Monday, January 28, 2013

అందాల రాశి

''ట్రైన్ నెం. 12621 తమిళనాడు ఎక్ష్ప్రెస్స్ తోడిహి ధేర్ మే ప్లాట్ ఫారం నెం. 4 సె రవాణా హోనే కే లియె తయార్ హై....''  నేను చెన్నై రైల్వే స్టేషన్ లో అడుగుపెట్టగానే ఈ అనౌన్స్మెంట్ వినగానే కంగారు పడ్డాను...నిజానికి నేను అరగంట ముందే స్టేషన్ లో ఉండాలనుకున్నాను..ఒక అరగంట ముందు బయల్దేరి ఉంటే ఉండేవాడ్ని కూడా....కాని నేను ప్రతి పనికి ఒక ప్రణాళిక వేసుకుంటాను. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలనుకుంటాను..కాని అవి పనికి మాలిన ప్రణాళికలు అని అవి బెడిసికొట్టే వరకు నాకు అర్దం కావు...కంచి నుండి చెన్నైకి రెండు గంటలు...చెన్నై బస్టాండ్ నుంది రైల్వే స్టేషన్ కి అరగంట పడుతుంది..కాబట్టి ఇంకా అరగంట సమయం ఉంటదిలే అని తాపీగా బయల్దేరాను..తీరా చూస్తే కంచిలో చెన్నై బస్ ఏదో తెల్సుకుని ఎక్కడానికే అరగంట పట్టింది. అక్కడ ప్రతి బస్ తమిళం  లోనే రాసి ఉంది.. ఏది చెన్నై వెళ్తుందో తెల్సుకోడానికి నాకు తెల్సిన తమిళం  కాని తమిళం లో నా పక్కన ఉన్న తమిళ తంబి ని బాగా విసిగించి చివరకి ఎలాగొలా బస్ ఎక్కా. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే సమయానికి మధ్య దారిలో ట్రాఫిక్ జాం. ఇన్ని కష్టాలు దాటుకుని రైల్వే స్టేషన్ చేరుకునే సరికి నేను మిగిలిపోతుందని ఆశపడ్డ అరగంట అయిపోయింది. నేను ఎక్కాల్సిన కోచ్, నేను కూర్చోవల్సిన సీటు వెతుక్కుని కూర్చునే సరికి పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది..ట్రైన్ బయల్దేరింది...
నా సీటులో కూర్చుని బ్యాగు సర్దుకుని నా వెంట తెచ్చుకున్న పులిహోర ని తిన్నాక కాని నా చుట్టు ప్రక్కన వాళ్ళని పరిశీలించే తీరిక నాకు దొరకలేదు. ఒక్కసారి చుట్టు ప్రక్కల అందర్నీ పరిశీలనగా చూసాను. నా ఎదురు ముగ్గురు ఉత్తరాది వాళ్ళు స్నేహితులనుకుంటా, హిందీ లో మాట్లాడుకుంటున్నరో పోట్లాడుకుంటున్నారో అర్ధం కాలేదు. నా ప్రక్కన ఒక పెద్దావిడ, ఒక చిన్న బాబు, వాళ్ళ అమ్మ కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెలుగు లో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ తెలుగు మాటలు వినగానే నాకు చాలా ఆనందమేసింది. అవును మరి, పక్క రాష్ట్రం వెళ్తే కాని మన భాష గొప్పతనం అర్ధం కాదు మనకి. వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళు కనపడితే మన ఆత్మీయులని చూసినంత ఆనందంగా ఉంటుంది మనకి.
నా చూపుల్ని ఇంకొంచెం పక్కకి జరిపాను. అప్పటికి కాని నాకు అర్ధం కాలేదు అక్కడ ఒక అందాల రాశి కూర్చొని ఉందని, అప్పటి వరకు నేను తప్ప కంపార్ట్మెంట్ లోని ప్రతి మగ వెధవా తననే చుస్తున్నారని. ఇంక నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను, నేను కూడ ఆ మగ వెధవల జాబితాలొ చేరిపోయాను. తననే చూస్తుండిపోయాను.
అందాల రాశి అని నేనేమి అతిగా వర్ణించలేదు. నిజంగానే తను చాలా అందంగా ఉంది. ఉత్తరాది అమ్మయిలా ఉంది. జీన్స్ టీ-షర్టు వేసుకుని ఉంది. జుట్టుని హైర్ బ్యాండ్ లో బంధించకుండా ఆ కురులకి స్వాతంత్ర్యం ఇచ్చేసింది. అవి వాటికి ఇష్టమొచ్చినట్లు గాలికి అలలలాగ ఎగసిపడుతున్నయి. కాని తన మొహం కనపడకుండా అడ్డుపడుతున్నప్పుడు మాత్రం అవి నాకు రాకాసి అలల్లా కనిపించాయి.
తను చాలా తెల్లగా ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్లుంది. తన బుగ్గలు చూడగానే మొన్నే కొత్తగా విడుదలైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'  సినిమాలో  నాకు కూడా ముద్దు పెట్టుకుంటె ముప్పై రోజులు కందిపోయే బుగ్గలది వస్తది అని మహేష్ బాబు చెప్పిన డైలాగ్  గుర్తొచ్చింది. మహేష్ బాబు చెప్పింది ఈ అమ్మాయి గురించేనేమో అనిపించింది.
నా ప్రక్కన కూర్చున్న తెలుగు వాళ్ళు ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. విషయమేంటని అడిగితే నా ఎదురు మధ్య బెర్తు, సైడు బెర్తుల్లొ పైన బెర్తు వాళ్ళవి అంట. ఆ చిన్న బాబు వాళ్ళ అమ్మ గర్భవతి అంట. అందుకని క్రింద బెర్తులైతే సౌకర్యంగా ఉంటాయి. పైకి ఎక్కలేము.కొంచెం ఆ హిందీ వాళ్ళని అడిగి క్రింద బెర్తులు ఇప్పించమని ఆ పెద్దావిడ అడిగింది. అందులో ఒకడు మధ్య బెర్తుకి మారడానికి ఒప్పుకున్నాడు. ఇంకొకడు మారను అన్నాడు. వాడు మారను అనడంలో కూడా న్యాయం ఉందిలే.. ఎందుకంటే వాడు అప్పటి వరకు మన అందాల రాశి (పేరు తెలియదు కనుక ఇలాగే పిలిచుకుందాం) కంట్లో పడడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నపళంగా వాడు సీటు మారి ఆ అమ్మాయి ఉన్న బెర్తు పైన బెర్తు కి మారిపోతే క్రిందకి తొంగి చూడడం ఇబ్బంది కదా మరి.
ఇక తప్పక మన అందాల రాశిని తన పైన బెర్తు కి మారమని అడిగాను. ఆ అమ్మాయి మొహమాటం కూడా లేకుండా మారను అని తెగేసి చెప్పింది. తను అలా సమాధానం చెప్పేసరికి ఎందుకో తన స్థానం అందాల రాశి నుండి అందగత్తె కి పడిపోయింది. ఇప్పుడు తను ఇందాక కనిపించినంత గొప్ప అందంగా కనబడటం లేదు. ఇక్కడ నాకో విషయం అర్ధమయ్యింది. అందం అంటే శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు. మనం చేసే పనుల వల్ల కూడా అందం పెరగడం తగ్గడం జరుగుతుంది అని.
ప్రక్క క్యాబిన్లో ఒకతను సీటు మారటానికి ఒప్పుకున్నాడు. ఆ పెద్దావిడ అటు వెళ్ళి పడుకుంది. ఆ బాబు వాళ్ళ అమ్మ ధ్యాంక్స్ చెప్పి తను కూడా పడుకుంది.
నేను కూడా నాకు కేటాయించిన మధ్య బెర్తులో పడుకున్నాను. ట్రైన్ బయల్దేరి అప్పటికే గంట అవుతుంది. మన అందాల రాశి ఏదో పుస్తకం చదువుకుంటుంది. నేను తన వంకే చూస్తున్నాను. చూసి సాధించేదేమీ లేదు అని తెలుసు, ఏదో సాధించాలి అన్న ఉద్దేశం కూడా నాకు లేదు. ఒక అందమైన చిత్రపటాన్ని చూస్తున్నప్పుడో, ఒక మంచి సినిమా ని చూస్తున్నప్పుడో,లేదా కష్టపడి ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ ని చూస్తున్నప్పుడో మనమేం సాధిస్తాం? మనసుకి ఆహ్లాదం, కనులకి ఆనందం తప్ప. నాకు కూడా ఆ సంతౄప్తి చాలు అని నాకు నేను సర్దిచెప్పుకుని తనని చూస్తున్నాను.
ఉన్నట్లుండి ఒక్కసారిగా తల తిప్పి నా ఎదురు కూర్చున్న ముగ్గురు హింది వాళ్ళని కోపంగా ఒక చూపు చూసింది. ఆ చూపు కి నేను ఉలిక్కి పడ్డాను. ఒక్కసారిగా ఊహల నుండి ఈ లోకంలోకి వచ్చాను.అప్పటి వరకు వినపడని ట్రైన్ శబ్ధం, ఎక్కడో చిన్న పిల్ల ఏడుపు, కంపార్ట్మెంట్ లొ గుసగుసలు, నా ఎదురు హిందీ వాలాల వెకిలి నవ్వులు ఒక్కసారిగా వినపడడం మొదలయ్యాయి. వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నారని తనని ఏదో కామెంట్ చేశారనీ అందుకే తను కోపంగా చూసిందని అప్పటికి అర్ధమయ్యింది. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో ఇంకో హిందీ వాడు వచ్చాడు. వాడు కూడా వీళ్ళ స్నేహితుడే అనుకుంటా. నా పైన బెర్తు వాడిదే అనుకుంటా. వాడు వచ్చాక వీళ్ళ వెకిళి చేష్టలు ఇంకొంచెం ఎక్కువయ్యాయి. ఆ నాలుగో వాడు ఆ అమ్మాయితో మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ అమ్మాయిని పిలిచి ఏదో అడిగాడు. తను సమాధానం చెప్పి వెంటనే పుస్తకంలో దూరిపోయింది. మనోడు మళ్ళి మళ్ళీ తనని ఏదో అడుగుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్తుంది. వాడు ఈసారి బ్యాగులో నుండి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసి తనని తినమని ఇవ్వబోయాడు. ఆ అమ్మాయి వద్దని సున్నితంగా తిరస్కరించింది. ఐనా మనోడు వదలకుండా తన చేతిని పట్టుకుని, ఆ చేతిలో ప్యాకెట్ పెట్టబోయాడు. ఆ అమ్మాయికి పిచ్చ కోపం వచ్చింది. అతని మీద గట్టిగా అరిచింది. అలా అరిచేసరికి మనోడికి భయమేసినట్లుంది. వెంటనే క్షమించమని అడిగి నిశ్శబ్ధంగా ఉండిపొయాడు. ఆ సంఘటన చూసి నాకు నవ్వొచింది. ఆ అమ్మయి వాడు పలకరించినప్పుడే సమాధానం చెప్పకుండా ఉండి ఉంటే వాడు ఇప్పుడు ఇలా చేయి పట్టుకునే సాహసం చేసేవాడు కాదుగా అనిపించింది. అమ్మాయిలు ఆకాశంలా ఉండాలి. లేకపోతే ప్రతివాడూ, వీడిలా పట్టుకోవాలనే చూస్తాడు.

రాత్రి 12 గంటలు దాటింది. ఆ నలుగురు కుర్రాళ్ళు కూడా పడుకుండిపోయారు. నాకూ నిద్ర వస్తుంది. కాని ఆ అమ్మాయి ఇంకా పుస్తకం చదువుతూనే ఉంది. అన్ని లైట్లు ఆపేసి ఉన్నాయి,మా బెర్తుల దగ్గర తప్ప. ఇక తప్పక తనని పిలిచి లైట్ ఆపు చేయమని హిందీ లో అడిగాను. కాని ఆ అమ్మాయి మళ్ళీ మొహమాటం లేకుండా చదువుకోవాలి ఆపను అని చెప్పింది. ఈసారి తన అందం మరీ తక్కువ స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు తను నాకు అతి సాధారణమైన అమ్మాయిలా కనపడుతుంది. తను అందగత్తె అన్న భావన అసలు కలగడం లేదు నాకిప్పుడు. ఇప్పటివరకు తన మీద ఉన్న ఆశక్తి  కోపంగా మారింది. ఈ అమ్మాయికి అందం ఉంది కాని సంస్కారం లేదు అనుకుని చేసేదేమీ లేక అటు తిరిగి పడుకున్నాను. కాని లైటు వెలుతురుకి నాకు చికాకు గా ఉంది, నిద్ర పట్టడం లేదు. అది చాలదు అన్నట్లు నా ప్రాణానికి, ఎవడో ఒకడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. నిద్ర వస్తున్నా నిద్ర పోలేక నాకు చికాకు వచ్చేస్తుంది. ఈ చపాతి మొహం దానికి నిద్ర రాదా అని మనసులో తిట్టుకుంటున్న సమయానికి నా బాధ చూడలేకో ఏమో ఆ అమ్మాయి దయ తలచి లైట్ ఆపుచేసి నిద్రకు ఉపక్రమించింది.
హమ్మయ్య అనుకుని ఇంక హాయిగా నిద్రలోకి జారుకున్నాను. బాగా ఆలశ్యం అవ్వడం వల్లనో ఏమో బాగా మత్తుగా నిద్ర పట్టేసింది. ఎంత సమయం గడిచిందో తెలీదు కాని మధ్య రాత్రిలో వెలుతురు కళ్ళ మీద పడుతుంటే మెలుకువ వచ్చేసింది. కళ్ళు తెరిచి చూస్తే ఆ అమ్మాయి మళ్ళీ లైట్ వేసుకుని కూర్చుంది. నాకు కోపం నషాలానికి అంటుకుంది. ఇక అడిగేదేమీ లేదు నేనే వెళ్ళి లైట్ ఆపుచేద్దామని పైకి లేచాను. నేను లేవడం చూసి తను లేచి నిలబడి నా దగ్గరకొచ్చి దయచేసి మీరు నా బెర్తులో పడుకుంటారా నేను మీ బెర్తులో పడుకుంటాను అని ఇంగ్లీష్ లో అడిగింది. తను అలా అడిగేసరికి నేను అయోమయంలో పడ్డాను. ఆ పెద్దావిడ కోసం సీటు మారమని అడిగినప్పుడు మారను అని తెగేసి చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇలా అడిగిందా అనిపించింది. కాని ఆ సంఘటన,లైట్ తో ఇబ్బంది పెట్టిన సంఘటన గుర్తొచ్చి కోపమొచ్చింది. నేను మారను అని తెగేసి చెప్పేసాను. పాపం ఆ అమ్మాయి మొహం చిన్నబోయింది. నాకు కావల్సింది కూడా అదే. ప్రతీకారం తీర్చుకున్నట్లు నా మనసు గర్వంతో ఉప్పొంగిపోయింది. లైట్ ఆపుచేసి వెళ్ళి నా బెర్తులో నేను పడుకున్నాను. ఆ అమ్మాయి అలానే చలి కోటు కప్పుకుని కూర్చింది. ఇంతలో ఒకడు మమ్మల్ని దాటుకుని వెళ్ళాడు. ఎవడో టాయిలెట్ కి వెళ్ళుంటాడులే అనుకుని పడుకోబోయాను. వెంటనే ఆ అమ్మయి నా దగ్గరకొచ్చి నిలబడి మళ్ళీ సీటు మారమని అడిగింది. నేను ఈ సారి తిరస్కరించకుండా ఎందుకు అని అడిగాను. ముఝే డర్ లగ్తా హై (నాకు భయంగా ఉంది) అని చెప్పింది. తన నోటి నుండి ఆ మాట వినగానే నాకు తన మీద ఎందుకో జాలి వేసింది. ఏమైంది అని అడిగాను. ఒకడు తననే చూస్తున్నాడని. తన సీటు దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడని అందుకే తనకి భయంగా ఉందని చెప్పింది. నేను కిందకి దిగి తన పక్కన కూర్చున్నా. ఎవరతను చూపించమని అడిగాను. అటు వైపు వెళ్ళాడని ఇందాక ఒకడు టాయిలెట్ కి వెళ్ళిన వైపు చూపించింది. వాడే వీడు అని అర్ధమయ్యింది. తనని నా బెర్తులో పడుకోమని నా బ్యాగు తీసుకుని తన బెర్తుకి వచ్చేశాను. ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పింది. మీరు ఒక్కరే ఎందుకు ప్రయాణం చేస్తున్నారని అడిగాను. ఆ అమ్మాయి వాళ్ళది ఢిల్లీ అంట. తను చెన్నై లో ఉద్యోగం చేస్తుందంట. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళాలన్నా చెన్నై రావాలన్నా వాళ్ళ నాన్న గారు వచ్చి తీసుకెళ్తారంట. కాని ఈ రోజు వాళ్ళ నాన్న గారికి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ వచ్చిందంట.అందుకే తను ఒంటరిగా బయల్దేరిందంట.
ఇందాక మీరు బెర్తు మారమన్నప్పుడు మీ ఎదురు వాళ్ళు నన్ను కామెంట్ చేస్తున్నారు. ఆ కోపంలో మీరు కూడా వాళ్ళ స్నేహితుడే అనుకుని సరిగ్గా సమాధానం చెప్పలేదు. మీరు లైట్ ఆపుచేయమన్నప్పుడు వీడు అటు ఇటు తిరుగుతూ నన్నే గమనిస్తున్నాడు అందుకే భయమేసి లైట్ ఆపలేదు అని చెప్పి సారీ చెప్పింది. నేను పర్వాలేదు, భయపడకండి వెళ్ళి పడుకోమని చెప్పాను. తన బ్యాగు తీసుకుని నా బెర్తులో పడుకుంది. ఆమె చెప్పింది విన్నాక నేను తన గురించి ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నానో అర్ధమయ్యింది. ఆ అమ్మాయి పొగరు వెనక ఇంత భయం దాగి ఉందని తెలిసింది. ఒక అమ్మాయి ఒంటరిగా కనపడితే చూపులతోనే తినేసే రాబందుల(నాతో కలిపి) మధ్యలో చెలాయించుకు రావాలంటే ఆ మాత్రం పొగరు ఉండాల్సిందేలే. ఐనా మన భారత దేశంలో అమ్మాయిలకి జీన్స్, టీ-షర్ట్లు వేసుకునే స్వేచ్ఛ ఉంది కాని అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే స్వేచ్ఛ ఇంకా రాలేదు కదా. అయినా మన దేశ రాజధాని నడిబొడ్డులొనే ఆడదాని స్వేచ్ఛకి దిక్కు లేదు ఇంక రైళ్ళలో ఏముంటదిలే. పగలు అందరిలాగే మామూలు మనుషుల్లా కనిపించే మగాళ్ళు రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళకి ఎందుకు మౄగాళ్ళలా కనిపిస్తున్నారు. ఒంటరిగా ఉన్న ఆడది ఒక మగాడ్ని చూస్తే ఏదో జంతువుని చూసినట్లు ఎందుకు భయపడిపోతుంది. ఎక్కడో ఏదో జరిగితే ప్రతి మగాడ్ని అలాగే అనుకుని అనుమానించే ఆడవాళ్ళది తప్పా? లేక ఒంటరిగా ఉన్న ఆడదానికి భరోసా కల్పించలేకపోతున్న మగాడిది తప్పా? ఇలా అలోచిస్తూ నిద్రపోలేకపోయాను. తెలియకుండానే సమయం గడిచిపోయింది. సరిగ్గా 5 గంటలకి ట్రైన్ విజయవాడ స్టేషన్లో ఆగింది. నా బ్యాగు తీసుకుని బయల్దేరబోతు ఆ అమ్మాయి వంక చూసాను. తను ఇప్పుడు నాకు మొదట కనిపించిన దానికంటే ఇంకా చాలా అందంగా కనపడుతుంది. తను నా మనసులో ఇంక ఎప్పటికీ అందాల రాశిగానే ముద్రపడిపోయింది.

3 comments:

  1. Very nice. Is it real experience...?

    ReplyDelete
  2. Really Nice Elaboration and very trendy!!

    ReplyDelete
  3. Thanks +kalasagar garu, lakshmi garu for ur comments. This story is based on real incident but have some fictional scenes

    ReplyDelete