడానికి భూమ్మీద నూకలు చాలా ఉన్నాయేమో అని భగవంతుడికి మనసులోనే దణ్ణం పెట్టుకుని బైక్ ని నడిపిస్తున్నాను కొంచెం వేగం తగ్గించి. అలా కొంచెం ముందు కి వెళ్ళగానే రోడ్ కి అవతలి పక్క నేను చూస్తుండగానే ఒక లారీ ముందు వెళ్తున్న బైక్ కి ఢీ కొట్టింది. అంతే బైక్ మీద వెనక కూర్చున్న వ్యక్తి ఎగిరి ఒక అయిదు అడుగుల దూరం లో పడ్డాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి బైక్ తో పాటు కింద పడ్డాడు. అతని కాలు బైక్ వెనక చక్రం లో ఇరుక్కున్నట్లుంది. రెండు క్షణాల్లో జనమంతా గుమి గూడిపోయారు. నేను రోడ్ కి ఇవతలి వైపే ఉన్నాను. ఆంబులెన్స్ కి ఫోన్ చేయండి అని ఎవరో గట్టిగా అరుస్తున్నారు. నేను బైక్ ఆపి అటు వెళ్దామనుకున్నాను. కాని ఎందుకో నాకు ధైర్యం సరిపోవట్లేదు. నాతో పాటు రోడ్ కి ఇవతలి వైపు ప్రయాణిస్తున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ వాహనాలని స్లో చేసి చూసుకుంటూ వెళ్తున్నారు కాని ఎవరూ ఆఫడం లేదు. నాకు కూడా అక్కడ ఉండ బుద్ది కాలేదు. వెంటనే అక్కడి నుండి బైక్ కూడా దిగి చూడకుండా వచ్చేసాను. ఆఫీస్ కి సరైన టైం కే చేరుకున్నాను. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని కంప్యూటర్ ఆన్ చేసి కూర్చున్నాను. కాని ఎందుకో నా మనసంతా అదోలా ఉంది. ఏదో తెలియని బాధ. వర్క్ చేస్తున్న కూడా ఏదో ధ్యాస. నా మనసంతా ఆ యాక్సిడెంట్ చుట్టూనే తిరిగుతుంది. పని మీద ధ్యాస ఉండట్లేదు.
నేనేదో ఆ యాక్సిడెంట్ చేసినంత గిల్టీ గా ఉంది నాకు.
అసలు నేనెందుకు ఆగకుండా వచ్చేసా? ఆఫీస్ టైం ఐపోతుందనా? లేదా ఆ యాక్సిడెంట్ ని చూసి భయమేసిందా? నాకెందుకులే అని నిర్లక్ష్యమా? నాకు అసలు జాలీ, దయా అలాంటివేమీ లేవా? ఇలా ఎవేవో ప్రశ్నలు నన్ను హింసిస్తున్నాయి. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఇంటికి బయల్దేరాను. సరిగ్గా యాక్సిడెంట్ జరిగిన రోడ్ లొనే ప్రయాణిస్తున్నాను. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నాను. అక్కడ యాక్సిడెంట్ చేసిన లారీ లేదు. యాక్సిడెంట్ కి గురైన బైకూ లేదు. రక్తపు మరకలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయి.ఆ ప్రదేశం లో రోడ్ మొత్తం రక్తం తో తడిసిపోయింది. ఆ రక్తాన్ని చూడగానే నాకు ముచ్చెమటలు పోసాయి. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇంటికెళ్ళగానే స్నానం చేసి అమ్మ ని అన్నం పెట్టమన్నాను. అన్నం కలిపి నోట్లో పెట్టుకుంటుంటే నాకు రోడ్ మీడ ఉన్న రక్తం నా ప్లేట్ లో కనపడుతుంది. నేను తినే ముద్ద ఎర్రగా రక్తంలో తడిచిపోయినట్లుంది. నేను అన్నం తినలేకపోయాను. చేయి కడిగేసాను. అమ్మ ఏమైందిరా చేయి కడిగేసావేంటి అని అడిగింది. ఆకలి వేయట్లేదు అని చెప్పి టి వి చూస్తూ కూర్చున్నాను. అమ్మ అరెయ్ చిన్నోడు నిన్న రాత్రి అనగా వాళ్ళ ఫ్రెండ్ రూం కి వెళ్తున్నా పొద్దున్నే వస్తా అని వెళ్ళాడు ఇంత వరకు రాలేదు. ఫోన్ చేస్తే ఆఫ్ చేసి ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కో నాకెందుకో కంగారు గా ఉంది అని చెప్పింది. ఆ మాట వినగానే నాలో ఎందుకో చిన్నగా కంగారు మొదలయ్యింది. మా తమ్ముడి నెంబర్ కి ఫోన్ చేసాను. ఆఫ్ చేసి ఉంది. కంగారు కాస్తా చిన్నగా భయంగా తయారయ్యింది. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసాను. మాకు తెలియదన్నయ్యా మా దగ్గరకి రాలేదు అని అందరి దగ్గర నుండీ ఒకటే సమాధానం. నాకు ఏం చేయాలో అర్ధం కావట్లేదు. ఒక్కసారిగా నా మెదడులో ఆ యాక్సిడెంట్ సన్నివేశం గుర్తొచ్చింది. వెన్నులో వణుకు పుట్టింది. మా వాడికి ఏమైనా... చా అలాంటిదేమి జరిగి ఉండదు అని నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను. కాని పదే పదే అదే అనుమానం నా బుర్ర ని తొలిచేస్తుంది. అసలు పొద్దున్న ఆ యాక్సిడెంట్ జరిగింది ఎవరికి? ఇంక క్షణం కూడా అలోచించకుండా వెంటనే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ పక్కన ఉన్న కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తిని వాకబు చేసాను. ఎవరో తెలియదయ్యా..ఇద్దరు కుర్రాళ్ళు... ఒకతనికి తలకి దెబ్బ తగిలింది. ఇంకో అతనికి కాలు విరిగినట్లుంది. గవర్నమెంట్ ఆసుపత్రి కి తీసుకెళ్ళినట్లున్నారు. మరి ఉన్నారో పోయారో? అన్నాడు. అక్కడి నుండి వెంటనే గవర్నమెంట్  హాస్పిటల్ కి చేరుకున్నాను. 
హాస్పిటల్ లో అడుగుపెడుతుంటే నా మనసులో ఏదో తెలియని ఆందోళన. అసలు నేను అక్కడికి ఎందుకొచ్చానో  కూడా నాకు అర్ధం కావట్లేదు. ఎవరిని ఏమని అడగాలో కూడా తెలియడం లేదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగుతున్నాయి. మా వాడు కాకూడదు అని మనసులో ఎంత మంది దేవుళ్ళని తలుచుకున్నానో నాకే తెలియదు.
ఇంతలో నా ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది. అప్రయత్నం గానే చూశాను. నేను ఇంటికొచ్చేసాను. నువ్వు ఎక్కడికెళ్ళావ్. త్వరగా ఇంటికి రా.. అని మా తమ్ముడి ఫోన్ నుండి మెసేజ్. ఆ మెసేజ్ చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయ్యింది. కళ్ళలో ఆనందం. గుండెల్లో ఉన్న బరువంతా దిగిపోయింది. వెంటనే ఇంటికి వెళ్దామని వెనక్కి తిరిగాను. కాని ఆ యాక్సిడెంట్ అయిన కుర్రోళ్ళు గుర్తొచ్చారు. పక్కన ఉన్న వార్డ్ బాయి ని పొద్దున్న జరిగిన యాక్సిడెంట్ తాలుకు వాళ్ళు ఎక్కడున్నారని అడిగాను. ఐ.సీ.యూ లో ఉన్నారని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్ళి చూశాను. చాలా మంది జనం ఉన్నారు బయట. ఒకతన్ని పిలిచి అడిగాను ఎలా ఉంది వాళ్ళకి అని. ఒకతనికి తలకి బాగ దెబ్బ తగిలింది. ఇప్పుడే ఆపరేషన్ చేసారు, ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. ఇంకో అతనికి కాలు విరిగింది. లోపల రాడ్ వేసారు అని చెప్పాడు. మీరు అతనికి ఏమి అవుతారు అని అడిగాను నాకు సమాధానం చెప్పిన వ్యక్తి ని. ఆ యాక్సిడెంట్ నా వల్లే జరిగింది. నా లారీ కిందే పడ్డారు వాళ్ళు, వెంటనే ఆంబులెస్ లో హాస్పిటల్ కి తీసుకొచ్చాను. వాళ్ళ తల్లి తండ్రులు దేవుళ్ళు. వాళ్ళ బిడ్డలకి నా వల్లే ఈ పరిస్తితి వచ్చినా నన్ను ఒక్క మాట అనలేదు. పైగా సమయానికి హాస్పిటల్ కి తీసుకు వచ్చా అని నాకు కృతజ్ఞతలు చెప్తున్నారు అని వాళ్ళ వంక ఆరాధనా పూర్వకం గా చూస్తున్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. యాక్సిడెంట్ చేసిన వాడు పారిపోకుండా ఇక్కడేం చేస్తున్నాడు.
ఆ కుర్రోళ్ళ అమ్మా నాన్నా ఎంత మంచి వాళ్ళు? తమ బిడ్డలకి ఈ దుస్తితికి కారణమైన వాడిని కూడా క్షమించేసే అంత మంచి వాళ్ళా అనిపించింది. ఆ సమయంలో నా మీద నాకే అసహ్యమేసింది.
నా తమ్ముడికి ఏమైనా అయ్యిందా అన్న చిన్న అనుమానం వస్తేనే నేను ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చేసాను.అదే నా కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగి ఒకడు ప్రణాపాయం లో ఉన్నాడు అంటే కనీసం ఆగి వాళ్ళ దగ్గరకి వెళ్ళాలన్న ఇంగిత జ్ఞానము కూడా నాకు లేదా? నేను ఇంత స్వార్ధపరుడినా?  నా ప్రాణాలు, నా వాళ్ళ ప్రాణాలు అంటేనే విలువ ఇస్తున్నానా? పక్కనోడి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే స్థితిలో నేను లేనా? నేను మనిషినేనా? అనిపించింది. అక్కడ అందరూ నాకు మంచి వాళ్ళే కనపడుతున్నారు. యాక్సిడెంట్ చేసి తన దారిన తాను పోకుండా ఇంకా ఇక్కడే ఉన్న ఆ డ్రైవర్, ఆ డ్రైవర్ ని క్షమించగలిగే గొప్ప మనసున్న ఆ తల్లితండ్రులూ.. అందరూ మంచి వాళ్ళే. అక్కడ నాకు కనిపిస్తున్న ఒకే ఒక చెడ్డ వాడు నేనే..

Monday, March 11, 2013

మల్లీశ్వరి

పెద్దోడా లేవరా...పెద్దోడా లేచి రెడీ అవ్వరా....టైం అవుతుంది....' నిద్ర పోతుంటే అమ్మ జోరీగ లా చెప్పిందే చెప్పి నస పెడుతుంది. ఆదివారం కదా హాయిగా పడుకుందామనుకుంటే ఆ అదృష్టము లేకుండా చేస్తుందని పిచ్చ కోపం వచ్చేసింది. నేను రాను నువ్వు వెళ్తే వెళ్ళు లేకపోతే మానెయ్' అని అమ్మ మీద గట్టిగా అరిచేసాను. అదేంట్రా నువ్వేగా రాత్రి అడిగితే తీసుకెళ్తాను అన్నావ్. సర్లే ఎవరూ ఎక్కడికీ తీసుకెళ్ళనక్కర్లేదు. నేను ఇంట్లోనే పడి ఉంటానులె...అని మొహం చిన్నబుచ్చుకుంది. అమ్మ వాళ్ళ అక్క కూతురి ఆడపడుచు పెళ్ళి. అమ్మ తరుపు వాళ్ళ పెళ్ళి కాబట్టి నాన్నకి అది పెద్ద ముఖ్యమైన కార్యక్రమం కాదు. అందుకే ఆయన వెళ్ళడు. అమెని తీసుకెళ్ళడు. ఇంక అమ్మకి ఉన్న ఒకే ఒక చాయిస్ నేనే. అందుకే ఒక వారం ముందు నుండి పెళ్ళికి వెళ్ళాలి పనులేమి పెట్టుకోవద్దని నాకు చెప్తూనే ఉంది. ఇప్పుడు తీసుకెళ్ళను అనేసరికి అమ్మకి కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. పెళ్ళై పాతికేళ్ళు అయినా ఇంకా పుట్టింటి మీద ఇంత ఆశ ఏంటో. ఇంక ఆమె కొళాయి విప్పితే ఆపడం కష్టం అని అర్ధమయ్యి లేచి తయారయ్యాను.
పెళ్ళి మా ఊరిలోనే కాబట్టి ముహుర్తం టైం కి వెళ్తే సరిపోతుందని ఇద్దరం బైక్ మీద బయల్దేరాం.
పెళ్ళి మండపం లో అడుగు పెట్టగానే మా పెద్దమ్మ కొడుకు ఎదురయ్యాడు. మమ్మల్ని పలకరించి మా బంధువుల దగ్గరకి తీసుకెళ్ళాడు. వాడు వరసకి అన్నయ్యే అయినా ఇద్దరం ఒకే వయసు వాళ్ళం. ఇద్దరం చిన్నప్పటి నుండి కలిసి తిరిగాము. ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండవు. పెళ్ళిలో బోర్ కొడుతుంది అనుకున్నా. కాని వాడిని చూసాక ప్రాణం లేచి వచ్చినట్లైంది. చుట్టాలందరిని ఒకసారి పలకరించి ఇద్దరం పక్కకి వచ్చేసాం. 
మా వాడు 'ఇంకేంట్రా సంగతులు...కాలేజ్ ఎలా ఉంది. కాలేజి లో ఎవరైనా అమ్మాయి నచ్చిందా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు?' అని వరుసగా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉన్నాడు. ఇద్దరమ్మాయిలు కలవక కలవక కలిస్తే ఏం మాట్లాడుకుంటారో తెలియదు కాని ఇద్దరబ్బాయిలు కలిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మయిల గురించే మాట్లాడుకుంటారు. అయినా అమ్మాయిల కన్నా అందమైన టాపిక్ ఏముంటుంది చెప్పండి. నేను అదేం లేదురా. ఇంక ఎవరూ నచ్చలేదు. నువ్వే చూసి పెట్టు ఎవరైనా ఉంటే అని ఏదో మాట వరసకి చెప్పాను. కాని మా వాడు ఆ మాట ని బాగా  సీరియస్ గా తీసుకున్నట్లున్నాడు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే చూసి పెడతాను ఉండు. పెళ్ళిలో చాలా మంది అమ్మాయిలు వస్తారుగా అందులో ఎవరైనా నచ్చుతారేమో చూడు అని చిన్న ఆశ రేపాడు. ఇంకేముంది 'నీలా ప్రోత్సహించే వాళ్ళు లేక అమ్మాయిల విషయంలో చాలా వెనకబడి ఉన్నానురా అని మా వాడికి ఒక పొగడ్త విసిరి ఇంక వేట మొదలు పెట్టాం.
ఆ మండపం లో మొత్తం మీద ఒక నూట యాభై మంది ఆడంగులు ఉండి ఉంటారు. అందులో ఆంటీలని అమ్మమ్మలని తీసేస్తే ఒక యాభై మంది అమ్మాయిలు మిగిలారు. వాళ్ళలో పెళ్ళైన వాళ్ళు ఎంత మందో,పెళ్ళి కాని వాళ్ళు ఎంత మందో ముందు కనిపెట్టాలి. కనుక ముందు అమ్మాయి కనపడగానే మొహం చూడకుండా కాళ్ళు చూస్తున్నాం. కాళ్ళకి మెట్టెలు ఉంటే ఇంక తల పైకి కూడా ఎత్తకుండా వెంటనే ఇంకో అమ్మాయి ని పరిశీలిస్తున్నాం. అలా పెళ్ళైన వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగిలింది 15 మంది. ఆ పదహైదు మందిలో నిజంగా సైటు కొట్టే అర్హతలు ఉన్న అమ్మాయిలు ఒక 5 మంది ఉన్నారు. ఆ అయిదు మంది వెనకాల వాళ్ళ బాబులున్నారు. దేశంలో ఆడ జనాభా కరువయ్యారు అంటే ఎంటో అనుకున్నాను. ఇదన్న మాట పరిస్థితి అనుకుని నన్ను నేను ఓదార్చుకున్నాను.

ఇక చేసేది ఏమి లేక నిరాశగా నిట్టూరుస్తుంటే దేవతలా ప్రత్యక్షమైంది ఒక బంగారు బామ్మ. మీరు సరిగ్గానే చదివారు బంగారు బొమ్మ కాదు బంగారు బామ్మే. 
మండపం పైన అంతస్ఠుకి వెళ్ళే మెట్ల దగ్గర నుంచుని ఒక బామ్మ పైకి చూస్తు ఒసేయ్ అమ్ములు ఎక్కడున్నావే అని గట్టిగా కేకలు వేస్తుంది. అరిచి అరిచి ఓపిక నశించి ఇంక గొణగడం మొదలెట్టింది. 'నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికెళ్ళిందో ఈ దొంగ ముండ. దీనికి పెత్తనాలు బాగ ఎక్కువయ్యయి. ఇంటికెళ్ళాక చెప్తా దీని సంగతి. ఇలా ఆపకుండా గొణగుతూనే ఉంది. మేము అప్పుడే పైకి వెళ్దామని మెట్ల దగ్గరకి వచ్చాం. మమ్మల్ని చూడగానే ఇదిగో అబ్బాయ్, ఒక సారి ఇటు రా అయ్యా. అని పిలిచింది. 'పైన నా మనవరాలు ఉంది. నేను ఈ మెట్లెక్కి పైకి వెళ్ళలేను. కాస్త దాన్ని పిలువయ్య. నాకు ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అని చెప్పింది. నేను సరే బామ్మ గారు, మీ మనవరాలు ఎవరు. ఏం పేరు చెప్పండి పిలుస్తాం అని చెప్పాం. ఒకసారి మమ్మల్ని ఎగాదిగా చూసి నా మనవరాలి పేరు మల్లీశ్వరి . కొంచెం త్వరగా పిలువండయ్య అని చెప్పింది.
మల్లీశ్వరి ... ఆ పేరు వినగానే ఎందుకో బాగా నచ్చింది. పేరు పాతదే ఐనా ఆ పేరు లో మల్లె పూవులో  ఉండే తాజాదనం ఉట్టిపడుతుంది. పైకి వెళ్ళి చూసాం. కొంత మంది చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. బామ్మ గారి మనవరాలు ఆ పిల్లల్లో ఉందేమో అని మళ్ళీశ్వరీ అని పిలిచాను. అందులో ఒక చిన్న పాప నవ్వుతూ మా దగ్గరకి పరిగెత్తుకొచ్చింది. మల్లీశ్వరి అంటే ఆ చిన్న పాపేనేమో అనుకున్నాం. 'మీకు మల్లీశ్వరి అక్క కావాలా? అదిగో అక్కడ ఉంది అని మా వెనక వైపు చూపించింది. వెనక్కి తిరిగి చూసాం. నలుగురైదుగురు అమ్మాయిలు గుంపుగా నించుని ఉన్నారు. అందులో ఒకే ఒక అమ్మయి మాత్రం లంగా వోణీ వేసుకుని ఉంది. మిగతా వాళ్ళoతా చుడిదార్లు వేసుకుని ఉన్నారు. ఆ లంగా వోణీ వల్ల ఆ అమ్మాయి మిగతా వాళ్ళ కన్నా కొంచెం ఎక్కువ ఆకర్షణ గా కనపడుతుంది. దానికి తోడు జడ నిండా పూలు, తలలో పాపిడి బిళ్ళ, చెవులకి బుట్టలు, చేతి నిండా గాజులు, కాళ్ళకి పట్టీలు, నుదుటిన బొట్టు ఇవన్నీ ఆ అమ్మాయి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అచ్చ తెలుగు ఆడ పిల్లలా ఉంది. నిజానికి పెళ్ళిళ్ళు, పేరంటాలకి ఇలా తయారవుతేనే పద్దతిగా ఉంటారు. కాని ఈ కాలం అమ్మాయిలకి అంత పద్దతిగా రెడీ అయ్యే ఓపిక, తీరిక ఉండట్లేదు. పైగా సింపుల్ గా ఉంటేనే అందమనుకుంటున్నారు.
అలంకరణ అనేది ఆడవాళ్ళకి మాత్రమే తెలిసిన టెక్నిక్. కాని ఈ కాలం అమ్మయిలు ఆ టెక్నిక్ ని సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. మొహానికి నాలుగైదు క్రీములు రాసేసి, పెదాలకి లిప్ స్టిక్కులు పూసేసి, కనుబొమ్మలని అడ్డదిడ్డంగా కోసేసి, నుదుటిన బొట్టు తీసేస్తే అదే అలంకరణ అనుకుంటున్నారు. నిజానికి అలంకరణ అంటే చందమామ చుట్టూ చుక్కల్ని నింపితే అలంకరించడం అవుతుంది కాని, చందమామ ని కప్పేస్తూ మబ్బుల్ని నింపితే అలంకరించడం ఎలా అవుతుంది. ఇప్పుడు ఆడ వాళ్ళు చేస్తుంది కూడా అదే.. వాళ్ళ అందాన్ని కృత్రిమ వస్తువులతో కప్పేసుకుంటున్నారు. కాని ఈ అమ్మాయి అలా లేదు. చాలా నేచురల్ గా ఉంది. అందుకే చూడగానే నచ్చేసింది. ఆ చిన్న పాప ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి అక్కా నిన్నెవరో పిలుస్తున్నారు అని మా వంక చూపించింది. తను మా వంక ప్రశ్నార్ధకంగా ఒక చూపు చూసింది. తన అయోమయం అర్ధం చేసుకుని నేను వెంటనే 'మల్లీశ్వరి  అంటే మీరేనా? మీకోసం మీ బామ్మ గారు వెతుకుతున్నారు అని చెప్పాను. తను వెంటనే పరిగెత్తుకుంటూ చూస్తుండగానే మాయమైపోయింది.
నేను ఆ అమ్మాయిని కళ్ళప్పగించి చూడడం మా వాడు గమనించాడు. ఏంట్రా అమ్మాయి బాగా నచ్చినట్లుంది. చూడగానే పడిపోయినట్లున్నావ్, కళ్ళార్పకుండా చూస్తున్నావ్. మన అన్వేషణ ఫలించినట్లుంది కదా.. అని కొంటెగా నవ్వాడు. నేను కూడా నవ్వుతూ అవును రా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. పద కిందకెళ్ళి చూద్దాం అని వాడ్ని వెంటబెట్టుకుని కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళే సరికి బామ్మా మనవరాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆ అమ్మాయి 'అసలు నీతో రావడం నాది బుద్ది తక్కువ, ఎక్కడా ప్రశంతంగా ఉండనివ్వవు, ఎప్పుడు చూడు తిండి గోలే. ఒక అరగంట ఆలశ్యంగా తింటే చచ్చిపోతావా? ఇదేమైనా మన ఇళ్ళా ? టైం కి మింగడానికి అని పాపం వాళ్ళ బామ్మ ని చెడా మడా తిట్టేసింది. మేము రావడం చూసి ఆపేసింది. నేను కావాలని బామ్మ గారి దగ్గరకెళ్ళి ' బామ్మ గారు మీ మనవరాలు వచ్చినట్లుందిగా భోం చేసారా? అని అడిగాను. భోజనమా నా పిండాకూడా మధ్యాహ్నం 3 అవుతుంది. ఆకలేస్తుందే అంటే ఈ ముదనష్టపుది నా మీద గయ్యిమని ఒంటి కాలి మీద లేస్తుంది అని బామ్మ గారు మనవరాలి గాలి తీసేసింది.
తను ఇంక ఏం చెప్పాలో తెలియక 'అదేం లేదండీ, భోజనాల దగ్గర ఖాళీ లేదు, జనాలు బాగా ఎక్కువ గా ఉన్నారు. కాసేపాగి వెళ్దామంటున్నా అంతే అని సర్దిచెప్పుకుంది. నేను అయ్యో ముసలావిడ కదా పాపం ఆకలికి ఉండలేరు. సరే మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి ఎలాగొలా మీ ఇద్దరికి సీట్లు ఆపుతాం అని చెప్పాను. తను అయ్యో, వద్దండి పర్లేదు తర్వాత బంతిలో కూర్చుంటాం అంది. నేను అయినా వినిపించుకోకుండా మా వాడ్ని వెంటబెట్టుకుని భోజనాల దగ్గరకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అర్దమయ్యింది జనాలు బాగా ఉన్నారు అంటే ఏంటో. రైల్లో జనరల్ కంపార్ట్మెంట్ లో సీట్ల కోసం కొట్టుకుంటున్నట్లు కొట్టుకుంటున్నారు. ఒక బంతి జరుగుతుండగానే వెనకాల కుర్చీలు పట్టేసుకుని నించున్నారు. కుర్చీలో నుండి కొంచెం జరిగినా కుర్చీ లాగేసుకుని కుర్చునేటట్లున్నారు. ఇప్పుడు వీళ్ళని కూర్చోబెట్టడం ఎలా రా బాబు అనుకుంటుండగా ఆ వరుసలో ఒక మూల మా అమ్మ, పెద్దమ్మ రెండు కుర్చీలు పట్టుకుని కూర్చోవడానికి రెడీ గా ఉన్నారు. వెంటనే వాళ్ళ దగ్గరకెళ్ళాం, వీళ్ళు తిన్నాక ఇక్కడ కూర్చోపెడదాం లే అన్నాడు మా అన్నయ్య. 'వద్దురా బాబు ఈ బంతి లో కూర్చోపోతే ఆ ముసల్ది చచ్చిపోయేలా ఉంది, లేదంటే మనవరాల్ని చంపుకు తినేలా ఉంది అని చెప్పాను. అయితే ఏం చేద్దాం అన్నాడు. అమ్మ వాళ్ళని లేపి వాళ్ళని కూర్చోపెడదాం అన్నాను. ఆ మాట వినగానే 'ఒరేయ్ దుర్మార్గుడా.. అమ్మాయి కోసం అమ్మ తినే విస్తరాకు లాగేస్తావురా అని తిట్టాడు. ఏడిసావులే ముందు వీళ్ళని ఇక్కడ నుండి లేపే మార్గం చూడు అని చెప్పాను. వాడు కొంచెం ఆలోచించి 'అమ్మా నిన్ను అక్క వాళ్ళ అత్తగారు పిలుస్తున్నారే అని మా పెద్దమ్మ కి చెప్పాడు. మా పెద్దమ్మ ఇక వియ్యపురాలు పిలిస్తే వెళ్ళాలి కదా అని లేచి వెళ్తుoటే మా అమ్మ ఒక్కటే కూర్చుని తినలేక తను కూడా లేచింది. అక్కడ మమ్మల్ని కూర్చోమని వాళ్ళు వెళ్ళిపోయారు. మా వాడి ప్లాన్ ఫలించినందుకు వాడ్ని మెచ్చుకుని  మల్లీశ్వరిని బామ్మ ని పిలిచి అక్కడ కూర్చోబెట్టాను.
వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి మేము వాళ్ళకి కనిపించే అంత దూరం లో నిలుచున్నాము. నేను తననే చూస్తూ ఉన్నాను. తనకి నేను చూస్తున్నాను అనే విషయం అర్ధమయ్యింది. అప్పుడప్పుడూ ఒకసారి అలా చూసీ చూడనట్లు ఒక చూపు విసిరి వెంటనే కళ్ళు తిప్పేస్తుంది. కాని నేను మాత్రం నా చూపుల్ని తన మీదే కేంద్రీకరించాను.
నేను అలా చూస్తుంటే మొదట కొంచెం ఇబ్బంది పడింది కాని తర్వాత తను కూడా చూడడం మొదలు పెట్టింది. బామ్మ గారు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఆమె పని లో ఆమె ఉంది. భోజనాలు అయ్యాక తనతో ఎలాగొలా మాట్లాడాలి అనుకున్నా. తనతో పరిచయం పెంచుకోవాలి అనుకున్నా. వాళ్ళు భోజనం చేసాక వాళ్ళ వెనకే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాను. నేను తన వెనక పడడం తను గమనిస్తుంది. వెళ్ళి మాట్లాడదామంటే బామ్మ పక్కనే ఉంది.  సైగ చేసి పిలిచే అంత చనువు లేదు, తెగించేంత ధైర్యమూ లేదు. అవకాశం కోశం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంతలో మా అన్న ఏదో పని ఉండి బయటకెళ్ళాడు. నాకు అక్కడ ఉన్న ఒకే ఒక పని మల్లీశ్వరి తో పరిచయం పెంచుకోవడం. అందుకే నేను నా పనిలోనే ఉన్నాను. తను కూడా నా పైన ఆశక్తి చూపిస్తుందేమో అనిపిస్తుంది తన చూపులు చూస్తుంటే. తను చూస్తున్నప్పుడు అప్రయత్నంగానే నా పెదవుల నుండి ఒక నవ్వు జారిపోయింది. తను వెంటనే చూపు తిప్పేసుకుంది. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు సీన్ లోకి ఒక విలన్ వచ్చాడు. అదే వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళని పిలిచి హడావిడిగా మండపం ఎక్కించి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో ఒక ఫోటో దిగి వెళ్ళొస్తాం అని చెప్పి కంగారు కంగారుగా బయల్దేరిపోయారు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. మా అన్న కూడా లేడు. వాళ్ళు బయటకొచ్చి ఆటో ఎక్కారు. నేను తన వంకే చూస్తున్నాను. కాని తను తల కూడా తిప్పలేదు. ఆటో ఎక్కేసింది. ఒక్కసారి చూస్తే చాలు తనకి నువ్వు నచ్చినట్లు లేకపోతే ఇది ఇంక ఇక్కడితో వదిలేద్దాం అని నా మనసు చెప్తుంది. వెంటనే బైక్ తీసి వాళ్ళ ఆటో వెనక పడ్డాను. తనకి నేను వెనక వస్తున్న విషయం తెలుసో లేదో కూడా నాకు తెలియదు. తను వెనక్కి తిరిగి ఎందుకు చూస్తుంది. కాని నా మనసు ఊరుకోవట్లేదు, ఒక్కసారి చూడాలి ఒకే ఒక్కసారి చూడాలి అని పదే పదే కోరుకుంటున్నాను, మల్లీశ్వరీ  ఒక్కసారి చూడవే అని మనసులోనే గట్టిగా అరిచాను. నా అరుపు తనకి వినబడిందో ఏమో తెలియదు కానీ అకశ్మాత్తుగా ఒక్కసారి ఆటో లో నుండి వెనక్కి తొంగి చూసింది. అంతే నా ఆనందానికి హద్దులు లేవు. ఆ అమ్మాయి నాకేదో ఐ లవ్ యూ చెప్పినంత సంబరపడిపోయా. ఏదో నా గర్ల్ ఫ్రెండ్ కి టాటా చెప్తున్నట్లు చెయ్యి ఊపాను. తను వెంటనే కంగారు పడిపోయి తల తిప్పేసింది. కాని నేను చేయి ఊపడం మాత్రం ఆపలేదు వాళ్ళ ఆటో నా చూపులని దాటి వెళ్ళే వరకు.
మల్లీశ్వరినే తలచుకుంటూ తిరిగి కళ్యాణ మండపం చేరుకున్నాను. ఎక్కడికెళ్ళవురా ఇంతసేపు? ఫోన్ చేస్తే తీయవేంటి? అని మా అన్నయ్య అడుగుతున్నాడు. నాకు అవేమి వినపడటం లేదు. నా మనసంతా మల్లీశ్వరి మీదే ఉంది. పరిచయమయ్యేంత దగ్గర కూడా కాకుండానే అప్పుడే దూరమైపోయిందని బాధగా ఉంది. మల్లీశ్వరి అన్న పేరు తప్ప నాకు ఇంకేమి తెలియదు. మళ్ళీ తనని ఎలా కలవడం? అసలు మళ్ళీ నాకు తను కనిపిస్తుందా? నాకెందుకో మనసంతా బరువు మోస్తున్నట్లుంది. నీకు మల్లీశ్వరీ వాళ్ళు తెలుసా? ఇంతకు ముందెప్పుడైనా చూసావా? అని మా అన్న ని అడిగా. 'లేదురా బహుశా పెళ్ళి కొడుకు తరుపు వాళ్ళు అయి ఉంటారు అన్నాడు. ఇంతలో అమ్మ వాళ్ళు టైం అవుతుంది. గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగి వెళ్ళిపోదాం రమ్మన్నారు. అయిష్టంగానే పైకి వెళ్ళి ఫొటో కి ఫోజిస్తూ నిలబడ్డాను. కెమెరా ఫ్లాష్  నా  మీద పడగానే నా మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. వాళ్ళ కుటుంబం కూడా ఫోటో దిగారు కదా. ఆ ఫోటో చుపించి వాళ్ళెవరో కనిపెట్టడం పెద్ద కష్టం కాదు కదా అనుకున్నాను. వెంటనే నా అలోచనని మా అన్న కి చెప్పాను. మా వాడు కూడా 'అవును రా ఫోటో చూపించి అమ్మ నో అక్క నో అడిగితే చెప్తారు వాళ్ళెవరో..కాబట్టి ఆ అమ్మాయి దొరికేసినట్లే. ఫొటోలు రాగానే నీకు ఫోన్ చేస్తాను అన్నాడు. వాడిచ్చిన అభయంతో కాస్త ప్రసాంతంగా ఇంటికెళ్ళాను.
ఒక వారం రోజుల తర్వాత మా అన్న దగ్గర నుండి ఫోన్ 'అరేయ్ నేను అక్క వాళ్ళ ఇంటికెళ్తున్నాను. ఫోటోస్ వచ్చాయంట, నువ్ కూడా రా' అని చెప్పాడు. ఆ మాట వినగానే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. అరగంటలో అక్క వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమయ్యాను.వెళ్ళడంతోనే ఆల్బం పట్టుకుని మల్లీశ్వరి ఫోటో వెదకడం మొదలుపెట్టాను. నా శ్రమ ఫలించింది. మల్లీశ్వరి ఫోటో కనపడింది. ఆ ఫోటో చూడగానే నా కన్నా మా అన్న ఎక్కువ సంబరపడిపోయాడు. కారణం మల్లీశ్వరి వాళ్ళ నాన్న మా వాడికి బాగా తెలుసంట. ఆయన మా వాడికి (అంటే నాకు కూడా) వరసకి మావయ్య అవుతాడంట. నాకు ఆ మాట వినగానే చిర్రెత్తుకొచ్చింది. మా వాడిని చెడామడా తిట్టేసాను. నువ్వు సరిగ్గా వాళ్ళ నాన్న వచ్చినప్పుడే ఎందుకు బయటకెళ్ళావు, ఆ టైం లో నువ్వు ఉండి ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అని నా బాధ వెళ్ళగక్కుకున్నాను. నువ్వు వెంటనే వెళ్ళి ఆ అమ్మాయి వివరాలు కనుక్కుని రమ్మని మా వాడ్ని ఆజ్ఞపించాను
 సాయంత్రం కల్లా మా వాడి దగ్గర నుండి ఫోన్ 'ఆ అమ్మాయి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. ఒక్కతే కూతురు. క్రొద్ది కాలం క్రితమే వాళ్ళ అమ్మ చనిపోయారు. ప్రస్తుతం తను, వాళ్ళ బామ్మ, వాళ్ళ నాన్న ముగ్గురే ఉంటున్నారు అని చెప్పి ఆ అమ్మాయి కాలేజ్ వివరాలు, వాళ్ళ ఇంటి చిరునామా తో సహా మొత్తం వివరాలు ఇచ్చాడు. మా వాడు చేసిన సాయానికి వాడి మీద ఎక్కడ లేని ప్రేమ తన్నుకొచ్చింది. మొదటి సారి వాడిని అన్నయ్య అని పిలవాలనిపించి 'థ్యాంక్స్ అన్నయ్యా..' అన్నాను. మా వాడు వెంటనే ' ఏరా తాగున్నావా ఏంటి తేడాగా మాట్లాడుతున్నావ్ అన్నాడు. చీ వీడబ్బా నేను ప్రేమగా మాట్లాడితే ఎవ్వడూ నమ్మడేంట్ర బాబు అనుకుని 'అదేం లేదురా నువ్వు లేని పోని అనుమానాలు పెట్టుకోకు అని ఫోన్ పెట్టేసాను.
ఇక ఒక్కరోజు కూడా ఆలశ్యం చేయకుండా ఆ తరువాతి రోజే మా వాడిని వెంటబెట్టుకుని వాళ్ళ కాలేజి దగ్గర కాపు కాసాను. అప్పటికే క్లాసులు మొదలైపోవడం వల్ల దాదాపు అందరు లోపలే ఉన్నారు. ఇక వాళ్ళ కాలేజి అయ్యేవరకు ఎదురు చూడడం తప్ప ఇంకేమి చేయలేమని అర్ధమయ్యింది. వాళ్ళ కాలేజ్ లోపలికి వెళ్ళి పిలవమని చెప్తే ఎలా ఉంటదో ఆలోచించాను. ఒక అమ్మాయి కోసం అబ్బాయి వచ్చాడంటే కచ్చితంగా వాళ్ళిద్దరికీ ఏదొక రిలేషన్ ఉండాలి. బావ నొ బాయ్ ఫ్రెండ్ నొ అని చెప్దామంటే తీరా తను వచ్చాక వీడెవడో నాకు తెలియదు అంటే ? ఇక మిగిలి ఉన్న ఒకే ఒక రిలేషన్ అన్నయ్య.. చీ ఇంతకన్న దరిద్రముంటుందా... వద్దులే దానికన్న బయట ఎదురు చూడడమే మంచిది అని గేటు కాడ నక్కల్లా పడిగాపులు కాస్తున్నాం. సాయంత్రం అయ్యింది.. కాలేజ్ వదిలారు. అందరు బయటకి వస్తున్నారు. నాకు గుండెల్లో దడగా ఉంది. ఆ అమ్మాయి అసలు ఇవాళ కాలేజి కి వచ్చిందా రాలేదా? వస్తే నన్ను గుర్తు పడుతుందా లేదా, గుర్తు పట్టినా నాతో ఎందుకు మాట్లాడుతుంది. తను నాకు నచ్చింది కాబట్టి నేను తన కోసం ఇంత దూరం వచ్చాను. తనకి నచ్చాలని ఏం లేదు కదా? ఇలా అడ్డమైన అనుమానాలు నా బుర్ర ని తొలిచేస్తున్నాయి. ఆ అమ్మాయి త్వరగా వస్తే బాగుండు ఈ అనుమానాలన్నిటికీ సమాధానలు దొరుకుతాయి అనుకుంటుండగా మా వాడు పిలిచాడు 'అదిగోరా మల్లీశ్వరీ అక్కడ వస్తుంది చూడు అని చూపించాడు. అవును మల్లీశ్వరే.. ఒక నలుగురు అమ్మాయిలతో కలిసి నడుస్తుంది. చుడీదార్ వేసుకుని ఉంది. పెళ్ళిలో లాగ లంగా వోణీ, నగలు లేకపోయినా సింపుల్ గా బాగుంది.  అయినా అబ్బయిలకి అమ్మాయిలు మొదటి సారి చూసినప్పుడు అందంగా కనిపిస్తే చాలు తరువాత దయ్యాల్లా ఉన్నా సర్దుకుపోతారు. అందుకే పెళ్ళి చూపుల్లో అమ్మాయిల్ని అంత అందంగా ముస్తాబు చేస్తారు.
గేటు దాటి బయటకి వచ్చేసారు వాళ్ళు. తను నన్ను ఇంకా గమనించలేదు. మల్లీశ్వరీ అని పిలుద్దామని గొంతు తెరిచాను. కాని నా గొంతు పెగలటం లేదు. పిలుపు గొంతులోనే ఆగిపోయింది. కాని నా పిలుపు తనకి వినపడింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. నన్ను చూడగానే తన మొహంలో ఆశ్చర్యం, కళ్ళల్లో ఆనందం, అడుగుల్లో భయం. ఇవన్ని నాకు కనపడుతున్నాయి. అన్నిటికన్నా తన కళ్ళల్లో ఆనందం నాకు బాగా తెలుస్తుంది. నన్ను చూడగానే తనకేమి చేయాలో అర్ధం కాలేదు. తన అడుగులు ముందుకి కదలడం లేదు, అలాగని ఆగిపోనూ లేదు, ఆగాలా వద్దా అన్న అయోమయంలో ఉన్నాయి తన అడుగులు. వాళ్ళ ఫ్రెండ్స్ కి నన్ను చూపించింది. వాళ్ళు నన్ను కింద నుండి పై దాకా స్కానింగ్ చేస్తున్నారు. ఇక ధైర్యం చేసి మల్లీశ్వరీ అని పిలిచాను. నా పిలుపు వినగానే తను ఆగిపోయింది.వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వుకుంటూ ముందుకి వెళ్ళిపోయారు. 'హాయ్ బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? అని అడిగాను, తను నవ్వింది. హాయ్ గుర్తున్నారు  పెళ్ళి లో చూసాను కదా.. మీరే కదా మాకు భోజనాల దగ్గర హెల్ప్ చేసింది అని ఇప్పుడిప్పుడే తెరలు తెరలుగా గుర్తొస్తున్నట్లు తెగ నటించేస్తుంది. అమ్మాయిలు ఏదీ నిజాయితీగా ఒప్పుకోరా అనిపించింది. హా అవును థ్యాంక్స్ గుర్తుపట్టినందుకు అన్నాను.
ఏంటి మా కాలేజి కి వచ్చారు. ఏమైనా పనా? అని అమాయకంగా అడిగింది. ఇంక ఈ ముసుగులో గుద్దులాటలు నాకు నచ్చలా, తెగేసి మాట్లాడేద్దాం అని 'అవును మల్లీశ్వరి అనే అమ్మాయి కోసం వచ్చాను. తనతో మాట్లాడాలి అని సూటిగా చెప్పాను. నాకోసం వచ్చారా? నాతో ఏం మాట్లాడాలి? సరే చెప్పండి  అని అడిగింది. తను అలా అడిగేంత వరకూ నేను అలోచించలేదు అసలేం మాట్లాడాలో..ఆ అమ్మాయి కనపడుతుందా లేదా అన్న అయోమయంలోనే ఉన్నాను కాని కనపడితే ఏం మాట్లాడాలి అన్న ఆలోచనే నాకు రాలేదు.
వెంటనే 'మీరు ఇలా కనపడి మాట్లాడమని వరమిస్తారని అసలు ఊహించలేదు. అందుకే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నాకు కొంచెం టైం కావాలి. మీరు బస్ ఎక్కి మీ స్టాపు లో దిగేలోపు ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటాను. ప్లీZ అని అన్నాను. తను నవ్వి సరే అని వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బస్ ఎక్కింది. నేను తన వెనకే బైక్ మీద వెళ్తున్నాను. మా అన్నయ్య ఏంట్రా మాట్లాడమన్నప్పుడు మాట్లాడకుండా మళ్ళీ వెనక ఈ చేజింగ్ లు ఎందుకు అన్నాడు. కాని నాకు నిజంగా అప్పుడు ఏం మాట్లాడాలో తెలియలేదు. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు దిగిపోయారు. తన స్టాప్ వచ్చేసరికి తను ఒక్కతే మిగిలింది. బస్ దిగగానే నేను తన పక్కన వెళ్ళి నిల్చున్నాను. తను చెప్పండి ఏం మాట్లాడాలి అంది. వాళ్ళ ఇళ్ళు దగ్గరలో ఉండడం వల్ల తను కొంచెం కంగారు పడుతుంది ఎవరైనా చూస్తారేమో అని. తన బాధ అర్ధం చేసుకుని 'ఇక్కడ మీకు అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా చూస్తే బాగోదులేండి. మీరు వెళ్ళిపోండి అన్నాను. నేను అలా అనేసరికి తన భయం పోయినట్లుంది. నేను వెంటనే ఒక పేపర్ మీద నా ఫోన్ నెంబర్ రాసి తనకిచ్చి మీకు మాట్లాడడం ఇష్టమైతే ఒకసారి నా నెంబర్ కి ఫోన్ చేయండి అని చెప్పి బైక్ ఎక్కి బయల్దేరబోయాను. తను వెళ్ళిపోతూ మీ పేరు చెప్తారా అని అడిగింది. అప్పటికి కాని నాకు వెలగలేదు తనకి ఇంతవరకు నా పేరు కూడా తెలియదని. తనకి నా పేరు చెప్పి ఇక ఇద్దరం అక్కడి నుండి బయల్దేరాము.
బైక్ మీద వస్తూ ఆలోచిస్తున్నాను 'మల్లీశ్వరి ఫోన్ చేస్తుందా? కచ్చితంగా చేస్తుంది. తనకి కూడా నేను నచ్చాను. నన్ను వాళ్ళ కాలేజ్ దగ్గర చూడగానే తన కళ్ళల్లో ఆనందమే చెప్పింది తనకి నేను నచ్చానని. నచ్చకపోతే నన్ను వాళ్ళ ఇంటి దాకా ఎందుకు రానిస్తుంది. పేరు కూడా తెలియకుండా ఫోన్ నెంబర్ ఇస్తే ఎందుకు తీసుకుంటుంది. తను కచ్చితంగా ఫోన్ చేస్తుంది.
తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. అనుకున్నట్లుగానే ఫోన్ వచ్చింది. అవతలి నుండి 'హలో అని ఒక తీయని స్వరం వినిపించింది. నేను క్షణం కూడా ఆలోచించకుండా మల్లీశ్వరీ అని పిలిచాను. 'హా అవును అని సమాదానం. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. చెప్పండి ఎందుకు ఫోన్ చేయమన్నారు. అసలెందుకు మా కాలేజి కి వచ్చారు. అని ప్రశ్నల బాణం సంధించింది. ఇక తప్పించుకునే అవకాశం లేదు కనుక ఏమో మిమ్మల్ని చూడగానే ఎందుకో మీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కాలేజి కి వచ్చేసాను అని చెప్పాను. నిన్ను ప్రేమిస్తున్నాను అని ధైర్యం చేసి చెప్పలేని వాళ్ళందరూ చెప్పే అబద్దాన్నే నేను కూడా చెప్పాను. నా అసలు ఉద్దేశం తనకి బాగా తెలుసు కాని తను బయట పడదు. తను బయటపడనంత వరకు నాకేమీ ఇబ్బంది లేదు. ఆ రోజు కనీశం రెండు గంటలు ఫోన్ మాట్లాడి ఉంటాం. ఆ రోజే కాదు అప్పటి నుండి రోజూ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాం. తన గురించి నేను, నా గురించి తను బాగా తెలుసుకుంటున్నాం. తనతో మాట్లాడడం మొదలుపెట్టాక మిగతా ప్రపంచాన్నే మర్చిపోయాను. ఫ్రెండ్స్, సినిమాలు, షికారులు ఇవన్నీ మర్చిపోయాను. తనతో వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ మాట్లాడడం, కుదరనప్పుడు తన గురించి కలలు కనడం ఇదే నా దిన చర్య. తను ఎప్పుడు కలుద్దామంటే అప్పుడు రెక్కలు కట్టుకు వాలి పోయేవాడిని. దాదాపు వాళ్ళ కాలేజి బస్ స్టాప్ లోనే కలిసే వాళ్ళం. అప్పుడప్పుడూ పక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళే వాళ్ళం.
ఇద్దరం బాగా దగ్గరయ్యాం. తను నాకు ఒక్కరోజు కూడ ఫోన్ చేయకుండా ఉండేది కాదు. కాని మాకు ఉన్న ఒకే ఒక చిక్కల్లా తన దగ్గర సెల్ ఫోన్ లేదు, ఫోన్ చేయాలంటే ఇంటికొచ్చాక తను చేయాల్సిందే.. మరీ అవసరమైతే కాయిన్ బాక్స్ నుండి చేసేది.ఎంత దగ్గర అయినా ఇంతవరకు మనసు విప్పి ప్రేమిస్తున్నాను అన్న నిజం నేను చెప్పలేదు, తను కూడా చెప్పలేదు, కాని ఇంక ఆగడం నా వల్ల కాలేదు. తను ఫోన్ చేసినప్పుడు నీకో మాట చెప్పాలి. కాని ఇప్పుడు కాదు నీ పరీక్షలు అయ్యాక చెప్తాను అన్నాను. తను ఆత్రంగా ఏంటో చెప్పు . పరీక్షలయ్యే వరకు ఎదురు చూడలేను నన్ను ఊరించకుండా త్వరగా చెప్పు అని సాధించింది. అయిన నేను ఒక తేదీ ఖరారు చేసుకుని అప్పుడే చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇంతలో తనకి పరీక్షలు వచ్చేసాయి. ఫోన్లు మాట్లాడడం తగ్గించాం. సరిగ్గా అదే సమయానికి వాళ్ళ ఇంట్లో ఫోన్ పని చేయడం మానేసింది. తను రోజు పరీక్ష అవ్వగానే వాళ్ళ కాలేజి దగ్గర ఉన్న కాయిన్ బాక్స్ నుండి ఫోన్ చేసేది.
అలా చూస్తుండగానే తన ఆఖరి పరీక్ష రోజు వచ్చేసింది.నేను తనకి నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకున్నది కూడా ఆ రోజే. కాని ఆ విషయం తనకి తెలియదు. ముందు రోజు ఫోన్ చేసినా కూడా తనకి నేనేం చెప్పలేదు.
ఇవాళ ఆ అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్తున్నాను. మల్లీశ్వరి కి కూడా నేనంటే ఇష్టమే కాబట్టి కాదనే ప్రసక్తే లేదు. ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను. ఒకే కులం కాబట్టి మాకు పెద్దగా అభ్యంతరాలు కూడా ఉండవు. పైగా చుట్టాల అమ్మాయి.అన్నీ కుదరాయి. ఇలా ఎవేవో ఊహల్లో తేలిపోతున్నాను. వాళ్ళ కాలేజి కి బయల్దేరాను. తోడుగా ఉంటాడని ధైర్యం కోసం మా స్నేహితుడిని కూడా వెంట తీసుకెళ్ళాను. ఇంకా పరీక్ష ముగిసే టైం అవ్వలేదు. ఏం చేయాలో తోచడం లేదు. ఇంతలో మా ఫ్రెండ్ ఇంటర్నెట్ లో కొంచెం పని ఉంది. నెట్ సెంటర్ కి వెళ్ళొద్దాం అన్నాడు. సరే అని ఇద్దరం దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కి వెళ్ళాం. అక్కడ అన్ని క్యాబిన్లు నిండిపోయాయి. లోపల చివర రెండు ఖాళీ అవుతాయి వెయిట్చేయండి అని ఆ షాప్ వాడు అన్నాడు. మేము వాడు చెప్పిన క్యాబిన్ దగ్గరకెళ్ళి నిల్చున్నాము. వాడు చెప్పిన రెండు క్యాబిన్ లలో రెండు జంటలు ఉన్నాయి. వాళ్ళని చూసి మా ఫ్రెండ్ మనం ఎప్పుడు వస్తాము రా ఇలా అమ్మాయిలతో నెట్ సెంటర్లకి అని నాతో అంటున్నాడు.

టైం అయిపోయింది వాళ్ళని పిలవండి అని నెట్ ఓనర్ పిలవమంటే పిలిచాము. డోర్ తీసుకుని ఒకడు బయటకొచాడు. వాడి వెనకే ఒక అమ్మాయి బయటకొచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే నాకు మొహంలో నెత్తుటి చుక్క లేదు. బయటకొచ్చింది ఎవరో కాదు మల్లీశ్వరి. నన్ను చూడగానే ఆ అమ్మాయికి కరెంట్ షాక్ కొట్టినంత పనయ్యింది. ఆ అమ్మాయి మొహం లో భయం విస్పష్టంగా కనపడుతుంది. ఇంతలో పక్క క్యాబిన్ లో నుండి వాళ్ళ స్నేహితురాలు ఇంకో అబ్బాయి బయటకి వచ్చారు. మల్లీశ్వరికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. కాని వెంటనే తేరుకుని 'హాయ్ ఏంటి ఇక్కడ? వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు? అని అడిగింది.
తను ఇంకా అంత ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు పిచ్చ కోపం వచ్చింది. ఆపుకున్నాను. నీతో ఒక మాట చెప్పాలి అన్నాను కదా. అది చెప్పటానికి వచ్చాను అని అన్నాను. అవునా చెప్పు అని మొహం లో రాని నవ్వుని పులుముకుని అడిగింది. నీతో ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కాని ఇంక ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదులే. నీకు లవర్ ఉన్నట్లున్నాడు కదా అన్నాను.
తను వెంటనే 'నీకు తను నా లవర్ అని చెప్పానా? అయినా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కూర్చుంటే లవర్సేనా? ఇంతేనా నువ్వు నన్ను అర్ధం చేసుకుంది. చ్చీ  నువ్వు ఇంత నార్రో మైండెడ్ అనుకోలేదు. తను మా క్లాస్ మేట్. తనకి ఈ-మైల్ ఐడీ లేకపోతే కొత్తది క్రియేట్ చేయడానికి వచ్చాను. అంత మాత్రానికే ఎదేదో ఊహించేసుకుంటావా. చా నిన్ను ప్రేమించి తప్పు చేసాను. నేను కూడా నీకు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కాని నువ్వు అనర్హుడివి అని ఏడ్చేసింది.
ఏడుపు ఆడవాళ్ళ దగ్గర ఉన్న భయంకరమైన ఆయుధం. దాని ముందు ఎంతటి మగాడు కూడా గెలవలేడు. తను అలా ఏడుస్తుంటే తప్పంతా నాదేనేమో అని నాకే అనిపిస్తుంది. ప్లీజ్ ఏడవకు.. నేను కావాలని అలా మాట్లాడలేదు సారీ అని చెప్పాను. అసలు నేనెందుకు సారీ చెప్తున్నానో నాకే అర్ధం కాలేదు. రేపు మాట్లాడదాం అని అక్కడి నుండి వచ్చేసాను. జరిగినదంతా గమనించిన నా ఫ్రెండ్ 'ఏరా ఈ అమ్మాయినా నువ్వు ప్రేమించింది. అని అడిగేసరికి నాకు అవమానంగా అనిపించింది.
తను చెప్పిందే నిజమా?  నేను నిజంగా నారో మైండెడ్ ఆ? నిజంగా ఈ-మయిల్ క్రియేట్ చేయడానికే వస్తే తన ఫ్రెండ్ ఒక అబ్బాయితో, ఈ అమ్మాయి ఒక అబ్బాయితో ఎందుకు విడి విడిగా కూర్చోవడం. తను తప్పు చేయనప్పుడు నన్ను చూడగానే ఎందుకు అంత భయపడింది. అయినా రోజూ పరీక్ష అవగానే నాకు ఫోన్ చేసే అమ్మాయి ఇవాళ ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అడుగుదామంటే నన్ను నారో మైండెడ్ అంటుంది. అసలు బ్రాడ్ మైండ్ అంటే ఎంటి ? మనం ప్రేమించిన అమ్మాయి పరాయి మగాడితో నెట్ సెంటర్ లోనో, పార్కుల్లోనో లేదంటే తన బెడ్ రూం లోనో కనపడితే ఫ్రెండ్ షిప్ అనుకోవడమే బ్రాడ్ మైండెడ్ ఆ?
అంత విశాల మనస్తత్వం నాకు లేదు. అయినా తను చెప్పిందే నిజమనుకుని సర్దుకు పోయి పెళ్ళి చేసుకున్నా తను రేపు ఎవరితో మాట్లాడినా నేను తనని అనుమానంగానే చూస్తానేమో. అసలు నిజంగా నాది ప్రేమే అయితే తన మీద నాకు అనుమానం ఎందుకొస్తుంది. నాది నిజంగా ప్రేమ కాదేమో? ప్రేమున్న చోట అనుమానం ఉండదు అనుమానం ఉన్న చోట ప్రేమ నిలబడదు.
నేను కులం కలిసింది ఇష్టాలు కలిసాయి, బంధుత్వాలు కలిసాయి అని ఆలోచించాను కాని మా మనస్తత్వాలు కలిసాయో లేదో ఆలోచించలేదు. ఈ సంఘటన తో అర్ధమయ్యింది మా మనస్తత్వాలు ఏంటో? తను చెప్పినట్లే నాది నారో మైండెడ్. తను చాలా బ్రాడ్ మైండెడ్. తనకి నాకు సరిపోదు అని అర్ధమయ్యింది.
అప్పటి నుండి నేను తన ఫోన్ కోసం ఎదురు చూడలేదు. తన నుండి నాకు కూడా ఫోన్ రాలేదు.
రెండేళ్ళు గడిచిపోయాయి. మా అన్న ఫోన్ చేసాడు. 'అరేయ్ మల్లీశ్వరి పెళ్ళి అంట. వాళ్ళ నాన్న ఇప్పుడే కార్డ్ ఇచ్చి వెళ్ళాడు. అని చెప్పాడు. పెళ్ళికి నేను కూడా వస్తాను అన్నాను. వద్దులేరా అన్నాడు. లేదు వస్తాను అని వాడితో బయల్దేరాను. పెళ్ళి కూతురి గెటప్ లో మల్లీశ్వరి చాల బాగుంది. పెళ్ళి కొడుకు ఎవరా అని చూసాను. తనతో నెట్ సెంటర్లో కనిపించిన వాడైతే బాగుండు అనుకున్నాను. కాని నా ఆశ నెరవేరలేదు. పెళ్ళి కొడుకు నేను కాదు, ఆ నెట్ సెంటర్ వాడు కాదు వేరే ఎవడో బ్రాడ్ మైండెడ్ మనిషి అనుకుంట. వాడిని చూడగానే నవ్వొచ్చింది.