Friday, September 6, 2013

అమ్మమ్మ...పదవ తరగతి..

అవి మూడవ ప్రపంచ యుద్ధం రోజులు.. అదేనండీ మా పదవ తరగతి పరీక్షల రోజులు. ఇంటి ముఖం చూసి నెల రోజులయ్యింది. అంటే నేనేదో హాస్టల్ లో ఇంటికి దూరం గా బ్రతుకుతున్నాననుకునేరూ.. అలాంటిదేమీ లేదు. మా దినేష్ గాడి ఇంటిలో కంబైండ్ స్టడీస్ (కలిసి చదువు కోవడం) కోసం నెల రోజుల నుండి వాళ్ళ ఇంటిలోనే ఖానా.. పీనా.. సోనా...సారీ పఢ్ నా..! నిద్ర ఆ మాట అంటేనే బూతు మాటలా బాధ పడిపోయేవారు వాళ్ళ అమ్మమ్మ.
పరీక్షలకి కనీసం పాతిక రోజులు కూడా లేదు ఎప్పుడు చూసినా నిద్ర అని చస్తావేంట్రా ముదనష్టపోడా అని చేయి నా వంక చూపిస్తూ వాళ్ళ మనవడిని తిట్టేది అమ్మమ్మ. దినేష్ గాడంటే అమ్మమ్మ కి పంచ ప్రాణాలు. తనకి ముగ్గురూ కూతుర్లే కావడం వల్ల , తన కూతుళ్ళకి పుట్టిన వాళ్ళలో మొదటి మగ సంతానం కావడం వల్ల అమ్మమ్మ మా దినేష్ గాడిని తన దగ్గరే పెంచుకుంది.
పదవ తరగతి పాసవ్వడమే ఈ మానవ జీవితానికి పరమార్ధం మీరు పుట్టిందే పదవ తరగతి పరీక్షలు పాసవ్వడం కోసం అని అమ్మమ్మ నాకు ఆ దినేష్ గాడికి రోజు కి కనీసం అరగంట హితబోధ చేసే వారు. అంత కష్టపడి వాళ్ళ ఇంటిలోనే ఎందుకు చదువుకోవాలి అనుకుంటున్నారా.. ఇచ్చిన మాట కోసం, చేసిన స్నేహం కోసం.

మా దినేష్ గాడు ఏడవ తరగతిలో ఆరు సబ్జెక్ట్ లూ (అదేలేండి అన్ని సబ్జెక్ట్ లూ) ఫెయిలైపోయాడు. నా మనవడు ఏడవతరగతే పాసవలేకపోయాడు ఇంక పదవ తరగతి ఏం పాసవుతాడని అప్పటి నుండి దిగులు పెట్టుకుంది అమ్మమ్మ. ఎనిమిదవ తరగతి నుండే పదవ తరగతి క్లాసులు చెప్పించడం మొధలు పెట్టింది. అలా మూడేళ్ళు పదవ తరగతి పుస్తకాలు చదువుతూ ఎనిమిది,తొమ్మిది తరగతులు కూడా ఫెయిలైపోయాడు. వీడు పదవ తరగతిలోకి అడుగు పెట్టాడు. అమ్మమ్మ దిగులుతో మంచం పట్టింది.
ఒక రోజు స్కూల్ నుండి దినేష్ వాళ్ళ అమ్మమ్మ కి ఫోన్ వచ్చింది అర్జెంట్ గా రమ్మని. ఏమైందో అని కంగారుగా స్కూల్ కి వచ్చింది అమ్మమ్మ. మా ప్రిన్సిపల్, మా బయోలజీ టీచర్ అమ్మమ్మ ని ప్రాదేయపడ్డారు, మీ మనవడిని వేరే స్కూల్ లో జాయిన్ చేయండి, కావాలంటే ఖర్చులన్నీ మేమే భరిస్తాం అని.మీ వాడి తెలివి తేటలకి పదవ తరగతి పాసవ్వడం కష్టం. మీ వాడి వల్ల టీచర్లకి లేని పోని రోగాలొస్తున్నాయి. మొన్న బయోలజీ లో టెస్ట్ పెడితే మీ వాడు రాసినది చూసి బీ పీ పెరిగిపోయీ సీరియస్ అయితే హాస్పిటల్ లో జాయిన్ చేసారు నన్ను అని మా బయోలజీ టీచర్ ఏడుస్తూ చెప్పారు. అదేంటండీ ఏం రాసాడు అని అమ్మమ్మ అమాయకం గా అడిగితే ఏం రాసాడా...గుండె గురించి రాయమని అడిగితే గుండె తల వెనక భాగం లో ఉంటదంట. గుండె మీద చాలా తెలుగు పాటలు ఉన్నాయి. ఉదాహరణ కి అని 'గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో... ' అని ఏదో పాట కూడా రాసాడండి.చివర్లో గుండె డయాగ్రాం (బొమ్మ) వేయమంటే లవ్ సింబల్ వేసి మద్యలో ఐ లవ్ యూ అని రాసి ఒక బాణం గుర్తు కూడా వేసాడండి... అది చూసి నాకు బీపీ పెరిగిపోతే హాస్పిటల్ లో పెట్టారండి. ఇవాలే స్కూల్ కి వస్తున్నా వారం తరువాత అని చెప్పింది. వాళ్ళ అమ్మమ్మ కాళ్ళ వేళ్ళా పడి మా ప్రిన్సిపల్ ని ఒప్పించింది స్కూల్ లో ఉంచడానికి.
అమ్మమ్మ వీడి చదువు మీద దిగులుతో మంచం పట్టింది. ఆవిడ దిగులు చూసి ఎందుకమ్మా నువ్వు దిగులు పెట్టుకున్నంత మాత్రాన పాసైపోతాడా. అయినా ఈ కాలం పిల్లలకి మనం చెప్తే బుర్రకెక్కదమ్మా. వాళ్ళ ఈడు వాళ్ళు చెప్తేనే అర్ధమయ్యిద్ది అని ఎవరో చెప్పారంట. అంతే అమ్మమ్మ కి అద్భుతమైన అలోచన వచ్చింది. అదే కంబైండ్ స్టడీస్.
మూడేళ్ళ నుండి ఆ పదవ తరగతి పుస్తకాలని అమ్మమ్మ మొహాన్ని చూస్తూ గడిపేస్తున్న దినేష్ గాడికి ఆ మాట వినగానే పులిహోర పొట్లం లో చికెన్ ముక్క దొరికినంత ఆనంద పడిపోయాడు. కాని అమ్మమ్మ ఒక కండీషన్ పెట్టింది అడ్డమయిన వెధవల్నీ తీసుకు రావడానికి వీలు లేదు మీ క్లాసులో బాగా చదివే వాల్లతోనే కలిసి చదువుకోమని. వాడు వెంటనే మా క్లాసులో ప్రియా , రమ్య , విద్య వీళ్ళు ముగ్గురూ క్లాస్ లో టాపర్స్. వాళ్ళు ఎవరైనా ఓకే అని చెప్పాడు.పాపం అమ్మమ్మ వాడి కక్కుర్తి బుద్ది ని అర్ధం చేసుకోలేక వాళ్ళని కంబైండ్ స్టడీస్ కి ఇంటికి రమ్మని అడిగింది. వాళ్ళు అమ్మమ్మ ని ఎగా దిగా చూసి అబ్బాయితో కంబైండ్ స్టడీస్ కి ఇంట్లో ఒప్పుకోరని సారీ చెప్పేసారు. వాడి ఆశలన్నీ అడియాశలయ్యయి.
అలాంటి సమయం లో క్వార్టర్లీ లో అనుకోకుండా ఒక సబ్జెక్ట్ పాసయ్యాడు వాడు. అమ్మమ్మ కి ఆశ్చర్యం. ఆ అద్భుతం ఎలా జరిగిందని వాడిని అడిగింది. వాడు కష్టపడి చదివి పాసయ్యాను అమ్మమ్మా అని చెప్పాడు. కాని అమ్మమ్మ నమ్మలేదు వాడి తల మీద వాడి చేయ్యే పెట్టి నిజం చెప్పమంది.వాడు నా దాంట్లో చూసి పాసయాడన్న రహస్యం చెప్పేసాడు. అంతే సకుటుంబ సపరివార సమేతం గా దినేష్ గాడు మా ఇంటికి వచ్చాడు.వాళ్ళ అమ్మమ్మ నన్ను మా ఇంటి ఎదురుగా ఉన్న మునగ చెట్టు ఎక్కించేసింది. మీ అబ్బాయి దానిలో చూసి రాస్తేనే మా వాడు ఒక సబ్జెక్ట్ పాసయైపోతే, మీ వాడితో కలిసి చదువుకుంటే మా వాడు ఖచ్చితం గా అన్ని సబ్జెక్టులూ పాసయిపోతాడు కాబట్టి మీ అబ్బాయి ని రోజూ చదువుకోడానికి మా ఇంటికి పంపించండి అని మా అమ్మ ని అడిగింది.మా అమ్మ అయ్యో దానిలో ఏముందండీ చదువుకోడానికేగా ఖచ్చితంగా పంపిస్తాను అని మాట ఇచ్చింది. నేను కూడా దినేష్ గాడి కోసం వస్తాను అని మాట ఇచ్చాను. అలా ఆ రోజు నుండి సాయంత్రం స్కూల్ వదలగానే వాడితో పాటు వాళ్ళ ఇంటికెళ్ళడం మొదలు పెట్టాను. అమ్మమ్మ దినేష్ గాడితో పాటు నన్ను కూడా సొంత మనవడిలా చూసుకునేది. అక్కడి దాకా బానే ఉంది ఆ తరవాత నుండే అసలు కథ మొదలయ్యింది.

దినేష్ గాడి రూం లో కూర్చుని చదువుకునే వాళ్ళం. వాళ్ళ అమ్మమ్మ మమ్మల్ని చూసి మురిసిపోయేది. గంటకొకసారి తినడానికి అరగంటకొకసారి తాగడానికి ఏదొకటి తీసుకొచ్చేది.మా దినేష్ గాడికి నిదరెక్కువ, నాకు బద్దకమెక్కువ. ఒక గంటసేపు చదివితే అబ్బో బాగా కష్టపడిపోయాను అనుకుంటాను నేను, వాడు ఆ టైం కూడా ఇవ్వడు. పుస్తకం పట్టుకున్న అయిదు నిమిషాలకే ఆవలింతలు మొదలవుతాయి, ఆరో నిమిషం లో గురక మొదలవుతుంది. కాని వాడి దగ్గర ఎవరికీ తెలియని బ్రహ్మవిద్య ఒకటుంది. నిద్రపోతూ కూడా నోరు ఆడించగలడు.. అది చూసి వాళ్ళ అమ్మమ్మ మనసులో చదువుకుంటున్నాడేమో అని సైలెంట్ గా వెళ్ళిపోయేది.
కొన్ని రోజులకి అలా పుస్తకాలు ముందేసుకుని కుర్చోవడం బోరు కొట్టి పుస్తకాలు పక్కన పడేసి కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టాం, ఒకరోజు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటుండగా దినేష్ గాడు అకస్మాత్తుగా పుస్తకం పట్టుకుని చదవడం మొదలుపెట్టాడు, ఏమైందో అర్ధమయ్యే లోపు వాళ్ళ అమ్మమ్మ లోపలికి వచ్చారు. మా ఇద్దరిని చూసింది ' కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చేడగొడుతున్నట్లుంది' అని ఒక సామెత చెప్పి వెళ్ళిపోయింది. 'అరేయ్ వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి ఆమె వస్తుందని నీకు ఎలా తెలుసు రా ?' అని అడిగితే 'అనుభవం రా అనుభవం.. మూడేళ్ళ నుండి మరి ఎలా ఉంటున్నాననుకున్నావ్' అని ఒక విలన్ నవ్వు నవ్వాడు. కానీ వాడి ఆటలు ఎంతో కాలం సాగలేదు, అమ్మమ్మ కి అర్ధమయిపోయింది తన గాజుల శబ్ధం విని వాడు అలర్ట్ అవుతున్నాడని. ఒకసారి గాజులు శబ్ధం కాకుండా రూం లోకి వచ్చి తొంగి చూసింది. మా వాడు పుస్తకం ముందు పెట్టుకుని ఒక కాలు గోడ పైన ఇంకో కాలు మంచం పైనా పెట్టుకుని నోరు తెరుచుకుని నిద్ర పోతున్నాడు. అంతే అమ్మమ్మ ఒసేయ్ రాములమ్మ అయిపోయింది.వాడిని అడ్డమయిన తిట్లూ తిట్టింది. అప్పటి నుండి రూం లో తలుపు వేసుకోవడం నిషేధం. అయినా ఆ దరిద్రుడికి నిద్ర మాత్రం తగ్గలేదు. తన బ్రహ్మ విద్య ని వాడటం మొదలు పెట్టాడు.
ఒకసారి పుస్తకం కింద పెట్టి తల కిందకి పెట్టి కళ్ళు మూసుకుని నిద్రపోతూ నోరు ఆడిస్తున్న సమయం లో అమ్మమ్మ లోపలికి వచ్చింది, వాడి ముందు కూర్చుంది. కాని వాడు అదేమీ గమనించకుండా తల కిందకి దించి నోరు ఆడిస్తూనే ఉన్నాడు. అమ్మమ్మ కి అనుమానమొచ్చింది. చిన్నగా వాడి ముందు ఉన్న పుస్తకాన్ని నిదానం గా ముందుకి లాగింది. అయినా వాడు అలాగే నోరు ఆడిస్తున్నాడు, పుస్తకాన్ని వాడి ముందు నుండి తీసేసింది, అయినా నోరు మాత్రం ఆడతానే ఉంది. అంతే నెత్తి మీద ఒక్కటిచ్చింది. వాడు నేలకి కరుచుకున్నాడు, అలా వాళ్ళిద్దరినీ చూస్తుంటే టాం అండ్ జర్రీ చూస్తున్నట్లుండేది.
అలా రోజులు గడిచిపోతూ పరీక్షలు దగ్గర పడ్డాయి, అమ్మమ్మ కి బీ పీ పెరిగిపోతుంది. నన్ను పరీక్షలయ్యే వరకు ఇంటికి వెళ్తానంటే కాళ్ళు విరగకొడతానంది. ఆ నెల రోజులూ మా కన్నా ముందు లేచి మమ్మల్ని లేపి చదువుతున్నంత సేపు మా రూం చుట్టూ తిరుగుతూ ఉండేది. ఒకసారి దినేష్ గాడిని సోషల్ లో ఒక ప్రశ్న అడిగి జవాబు చెప్పమంటే వాడు బిత్తర చూపులు చూస్తుంటే చీ వెధవ ఇది కూడా రాదా అని టక టక గుక్క తిప్పుకోకుండా ఆన్సర్ చెప్పేసింది.
పరీక్షలకి వారం ఉంది అనగా ఇంట్లో హోమాలు చేయించడం మొదలు పెట్టింది. రాష్ట్రం లోని అన్ని పుణ్యక్షేత్రాల్లో పూజలు చేయించింది. చూస్తుండగానే వారం గడిచిపోయింది. తెల్లారితే పదవ తరగతి మొట్ట మొదటి పరీక్ష. ఒకసారి ఇంటికెళ్ళి వస్తాను రేపు పరీక్షలు మొదలవుతున్నాయి కదా అమ్మా నాన్న ని చూసి వస్తాను అంటే కనికరించి అనుమతిచ్చింది.ఎక్కడ హాల్ టికెట్ ఇచ్చేస్తే మళ్ళీ రానేమో అని హాల్ టికెట్ తన దగ్గరే అట్టి పెట్టుకుంది.
తెల్లారింది. నేను స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ చేస్తుండగా దినేష్ గాడు ఆయాస పడుతు మా ఇంటికి వచ్చాడు. ఏరా ఏమైంది అని అడిగాను. అది అది హాల్ టికెట్లు పోయాయి రా అని ఏడుస్తున్నాడు. అదేంట్రా హాల్ టికెట్ పోవడమేంటి అని అడిగాను. హాల్ టికెట్ కాదు రా హాల్ టికెట్లు రా నీది కూడా పోయింది రా అని బాంబు పేల్చాడు.
అంతే దెబ్బకి కెవ్వు మని కేక పెట్టి నేను కూడా ఏడుపు మొదలు పెట్టా. అయినా అసలు ఎలా పోయాయిరా అని ఏడుస్తూనే అడిగా. పొద్దున్నే పూజ చేయించడానికి నేనూ అమ్మమ్మా గుడికి వెళ్ళాం రా. హాల్ టికెట్లు దేవుడి దగ్గర పెట్టి నాకు డిస్టింక్షన్ రావాలని నీకు స్టేట్ 1st రావాలని అమ్మమ్మ కోరుకుని కళ్ళు మూసుకుంది రా. అంతే కళ్ళు తెరిచి చూసే సరికి మాయమైపోయాయి రా అని ముక్కు తుడుచుకుంటూ చెప్పాడు.
రేయ్ దరిద్రుడా నీకు డిస్టింక్షన్ ఏంటిరా నాకు స్టేట్ 1st ఏంటిరా అసలు ఆ కోరికలు ఏంట్రా.. అలా కోరుకుని దేవుడిని దడిపిస్తే ఆయనకి కాలి హాల్ టికెట్లు ఎత్తుకెళ్ళిపోయి ఉంటాడు రా.. అయినా కోరుకునేదేదో నీ గురించి కోరుకోవచ్చుగా నా హాల్ టికెట్ కూడా దొబ్బెట్టడం ఎందుకు అని మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాను.
అందరం కలిసి కట్టు గా మా స్కూల్ కెళ్ళి మా ప్రిన్సిపల్ ముందు ఏడిస్తే ఆమె పరీక్ష కి అయిదు నిమిషాల ముందు కొత్త హాల్ టికెట్లు మా చేతిలో పెట్టింది.

ఒక్కో పరీక్ష ఒక్కో యుద్ధం చేసినంతగా ఫీలైపోయే వాళ్ళం. హిందీ అంటే మా వాడికి హడల్. నాకేమీ రాదురా ఫెయిలైపోతాను రా అన్నాడు. భయపడకు ఏదో ఒకటి రాసెయ్యి కాని చివర్లో ' హై ' అని మాత్రం రాయి అదేరా హిందీ అంటే అని ఒక చిట్కా చెప్పా. అంతే హిందీ ని హలీం చేసి వచ్చాడు మా వాడు.తరువాత లెక్కల పరీక్ష. అమ్మమ్మ వాడి అట్ట నిండా ఫార్ములాలు రాసి పడేసింది. పరీక్షలో అవి చూసి రాసేసాడు. చివరి పరీక్ష సోషల్. అది అంటే వాడికే కాదు నాకు కూడా దడే.సోషల్ పరీక్షలో చివరిలో ఒక మ్యాపు ఇచ్చి అందులో ఏ ఏ రాష్ట్రాలు ఎక్కడున్నాయో గుర్తు పెట్టమన్నారు. మా దరిద్రానికి అంతకు ముందు సంవత్సరమే ఇంకో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంట.
రాష్ట్రాలు విడిపోకూడదని మనస్పూర్తిగా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సోషల్ స్టూడెంటే ఎందుకంటే ఎన్ని ఎక్కువ రాష్ట్రాలైతే అంత ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి.
మా దినేష్ గాడు కళ్ళు మూసుకి వేలు ఎక్కడ పెడితే అక్కడ గుర్తు పెట్టేసాడంట. అలా మా చివరి పరీక్ష కూడా పూర్తయిపోయింది.

ఒక నెల రోజులు గడిచిపోయాయి. తెల్లారితే రిసల్ట్స్. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.నేను కూడా దినేష్ గాడి ఇంటికెళ్ళాను. అక్కడ ఒక ఆంబులెన్స్ సిద్ధం గా ఉంది. ఆ వాతావరణం చూసి నాకు భయమేసింది. అందరి మొహాల్లో ఉత్కంఠ. దినేష్ గాడి గురించి కాదు వాడు పాసవ్వకపోతే అమ్మమ్మ కి ఏమవుతుందేమో అని.
రిసల్ట్స్ వచ్చాయి........ నాకు స్టెట్ 1st రాలేదు కాని డిష్టింక్షన్ వచ్చింది.
తర్వాతి నెంబర్ దినేష్ గాడిది.... 2nd క్లాసులో వాడి పేరు లేదు. ఫెయిలైపోయాడని అనుమానం మొదలయ్యింది. నర్సులు ఇంజెక్షన్లూ, సెలైన్ లూ రెడీ చేసుకుంటున్నారు. 3rd క్లాసులో కూడా వెదికారు అక్కడా వాడి నెంబర్ లేదు. అంతే అమ్మమ్మ కి చిన్నగా గుండెల్లో నొప్పి మొదలవుతుంది.అందరూ ఆశలు వదిలేసుకున్నారు. స్ట్రెచర్ మీద ఎక్కిస్తున్నారు. ఆంబులెన్స్ బయల్దేరబోతుంది. నాకు ఎందుకో అనుమానమొచ్చి 1స్త్ క్లాసులో చూసా. గట్టిగా ఒక్క కేక పెట్టా. అమ్మమ్మా మన దినేష్ గాడు 1స్ట్ క్లాసులో పాసయ్యాడు అమ్మమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పాను.
అంతే అమ్మమ్మ కి నోట మాట రాలేదు. ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఊపిరి ఆడటం లేదు అని ఆక్సిజన్ పెట్టారు. ఒక పది నిమిషాలకి తేరుకుంది. దినేష్ గాడి ని దగ్గరకి రమ్మని సైగ చేసింది వాడు దిక్కులు చూసుకుంటూ అమ్మమ్మ దగ్గరకి వెళ్ళాడు.
ఈ జన్మ కి నాకు ఈ ఆనందం చాలు రా ఇంకేమి అక్కర్లేదు అని ఆస్థి మొత్తం దినేష్ గాడి పేర రాసేసింది.

10 comments:

  1. nice..
    Exams తప్పించుకోవాలని మీ దినేష్ కాని మాయం చెయ్యలేదు కదా హాల్‌టికెట్స్..

    ReplyDelete
  2. మీ బ్లాగ్ బాగుంది బ్రహ్మా గారు ఈసారి వీలుచూసుకుని మొత్తం అన్ని ఒకసారి చదివేయాలి ...... పదో తరగతి చదివితే ఈ కష్ఠాలన్ని తప్పవ్.... నేను కుడా అనుభవించా



    ReplyDelete
    Replies
    1. పెద్దమ్మ సెక్స్ స్టోరీస్

      Delete
  3. ధన్యవాదాలు భాను గారు..! తప్పకుండా సమయమున్నప్పుడు అన్నీ చదివి మీ అభిప్రాయాలు తెలియచేయగలరు. !

    ReplyDelete
  4. పదో తరగతి పాస్ అవ్వాలంటే ఇంత కష్టపడాలని అస్సలు తెలిదండీ.... :-)

    ReplyDelete
  5. idi super........

    chaala bagundhi. gmail naaku copy ani telusu.

    ReplyDelete
    Replies
    1. ఈ కధ మీకు నచ్చినందుకు సంతోషం ధన్యవాదాలు.. అనామికా స్టొరీ ని మీరు ఎక్కడ చదివారో ఆ సోర్స్ ని మాకు చూపించగలిగితే ఇంకా సంతోషం.. నా కధతో పోల్చి చూసుకుంటాను

      Delete
    2. Hai My name is phani nenu movie directorkavalani na life ambition.nenu precent oka short film thedam anukuntunnanu.naku ne help kavali help chesthara please. na email id: phani.ica@gmail.com phone no.08623030543

      Delete
    3. me mail or call kosam yeduru chusthuntanu

      Delete