Tuesday, October 22, 2013

అనామిక@జీమెయిల్.కాం

చాలా రోజులైంది జీమెయిల్ ఓపెన్ చేసి మెయిల్స్ చూసుకుని. ఆ..! అయినా నా మొహానికి అంత ముఖ్యమయిన మెయిల్స్ 
ఏమొస్తాయిలే. బజాజ్ ఫైనాన్స్ వాడు లోన్ తీసుకోమనో, ICICI వాడు ఇన్సూరెన్స్ తీసుకోమనో లేదంటే EBAY వాడు 
కూపన్ పంపిస్తున్నాం ఏదో ఒకటి కొని తగలడమనో వచ్చి ఉంటాయి అంత కన్నా ఏముంటాయిలే? నాకేమయినా గాల్ ఫ్రెండ్స్ 
గట్రా ఉన్నారా రోజుకొక గుడ్ మార్నింగ్ మెయిల్ పెట్టడానికి. అప్పుడెప్పుడో ఇంజినీరింగ్ లో దేనికో ఈమెయిల్ అడ్డ్రెస్ 
కావాలి అంటే కొత్తది క్రియేట్ చేసుకున్నా. క్రియేట్ చేసుకున్నందుకు గూగుల్ వాడు పంపిన మెయిల్ తప్పితే మల్లీ 
ఒక్క మెయిల్ కూడా రాలేదు. నా మెయిల్ ఐడి మా ఫ్రెండ్స్ కి ఇచ్చి మెయిల్ పంపమన్నా ఒక్కడు కూడా పంపే వాడు 
కాదు. ఒక్క మెయిల్ అయినా రాకపోదా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే వాడిని. ఆ కాయలు పండ్లై రాలిపోయేవి 
కాని మెయిల్స్ మాత్రం వచ్చేవి కావు. ఒక రోజు అకస్మాత్తుగా నా జీమెయిల్ కి ఒక మెయిల్ వచ్చింది. నా కోరిక 
నెరవేరింది అని ఆనందం తో ఉబ్బి తబ్బిబ్బైపోయి మెయిల్ ఓపెన్ చేసా. కంగ్రాచ్యులేషన్స్..! You are the 
luckiest winner ( మీరు అదృష్టం వరించిన విజేతలు) మీరు గెలుచుకున్నారు అక్షరాలా యాభై లక్షల 
పౌండ్లు అని ఉంది. అది చదువుతుంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఇది కలా నిజమా అని గిల్లి చూసాను. 
నా పక్కనే ఉన్న బక్కోడు గట్టిగా కేక పెట్టాడు. నేను గిల్లింది వాడి తొడనే. వాడు అరిచాడంటే ఇది నిజం. అహా 
ఒక్క బాల్ కే సెంచరీ కొట్టేసినంత ఆనందం. 50 లక్షల పౌండ్లని మన దేశ కరెన్సీ లో లెక్కలు కట్టేసి గాల్లో 
మల్టీప్లక్సులు కట్టేస్తున్నా ఒక్క దెబ్బతో కోటీశ్వరుడ్ని అయిపోయా అనుకుంటూ.
వెంటనే నా యాభై లక్షల పౌండ్లని నాకు అర్జెంట్ గా పంపించేయండి అని మా ఇంటి డోర్ నెంబర్ తో సహా అడ్రస్ 
మొత్తం మెయిల్ పెట్టాను. తెల్లారి మల్లీ మెయిల్ తెరిచి చూస్తే 'తప్ప కుండా మీ డబ్బులు మీకు పంపిస్తాం. 
కాకపోతే మొదట మీరు ఈ క్రింద ఉన్న ఎకౌంట్ లో ఒక పాతిక వేలు సెక్యూరిటీ డిపాసిట్ కోసం కట్టండి. రెండు 
రోజుల్లో మీ డబ్బులు మొత్తం మూటలు కట్టి మీ ఇంటికి పంపిస్తాం' అని ఒక ఎకౌంట్ నెంబర్ పంపాడు. పాతిక 
వేలా? ఎలా ఇస్తాం అయినా నాకు రావాల్సిన యాభై లక్షల పౌండ్లలో ఒక పాతిక వేలు తీసుకుని మిగతావి పంపిచొచ్చుగా 
అని ఆలోచిస్తుండగా మా బక్కోడు పరిగెత్తుకుంటూ వచ్చి అరేయ్ నీకో రహస్యం చెప్తాను ఎవరికీ చెప్పకు. నాకు 
లాటరీలో యాభై లక్షల పౌండ్లు వచ్చాయి రా. ఇప్పుడే మెయిల్ వచ్చింది. నాకేం చేయాలో అర్ధం కావట్ల అన్ని 
డబ్బులు. నీకు ఒక 100 పౌండ్లు ఇస్తాలేరా అన్నాడు దాన కర్ణుడిలా. అంతే నాకు దిమ్మ తిరిగి బొమ్మ మొత్తం 
చాలా స్పష్టం గా కనిపించేసింది. నా మల్టీ ప్లక్సులు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. ఒక అయిదు నిమిషాల 
తరువాత తేరుకుని వాడికి కూడా బొమ్మ చూపించేసాను.
అలా నా మొదటి మెయిల్ తోనే కోటీశ్వరుడిని అవబోయి కొద్దిలో మిస్స్ అయ్యిపోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క 
మెయిల్ కూడా రాలేదు. అయినా మెయిల్ తెరిచి ఒకసారి చెక్ చేసుకోడం మాత్రం అలవాటు అయిపోయింది. అందుకే ఇవాళ 
కూడా తెరిచి చూసా. తెరవగానే ఒక అద్భుతం జరిగింది. 'హాయ్ ఫ్రెండ్' అని ఒక మెయిల్ కనపడింది. పంపింది 
ఎవరా అని చూస్తే ఇంకో అద్భుతం. ఒక అమ్మాయి పేరు ఉంది. నేను నా మెయిల్ ఓపెన్ చేయబోయి పొరపాటున వేరే 
వాళ్ళ మెయిల్ ఓపెన్ చేసేసానా అని కొంచెం సేపు అనుమానమొచ్చింది. నాకు నా మెయిల్ ఓపెన్ చేయడమే సరిగ్గా రాదు ఇంక 
వేరే వాళ్ళ మెయిల్స్ ఓపెన్ చేసే అంత ప్రతిభా పాటవాలు లేవని గుర్తొచ్చింది. వెంటనే ఆలస్యం చేయకుండా. 'హాయ్ 
ఫ్రెండ్.. మీరెవరో తెలుసుకోవచ్చా అని మెయిల్ పెట్టాను. ఎంతకీ రిప్లై రాకపోయేసరికి కంప్యూటర్ ఆఫ్ చేసి 
పడుకున్నాను.
తెల్లారి లేచి పళ్ళు కూడా తోముకోకుండా కంప్యూటర్ దగ్గరకి వెళ్ళాను. కంప్యూటర్ ఆన్ చేసే ఉంది. రాత్రి 
సరిగ్గా ఆఫ్ చేయలేదనుకుంటా అనుకుని మెయిల్ ఓపెన్ చేసా.
తన దగ్గర నుండి రిప్లై వచ్చింది. నా పేరు కల్పన. మాది ఖమ్మం అని అడగకుండానే తన పూర్తి వివరాలు 
చెప్పేసింది. నా పేరు, మా వూరు ఎక్కడని అడిగింది. ఇదంతా ఒక్క మెయిల్ లోనే అడిగేసింది. నేను నా వివరాలు 
చెప్పి తను ఆన్ లైన్ కి ఎప్పుడొస్తదో చెప్పమని, ఆన్ లైన్ లో ఉంటే వివరం గా మాట్లాడుకోవచ్చు అని అడిగాను. 
తను తర్వాతి మెయిల్ లో నువ్వు ఆన్ లైన్ లో ఉన్నప్పుడు నాకు కుదరదు. నాకు కుదిరినప్పుడు నువ్వు 
ఉండవులే. పర్లేదు మెయిల్ లోనే మాట్లాడుకుందాం అని చెప్పింది. అలా పరిచయం స్నేహం మొత్తం మెయిల్స్ లోనే 
జరిగిపోయాయి. తను ఎప్పుడయినా ఆన్ లైన్ కి వస్తదేమో అని ఆశగా ఎదురు చూసే వాడిని కాని తను వచ్చేది కాదు. 
ఒక రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూం కి వెళ్ళి వాడి లాప్ టాప్ లో నా మెయిల్ ఓపెన్ చేసాను. ఆశ్చర్యం తను ఆన్ 
లైన్ లో ఉంది. వెంటనే క్షణం కూడా ఆగకుండా తనకి హాయి అని పంపాను. వెంటనే రిప్లై వచ్చింది. ఎక్కడున్నావ్ 
అని అడిగింది. మా ఫ్రెండ్ రూం లో ఉన్నా. ఏ ఎందుకు అలా అడిగావ్ అని పంపాను. నువ్వు ఇంట్లో ఉంటే 
నేను ఆన్ లైన్ లో ఉండను కదా అని పంపింది. నాకేం అర్ధం కాలేదు. తర్వాత చాలా సేపు ఏదో పిచ్చా పాటి 
మాట్లాడుకున్నాం. ఆ సమయం లో తను నువ్వు ఒకసారి మా ఊరు రావొచ్చు కదా కలుద్దాం అంది. నిజానికి నేనే 
తనని అడుగుదామనుకున్నా కాని తనే అడిగేసరికి ఆనందమేసింది. తప్పకుండా వస్తా అని మాట ఇచ్చా. తర్వాత 
యధావిధిగా మెయిల్స్ పంపించుకుంటూనే ఉన్నాము.
కాని ఒకసారి తను అకస్మాత్తుగా మెయిల్స్ పంపించడం ఆపేసింది. నేను ఎన్ని మెయిల్స్ పెట్టినా రిప్లై వచ్చేది కాదు. 
అలా వారం రోజులు గడిచిపోయాయి. తనకేమైంది ఎందుకు రిప్లై ఇవ్వట్లా. ఏమైనా ప్రాబ్లం ఆ. పోనీ ఒకసారి నేరుగా 
తనని కలిస్తే? అవును ఎలాగో తను కలుద్దాం అంది కదా. ఒకసారి తనని కలిసినట్లు కూడా ఉంటది. ఇలా 
ఆలోచన రావడమే ఆలశ్యం వెంటనే ఖమ్మం బయల్దేరాను. తను చెప్పిన అడ్రెస్ ప్రకారం వాళ్ళ ఇంటి దగ్గరకి 
వెళ్ళాను. వాళ్ళ నాన్న గారి పేరు అడిగి అదే ఇల్లు అని తెలుసుకున్నాను. తను బయటకి వస్తుందేమో అని చాలా 
సేపు ఎదురు చూసాను. ఎంతకీ రాకపోవడం తో ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను. కొంత 
సేపటికి వాళ్ళ నాన్న గారు వచ్చి తలుపు తీసారు. ఆయన పేరు అడిగి ఆయనే కల్పన వాళ్ళ నాన్న గారు అని 
ధృవీకరించుకుని 'నమస్తే అంకుల్, నేను కల్పన వాళ్ళ ఫ్రెండ్ ని అని నా పేరు చెప్పాను. కల్పన ఫ్రెండా ? 
కల్పన కి అబ్బాయిలు ఎవరూ ఫ్రెండ్స్ లేరే అని నా వంక అనుమానం గా చూసారు. లేదు అంకుల్ నేను తనకి 
ఆన్ లైన్ ఫ్రెండ్ ని. ఇదే మొదటిసారి తనని కలవడానికి రావడం. మాది విజయవాడ అని చెప్పాను. కల్పనని కలవడానికి 
వచ్చావా అని ఆశ్చర్యపోయారు. లోపలికి రమ్మన్నారు. అసలు నీకు కల్పన ఎలా తెలుసు? ఎప్పటి నుండి పరిచయం 
అని అడిగారు. తను నాకు ఒక నెల క్రితం నుండే పరిచయం అని. ఆన్ లైన్ లో ఫ్రెండ్స్ అయ్యాం అని చెప్పాను. 
నువ్వు మాట్లాడింది మా కల్పన తో కాదనుకుంట. నీకు ఏ ఈమెయిల్ ఐ డి నుండి మెయిల్స్ వచాయి అసలు అని 
అడిగారు. కల్పన జీమెయిల్ ఐ డి చెప్పాను ఆయనకి. ఆయన నిర్ఘాంతపోయారు. అవును అది మా కల్పనదే. కాని తను 
ఎలా పంపుతుంది. కల్పన చనిపోయి ఆరు నెలలు అయ్యింది. నెల క్రితం తన మెయిల్ ఐడి నుండి నీకు మెయిల్స్ 
ఎలా వస్తున్నాయి అన్నారు. అంతే నా కాళ్ళ కింద భూమి కంపించినట్లనిపించింది ఆయన చెప్పింది విని. ఆశ్చర్యం 
తో నాకు నోట మాట రాలేదు. ఆయన చెప్పేది ఇంకా నమ్మ బుద్ది కావట్లేదు. రెండు నిమిషాల తరువాత తేరుకుని 
ఏంటి అంకుల్ మీరు చెప్పేది కల్పన చనిపోయిందా ఎలా చనిపోయింది. ఎప్పుడు చనిపోయింది అని అడిగాను. ఆరు 
నెలల క్రితం కాలేజ్ వాళ్ళతో టూర్ కి వెళ్ళింది. ఆ టూర్ లో ఫ్రెండ్స్ తో బోటింగ్ కి వెళ్ళినప్పుడు 
ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయింది అని చెప్పారు. అవునా ఆరు నెలల క్రితమే చనిపోతే మరి తన మెయిల్ నుండి 
ఎవరు నాతో మాట్లాడుతుంది. తన మెయిల్ ఎవరైనా హ్యాక్ చేసారా..? తన మెయిల్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది 
అని అడిగాను. ఎందుకైనా మంచిది మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పాను. ఇద్దరం అక్కడి నుండి పోలీస్ 
స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసారు. ఏమైనా అవసరమైతే ఫోన్ చేస్తామని నా 
ఫోన్ నెంబర్ తీసుకున్నారు.
నేను తన గురించే ఆలోచిస్తూ తిరిగి ఇంటికి బయల్దేరాను. కల్పన వాళ్ళ ఇంటిలో వాళ్ళ నాన్న గారు తన ఫోటోలు 
చూపించారు. ఎంత అందం గా ఉంది తను. అంత అందమైన అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి దేవుడికి మనసెలా 
వచ్చింది. అసలు నాతో మాట్లాడుతుంది ఎవరు. తన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. 
అయినా నాతో ఎందుకు మాట్లాడుతున్నారు ? తనకి నాకు అసలు సంభందం ఏంటి? ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను 
తనని కలిసిన దగ్గర నుండి. మళ్ళీ ఏమైనా మెయిల్స్ వస్తాయేమో అని ఎదురు చూసాను. కాని ఒక్క మెయిల్ కూడా 
రాలేదు. రెండు రోజుల తర్వాత నేను ఇంట్లో ఉండగా కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్ళి తలుపు తీసాను. 
ఆశ్చర్యం కల్పన వాళ్ళ నాన్న గారు ఇద్దరు పోలీసులతో వచ్చారు. నన్ను చూడగానే ఆశ్చర్యం తో ఆయన 
నువ్వా? అని నివ్వెరపోయారు.నేను అంతే ఆశ్చర్యం తో 'ఏంటి అంకుల్ ఏమయ్యింది? మా ఇంటికి వచ్చారేంటి? 
అసలు మా ఇంటి అడ్రెస్ మీకు ఎలా తెలిసింది? నాకు ఫోన్ చేస్తే నెనే దగ్గరుండి తీసుకొచ్చే వాడిని కదా అన్నాను. 
మా ఇంట్లో వాళ్ళకి ఏం అర్ధం కాక అయోమయంగా చూస్తున్నారు. ఆయనతో వచ్చిన పోలీస్ 'వీళ్ళ అమ్మాయి చనిపోయి 
ఆరునెలలు అయినా తన మెయిల్ ఎవరో హ్యాక్ చేసి ఒకతనికి మెయిల్స్ పంపుతున్నారని కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి 
మెయిల్ ఓపెన్ చేసిన ఐపి అడ్రస్ కనుక్కున్నాం. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ఐపి వాడుతున్న అడ్రస్ కి వచ్చాం. 
అంటే మీ ఇంటికి వచ్చామన్న మాట. ఇప్పుడు అర్ధమయ్యిందా మొత్తం. ఆ అమ్మాయి మెయిల్ ఎందుకు హ్యాక్ చేసావురా? 
అసలు ఆ అమ్మాయికి నీకు సంభందం ఏంటి ?' అని గదమాయించాడు ఆ పోలీస్. వెంటనే నేను 'అయ్యో ఆ అమ్మాయి 
మెయిల్ నుండి మెయిల్స్ వస్తున్నాయని కంప్లైంట్ ఇచ్చింది నేనే కావాలంటే అంకుల్ ని అడగండి అని ఆయన వంక 
చూసాను. ఆయన అయోమయం గానే అవునని చెప్పారు. ఆ పోలీస్ కి మతిపోయింది. అదేంటి? నువ్వే హ్యాక్ చేసి నీకే 
మెయిల్స్ పంపించుకుని మళ్ళీ నువ్వే ఎందుకు కంప్లైంట్ ఇచ్చావ్ అన్నాడు.
 [[[మిగతాది రెండవ భాగంలో... PART - II  ని క్లిక్ చేయండి]]] 
                                     
   

6 comments:

  1. కథ బాగుందండి.. రెండవ బాగం ఎప్పుడు ?

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సంతోష్ గారు..! రెండో భాగం త్వరలోనే పోస్ట్ చేస్తా..

      Delete
  2. babu bujji ila sagam sagam chepthe kastam nayana. Nakasale telugu chadavadam radu chadavaka chadavaka edo first time chadivithe malli rendo bhagam antunav. Asaly nenu firstee migathadi rendo bhagam anna padhalu chusunte bagundu.... hum anyone nice story. Keep it up and all the best.

    ReplyDelete
    Replies
    1. మొదట కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు రవి వర్మ గారు..! మీలా కొత్తగా చదివే వాళ్ళు మరీ పెద్దగా ఉంటే బోర్ ఫీలయ్యి చదవలేరేమోనని కథ ని రెండు భాగాలుగా పోస్ట్ చేయాలనుకున్నాను. తెలుగు చదవడం రాకపోయినా కష్టపడి చదివి మెచ్చుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు..!

      Delete
  3. Good Story Chari when is the second half?

    ReplyDelete
  4. Font size penchandi. and line ki line ki madhyalo koddia gap vachhelaa chudandi. chaduvadaaniki chaala ibbandhigaa undhi.

    ReplyDelete