Thursday, April 25, 2013

ఏలియన్స్

చెన్నై లో ఇంటర్వ్యూ, మొదటి రౌండ్ పాసయ్యాను. మళ్ళీ 3 రోజుల్లో తర్వాతి రౌండ్.ఈ 3 రోజుల కోసం వెళ్ళడం రావడం ఎందుకని చెన్నై లోనే ఉండాలని నిశ్చయించుకున్నాను. చెన్నై లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరో ఒకరి దగ్గర ఉండొచ్చులే అని ధీమా. అంతలో అభిరాం దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అభి నా ఇంజినీరింగ్ క్లాస్ మేట్. వాళ్ళది సొంత ఊరు చెన్నై. వాళ్ళ నాన్న గారి ఉద్యోగరీత్యా మా ఊరిలో ఉండాల్సి వచ్చి ఇంజనీరింగ్ మా కాలేజి లోనే చదివాడు. కాలేజిలో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య స్నేహం అంతంత మాత్రమే. వాడి గురించి మాకు పెద్దగా తెలియదు. ఎప్పుడు చూసినా పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. పరీక్షలప్పుడు మాకు చూపించడనికి మాత్రం ఉపయోగపడే వాడు. వాడి మీద మొదటి సారి ఆసక్తి కలిగింది మాత్రం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం లో. క్యాంపస్ ఇంటర్వ్యూలో   గూగుల్ కంపెనికి మా కాలేజి నుండి ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి అభి రాం. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎన్నికైనందుకు వాడి మీద ఆసక్తి కలగలేదు, అంత పెద్ద కంపెనీ లో జాబ్ ని తిరస్కరించి సంచలనం సృష్టించాడు. అప్పుడే వాడి మీద ఆసక్తి కలిగింది. ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. నేను ఆస్ట్రో ఫిసిక్స్(ఖగోళ భౌతిక శాస్త్రం) లో P.HD చేయాలి అదే నా లక్ష్యం అని చెప్పాడు. వాడు అనుకున్నట్లు గానే బెంగుళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిసిక్స్ లో సీటు సంపాదించాడు. మేము మాత్రం ఉద్యోగాల కోసం ఇంకా ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం. వాడు ఫోన్ చేసి తనకి ఇప్పుడు సెలవలు అని, చెన్నై లో ఉన్నానని నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పాడు. ఈ 3 రోజులు అక్కడే ఉందామని సిద్ధమయ్యి బ్యాగ్ తీసుకుని బయల్దేరాను.
వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను. వాళ్ళ నాన్న గారు వచ్చి తలుపు తీసారు. నన్ను గుర్తు పట్టి ఆప్యాయం గా పలకరించారు. అభి ఎక్కడ ఉన్నాడని అడిగితే తను ఉంటే తన రూంలో కంప్యూటర్ ముందు కూర్చుని ఉంటాడు లేదంటే వెనక ఉన్న మా పాత ఇంటిలో ఉంటాడు అని కిటికీ లో నుంచి ఒక పాడు పడిన ఇంటిని చూపించారు. అది వాళ్ళ తాత గారు కట్టించిన ఇల్లు. అది ఇల్లు అనడం కంటే ప్రయోగశాల అనడమే సరిగ్గ సరిపోతుంది. వాళ్ళ తాత గారు అంటే మా నాన్న గారువెంకట నారాయణ్  అయన గొప్ప సైంటిస్ట్. ఈ విశ్వం లో ఉండే ఇతర గ్రహాల గురించి చాలా పరిశోధనలు చేసారు. కాని ఆయన పరిశోధనలకి తగిన గుర్తింపు లభించలేదు. ఆయన చేసిన చాలా రీసర్చ్ లకి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు అప్పటి ప్రభుత్వం. ఆయన చనిపోయాక ఇంక ఆయన వాడిన వస్తువులు పరికరాలు అన్నీ మాకు గుర్తు గా ఉండాలని ఆ ఇంటిలోనే వాటిని భద్రపరిచాను. ఇప్పటి వరకు వాటితో నాకు ఎలాంటి ఉపయోగం కనపడలేదు. కాని ఇప్పుడు అవే వస్తువులు నా కొడుకు కి ఉపయోగపడుతున్నాయి. అభి కూడా వాళ్ళ తాత గారి లాగే సైంటిస్ట్ కావాలని తాపత్రయపడుతున్నాడు. నేను ఎంత వద్దని వారించినా ఆస్ట్రో ఫిసిక్స్ చదువుతున్నాడు. కనీసం వాడైనా వాళ్ళ తాత గారు సాధించలనుకుంది సాదిస్తాడేమో అని ఆశ గా ఉంది అని చెప్పారు. ఇంతలో అభి తన రూం నుండి బయటకి వచ్చాడు. నన్ను చూసి చాలా ఆనందపడ్డాడు. తన రూం లోకి తీసుకెళ్ళాడు. ఆ రూం కూడా చిన్న సైజు లాబొరేటరీ లాగే ఉంది. స్నానం చేసి రెడీ అయ్యి వాళ్ళ నాన్న గారితో కలిసి టిఫిన్ చేసాము. వాళ్ళ నాన్న గారు ఆఫీస్ కి వెళ్ళాక ఇద్దరం చాలా సేపు కాలేజ్ విషయాలు, కెరీర్ కి సంబంధించిన విషయాలు, తన రీసర్చ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం.
అసలు తను దేని మీద రీసర్చ్ చేస్తున్నాడని అడిగాను. ఈ విశ్వం ఆవిర్భావం ఎలా జరిగింది, నక్షత్రాలు, పాల పుంతలు ఎలా ఏర్పడ్డాయి, మన భూగ్రహం లాంటి గ్రహాలు ఈ విశ్వం లో ఇంక ఎన్ని ఉన్నాయి, వాటి లో జీవి మనుగడకి అనువైన గ్రహాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషాయల మీద వాళ్ళ అధ్యయనం ఉంటుందని చెప్పుకొచ్చాడు. తను ఇప్పుడు యూనివర్సిటీ లో నేర్చుకుంటున్న చాలా విషయాలు చిన్నప్పుడే వాళ్ళ తాత గారు తనకి నేర్పించారని, వాళ్ళ తాత గారు వెంకట నారాయణ్ గారు తన దృష్టిలో గెలీలియో అంత గొప్ప సైంటిస్ట్ అని చెప్పుకొచ్చాడు. వాళ్ళ తాత గారి పరిశోధనలు చూపిస్తా అని చెప్పి వాళ్ళ పాత ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళాడు.
తను ఆ ఇంటి తాళం తీసాక లోపలికి అడుగు పెడుతుంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్లనిపించింది. అభి వాళ్ళ తాత గారు ఇంటినే ప్రయోగశాల చేసేసారన్న వాళ్ళ నాన్న గారి మాట నిజమనిపించింది. ఎటు చూసినా ఏవో యంత్రాలు, టెలిస్కోపులు, గోడల నిండా ఏవేవో చిత్రాలు, నక్షత్ర మండల నమూనాలు, ఒక పెద్ద పాత కాలపు కంప్యూటర్, గది నిండా ఏవేవో పరికరాలు ఉన్నాయి.
అభి ఒక టెలిస్కోప్ దగ్గరకి తీసుకెళ్ళి ఇది మా తాత గారు తను సొంతం గా తయారు చేసిన టెలిస్కోప్, ఈ టెలిస్కోప్ సాయం తో మన సౌర కుటుభానికి అవతల  కొన్ని కోట్ల దూరం లో ఉన్న నక్షత్రాలని కూడా చూడొచ్చు. మన పాల పుంతలో మనం చూస్తున్న, మనకి కనపడే నక్షత్రాలు కేవలం 13 శాతం మాత్రమే, కనపడనివి 87% నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలని ఈ టెలెస్కోప్ తో చూడొచ్చు అని చెప్పాడు. మా తాత గారు ఇంత కన్నా గొప్ప పరికరం ఒకటి కనిపెట్టారు. దాని సాయంతో అత్యంత శక్తిమంతమైన  కాంతి తరంగాలని అంతరిక్షం లోకి పంపించొచ్చు. ఆ తరంగాల సాయం తో మన సౌర కుటుంబం అవతల ఉన్న గ్రహాలలో మనలా జీవించే ప్రాణులు ఉన్నాయేమో తెలుసుకుందామని మా తాత గారు ప్రయత్నించారు కాని ఆ ప్రయోగం ఫలించలేదు అని చెప్పాడు అభి.
ఎందుకు విఫలమయ్యింది ఆ ప్రయోగం అని కుతూహలం గా అడిగాను. ఈ పరికరం ద్వారా మనం పంపిన కాంతి తరంగాలని వేరే గ్రహాలలో ఉన్న జీవులు గుర్తించి వాటిని గ్రహించగలగాలి. మళ్ళీ మనం పంపిన కాంతి ప్రయాణం చేసిన మార్గం లోనే వారు తమ ఉనికి ని తెలుపడానికి ఏదైన గుర్తు ని కాంతి ద్వారా తిరిగి అదే మార్గంలో పంపాలి. అలా పంపిన కాంతి ని ఈ పరికరం గ్రహించి వాళ్ళు పంపిన సందేశాన్ని ఈ కంప్యూటర్ లో ప్రదర్శిస్తుంది. కాని ఇదంతా జరగాలి అంటే వేరే గ్రహాల మీద మనలాంటి తెలివి తేటలు ఉన్న జీవులు ఉండి ఉండాలి. మనకి ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకి ఉండి ఉండాలి. ఇవన్నీ సాధ్యమయ్యే పని కాదు అందుకే ఈ ప్రయోగం విఫలమయ్యింది అని వివరించాడు.
ఇవన్నీ నీకు మీ తాత గారు చెప్పారా అని అడిగాను. అవును చిన్నప్పుడు నేను ఎక్కువ గా మా తాత గారి తోనే గడిపే వాడిని. ఆయన అభిరుచులు ఆలోచనలు అన్నీ నాతో పంచుకునే వారు. నాకు తెలియకుండానే ఆయన ప్రభావం నా పైన చాలా పడింది. నాకు కూడా ఈ విశ్వం గురించి పరిరశోధించాలి అన్న కోరిక బలంగా తయారయ్యి ఇప్పుడు ఈ స్థితి కి వచ్చాను అని చెప్పాడు. ఇలా మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ పరికరం శబ్ధం  చేయడం మొదలుపెట్టింది. ఇద్దరం ఒక్కసారి గా ఉలిక్కి పడ్డాం. ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. అభి వెంటనే ఏదో గుర్తు వచ్చిన వాడిలా పరిగెత్తుకుంటూ వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసి ఆ మెషిన్ ని కంప్యూటర్ కి కన్నెక్ట్ చేసాడు. ఏదో ప్రోగ్రాం ఓపెన్ చేసి ఏదేదో చేస్తున్నాడు. ఏమైంది అని అడిగాను. వాడి దగ్గర నుండి సమాధానం లేదు. చాలా కంగారు పడుతున్నాడు. ఆ మెషిన్ నుండి కంప్యూటర్ లోకి ఏదో డౌన్ లోడ్ చేస్తున్నాడని మాత్రం అర్ధమవుతుంది. కొంచెం సేపు మౌనంగా వాడు చేసేది చూస్తున్నాను. ఒక పది నిమిషాల తర్వాత వాడు గట్టిగా అద్భుతం, నమ్మలేకపోతున్నాను అని కేకలేస్తున్నాడు. వెంటనే వాళ్ళ నాన్న గారికి ఫోన్ చేసి ఇంటికి త్వరగా రమ్మని చెప్పాడు. తరువాత ఆ రూం లో ఒక మూల సర్ది ఉన్న పుస్తకాలలో నుంచి ఒక పుస్తకం తీసాడు. గబ గబా పేజీలు తిప్పుతున్నాడు. ఒక చోట ఆగి చదవడం మొదలు పెట్టాడు. నాకు అంతా అయోమయం గా ఉంది. ఏమైంది అని అడిగాను. అప్పుడు వాడు కొంచెం నిదానంగా రహస్యం చెప్తున్నట్లు చెప్పాడు. మా తాత చేసిన ప్రయోగం వృధా కాలేదు, ఇన్ని సంవత్సరాల తరువాత దాని ఫలితం తెలిసింది అన్నాడు. ఏం మాట్లాడుతున్నావ్, మీ తాత గారు చనిపోయే పది సంవత్సరాలు అయ్యింది అన్నావ్. ఇంక ఆయన ఈ ప్రయోగం ఎప్పుడు చేసి ఉంటాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఫలితం రావడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాను. అంతలో వాళ్ళ నాన్న గారు మా దగ్గరకి వచ్చారు. జరిగింది మొత్తం వాళ్ళ నాన్న కి చెప్పాడు. వాళ్ళ నాన్న కూడా నమ్మలేకపోయాడు. మా ఇద్దరి అనుమానాలని అర్ధం చేసుకుని వివరించడం మొధలు పెట్టాడు.
వెంకట నారాయణ్ అంటే మా తాత రాసుకున్న డైరీ ఇది, ఈ డైరీ లో ఆయన చేసిన ప్రయోగాల గురించి మొత్తం క్షుణ్ణంగా రాసి ఉంది. సరిగ్గా నలభై యేళ్ళ క్రితం అంటే 1969 వ సంవత్సరం లో అంతరిక్షవాసుల ఉనికి కనుక్కోడానికి, వాళ్ళతో కమ్మ్యూనికేట్ అవ్వడానికి ఈ మెషిన్ ని తన సొంత తెలివి తేటలు తో తయారు చేసారు.
సరిగ్గా జనవరి 10 1969 లో మొదటి సారి ఈ మెషిన్ ని ఉపయోగించి ఒక సందేశాన్ని కాంతి తరంగాల రూపం లో ఈ మెషిన్ ద్వారా అంతరిక్షం లోకి పంపించారు. ఆ కాంతి తరంగాలు అలా అంతరిక్షం లో ప్రయాణించి సౌర కుటుంబం కక్ష లో నుండి వెలుపలికి ప్రయాణించి ఏదో ఒక గ్రహం చేరుకుంటే అక్కడ ఏదైనా జీవ జాతి ఉంటే ఆ కాంతి తరంగాలని గుర్తించి వాటిని గ్రహించి మన సందేశాన్ని అర్ధం చేసుకుని తిరిగి అదే కక్షలో కాంతి తరంగాల రూపం లో మనకి సమాధానం పంపుతాయి దానిని మళ్ళీ ఈ పరికరం ద్వారా మనం వాళ్ళు పంపిన సందేశాన్ని గ్రహించవచ్చు అనేది ఆయన లక్ష్యం. కాని ఆయన ఆశించినట్లు ఎటువంటి రిప్లై రాలేదు. రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి కాని ఎటువంటి సందేశం రాలేదు. ఆయన ప్రయోగం ఫెయిల్ అయ్యిందని ఆయన భావించారు. జీవితాంతం తన ఓటమికి బాధ పడుతూనే ఉన్నారు.
కాని నిజానికి జరిగింది ఏంటంటే ఆయన అనుకున్న దాని కంటే ఆయన చాలా పెద్ద ప్రయోగం చేసారు. మీకు వివరంగా చెప్తాను వినండి. మనం ఇప్పుడు చూస్తున్న ఈ విశ్వం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. మనం రోజూ చూస్తున్న నక్షత్రాల కాంతి నిజానికి ప్రస్తుతం ఉన్న నక్షత్రం యొక్క కాంతి కాదు, అది కొన్ని వేల సంవత్సరాల క్రితం నక్షత్రం యొక్క కాంతి. ఇంకా వివరంగా చెప్పాలంటే మనం ఇప్పుడు బయటకొచ్చి సూర్యుడిని చూసాం అనుకోండి. మనం చూస్తున్న ఆ సూర్యుడి కాంతి 8 నిమిషాల క్రితం సూర్యుడి నుండి వెలువడిన కాంతి. ఆ కాంతి భూమి ని చేరడానికి 8 నిమిషాల సమయం తీసుకున్నది అన్న మాట. సూర్యుడికి మనకి మధ్య ఉన్న దూరం దాదాపు 15 కోట్ల కిలో మీటర్లు. ఒక కాంతి తరంగం ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటాం. ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపు 10 మిలియన్ మిలియన్ కిలో మీటర్ల దూరం.
ఆ ప్రకారం మా తాత గారు ఈ పరికరం ద్వారా పంపిన అత్యంత శక్తిమంతమైన కాంతి ఒక గ్రహాన్ని చేరుకుని అక్కడి నుండి మనకి తిరిగి సమాధానం రావదానికి 40 సంవత్సరాలు పట్టింది. అంటే ఇక్కడి నుండి మనం పంపిన కాంతి 20 సంవత్సరాలకి వారికి చేరింది అన్న మాట. అంటే మా తాత గారు పంపిన కాంతి తరంగాలు 20 సంవత్సరాలు ప్రయాణించి ఒక గ్రహం చేరుకున్నయి. అంటే మనకి దాదాపు ఒక కోటి 89 లక్షల 21 వేల 56 కోట్ల 80 లక్షల కిలో మీటర్ ల దూరం లో మన లాంటి తెలివి తేటలు గల జీవులు నివసించే ఒక గ్రహం ఉన్నదన్న మాట. ఇది నిజం గా అద్భుతం.
ఇదంతా వింటుంటే నాకు మతి పోతుంది. వాడు చెప్పేది ఏది నమ్మశఖ్యం గా అనిపించలేదు నాకు. వెంటనే నేను వాళ్ళ దగ్గర నుండి ఏదో సమాదానం వచ్చిందని అన్నావ్ కదా ఇప్పుడు. ఏం పంపారు వాళ్ళు అని అడిగాను. అభి వెంటనే కంప్యూటర్ లో ఏదో ఓపెన్ చేసాడు, కాని వాళ్ళు పంపిన సందేశం ఏమి అర్ధం కాలేదు. ఇదేంటో అర్ధం కావట్లేదు, అర్ధం చేసుకునేంత  పరిజ్ఞానం, పరికరాలు ఇక్కడ లేవు. వెంటనే దీని గురించి మా యూనివర్సిటీ ప్రొఫెసర్ తో మాట్లాడి ISRO కి పంపించాలి. వాళ్ళైతేనే దీనిని డీకోడ్ చేయగలరు అని చెప్పాడు. ఆలశ్యం చేయకుండా అక్కడి నుండి బయల్దేరాం. వాళ్ళ యూనివర్సిటీ హెడ్ ని కలిసాం. ఆయన బెంగుళూరులోని ISRO సెంటర్ కి మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. ISRO లో పని చేస్తున్న పెద్ద పెద్ద సైంటిస్ట్ లు కూడా ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇది నిజమైనా దాని వల్ల మనకి పెద్ద ఉపయోగం లేదని చెప్పారు ఎందుకంటే ఒక కాంతి తరంగం అంతరిక్షంలో ఒక గ్రహాన్ని చేరడానికి 20 సంవత్సరాల సమయం తీసుకుంటే ఇక మనం అక్కడికి చేరుకోవడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి. మనం అత్యంత వేగవంతమయిన మెషిన్ లో ప్రయాణించినా దాదాపు 12000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇది వాస్తవానికి అసంభవం. కోటాను కోట్ల కిలో మీటర్ల దూరం లో ఉన్న గ్రహానికి మనం చేరుకోలేం అని వివరించారు. కాని ఈ పరిశోధన మన భవిష్యత్ పరిశోధనలకి చాలా ఉపయోగపడుతుంది అని వివరించారు. ఇంతలో ఆ గ్రహాంతర వాసులు పంపిన సందేశాన్ని డీకోడ్ చేసారు అక్కడి సైంటిస్ట్ లు. వాళ్ళు పంపిన సందేశం మొత్తం చదివి ఒక్క సారిగా భయందోళనకి గురి అయ్యారు. వెంటనే 40 సంవత్సరాల క్రితం అభి వాళ్ళ తాత గారు పంపిన సందేసాన్ని డీకోడ్ చేసి చూసారు. మాకు  ఏమీ అర్ధం కావట్లేదు అక్కడ ఏం జరుగుతుందో.
అభి కలగ చేసుకుని ఏమైంది వాళ్ళు ఏం సందేశం పంపించారు అని అడిగాడు. మీ తాత గారు చేసిన ఈ ప్రయోగం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ కలిగేలా ఉంది. ఆయన  చేసిన ప్రయోగం వల్ల మన భూ గ్రహానికి విపత్తు ఏర్పడేలా ఉంది. మీ తాత గారు పంపిన సందేశం వాళ్ళకి ఆగ్రహం తెప్పించినట్లు అనిపిస్తుంది. వాళ్ళ గ్రహాన్ని మనం నాశనం చేసేస్తామేమో అన్న భ్రమలో వాళ్ళే మన గ్రహం పైకి యుద్ధం ప్రకటించారు. మన మీదకి దండెత్తి వస్తున్నారు అని చెప్పారు. వెంటనే నేను కుతూహలం ఆపుకోలేక అదెలా సాధ్యం, ఇందాక మీరే చెప్పారు కదా ఒక కాంతి తరంగం ప్రయాణించడానికే 20 సంవత్సరాలు పడితే ఇక అత్యంత వేగంతో ప్రయానించినా 12000 సంవత్సరాలు పడుతుందని ఇక వాళ్ళు మన దగ్గరకి చేరుకోవడం అసాధ్యం కదా అని అడిగాను. వెంటనే అక్కడ ఉన్న ఒక ప్రొఫెస్సర్ నవ్వుతూ అసాధ్యం అని చెప్పింది మనకి, మనం అక్కడికి చేరుకునేంత సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర ఇంకా అభివృద్ది కాలేదు. కాని వాళ్ళు మన కన్నా 100 రెట్లు ఉన్నతమైన పరిజ్ఞానం కలిగి ఉండి ఉంటారు. మన కన్నా 100 రెట్లు అభివృద్ది చెంది ఉండి ఉంటారు అని చెప్పారు. మన కన్నా తెలివి తేటలు, మన కన్నాఅభివృద్ది   చెందిన ప్రపంచం ఉంది అంటే నమ్మ శక్యం గా లేదు అని అమాయకం గా అన్నాను. ఆయన వెంటనే నవ్వి మనమే ఉన్నతమైన ప్రాణులం అని ఎలా అనుకుంటున్నావ్. ఈ విశ్వంలో కొన్ని కోట్ల నక్షత్ర మండలాల్లో ఒకటైన నక్షత్ర మండలాల్లో ఒక చిన్న నక్షత్రం మనం చూస్తున్న సూర్యుడు. ఆ సూర్యుడిని ఆధారం గా చేసుకుని దాని చుట్టు తిరుగుతున్న అతి చిన్న గ్రహం ఈ భూమి. ఈ విశ్వం ఆవిర్భవించి దాదాపు 13.5 బిలియన్ సంవత్సరాలు అయ్యింది. మన భూమి ఏర్పడి కేవలం 4.5 బిలియన్ సంవత్సరాలు మాత్రమే అయ్యింది.
భూమి ఆవిర్భవించిన దగ్గర నుండి జీవ జాతి ప్రాణం పోసుకుని మనం ఈ దశకి రావడానికి ఇన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. మరి మన కన్నా ముందు ఏర్పడిన గ్రహాల మీద ఉన్న జీవులు మన కన్నా ఇంకెంత అడ్వాన్స్డ్ గా ఉంటాయి? ఇప్పుడు మనతో కమ్యూనికేట్ అయిన ఈ గ్రహాంతర వాసులు కూడా మన కన్నా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. వాళ్ళు పంపిన మెసేజ్ ప్రకారం మన గ్రహాన్ని ఆక్రమించుకోబోతున్నట్లు స్పష్టంగా తెలియచేస్తున్నారు అని వివరంగా చెప్పారు. వాళ్ళెందుకు మన గ్రహాన్ని ఆక్రమించాలి అని అడిగాను. వాళ్ళకి కూడా మనలాగే జనాభా బాగా పెరిగిపోయి వాళ్ళ గ్రహం వారికి సరిపోక నివాస యోగ్యం గా ఉండే గ్రహాల కోసం ఎదురు చూస్తున్నారేమో మనలాగే అని చెప్పారు.
ఈ విషయాన్ని నాసా((NASA) శాస్త్రవేత్తలతో చర్చించి ఏం చేయాలో నిర్ణయించాలి అని చెప్పారు. మేము ఇంక అక్కడి నుండి బయల్దేరి చెన్నై లో అభి వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వాళ్ళ తాత గారి ప్రయోగం వల్లే ఇదంతా జరిగిందని, దీని వల్ల వాళ్ళ తాత గారికి చెడ్డ పేరు వస్తుందని అభి చాలా బాధ పడుతున్నాడు. తరువాతి రోజు పేపర్ లలో టి వి లలో భారతీయ శాస్త్రవేత్త చేసిన ప్రయోగం వలన ఈ ప్రపంచానికి ముప్పు వాటిల్లబోతుంది అని వాళ్ళ తాత గారి పేరు ప్రముఖం గా ప్రచురించారు. ఏలియన్స్ మన భూమి మీద కి దండయాత్ర కి బయల్దేరాయాని ఇంకొన్ని రోజులలో ప్రపంచం నాశనం కాబోతున్నదని ఎవేవో కల్పిత కధనాలతో న్యూస్ మార్మోగిపోయాయి. ఇవన్నీ చూసి అభి తత్తుకోలేకపోయాడు. తన తాత గారి పేరు మీద పడ్డ మచ్చ ని ఎలాగైనా తుడిచేయాలని నిశ్చయించుకున్నాడు.
ఆ రోజు నుండే తన పరిశోధనలు మొదలు పెట్టాడు. నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి తెలుసుకున్న దాని ప్రకారం ఆ ఏలియన్స్ మన భూమి ని చేరడానికి యాభై సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు వాటిని నిలువరించ గలిగితే ఏలియన్స్ దాడి నుండి మనం తప్పించుకోవచ్చు అని చెప్పారు. ఇది వెంటనే వచ్చే ఉపద్రవం కాకపోయిన మన భవిష్యత్ తరాలు ఎదుర్కోబోతున్న అతి పెద్ద ప్రమాదం అని తేల్చారు. అభి తన పరిశోధనలో ఆ ఏలియన్స్ భూమి నుండి వచ్చిన కాంతి తరంగాలు వచ్చిన మార్గాన్ని ఆదారం గా చేసుకుని ప్రయాణిస్తున్నాయని తెలుసుకున్నాడు. అవి భూమి కి వచ్చే మార్గాన్ని వక్రీకరించగలిగితే అవి దారి తప్పి వేరే దిశగా ప్రయాణిస్తాయని, అలా చేయగలిగితే భూమికి ఎటువంటి ప్రమాదం ఉండదని ఆ దిశగా తన ప్రయోగాలు మొదలు పెట్టాడు.  రెండేళ్ళు పట్టుదలతో శ్రమించి నాసా లో శాస్త్రవేత్త గా ఎన్నికయ్యాడు. తన పరిశోధనల్ని అక్కడి నుండి కొనసాగించాడు. సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత మొదటి సారి అభిరాం పేరు వార్తల్లో కనిపించింది. బారతీయుడైన నాసా శాస్త్రవేత్త అభి రాం వెంకట నారాయణ్ తన పరిశోధన లో విజయం సాదించాడు. నాలుగు సంవత్సరాల క్రితం ఇదే అభిరాం విధ్యార్ధి గా ఉన్నప్పుడే ఏలియన్స్ నుండి భూమి కి ముప్పు ఉందన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఈ భూమిని ఏలియన్స్ దాడుల నుండి కాపాడడానికి చేసిన పరిశోధనలు సత్ఫలితాలని అందించాయని, ఇక ఈ ప్రపంచానికి ఎటువంటి హాని లేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించినట్లు పేపర్లలో ప్రచురించారు. వెంటనే టి.వి. ఆన్ చేసాను. అభి రాం ఇంటర్వ్యు వస్తుంది.

 దేవుడు ఈ సృష్టి ని లయబద్ధం గా నిర్మించాడు. కొన్ని ప్రాణులు భూమి పైన నివసించేలా, కొన్ని ప్రాణులు నీటిలో నివసించేలా ఇంకొన్ని గాలిలో విహరించేలా వాటికి తగ్గ పరిసరాలని పరిస్థితులని కల్పించాడు. కాని ఆయన చేసిన ఒకే ఒక తప్పు మనుషులకి తెలివి తేటలు ఇవ్వడం. ఆ తెలివి తేటలు ఎక్కువై ఈ విశ్వంలో తన కన్నా శక్తిమంతుడు లేడని భ్రమలో విశ్వాన్ని జయించాలని కంకణం కట్టుకున్నాడు. వేరే గ్రహాల మీదకి చొర బడాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమం లో సంభవించిన ప్రమాదమే మనం ఇప్పుడు అధిగమించిన ఉత్పాతం. నిజానికి మన అవసరం మనల్ని పరిధులు దాటి ఆలోచించేలా చేస్తుంది. ఈ భూమి పైన జనాభా నానాటికీ పెరిగి పోతుంది, ప్రపంచం మొత్తం కాలుష్య కాసారం గా మారిపోయి జీవాలు బ్రతకలేని ప్రాంతం గా మారిపోయే ప్రమాదం లో ఉంది. అందుకే మనిషి భుమి కన్నా మెరుగైన గ్రహం కనపడితే అక్కడ తన ఉనికి ని కొనసాగించాలని తపిస్తున్నాడు.నిజానికి వేరే గ్రహానికి సంబంధించినంత వరకు మనం కూడా ఏలియన్సే.   కాని మనకి ఇంకా అర్ధం కాని విషయమేంటంటే ఈ అనంత విస్వం లో కోట్లాది గ్రహాల్లో ఒక చిన్న గ్రహం మీద బ్రతుకుతున్న అల్ప జీవులం మనం. ఈ విశ్వాన్ని మనం సృష్టించలేదు. విశ్వం మనల్ని స్రుష్టించింది. మనం బ్రతకడానికి భూమి ని సృష్టించింది. ఈ భూమి ని మనం కాపాడుకుంటే చాలు ఇంక ఏ గ్రాహాల మీద పరిశోదనలు చేయాల్సిన అవసరం లేదు. మన భూమి ని కాపాడుకుందాం..... ఇదే నా నినాదం..... ఇక సెలవు......అని చెప్పి  తన ఉపన్యాసం ముగించాడు.

2 comments:

  1. bhayya అంటే ఇక్కడి నుండి మనం పంపిన కాంతి 20 సంవత్సరాలకి వారికి చేరింది అన్న మాట. అంటే మా తాత గారు పంపిన కాంతి తరంగాలు 20 సంవత్సరాలు ప్రయాణించి ఒక గ్రహం చేరుకున్నయి. ante reply ravataniki kuda 20 years pattindi kada? ante okavela vallu advanced tech kaligi unte reply ravataniki antha samayam pattakapovachu kada?

    ReplyDelete