Friday, March 15, 2013

యాక్సిడెంట్

ఆఫీస్ కి ఇంకా 5 నిమిషాలే ఉంది. ఈ లోపు వెళ్ళకపోతే లేట్ రిపోర్టింగ్ పడుతుంది. అసలే ఈ నెలలో చాలా లేట్ రిపోర్టింగ్ లు ఉన్నాయి. అని మనసులో అనుకుంటూ బైక్ వేగం పెంచాను. నా ముందు వెళ్తున్న లారి ని దాటి ముందుకి వెళ్తుండగా ఎక్కడి నుండి దూరాడో ఒక ఆటో వాడు అడ్డంగా పెట్టాడు ఆటో ని.  అరవై స్పీడ్ లో ఉన్నాను. పక్కకి జరగడానికి  లారీ ఉంది. ఎదురుగా ఆటో. ఏం చేయాలో తెలియక సడెన్ గా బ్రేక్ వేసాను. వెనక వస్తున్న కార్ ని గమనించలేదు. చచ్చాను రా దేవుడా అనుకున్నా. పాపం ఆ కార్ వాడు ప్రమాదాన్ని ఊహించి బ్రేకు వేసాడు. కిర్ర్ర్ర్ మని పెద్ద శబ్ధం. కార్ సర్రున జారుకుంటూ వచ్చి నా బైక్ కి రెండు సెంటీ మీటర్ల దూరం లో ఆగింది. గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ కార్ వాడు అడ్డమైన బూతులు తిట్టాడు. తప్పు నాది కాదు ఆటో వాడిది అని చెప్పే అవకాశం లేకుండా వాడు వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఇంకా నేను మింగడానికి భూమ్మీద నూకలు చాలా ఉన్నాయేమో అని భగవంతుడికి మనసులోనే దణ్ణం పెట్టుకుని బైక్ ని నడిపిస్తున్నాను కొంచెం వేగం తగ్గించి. అలా కొంచెం ముందు కి వెళ్ళగానే రోడ్ కి అవతలి పక్క నేను చూస్తుండగానే ఒక లారీ ముందు వెళ్తున్న బైక్ కి ఢీ కొట్టింది. అంతే బైక్ మీద వెనక కూర్చున్న వ్యక్తి ఎగిరి ఒక అయిదు అడుగుల దూరం లో పడ్డాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి బైక్ తో పాటు కింద పడ్డాడు. అతని కాలు బైక్ వెనక చక్రం లో ఇరుక్కున్నట్లుంది. రెండు క్షణాల్లో జనమంతా గుమి గూడిపోయారు. నేను రోడ్ కి ఇవతలి వైపే ఉన్నాను. ఆంబులెన్స్ కి ఫోన్ చేయండి అని ఎవరో గట్టిగా అరుస్తున్నారు. నేను బైక్ ఆపి అటు వెళ్దామనుకున్నాను. కాని ఎందుకో నాకు ధైర్యం సరిపోవట్లేదు. నాతో పాటు రోడ్ కి ఇవతలి వైపు ప్రయాణిస్తున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ వాహనాలని స్లో చేసి చూసుకుంటూ వెళ్తున్నారు కాని ఎవరూ ఆఫడం లేదు. నాకు కూడా అక్కడ ఉండ బుద్ది కాలేదు. వెంటనే అక్కడి నుండి బైక్ కూడా దిగి చూడకుండా వచ్చేసాను. ఆఫీస్ కి సరైన టైం కే చేరుకున్నాను. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని కంప్యూటర్ ఆన్ చేసి కూర్చున్నాను. కాని ఎందుకో నా మనసంతా అదోలా ఉంది. ఏదో తెలియని బాధ. వర్క్ చేస్తున్న కూడా ఏదో ధ్యాస. నా మనసంతా ఆ యాక్సిడెంట్ చుట్టూనే తిరిగుతుంది. పని మీద ధ్యాస ఉండట్లేదు.
నేనేదో ఆ యాక్సిడెంట్ చేసినంత గిల్టీ గా ఉంది నాకు.
అసలు నేనెందుకు ఆగకుండా వచ్చేసా? ఆఫీస్ టైం ఐపోతుందనా? లేదా ఆ యాక్సిడెంట్ ని చూసి భయమేసిందా? నాకెందుకులే అని నిర్లక్ష్యమా? నాకు అసలు జాలీ, దయా అలాంటివేమీ లేవా? ఇలా ఎవేవో ప్రశ్నలు నన్ను హింసిస్తున్నాయి. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఇంటికి బయల్దేరాను. సరిగ్గా యాక్సిడెంట్ జరిగిన రోడ్ లొనే ప్రయాణిస్తున్నాను. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నాను. అక్కడ యాక్సిడెంట్ చేసిన లారీ లేదు. యాక్సిడెంట్ కి గురైన బైకూ లేదు. రక్తపు మరకలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయి.ఆ ప్రదేశం లో రోడ్ మొత్తం రక్తం తో తడిసిపోయింది. ఆ రక్తాన్ని చూడగానే నాకు ముచ్చెమటలు పోసాయి. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇంటికెళ్ళగానే స్నానం చేసి అమ్మ ని అన్నం పెట్టమన్నాను. అన్నం కలిపి నోట్లో పెట్టుకుంటుంటే నాకు రోడ్ మీడ ఉన్న రక్తం నా ప్లేట్ లో కనపడుతుంది. నేను తినే ముద్ద ఎర్రగా రక్తంలో తడిచిపోయినట్లుంది. నేను అన్నం తినలేకపోయాను. చేయి కడిగేసాను. అమ్మ ఏమైందిరా చేయి కడిగేసావేంటి అని అడిగింది. ఆకలి వేయట్లేదు అని చెప్పి టి వి చూస్తూ కూర్చున్నాను. అమ్మ అరెయ్ చిన్నోడు నిన్న రాత్రి అనగా వాళ్ళ ఫ్రెండ్ రూం కి వెళ్తున్నా పొద్దున్నే వస్తా అని వెళ్ళాడు ఇంత వరకు రాలేదు. ఫోన్ చేస్తే ఆఫ్ చేసి ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కో నాకెందుకో కంగారు గా ఉంది అని చెప్పింది. ఆ మాట వినగానే నాలో ఎందుకో చిన్నగా కంగారు మొదలయ్యింది. మా తమ్ముడి నెంబర్ కి ఫోన్ చేసాను. ఆఫ్ చేసి ఉంది. కంగారు కాస్తా చిన్నగా భయంగా తయారయ్యింది. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసాను. మాకు తెలియదన్నయ్యా మా దగ్గరకి రాలేదు అని అందరి దగ్గర నుండీ ఒకటే సమాధానం. నాకు ఏం చేయాలో అర్ధం కావట్లేదు. ఒక్కసారిగా నా మెదడులో ఆ యాక్సిడెంట్ సన్నివేశం గుర్తొచ్చింది. వెన్నులో వణుకు పుట్టింది. మా వాడికి ఏమైనా... చా అలాంటిదేమి జరిగి ఉండదు అని నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను. కాని పదే పదే అదే అనుమానం నా బుర్ర ని తొలిచేస్తుంది. అసలు పొద్దున్న ఆ యాక్సిడెంట్ జరిగింది ఎవరికి? ఇంక క్షణం కూడా అలోచించకుండా వెంటనే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ పక్కన ఉన్న కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తిని వాకబు చేసాను. ఎవరో తెలియదయ్యా..ఇద్దరు కుర్రాళ్ళు... ఒకతనికి తలకి దెబ్బ తగిలింది. ఇంకో అతనికి కాలు విరిగినట్లుంది. గవర్నమెంట్ ఆసుపత్రి కి తీసుకెళ్ళినట్లున్నారు. మరి ఉన్నారో పోయారో? అన్నాడు. అక్కడి నుండి వెంటనే గవర్నమెంట్  హాస్పిటల్ కి చేరుకున్నాను. 
హాస్పిటల్ లో అడుగుపెడుతుంటే నా మనసులో ఏదో తెలియని ఆందోళన. అసలు నేను అక్కడికి ఎందుకొచ్చానో  కూడా నాకు అర్ధం కావట్లేదు. ఎవరిని ఏమని అడగాలో కూడా తెలియడం లేదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగుతున్నాయి. మా వాడు కాకూడదు అని మనసులో ఎంత మంది దేవుళ్ళని తలుచుకున్నానో నాకే తెలియదు.
ఇంతలో నా ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది. అప్రయత్నం గానే చూశాను. నేను ఇంటికొచ్చేసాను. నువ్వు ఎక్కడికెళ్ళావ్. త్వరగా ఇంటికి రా.. అని మా తమ్ముడి ఫోన్ నుండి మెసేజ్. ఆ మెసేజ్ చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయ్యింది. కళ్ళలో ఆనందం. గుండెల్లో ఉన్న బరువంతా దిగిపోయింది. వెంటనే ఇంటికి వెళ్దామని వెనక్కి తిరిగాను. కాని ఆ యాక్సిడెంట్ అయిన కుర్రోళ్ళు గుర్తొచ్చారు. పక్కన ఉన్న వార్డ్ బాయి ని పొద్దున్న జరిగిన యాక్సిడెంట్ తాలుకు వాళ్ళు ఎక్కడున్నారని అడిగాను. ఐ.సీ.యూ లో ఉన్నారని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్ళి చూశాను. చాలా మంది జనం ఉన్నారు బయట. ఒకతన్ని పిలిచి అడిగాను ఎలా ఉంది వాళ్ళకి అని. ఒకతనికి తలకి బాగ దెబ్బ తగిలింది. ఇప్పుడే ఆపరేషన్ చేసారు, ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. ఇంకో అతనికి కాలు విరిగింది. లోపల రాడ్ వేసారు అని చెప్పాడు. మీరు అతనికి ఏమి అవుతారు అని అడిగాను నాకు సమాధానం చెప్పిన వ్యక్తి ని. ఆ యాక్సిడెంట్ నా వల్లే జరిగింది. నా లారీ కిందే పడ్డారు వాళ్ళు, వెంటనే ఆంబులెస్ లో హాస్పిటల్ కి తీసుకొచ్చాను. వాళ్ళ తల్లి తండ్రులు దేవుళ్ళు. వాళ్ళ బిడ్డలకి నా వల్లే ఈ పరిస్తితి వచ్చినా నన్ను ఒక్క మాట అనలేదు. పైగా సమయానికి హాస్పిటల్ కి తీసుకు వచ్చా అని నాకు కృతజ్ఞతలు చెప్తున్నారు అని వాళ్ళ వంక ఆరాధనా పూర్వకం గా చూస్తున్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. యాక్సిడెంట్ చేసిన వాడు పారిపోకుండా ఇక్కడేం చేస్తున్నాడు.
ఆ కుర్రోళ్ళ అమ్మా నాన్నా ఎంత మంచి వాళ్ళు? తమ బిడ్డలకి ఈ దుస్తితికి కారణమైన వాడిని కూడా క్షమించేసే అంత మంచి వాళ్ళా అనిపించింది. ఆ సమయంలో నా మీద నాకే అసహ్యమేసింది.
నా తమ్ముడికి ఏమైనా అయ్యిందా అన్న చిన్న అనుమానం వస్తేనే నేను ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చేసాను.అదే నా కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగి ఒకడు ప్రణాపాయం లో ఉన్నాడు అంటే కనీసం ఆగి వాళ్ళ దగ్గరకి వెళ్ళాలన్న ఇంగిత జ్ఞానము కూడా నాకు లేదా? నేను ఇంత స్వార్ధపరుడినా?  నా ప్రాణాలు, నా వాళ్ళ ప్రాణాలు అంటేనే విలువ ఇస్తున్నానా? పక్కనోడి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే స్థితిలో నేను లేనా? నేను మనిషినేనా? అనిపించింది. అక్కడ అందరూ నాకు మంచి వాళ్ళే కనపడుతున్నారు. యాక్సిడెంట్ చేసి తన దారిన తాను పోకుండా ఇంకా ఇక్కడే ఉన్న ఆ డ్రైవర్, ఆ డ్రైవర్ ని క్షమించగలిగే గొప్ప మనసున్న ఆ తల్లితండ్రులూ.. అందరూ మంచి వాళ్ళే. అక్కడ నాకు కనిపిస్తున్న ఒకే ఒక చెడ్డ వాడు నేనే..

No comments:

Post a Comment