Saturday, August 17, 2013

ఒక 'సొల్లు' కహానీ..!


"ఒరేయ్ ఈ రోజైనా కాలేజి కి వెళ్దాం రా...."  దీనం గా శ్రీకాంత్ గాడి వంక చూస్తూ అడిగాను... "ఇంక క్లాసులు పోతే డీటైన్ అవుతాం రా, ఇందాకే నోటీస్ బోర్డ్ లో డీటైన్ అవ్వబోయే వాళ్ళ లిస్ట్ పెట్టారు రా... అందులో మన పేర్ళే 1st ఉన్నాయి రా" అని చెప్పాను. అవునా పద చూద్దాం అని నోటీస్ బోర్డ్ దగ్గరకి వెళ్ళాడు వాడు. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు వాడి మొహం మాడిపోయిన మసాల దోశ లా తయారయ్యింది. లిస్ట్ లో వాడి పేరు ఉన్నందుకు బాధ పడుతున్నాడేమో అని ఏం కాదులేరా ఇక నుండి క్లాసులకి వెళ్తే అట్టెండన్స్ సరిపోయిద్దిలేరా అన్నాను. ఏడిసావ్లే నేను దానికి ఫీల్ అవ్వటం లేదు. లిస్ట్ లో 1st పేరు నాది ఉంది, రెండో పేరు నీది ఉంది. చూస్తే నువ్వు నాకన్న ఒక్క క్లాస్ ఎక్కువ వెళ్ళినట్లుంది. అంటే నన్ను మోసం చేసి నాకు చెప్పకుండా క్లాసులకి వెళ్తున్నవన్న మాట. ఇదేనారా ఫ్రెండ్షిప్ అంటే? అని మొహం ఇంకా మాడ్చేసాడు.
ఈ సారి మాడిన వాసన కూడా వస్తుంది. ఐనా నాకు కూడా తెలియకుండా నేను ఒక క్లాసు వాడికన్నా ఎక్కువ ఎప్పుడు వెళ్ళానబ్బా అని కాలాన్ని వేలు పెట్టి గిర్రున వెనక్కి తిప్పాను.
ఆ రోజు ఫిజిక్స్ క్లాసు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. నేను, శ్రీకాంత్ గాడు కూడా ఇంకా శ్రద్ధగా వింటున్నట్లు మొహం పెట్టి నటిస్తున్నాం. నేను నటిస్తూనే ఉన్నా కాని శ్రీకాంత్ గాడు మాత్రం నటిస్తు నటిస్తూ నిద్రపోయాడు. బెంచ్ పైన తల పెట్టి పక్షవాతం వచ్చిన వాడికి మల్లే నోరు పక్కకి పెట్టి పడుకున్నాడు. నేను ఎందుకులే లేపడం అని వదిలేసాను. కొంచెం సేపటికి నోట్లో నుండి లాలాజలం జలపాతం లా బెంచ్ మీదకి జారుతుంది. ఇంకో అయిదు నిమిషాలకి వరద ఉధృతి పెరిగి వాడి పక్కన కూర్చున్న నవీన్ గాడి వైపుకి పరుగులు పెడుతుంది. నేను నవీన్ గాడి వైపు చూసి నవ్వుతున్నాను కాని శ్రీకాంత్ గాడిని లేపలేదు. పాపం బిడ్డ అలిసిపోయి పడుకున్నాడని లేపబుద్ది కాలేదు. నవీన్ గాడిని కూడ లేపనివ్వలేదు. నవీన్ గాడికి ఏం చేయాలో తెలీక వాడి పెన్నుతో గోదావరి నదీ జలాల కోసం పోలవరం ప్రాజెక్టు కట్టినట్లు పెన్నుతో ఆయకట్ట కట్టాడు. అయినా వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ఇదంతా చూసి నేను నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసా.  అప్పటి దాకా పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారన్న గుడ్డి నమ్మకం తో బ్లాకు బోర్డ్ మీద వాలిపోయి ఏవో బొమ్మలు అవేనండి డయాగ్రాంస్ గీసుకుంటున్న మ ఫిసిక్స్ సార్ వెనక్కి తిరిగి చూసారు. టి.వి ని మ్యూట్ లో పెట్టినట్లు అందరు సైలెంట్ అయిపోయారు. ఆ సైలెన్స్ లో శ్రీకాంత్ గాడి గురక సైరెన్ మోతలా స్పష్టం గా వినపడుతుంది. నేను లేపడానికి ప్రయత్నిస్తున్నాను. కాని వాడు కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ లా నిద్రపోతున్నాడు. వాడి గురక సౌండ్ వినగానే పున్నమి నాగు సినిమాలో నాగస్వరం విన్న చిరంజీవి లా ఊగిపోయారు మా సార్. కోపం తో ఆయన చేతిలో ఉన్న చాక్ పీస్ ని శ్రీకాంత్ గాడి మీదకి విసిరేసాడు. అది గురి తప్పి సరిగ్గా నవీన్ గాడు కట్టిన పోలవరం ప్రాజెక్ట్ లో పడింది. అయినా వాడు లేవకపోయేసరికి ఇంకో చాక్ పీస్, మళ్ళీ ఇంకో చాక్ పీస్ వేస్తూనే ఉన్నారు. పడిన రెండు క్షణాల్లోనే అవి ఆ సొల్లు లో తడిసి ముద్దై చివరికి  సున్నమయిపోతున్నాయీ. అది కనుక మా ప్రిన్సిపల్ చూసుంటే ఖచ్చితం గా ఆ సున్నం తో కాలేజీ మొత్తానికి పెయింట్లు వేయించేసే వాడు.  ఇంక లాభం లేదని నేనే గట్టిగా తొడపాశం పెట్టాను. అంతే గట్టిగా ఒక కేక పెట్టి ఠక్కున లేచి కూర్చున్నాడు. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. నోట్లో నుండి మాత్రం చొంగ కారుతూనే ఉంది. పరిస్థితి ప్రమాదకర స్థాయి లో ఉందని అర్ధం చేసుకుని ఆ మూసి నది (అదేనండి వాడి నోరు) గేట్లు మూసేసాడు. కాని అప్పటికే ఆ ఉప్పెన కి నవీన్ గాడు కట్టిన పెన్ను డ్యాం కొట్టుకుపోయింది. నవీన్ గాడు వాడి రేనాల్డ్స్ పెన్ను కోల్పోయి వరద బాధితుడిలా మిగిలిపోయాడు.
ఇదంతా చూసిన మా ఫిసిక్స్ సార్ కి విపరీతమైన కోపం, డజను చాక్ పీసులు వాడి సొల్లు సునామీ లో కరిగిపోయినందుకు ఆపుకోలేనంత దుఃఖం ఒకేసారి వచ్చాయి, చేతిలో డస్టర్ ఉన్నా విసిరేస్తే మళ్ళీ తిరిగి రాదేమోనన్న భయం తో రెండు చేతుల్తో డస్తర్ ని నలుపుతూ పళ్ళు కొరుకుతూ గెటౌట్ అని గట్టిగా అరిచాడు. మా శ్రీకాంత్ గాడికి ఏమీ అర్ధం కాక బిత్తర చూపులు చూసుకుంటూ మిగిలిపోయిన బ్యాలన్స్ చొంగ ని చొక్కాకి తుడుచుకుంటూ క్లాసులో నుండి బయటకి వెళ్ళిపోయాడు. వాడికి అటెండన్స్ వేయకుండా మా సార్ ఆయన పగ కొంచెం తీర్చుకున్నాడు.  అప్పటి నుండి మా ఫిసిక్స్ సార్ ప్రత్యేకం గా వాటెర్ ప్రూఫ్ చాక్ పీసుల్ని తయారు చేయించుకుని అవే వాడడం మొదలు పెట్టాడు.
ఆ రోజు నుండి శ్రీకాంత్ గాడికి పద్మశ్రీ లాగా సొల్లు శ్రీ అని బిరుదు కూడా ఇచ్చారు. అలా వాడి సొల్లు సృష్టించిన అలజడి వల్ల ఇవాళ నేను మిత్రద్రోహి ని అన్న నింద పడాల్సి వచ్చిందని బాధతో ఆ రోజు జరిగింది మా సొల్లు శ్రీకాంత్ గాడికి గుర్తుచేసాను. అవును కదా అనవసరం గా నిన్ను అనుమానించాను రా అని ఆప్యాయంగా నన్ను వాటేసుకున్నాడు. వాడి సొల్లు నా షర్ట్ కి అంటుతుంది అయినా వాడి ప్రేమ ని చూసి ఆపలేకపోయాను.



2 comments: