Monday, February 11, 2013

(స్నేహం + ప్రేమ)²= జీవితం

హాయ్ ఫ్రెండ్స్..!  నా బ్లాగ్ ని వీక్షించి నా  రాతల్ని ఓర్పుగా చదువుతున్న మీ అందరికీ ధన్యవాదాలు.  మీరు అందించిన ప్రోత్సాహంతో నాకు ఇంకా మంచి మంచి కథలు రాయలన్న ఉత్సాహం పెరిగింది. నా రచనల్ని చదవడానికి ఒక రెండు వందల మంది ఉన్నారన్న ధైర్యంతో ఒక అడుగు ముందుకేసి కొంచెం పెద్ద ప్రయోగమే చేయబోతున్నాను....
రామాయణాన్ని ఒక మహా గ్రంధంగా చదువుకోవచ్చు. కట్టే, కొట్టే, తెచ్చే అని మూడు ముక్కల్లోను చదివేయొచ్చు. మూడు ముక్కల్లో నా కథని చెప్పాలంటే ఒక ఇంజినీరింగ్ విద్యార్ధి జీవితం ప్రేమ,స్నేహం వల్ల ఎలాంటి మలుపు తిరిగిందో, చివరికి ఎక్కడికి చేరిందో అన్నదే నా కథాంశం. ఎందుకు? ఏమిటి? ఎలా? అన్న ప్రశ్నలకి సమాధానం కావాలంటే మాత్రం కొంచెం ఓపికగా చదువుకోండి. ఇది కథ అనుకోండి, నవల అనుకోండి, లేదా సీరియల్ అనుకోండి. కాని చదవండి........
ఈ ప్రపంచం లో అమ్మా నాన్నలు లేకుండా పెరిగిన అనాధలు ఎంతో మంది ఉండి ఉండొచ్చు. కాని స్నేహితుడు అంటూ లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని నా అభిప్రాయం. అలాగే ప్రతి వ్యక్తి జీవితం లో ప్రేమ అనే చాప్టర్ కచ్చితంగా ఉండి ఉంటది.
                                        ప్రేమ, స్నేహం ఈ రెండిటి సమాహారమే జీవితం.
-------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------

పేరు               : చరణ్ కృష్ణ బలుపు
నాన్న             : బలుపు వీరభద్రం
అమ్మ             : బలుపు భాగ్యలక్ష్మి
విద్యార్హత        : ఇంజినీరింగ్ పాస్
మార్కులు % : ఇలాంటివన్నీ అడగకూడదు
ఉద్యోగం          : అమ్మ లాయర్, నాన్న డాక్టర్
ఆస్తిపాస్థులు   : ఇంకం ట్యాక్స్ ఇబ్బందుల కారణంగా గోప్యంగా ఉంచుతున్నాను
పెళ్ళి              : ఒకటి అయ్యి పెటాకులయ్యింది, ఇంకొకటి సంప్రదింపుల దశలో ఉంది
ఎందుకని       : తర్వాత చెప్తాను

మీరు చదువుతున్న బయోడేటా నాదే. నా పేరు చరణ్. ఇష్టమైన వాళ్ళు ముద్దుగా చెర్రీ అంటారు.
నేనంటే పడని వాళ్ళు బలుపు (ఇంటి పేరు) అని పిలుచుకుంటారు.
అమ్మ నాన్నలకి నేను ఒక్కడినే కొడుకుని.. ఒక్కడే కొడుకు అనగానే అల్లారు ముద్దుగా పెరగడం, నా ఇష్టారాజ్యంగా ఉండటం, ఏది కోరుకుంటే అది నా ముందు ప్రత్యక్షమవడం.... ఇలాంటివన్ని ఊహించుకోకండి. అంత బొమ్మ లేదిక్కడ.. అంటే గారాభంగా పెంచలేదని కాదు..కాకపోతే ఒక్కడినే కావడం వల్ల మ వాళ్ళకి అతి జాగ్రత్త ఎక్కువై నా విషయంలో ఏం చేయాలన్నా ఆచితూచి మంచి చెడు లెక్కలు కట్టి చేస్తారు... నేను ఏం అడిగినా కాదనకుండా కొనిస్తారు కాని నేను అడిగింది మాత్రం కొనివ్వరు. నాకు ఏది పనికొస్తదో అదే కొనిస్తారు. స్కూల్ కి వెళ్ళాలంటే కేసులు లేనప్పుడు అమ్మో, పేషంట్లు లేనప్పుడు నాన్నో తీసుకెళ్తారు, ఇద్దరికి తీరిక లేకపోతే స్కూల్ మానిపించి వాళ్ళతో కోర్టుకో లెదంటే క్లినిక్ కో తీసుకెళ్ళేవారు. రబ్బరు బాలుతో క్రికెట్ ఆడడానికి హెల్మెట్, గార్డు పెట్టి పంపించే వాళ్ళు. అందరూ నవ్వుతుంటే సిగ్గుతో చచ్చిపోయేవాడ్ని. స్కూల్లో అందరూ విహారయాత్రలకి వెళ్తుంటే నేను కూడా వెళ్తా అని మారాం చేస్తే అమ్మో ఒక్కగానొక్క కొడుకువి నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తాం అనేవాళ్ళు. కనీసం ఆడుకోడానికి పక్కింటికి కూడా పంపించేవాళ్ళు కాదు.
అమ్మ కి నన్ను లాయర్ గా చూడాలని కోరిక. అందుకే నా ప్రతి పుట్టిన రోజుకి నల్లకోటు నే కొనిస్తది.
నాన్న కి నన్ను డాక్టర్ ని చేయాలని ఆశయం. ఎక్కడ తెలంగాణ ఇచ్చేస్తారో ఎక్కడ స్థలాల దరలు పెరిగిపోతాయొ అని నేను 10వ క్లాస్ లో ఉండగానే వాళ్ళ ఊరిలో హాస్పిటల్ కట్టడానికి స్థలం కొనేసాడు.
చిన్నప్పుడు మా అమ్మ నాతో భాగవతం బదులు లా పుస్తకాలు చదివించేది.
మా నాన్న ని ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళమంటే సైన్స్ ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళి శవాలు, శరీర భాగాలు చూపించే వాడు
ఇలా నా చిన్నతనం అంతా డాక్టర్ కావాలా లేక లాయర్ కావాలా అన్న అయోమయంలోనే గడిచిపోయింది. చూస్తుండగానే 10వ క్లాస్ కూడా పూర్తి అయిపోయింది.
బ్రతకాలంటే ఈ రెండు ఉద్యోగాలే చేయాలేమో అనే భ్రమలో బ్రతుకుతుండగా నా స్నేహితుడొకడు ఇంటర్లో ఎం.పి.సి తీసుకుని ఇంజినీరింగ్ చేస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే ఎక్కడ లేని ఉత్సాహం ముంచుకొచ్చింది.
జీవితంలో తెలుపు నలుపు రంగులే చూసిన నాకు ఇంజినీరింగ్ ఒక రంగుల హరివిల్లు లా కనిపించింది. నేను కూడా ఇంజినీరింగ్ చేయాలని నిర్ణయించేసుకున్నాను.
ఇదే విషయం మా అమ్మ నాన్న కి చెప్పాను. నా నోటి నుండి వినకూడని బూతు మాటలేవో వినపడినట్లు ఇద్దరు నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకుని చెడామడా తిట్టారు. అయినా నేను వినలేదు. కుదరదన్నారు. నేను ఇంట్లొ నుండి పారిపోయి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కాయిన్ బాక్స్ నుండి ఇంటికి ఫోన్ చేసి ఇంజినీరింగ్ చేయడానికి ఒప్పుకుంటే ఇంటికి తిరిగొస్తాను లేదంటే అస్సామో బీహారో వెల్లిపోతాను అని బెదిరించాను.
ఇక చేసేదేమి లేక సరే నీ ఇష్టం ఇంటికి రమ్మన్నారు.అలా ఇంజినీరింగ్ చేసే ప్రయత్నంలో మొదటి విజయం సాధించాను.
అయిష్టంగానే ఒక మంచి కాలేజిలో (మంచి అంటే మార్కులు ఎక్కువ తెప్పించే కాలేజి) ఎం.పి.సి లో చేర్పించారు.
ఆ కాలేజిలో ఫీజు కట్టి ఒక గాడిదని చేర్పిస్తే రెండేళ్ళలో ఆ గాడిదని కనీశం 80% మార్కులతో బయటకొచ్చేలా రుద్దుతారు. నన్ను కూడా బాగా రుద్దారు. రాత్రనక పగలనక బట్టీ వేయిస్తూనే ఉండేవారు. వాళ్ళ రుద్దుడుకి నేను తట్టుకోలేకపోయాను. నా జీవితంలో ఆ రెండు సంవత్సరాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలీకుండా గడిచిపోయాయి.
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా అయిపోయాయి. ఇక మిగిలింది ఎంసెట్. అమ్మ నాన్న ముందే చెప్పారు తెచ్చుకుంటే ర్యాంకు తెచ్చుకుని సీటు తెచ్చుకో లేదంటే డొనేషన్ కట్టే ప్రసక్తే లేదన్నారు.
సరే నా ప్రయత్నం నేను చేయాలని కష్టపడి చదివాను. ఫలితంగా చాలా పెద్ద ర్యాంకు వచ్చింది. మా ఊర్లో కాలేజీలలో సీటు రాదని అర్ధమయిపోయింది. వేరే ఊరు వెళ్ళడానికి మా ఇంట్లో ఒప్పుకోరు ఒక్కడినే కొడుకుని కదా మరి.
మా ఇంట్లో వాళ్ళని ఏ మొహం పెట్టుకుని డొనేషన్ కట్టమని అడగాలో తెలియక నా మొహాన్నే కొంచెం దీనంగా పెట్టి అడిగేసాను. సమాదానం ఊహించినదే. కట్టను పొమ్మన్నారు. అవును మరి, వాళ్ళు చెప్పినట్లు విని ఉంటే ఎన్ని లక్షలైనా తగలేసేవారు.
వెంటనే నిరాహార దీక్ష మొదలు పెట్టాను. ఒకటిన్నర రోజు చేసేసరికి నీరసమొచ్చి జ్వరమొచ్చింది. అధిష్టానం దిమ్మ తిరిగింది. నా డిమాండ్లకి తలొగ్గింది. వెంటనే నేను ఇంజినీరింగ్ చదవడానికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ఒప్పుకున్నారు. నాతో నిమ్మరసం తాగించి నా దీక్ష విరమింపచేసారు.
మా ఊర్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలలో కాస్త మంచి కాలేజీ ఎంచుకుని, ఆ కాలేజీ వాళ్ళతో బేరాలు ఆడి, బేరం కుదరక తెలిసిన పెద్దమనిషితో రికమండ్ చేయించి చివరికి కంప్యూటర్ సైన్స్ లో నాకో సీటు కొనిచ్చాడు మా నాన్న. ఇప్పటి వరకు మా నాన్న నాకు కొనిచ్చిన బహుమతుల్లో అత్యంత ఖరీధైనది ఇదే.
నాకు మనుషులు ఒక పట్టాన నచ్చరు. నాకు స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. నాకు నచ్చాలంటే వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలకి దగ్గరగా ఉండాలి. కాని ఒకసారి నచ్చితే తర్వాత అవతలి వ్యక్తి ఎంత వెధవని తెల్సినా వాళ్ళని వదులుకోలేను. నాతో ఒకసారి స్నేహం చేస్తే ఇంక జీవితాంతం నా స్నేహితుడిగా ఉండిపోవాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు నచ్చిన ఆ కొద్ది మంది వల్లే నా జీవితం రకరకాల మలుపులు తిరిగిపోయింది. ఇప్పుడు నేను ఇంజినీరింగ్లో చేరుతుంది కూడా నాకు నచ్చిన ఒక స్నేహితుడి వల్లే. పైన చెప్పాను కదా నా స్నేహితుడొకడు ఇంజినీరింగ్ చేరతాను అన్నాడని. వాడి కోసమే నేను కూడా ఇంజినీరింగ్లో, వాడు చేరిన కాలేజిలోనే చేరాను. కాకపోతే వాడు సీటు తెచ్చుకుని చేరాడు, నేను సీటు కొనుక్కుని చేరాను. కాని ఇద్దరికి ఒకటే గ్రూపు రాలేదు. వాడు మెకానికల్ లో చేరాడు. వాడి పేరు చందు.
ఇప్పటి వరకు నా జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అందులో చెప్పుకునే గొప్ప సంఘటనలు ఎమీ జరగలేదనే చెప్పాలి. కాని ఇంజినీరింగ్లో చేరాక ఎన్నో కొత్త అనుభూతులు.కొన్ని మరపు రాని సంఘటనలు,కొందరు మర్చిపోలేని వ్యక్తులు,బాధలు,ఆనందాలు,కష్టాలు, సుఖాలు, పాఠాలు,గుణపాఠాలు, ఇవన్ని నా జీవితంలోకి ప్రవేశించాయి.
నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నా కాలేజి మొదటి రోజు....
చందు, నేను ఉదయాన్నే లేచి గుడికెళ్ళాం. వాడికి బైక్ ఉంది. కాని కాలేజీకి బస్ లోనే వెళ్ళాలని ముందే నిర్ణయించుకున్నాం. మొదటి రోజే బైక్ పైన వెళ్ళి సీనియర్ల దృష్టిలో పడొద్దని మాకు తెల్సిన అన్నయ్య ఒకతను సలహా ఇచ్చాడు. ఇద్దరం బస్ ఎక్కి కాలేజీ స్టాప్ లో దిగాం. ఎందుకో తెలియని భయం, ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. ఇద్దరి మొహాల్లో ఆందోళన స్పష్టంగా కనపడుతుంది. మౌనంగా ముందుకు అడుగులేసాం. రెండు అడుగులు వేయగానే కాలేజీ గేటు ప్రత్యక్షమైంది. దాని పైన "వెల్కం టు ఫ్రెషర్స్" అని ఒక బ్యానర్ కట్టి ఉంది. చందు వంక చూశాను. వాడు వెళ్ళిపోదామా రెపు వద్దాంలే అన్నాడు. నాకు కూడా వెళ్ళిపోవాలనిపించింది. కాని మా నాన్న" కాలేజీలో ఇంక కొంచెం దబ్బులు కట్టాలి. కాలేజి తెరిచాక కడతా అని చెప్పాను. నాకు రావడం కుదరదు నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, నువ్వే కట్టేయి" అని నా చేతిలో డబ్బులు పెట్టారు. అందుకే ఇక తప్పక ధైర్యం చేసుకుని గేటు లోపల అడుగుపెట్టాం.

క్యాంపస్ మెయిన్ గేటు నుండి కాలేజ్ బిల్డింగ్ కి కనీశం అర కిలో మీటర్ దూరం ఉంటుంది. దారి మొత్తం తారు రోడ్డే. ఆ రోడ్డు ని రెండుగా విభజిస్తూ మధ్యలో ఒక డివైడర్. ఆ డివైడర్ పైన చిన్న చిన్న పూల మొక్కలు. దారి కి రెండు ప్రక్కల పెద్ద పెద్ద చెట్లు. మద్య మద్యలో కూర్చుని సేద తీరడనికి అక్కడక్కడా సిమెంట్ బెంచ్ లు. ఆ వాతావరం చాలా ఆహ్లాదంగా ఉంది. ఏదో పార్క్ లో నడిచి వెళ్తున్న అనుభూతి. అప్పుడే ఒక విషయం గమనించా. అబ్బాయిలందరూ ఒక వైపు నడుస్తున్నారు. అమ్మాయిలు డివైడర్ కి అవతలి వైపు నడుస్తున్నారు. అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్యన పరదా పరిచినట్లు డివైడర్ పైన గుబురుగా పెరిగిన మొక్కలు. ఆ మొక్కల మధ్య చిన్న చిన్న సందుల్లో నుండి కనపడీ కనపడనట్లు కనిపిస్తున్నారు. ఎవరి ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. దాదాపు అన్నీ చుడీదార్లే, అక్కడక్కడా జీన్స్ లు, కనీశం ఒక్క లంగా ఓణీ అయినా కనపడుతుందేమో అని ఆశగా చూసాను. కాని నా ఆశ అత్యాశే అని అర్ధమయ్యింది.
కాలేజ్ లోకి ప్రవేశించగానే నోటీస్ బోర్డ్ దగ్గర జనాలు గుమిగూడి ఉండటం గమనించి చందు,నేను అటు వెళ్ళాం. ఎవరి క్లాస్ రూం లు ఎక్కడో నోటీస్ అంటించారు. చందు వాళ్ళ క్లాస్ వేరే బ్లాక్ లో ఉంది. నాది వేరే బ్లాక్ లో ఉంది. సాయంత్రం కాలేజ్ అయ్యాక మా క్లాస్ దగ్గరకి రమ్మని చెప్పి ఎవరి క్లాసుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయాం.
                       Continue reading   Part - II                                        

No comments:

Post a Comment