Tuesday, August 20, 2013

కళ్యాణ్ గాడి కళ్యాణం...!

"నాన్నా కళ్యాణం...! మన పేరయ్య గారు వచ్చారు రా.. ఏవో రెండు ఫోటోలు తీసుకొచ్చారు. పెద్దగా ఏం లేరు 
రా..! ఒక పిల్ల చామంచాయగా ఉంది. ఇంకో పిల్లేమో కొంచెం కురసగా ఉన్నట్లుంది రా. నీ పక్కన పెద్దగా 
ఆనరేమోరా. వద్దని చెప్పేయమంటావా మన పేరయ్య గారికి?" ఫోన్లో మన కళ్యాణ్ వాళ్ళ అమ్మ. నువ్వాగవే తల్లీ! వచ్చిన 
సంబంధాన్ని వచ్చినట్లు వెనక్కి పంపించేస్తావ్ నువ్వొకదానివి. అయినా చామంచాయ సరిపోదంటే నా మొహానికి. అయినా మరీ 
అంత తెల్లగా ఉన్నా ఏం చేసుకుంటామే? కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించుకోకుండా దాని మొహం చూస్తా కుర్చుంటామా 
ఏంటి? ఇంక హైట్ అంటావా ఇంట్లో నేనొక తాడి గాడిని ఉన్నా సరిపోదా? ఇంకో తాడి చెట్టు కావాలా? ఐనా హైటుగా ఉన్న 
కోడల్ని తెచ్చుకుని దానితో కొబ్బరి మట్టలేమైనా కోయిస్తావా ఏంటే?
ముందు ఫోన్ పెట్టి పేరయ్య గారికి ఒక జగ్గు జూస్ చేసి పెట్టు. నేను ఇంటికొస్తున్నా" అని ఫోన్ పెట్టేసాడు కళ్యాణ్.
కళ్యాణ్: నమస్తే అండి బాగున్నారా?
పేరయ్య: ఆ బాగున్నానయ్యా నువ్వు బాగున్నావా? నీకోసమే చూస్తున్నా బాబూ.. ఇదిగో ఈ రెండు సంబందాలలో 
నువ్వు ఏదో ఒకటి ఖాయం చేసుకోవాలంతే.
ఈ శ్రావణ మాసం లో నీ పెళ్ళి అయిపోవాల్సిందే. ఎప్పుడో పోయిన పుష్కరాలప్పుడు నీకు మొదటి సంబంధం 
తీసుకొచ్చా. వచ్చే ఏడాది మళ్ళీ పుష్కరాలొచ్చేస్తున్నాయి. నీకు మాత్రం ఇంకా పెళ్ళి కాలేదు. ఈ చుట్టు పక్కల 
ఉన్న పది జిల్లాలలో పెద్దమనిషి అయిన అమ్మాయిలు ఉన్న ప్రతి ఇంటి గడపా తొక్కానయ్యా నీకోసం. ఈ రెండు 
సంబంధాలే ఇంక ఆఖరు నా ఖాతాలో అని చేతిలో ఫొటోలు పెట్టాడు.
రెండు ఫోటోలు నచ్చేసాయి. రెండూ మాట్లాడి చూడండి ఏది కుదిరితే అది చేసుకుందాం అని చెప్పాడు కళ్యాణ్.
రెండు రోజుల తర్వాత...
"సారి బాబు ఆ రెండు సంబంధాల వాళ్ళకి మన సంబంధం నచ్చలేదంట" ఫోన్ లో పేరయ్య.
ఆ పిడుగు లాంటి వార్త వినగానే ఆరడుగుల ఆజానుబావుడు అరడుగు కృంగిపోయాడు. గుండె దిటవు చేసుకుని 
ఏమైందండి ఎందుకంటా అని అడిగాడు.
పేరయ్య : ఒకరేమో ఏజ్ ఎక్కువని వద్దన్నారు. ఇంకొకరేమో గవర్నమెంట్ జాబు సంబంధమే కావాలంట . అయినా నీ 
జాతకం లో ఏదో దోషముందయ్యా లేకపోతే ఏమీ లేని వెధవలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అన్నీ ఉన్న వెధవవి 
నీకు మాత్రం అయ్యి చావట్లా? అని నాలుక కరుచుకుని సారీ బాబు ఏదో నీకు సంబంధం సెట్ చేయలేకపోతున్నా 
అన్న కోపం లో అలా అనేసా ఏమీ అనుకోకూ బాబు.
కళ్యాణ్: ఆ ఇందులో అనుకోడానికి ఏముందిలేండి. అవ్వాల్సిన టైం కి పెళ్ళి అవకపోవడం వల్ల అడ్డమైన వెధవలతో 
మాటలు పడాల్సి వస్తుంది. అని నాలుక కొరుక్కుని అయ్యో మిమ్మల్ని కాదండీ మామూలుగా అన్నాను. ఇప్పుడేం 
చేయమంటారో చెప్పండి మీరే?
పేరయ్య : ఏం లేదు బాబు నాకు తెలిసిన సిద్ధాంతి ఒకాయన ఉన్నాడు. జాతకాలు చూసి దోషాలు ఏమైనా ఉంటే దోషాలు 
తొలగిస్తాడు. ఒకసారి ఆయన్ని కలువు నాయన నీకు మంచి జరగొచ్చు.
కళ్యాణ్: అలాగే అండి.
పేరయ్య : ఇంకో విషయం. ఈ వారం మా అమ్మాయి పెళ్ళి బాబు. అమ్మ గారిని తీసుకుని తప్పకుండా రా బాబు.
కళ్యాణ్: పేరయ్య గారు మీకు పెళ్ళీడుకొచ్చిన అమ్మాయి ఉందా? ఎప్పుడూ మాట వరసకైనా చెప్పలేదేంటండీ?
పేరయ్య : ఓరినాయనో వీడి కక్కుర్తి మండిపోను అని మనసులో తిట్టుకుంటూ బాబూ మా అమ్మాయి నువ్వు 10th లో 
ఉన్నప్పుడు L.K.G చదువుతుండేది బాబు. U.K.G లో ఉన్నప్పుడు ఎవరో అబ్బాయిని ప్రేమించిందంట. ఆ 
అబ్బాయినే ఇప్పుడు పెళ్ళి చేసుకుంటుంది. లేకపోతే బంగారం లాంటి అల్లుడిని ఎందుకు మిస్ చేసుకుంటాను 
బాబు. సారీ బాబు. పెళ్ళికి కుదిరితేనే రా పర్లేదు. నీకు ఏవో పనులుంటాయి గా. ఉంటా బాబు.

సిద్ధాంతి గారి ఇంట్లో...
నమస్కారమండీ శాస్త్రి గారు..
సిద్ధాంతి : చెప్పు నాయన.. ఏ పని మీద వచ్చావ్.
కళ్యాణ్ : నా పేరు కళ్యాణ్ అండి. నాకింకా కళ్యాణ ఘడియలు రాలేదండి. ఎప్పుడొస్తాయో చూసి చెప్తారేమో అని మీ 
దగ్గరకొచ్చా అండి..
సిద్ధాంతి : నీ వయసెంత నాయనా..
కళ్యాణ్ : పాతికేళ్ళండీ...... పదేళ్ళ క్రితం...
సిద్ధాంతి : అబ్బో భూమి పుట్టక ముందు పుట్టావు..ఇంకా కళ్యాణ ఘడియలు రాకపోవడమేంతి నీ పిండాకూడు.. 
అవెప్పుడో వచ్చేసి వెళ్ళిపోయుంటాయి కూడా..
కళ్యాణ్ : అవునా అంటే ఇంక నాకు కళ్యాణ యోగం లేదా స్వామీ..
సిద్ధాంతి : ఏది ఒకసారి నీ జాతకం ఇలా ఇవ్వు... మా ల్యాబు కి పంపించి అన్ని టెస్టులు చేసి రిపోర్ట్ 
ఎల్లుండి చెప్తా..
కళ్యాణ్ : అంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ వైగరా అన్నీ చేస్తారా స్వామీ మీ ల్యాబులో..
సిద్ధాంతి : హా చేస్తాం, ఎయిడ్స్ టెస్ట్, నీ పిండాకూడు టెస్ట్ అన్నీ చేస్తాం. ఇలా అధిక ప్రసంగం చేసే వాళ్ళకే 
పెళ్ళిళ్ళు అయ్యి చావవు..
కళ్యాణ్ : అయ్యో సారీ స్వామీ ఏదో అమాయకత్వంతో అడిగేసాను. ఎల్లుండి వస్తాను స్వామీ ఉంటాను..

సిద్ధాంతి గారు చెప్పిన ఎల్లుండి..అంటే ప్రస్థుతం...

సిద్ధాంతి : రావయ్యా రా.. ఇదిగో నీ జాతకమే చూస్తున్నాను...
నీకు ఈపాటికే కనీసం ఒక పెళ్ళైనా అయిపోయి ఉండాలయ్యా... గ్రహాలు అన్నీ కూడా కరెక్ట్ పొజీషన్లలోనే ఉన్నాయయ్యా...
కళ్యాణ్ : మరెక్కడ దెబ్బ కొట్టింది స్వామీ...
సిద్ధాంతి : నీ పేరు కళ్యాణ్ కదా... ముందు వెనకా ఏమైనా ఉన్నాయా..
కళ్యాణ్ : ఉత్త కళ్యాణే స్వామీ..
సిద్ధాంతి : ఉత్త కళ్యాణా మరి ఇక్కడ కళ్యాణ్ అని మాత్రమే రాసి ఉంది ఏంటి?
కళ్యాణ్ : ఉత్త కళ్యాణ్ అంటే కళ్యాణ్ మాత్రమే అని..ముందు వెనకా ఏమీ లేదనీ..
సిద్ధాంతి : నీ బాష తగలెయ్య.. సర్లే నీ పేరే నీ పెళ్ళికి అడ్డంకి. కళ్యాణ్ అన్న పేరు వాళ్ళకి కళ్యాణం కలిసి 
రాదు నాయనా..
కళ్యాణ్ : అయ్యో అదేంటి స్వామీ.... కళ్యాణ్ అని ఈ లోకం లో చాలా మంది ఉన్నారు కదా స్వామీ... వాళ్ళంతా 
పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా పిల్లల్ని కనట్లేదా..
సిద్ధాంతి : ఉన్నారు కళ్యాణ్ బాబు అనో,కళ్యాణ్ కుమార్ అనో, కళ్యాణ్ రాం అనో ఇలా ముందు వెనకా ఏదో ఒకటి 
పెట్టుకుంటారు అందరూ...అంతే కానీ నీలా ఉత్త కళ్యాణ్ చీ చీ నీ దరిద్రపు బాష నాకు అంటుకున్నట్లుంది. 
సర్లే నీలా కళ్యాణ్ అని మాత్రమే పెట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అలాంటి వాళ్ళలో కళ్యాణ దోషం 
ఉన్న వాడివి నువ్వొకడివి... అంతెందుకు పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అప్పుడు అతని పేరు ఏంటీ?
కళ్యాణ్ : ఉత్త కళ్యాణ్ సారి సారి కళ్యాణ్..
సిద్ధాంతి : పేరు కి ముందు పవన్ తగిలించుకున్నాడు.. ఒకటి కాదు.. రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి... 
ఇప్పుడు అతని రేంజ్ ఎలా ఉందో చూస్తున్నావుగా
కళ్యాణ్ : అంటే ఇప్పుడు నేను కూడా పేరు కి ముందు ఏమైనా పెట్టుకుంటే నాకు కూడా పెళ్ళి అయ్యిద్దా స్వామీ
సిద్ధాంతి :ఖచ్చితంగా అయ్యిద్ది.. పవన్ కళ్యాణ్ లా రెండు కాకపోయినా కనీసం ఒక్కటైనా అయ్యిద్ది...
కళ్యాణ్ : అయితే అర్జంట్ గా పేరు మార్చేయండి స్వామీ..
సిద్ధాంతి :మార్చొచ్చు కాని ఒక పాతిక వేలు ఖర్చయ్యిద్ది నాయనా..
కళ్యాణ్ : పాతిక వేలు అంటే మరీ ఎక్కువ స్వామీ ఒక పది వేలైతే O.K.
సిద్ధాంతి :పది వేలకి పెళ్ళి దాకా అవ్వడం కష్టం నాయనా.. ఎంగేజ్మెంట్ వరకు అయితే O.K.
కళ్యాణ్ :వద్దులే స్వామీ ఇదిగోండి పాతిక వేలు...
సిద్ధాంతి :మంచిది...ఇప్పుడు చెప్పు నీ పేరు కి ముందు ఏం పేరు పెడదాం. పవన్ కళ్యాణ్ అని 
పెట్టుకుంటావా బాగా పాపులర్ పేరు కదా...
కళ్యాణ్ :వద్దు స్వామీ ఆ పేరు జనాలలో బాగా పాపులర్ అయిపోయింది. ఏదైనా కొత్త పేరు పెట్టండి స్వామీ
సిద్ధాంతి :పోనీ వాళ్ళబ్బాయి పేరు అఖీరా పెట్టుకుంటావా? లేటెస్ట్ పేరు...
కళ్యాణ్ : అఖీరా కళ్యాణ్... ఇదేదో బాగుంది స్వామీ... ఇదే ఖాయం చేసుకోండి..

ఒక అరగంట పుజా పునస్కారాల తర్వాత సిద్దాంతి గారు కళ్యాణ్ నుదుటిన మూడు నామాలు పెట్టి నాయాన ఇక 
నుండి నీ పేరు అఖీరా కళ్యాణ్...
థాంక్స్ స్వామీ అని సిద్దాంతి గారి కాళ్ళ మీద పడగానే ఆయన కళ్ళు మూసుకుని కళ్యాణ ప్రాప్తిరస్తు అని 
దీవించగానే..... 'ఇది కళ్యాణం కమనీయం జీవితం ...' అని రింగ్ టోన్ తో మన కళ్యాణ్ సారీ మన అఖీరా కళ్యాణ్ 
ఫోన్ మ్రోగింది.
'నాన్నా కళ్యాణం నీకు సంబంధం ఖాయమయ్యింది రా... అని వాళ్ళ అమ్మ గొంతు ఫోన్ లో...
వెంటనే నోట మాట రాక ఫోన్ కట్ చేసి స్వామీ అని శాస్త్రి గారి కాళ్ళ మీద పడిపోయి మీరు ఇలా పేరు మార్చారు....అలా 
పెళ్ళి సంబంధం ఖాయమైపోయింది. మీరు మహానుభావులు... అని పొగిడి పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళాడు...
అమ్మా నువ్వు చెప్పింది నిజమేనా అమ్మా.. నిజంగా పెళ్ళి సంబంధం ఖాయమయ్యిందా అమ్మా అని ఆప్యాయం గా వాళ్ళ 
అమ్మ ని అడిగాడు.
అవును రా పిచ్చి మొద్దు... ఆ అమ్మాయి పేరు కళ్యాణి అంట. పేరయ్య గారు నీ పేరు చెప్పంగానే ఎగిరి 
గంతేసిందంట..
ఆ అమ్మాయి కి కళ్యాణ్ అన్న పేరు ఉన్న అబ్బాయినే చేసుకోవాలని కోరికంట.. కనీసం కళ్యాణ్ కి ముందు వెనకా 
ఎమైనా పేరు ఉన్నా కూడా ఒప్పుకునేది కాదంట. తన పెళ్ళిలో కళ్యాణ్ వెడ్స్ కళ్యాణి అని చుసుకోవాలని కోరికంట. 
అందుకే కేవలం నీ పేరు కళ్యాణ్ అని చెప్పగానే నిన్నే చేసుకుంటా అని ఒంటి కాలి మీద తపస్సు చేస్తుందంట.. 
చూసావారా ఎప్పుడూ.... నా పేరులో కళ్యాణం ఉంది కాని నా జీవితం లో కళ్యాణం లేదని బాధ పడే వాడివి కదరా.. 
ఇప్పుడు నీ పేరే నీ పెళ్ళి చేస్తుంది..
మన కళ్యాణ్ కి సారీ అఖీరా కళ్యాణ్ కి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.. పంతులు గారు పేరు మార్చడం వల్ల 
పెళ్ళి కుదిరిందా? నా పేరు వల్ల పెళ్ళి కుదిరిందా... ఏమీ అర్ధం కావటం లేదు అనుకుంటూ కొంచెం సేపటికి 
తేరుకుని అమ్మా అఖీరా కళ్యాణ్.. ఈ పేరు ఎలా ఉందమ్మా..
నీ బొందలా ఉంది...

3 comments:

  1. కళ్యాణ్ గాడి కళ్యాణం ela jarigindho mari??????????

    ReplyDelete
  2. Best casinos with Slots from Vegas Casinos | Mapyro
    Play the best casino games with real casino 창원 출장안마 slots 속초 출장안마 from Vegas Casinos. Play thousands of free casino games, 안산 출장마사지 get 제천 출장마사지 a 100% bonus, 통영 출장샵

    ReplyDelete