Monday, August 26, 2013

కథ..స్క్రీన్ ప్లే..డైరక్షన్...షేర్ ఖాన్

డియర్ స్టూడెంట్స్ మన కాలేజ్ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం,ఆసక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోగలరు...ఇంగ్లీష్ లో ఉన్న సర్క్యులర్ ని మా లాంటి పేద విద్యార్ధుల (పూర్ స్టూడెంట్స్ ని తెలుగులో అదే కదా అంటారు) కోసం తెలుగులో చదివి వినిపించారు మా లెక్చరర్.ఈ సారి ఎలాగైనా మా టాలెంట్ ని అందరికి తెలిసేలా ప్రదర్శించాలి అనుకున్నాం మేమంతా (మేమంతా అంటే మా తొట్టి గ్యాంగ్).ఆ ఈవెంట్స్ ఏంటని అడగగా మా లెక్చరర్ లిస్ట్ చదవడం ఆరంభించారు.
ఎస్సే రైటింగ్ ,టెక్నికల్ క్విజ్, డిబేట్, సాంగ్స్, డ్యాన్స్, నాట్యం ఇలా చెప్తుంటే ఒకరి మొహాలం ఒకరు చూసుకున్నాం.మనకి పైన చెప్తున్న వాటికి ఎక్కడైనా సంబంధం ఉందా అని. ఇంతలో వరద బాదితుడికి పులిహార పొట్లం దొరికినట్లు డ్రామా అన్న పేరు వినపడింది. ఇదైతే మన టాలెంట్ మొత్తం చూపించడానికి మంచి అవకాశం ఉంటది అనుకుని అందరం డ్రామా కి పేర్లు ఇచ్చాం.
డ్రామా ఐతే మన H.O.D  షేర్ ఖాన్ ని కలవాలి. ఆయనే సెలెక్ట్ చేస్తారు ఆర్టిస్ట్ లని అని చెప్పారు.
షేర్ ఖాన్ ఆ పేరు వినగానే మా గుండెలు గుభేల్ మన్నాయి. ఎవరి పేరు చెబితే స్టూడెంట్స్ స్లిప్పులు రాయడం మానేస్తారో...
ఎవరి పేరు చెబితే లెక్చరర్లు క్లాసులు చెప్పడానికి భయపడతారో ఆయనే షేర్ ఖాన్...
డైరెక్టర్, ప్రిన్సిపాల్, లెక్చరర్స్, స్టూడెంట్స్ ఈ నలుగురూ మా కాలేజీ కి నాలుగు స్థంభాలైతే కనిపించని అయిదో స్థంభమేరా మా షేర్ ఖాన్...

అలాంటి షేర్ ఖాన్ దగ్గరకెళ్ళడానికా మేము పేర్లు ఇచ్చింది. పులి బోనులోకి వెళ్ళడానికి బ్లాకు లో ఎంట్రీ పాసులు కొనుక్కున్నట్లుంది మా పరిస్థితి.
పేర్లు ఇచ్చాక మధ్యలో మిడిల్ డ్రాపులు ఉండవని చెప్పడం తో ధైర్యం తెచ్చుకుని వెళ్ళాం.
లోపలికి వెళ్ళే సరికే ఇంకొ పది మంది దాకా మేకలు (స్టూడెంట్స్)  పులి బోనులో ఉన్నాయి. కాని మేము భయపడినంత వయలెంట్ గా ఏం లేదు సిచ్యుయేషన్ అక్కడ.
పులి చాలా ప్రసాంతం గా ఉంది. అందరిని నవ్వుతూ పలకరిస్తుంది. "చూడండి స్టూడెంట్స్ మీరందరు పేర్లు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందం గా ఉంది. కాని ఇంతమందిని తీసుకోవడం కుదరదు కనుక నా కథలో క్యారక్టెర్స్ కి సరిపోయే వాళ్ళని మాత్రమే తీసుకుంటాను.మిగతా వాళ్ళకి మరొక సారి చాన్స్ ఇస్తాను OK నా?. ఇప్పుడు మీ అందరికి నేనొక డయలాగ్ ఇస్తాను దాన్ని చదివి ఒక అయిదు నిమిషాలలో ఒక్కొక్కరుగా నాకు చెప్పండి. ఎవరి డయలాగ్ నచ్చితే వాళ్ళని తీసుకుంటా"  అని అందరి చేతుల్లో పేపర్ పెట్టారు.
ఆ డయలాగ్ చూడగానే అది తెలుగు బాషే అని అర్ధం చేసుకోడానికే ఒక 2 నిమిషాలు పట్టింది. దాన్ని పూర్తిగా చదవడానికి ఇంకో 3 నిమిషాలు పట్టింది అందరికి.
అయిదు నిమిషాల తరువాత ఒక్కొక్కరుగా డయలాగ్ చెప్పడం మొదలు పెట్టారు.ఒక పది మంది డయలాగ్ చెప్పిన తరువాత మా షేర్ ఖాన్ అసలు క్యారక్టర్ బయటకొచ్చింది. పులి నిద్ర లేచింది. ఒక్క సారి గా గాంఢ్రించింది.
"ఏంట్రా ఆ డయలాగులు చెప్పడం? మిమ్మల్ని చూస్తుంటే తెలుగు చచ్చిపోతుందనిపిస్తుంది రా...తెలుగు డయలాగ్ ని తెలుగులో చెప్పడం కూడా రాదారా మీ మొహాలు మండ. నువ్వు ఇటు రారా " అని మా నవీన్ గాడిని పిలిచి మళ్ళీ ఇంకో సారి చెప్పమన్నాడు.
వాడు "ఓరీ ముండా" అనగానే వెంటనే వాడి చెవి మెలిపెట్టి ముండా ఏంట్రా ముండా అది ముండా కాదురా మూఢా.. రా నీ మొహం మండా అని గట్టిగా ఇంకోసారి చెవి మెలి పెట్టాడు.వాడు చెవి కోసిన మేకలా అరుస్తుంటే నేను నవ్వాపుకోలేక కిసుక్కున నవ్వాను. అది చూసి మా H.O.D కి పుసుక్కున కోపమొచ్చింది.
"ఏంటి సార్ నవ్వుతున్నారు, ఇంకొకడిని చూసి నవ్వడం కాదు నీకొస్తే నువ్వు చెప్పి తగలడు" అని విసుక్కున్నాడు. ఆయన విసుక్కోవడంతో నాకు పౌరుషం పెరిగి ఒక్కసారి కళ్ళు మూసుకుని ఎన్టీవోడిని తలుచుకుని అవేశం తెచ్చుకుని మా షేర్ఖాన్ వైపు చేయి చూపిస్తూ డయలాగ్ చెప్పడం మొదలు పెట్టాను
"ఓరీ మూడా! నిజకర నికర విధారిత శత్రు మస్త మస్తిష్కమును కోరు ఈ వీర హర్యక్షంబునే నిర్లక్షంబు చేయుంచుంటివా...?"  అని డీలాగ్ మొత్తం చెప్పి చివర్లో హెహెహే అని బాలకృష్ణ లాగ లాస్ట్ లో ఒక సౌండ్ ఇచ్చి ఇంద్ర లో చిరంజీవి లా మీసం మెలేసి,  ఆది లో బుడ్డ N.T.R లా తొడ కొట్టాను.
అందరి కళ్ళల్లో ఆశ్చర్యం , మా షేర్ ఖాన్ కళ్ళల్లో ఆశ్చర్యం తో కూడిన ఆనందం, ఒక రెండు నిమిషాల తరువాత తేరుకుని 'శెహ్బాష్ ఇది రా డయలాగ్ చెప్పే విదానం, ఇది రా ఎమోషన్ అంటే, ఇది రా ఎక్స్ప్రెషన్ అంటే? అని తెగ మెచ్చేసుకున్నాడు.
ఒక్క డయలాగ్ కే ఇంత ఫీలయిపోతున్నాడేంటి అని " ఒక్కొక్క డయలాగ్ కాదు షేర్ ఖాన్ వంద డయలాగుల్ని ఒకేసారి చెప్పేస్తా" అని అందామనుకుని మరీ ఓవర్ గా ఉంటదేమో అని ఆపేసా. కథలో నాదే మెయిన్ కేరక్టర్ అని చెప్పాడు, మిగతా సపోర్టింగ్ ఆర్టిస్టులని ఎంచుకుని మిగతా వాళ్ళని పంపించేసాడు.

"స్టూడెంట్స్, ఇప్పుడు మీరు వేసే డ్రామా కథ మామూలు కథ కాదు, ఒక సామాజిక బాధ్యతతో కూడుకున్న కథ, ఈ నాగరిక ప్రపంచం లో మన మూలాలని మనం మరిచిపోతున్నాం అని గుర్తు చేసే కథ.."అని చెప్తున్నారు. అబ్బో ఇదేదే కృష్ణ వంశీ సినిమా టైపు కథలా ఉందే... ఇలాంటి కథలో నాది మెయిన్ కేరక్టర్ అంటే ఈ కేరక్టర్ తో మనకి మంచి పేరొస్తదేమో అని మనసులో ఏదేదో అనేసుకుంటుండగా  ఇంతకీ ఈ స్టోరీ కి టైటిల్ ఏంటి సార్ అని ఎవరో అడిగితే "రోడ్డు మీద పేడ" అని గర్వం గా టైటిల్ ని లాంచ్ చేసాడు మా షేర్ ఖాన్. అంతే అందరికీ ఒక్కసారిగా కడుపులో దేవేసినట్లు అనిపించింది. రోడ్డు మీద పేడా? ఇదేం టైటిల్ రా నీ అమ్మా కడుపు మాడా.. మళ్ళీ ఇందులో నాది మెయిన్ కేరక్టరా? ఓరి నాయనో అని నా అంతరాత్మ మా H.O.D ని అడ్డమైన బూతులు తిట్టింది.

వారం రోజుల కఠిన కఠోర రిహార్సల్స్ అనంతరం.. మా రోడ్డు మీద పేడ స్టేజీ మీదకి ఎక్కేటందుకు రెడీ అయ్యింది...

ఇప్పుడు మీరు చూడబోతున్నారు... ఒక గొప్ప సోషల్ ఎలిమెంట్స్ ఉన్న డ్రామా...  రోడ్డు మీద పేడ.. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరక్షన్ మన H.O.D  షేర్ ఖాన్ గారు అని మా యాంకర్ అనౌన్స్ చేయగానే హాలు మొత్తం ఒకటే ఈలలు చప్పట్లు, ఇవన్ని మా షేర్ ఖాన్ గారి కోసమే అనుకుని ఆయన ప్రేక్షకుల వైపు చూస్తూ చేయి ఊపుతున్నారు.. ఇంతలో చిన్నగా తెర పైకి లేచింది..  


                                              "రోడ్డు మీద పేడ"

ఒక పల్లెటూరి రైతు ( కథలోని మెయిన్ కేరక్టర్ అంటే నేనే ) ఒక గేద (ఇక్కడ గేద అంటే నిజం గేద కాదు.. నిజం గేద ని పెడదామంటే బ్లూ క్రాస్ వాళ్ళు బొక్కలో పెడతామన్నారు. గేదా పర్సనాలిటీ ఉన్న ఒకడికి నల్ల బెడ్ షీట్ కప్పామన్న మాట)  ని తోలుకుంటూ హైటెక్ సిటీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు..

"హై హై...ఓ..ఓ..డుర్ డుర్...చల్ చల్..."  అని నేను అరుచుకుంటూ మా గేద గాడిని తోలుతున్నాను.. సరిగ్గా హై టెక్ సిటీ దగ్గరకొచ్చే సరికి మా గేదకి మోషన్స్ అయ్యి రోడ్డు మీద పేడ వేసింది..అది నేను చూసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిఫోయాను..

తరువాతి సన్నివేశం...

ఒక పని లేని టి.వి రిపోర్టర్ రాం బాబు తన కెమేరామెన్ గంగ తో సెన్సేషనల్ న్యూస్ ని వెతుక్కుంటూ హైటెక్ సిటి పరిసర ప్రాంతాలలో తిరుగుతుంటాడు..
అప్పుడు మన గంగ దూరంగా పచ్చగా నిగనిగలాడుతూ కుప్ప లా రోడ్డు మీద పడి ఉన్న ఒక వింత పదార్ధాన్ని చూసి రాంబాబు ఏంటది అని దాని దగ్గరకి వెళ్తారు..
అసలే న్యూస్ లేక గోల్లు గిల్లుకుంటున్న రాంబాబు కి ఆ వింత పదార్ధం మీద ఒక ప్రోగ్రాం చెయ్యాలనిపించి వెంటనే తన T.V.X చానల్ కి ఫోన్ చేసి... ఈ సెన్సేషనల్ న్యూస్ గురించి బ్రేకింగ్ న్యూస్  వేయండి అని చెప్పాడు.

"హై టెక్ సిటి రోడ్డు పైన ఒక వింత పదార్ధం... బాంబు ఏమో అన్న అనుమానం తో ప్రజల్లో భయాందోళనలు.."  ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి క్షణాల్లో అన్ని డెపార్ట్ మెంట్ ల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు..
బాంబు స్క్వాడ్ వాళ్ళు వాళ్ళ బాంబు డెటెక్టర్ తో చెక్ చేసి అది బాంబు కాదని తేల్చేసారు..ఇక అదేమిటి అన్న ప్రశ్న అందరిలో తలెత్తింది. గంగ తన కెమేరా ని జూం చేసి ఆ పేడ ని చూపిస్తుంటే మన రాం బాబు మైక్ మూతి దగ్గర పెట్టుకుని రోడ్డు పైన ఉన్న ఈ వింత పదార్ధం ఏమై ఉంటుంది.. మీ ఆన్సర్ ని టైప్ చేసి మాకు SMS పంపండి.. అని ఒక SMS పోల్ కూడా పెట్టేసాడు.

ఇంతలో అక్కడికి చేరుకున్న ఒక సైంటిస్ట్ బహుశా ఇది మార్స్ గ్రహం లో ఏదైనా విస్పోటనం జరిగి అక్కడి నుండి ఒక మట్టి ముద్ద ఎగిరి భూమి మీద పడి ఉండొచ్చు అనుకుంటున్నాను అంటాడు..
వెంటనే లేదు లేదు.. ఇది చాలా మెడికల్ వేల్యూస్ కలిగి ఉన్న పదార్ధం.. కచ్చితం గా ఇది ఏదో మెడిసిన్ కి సంబంధించినదై ఉంటుంది అని ఒక డాక్టర్ చెప్పాడు.

వెంటనే ఏమిటండీ మీరు మాట్లాడేది.. అది చూస్తుంటే చాలా ఫ్రెష్ గా ఉంది..మంచి వాసన వస్తుంది.. కచ్చితంగా ఇదేదో తినే పదార్ధం అయ్యి ఉంటుందని వేలితో తీసుకుని నాలుక కి రాసుకున్నాడు అక్కడే ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పని చేసే చెఫ్.

అపచారం అపచారం.. ఏమిటయ్య నువ్వు.. చేతులు పెట్టేస్తున్నావ్.. అదేమిటనుకున్నావ్..సరిగ్గ చూడు.. ఆ షేపు అవి చూస్తుంటే తెలియట్లా.. రోడ్డు పైన వెలిసిన వినాయకుడని.. అని ఒక పూజారి లెంపలేసుకుని దణ్ణం పెట్టుకున్నాడు..

ఇదంతా చూసి మన రాం బాబు అందరి దగ్గర మైకు పెట్టి వాళ్ళ వాదనలు లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తున్నాడు..ఇలా జరుగుతుండగా నేను గోచీ పైకి దోపుకుంటూ మా గేదగాడిని తోలుకుంటూ వెనక్కి వస్తుంటాను..అక్కడ జనాల హడావిడి చూసి ఏమైందో అని నా గేద ని BMW కారు పక్కన పార్క్ చేసి నేను ఆ గుంపులోకి వెళ్ళాను.. ఏమైందని అక్కడ నుంచున్న వారిని అడిగితే రోడ్డు మీద ఉన్న దాన్ని చూపించి అదేమిటో తెలియక కొట్టుకుంటున్నారు అని చెబితే దాని దగ్గరకెళ్ళి చూసి అది నా గేద పేడే అని గుర్తించి అయ్యో ఎందుకయ్యా కొట్టుకుంటారు ఇది నా బర్రె పేడ..ఇందాక ఇటుగా వెళ్ళినప్పుడు వేసినట్లుంది చూసుకోలా.. అని నా రెండు చేతులో ఎత్తి నా గంపలో వేసుకుంటుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇది గేద పేడ? అని మన రాం బాబు నా దగ్గరకొచ్చి మైకు నా నోట్లో పెట్టాడు.
అప్పుడు నేను అవునయ్య ఇది నా బర్రె వేసిన పేడ నే.. అయినా మీ పట్నమోల్లకి పేడ కూడా తెలీదా.. ఏం మనుషులయ్యా..
అయినా మా పల్లెటూరి కి రండయ్యా ఇలాంటి పేడ కుప్పలు బోలెడుంటాయి.. మా ఊరిలో రోడ్డులుండవయ్యా పేడలే ఉంటాయి..
అయినా మీకు బర్రెలు పాలు ఇస్తాయని తెలుసు గాని పేడలేస్తాయని, అవి గిట్లనే ఉంటాయని కూడా తెలీదా అయ్యలు.. మీకన్నా మా పల్లెటూరోల్లే నయమయ్యా.
అనుకుని నా బర్రె ని తీసుకుని బయలుదేరుతుంటే మన రాం బాబు ఆపి ఈ పేడ తో ఏం చేస్తారు కొంచెం మా ప్రేక్షకులకి చెప్పండి అని మళ్ళీ నా మూతిలో మైకు పెట్టాడు..
ఈ పేడ తో సంక్రాంతి కి గొబ్బెమ్మలు చేసుకోవచ్చు.. నీళ్ళల్లో కలిపి కల్లాపి చల్లుకోవచ్చు..గోడకేసి కొట్టి ఎండబెట్టి పిడకలు కూడా చేసుకోవచ్చు... అని నేను చెప్తుంటే అందరూ ఆశ్చర్యం గా నోళ్ళెల్లబెట్టి చూస్తున్నప్పుడు చిన్నగా తెర కిందకి జారుతుంది.
మా షేర్ ఖాన్ కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు రాలుతున్నాయి. ప్రేక్షకులంతా నవ్వాలో ఏడవాలో అర్ధం కాక బుర్ర గోక్కుంటూ చప్పట్లు కొట్టారు.
తరవాతి రోజు మా తారాగణాన్ని తన రూం కి పిలిచి అభినందించి గిఫ్ట్లు ఇచ్చారు.హమ్మయ్యా అనుకుని అందరూ ఊపిరి పీల్చుకుంటుండగా 'ఈ డ్రమా ని కేవలం మన కాలేజీ కే పరిమితం చేయటం నాకు నచ్చట్ల, ఇలాంటి మంచి కథ జనాల్లోకి వెళ్ళాలి అందుకే ఊరు ఊరూనా వాడ వాడనా ఈ కథతో మనం నాటక ప్రదర్శనలిద్దాం అని బాంబు పేల్చాడు. అంతే అందరూ ఒక్కసారిగా వద్దు బాబోయ్ వద్దు అని గట్టిగా అరిచారు.

2 comments: