Tuesday, April 2, 2013

రాంగ్ నెంబర్

ఫోన్ రింగ్ అవుతున్న శబ్ధం విని మెళుకువ వచ్చింది. కళ్ళు నులుముకుంటూ ఫోన్ వంక చూసాను. ఏదో తెలియని నెంబర్. గోడకి వేలాడుతున్న ఘడియారం వంక చూసాను. టైం అర్ధరాత్రి  12.20 అవుతుంది. ఇంత రాత్రి టైం లో ఫోన్ చేసి నిద్ర చెడగొట్టిన ఈ దరిద్రుడు ఎవడ్రా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసాను. ఎవరిదో మగ గొంతు.చాలా గంభీరం గా ఉంది. నేను హలో అని కూడా అనకుండానే నా పేరు చెప్పి నువ్వేనా అని అడిగాడు. హా అవును మీరెవరు? నిద్ర మత్తులోనే సమాధానం చెప్పి వాడిని తిరిగి ప్రశ్నించాను. నీకు సుధ తెలుసా? అని అడిగాడు. ఆ మాట వినగానే నిద్ర మబ్బు మొత్తం వదిలిపోయింది. వాడు మళ్ళీ అదే ప్రశ్న వేసాడు. నీకు సుధ తెలుసా?  అని. నేను వాడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వెవరు అసలు అని అడిగాను. నేను చీరాల టౌన్ S.I ని మాట్లాడుతున్నాను. సుధ అనే అమ్మాయి ఒక గంట క్రితం  చనిపోయింది అన్నాడు. అంతే పడుకుని ఉన్న వాడిని కాస్తా ఒక్కసారి లేచి కూర్చున్నాను. సుధ చనిపోయిందా? నేను సరిగ్గానే విన్నానా?. నాకేం మాట్లాడాలో అర్ధం కాలేదు. వెంటనే ఫోన్ కట్ చేసేసాను. ఒక రెండు గంటల క్రితమే కదా తనతో మాట్లాడాను. బానే మాట్లాడింది కదా. మరిదింతా ఏంటి? అసలు ఫోన్ చేసింది ఎవడు? నిజం గానే పోలీస్ ఆ? మా ఫ్రెండ్స్ ఎవరైనా కావాలని ఏడిపించడానికి చేస్తున్నారా? కరక్టే వాళ్ళే అయి ఉంటారు? ఆ నవీన్ గాడు చాలా సార్లు గొంతు మార్చి వేరే వేరే నెంబర్ల నుండి కాల్ చేసి ఆట పట్టిస్తుంటాడు. వాడే అయి ఉంటాడు. వాడికి సుధ మేటర్ కూడా తెలుసు. చాలా సార్లు పరిచయం చేయమని ఛావగొట్టాడు. అయినా ఆట పట్టించడానికి వేళా పాళా లేదా అని పిచ్చ కోపం వచ్చి వెంటనే వాడి నెంబర్ కి ఫోన్ చేసా. ఫోన్ ఎత్తగానే అడ్డమైన బూతులు తిట్టాను. కాని వాడు కాదని తర్వాత అర్ధమయ్యింది. వాడితో ఫోన్ లో మాట్లాడుతుండగా సుధ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. కాల్ వెయిటింగ్ లో ఉంది. వెంటనే నవీన్ గాడి ఫోన్ కట్ చేసి తన ఫోన్ ఎత్తాను. కాని మాట్లాడుతుంది సుధ కాదు. ఇందాక మాట్లాడిన మగ గొంతే. ఏరా ఫోన్ కట్ చేసావేంటి? నాటకాలేస్తున్నావా? ఫోన్ కట్ చేస్తే దొరకకుండా పోతావా? అని మాట్లాడుతున్నాడు. అప్పటికి కాని నాకు అర్ధం కాలేదు నేను చాలా సీరియస్ ప్రాబ్లం లో ఉన్నాను అని. వెంటనే లేదు సార్, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆట పట్టిస్తున్నారు అనుకున్నాను. అందుకే కట్ చేసాను. సారీ సార్. అసలేమైంది సార్ అని దీనంగా అడిగాను. అప్పుడు చెప్పాడు అసలు విషయం. ఇందాకా 10 గం. లకి ఫోన్ వచ్చింది స్టేషన్ కి. ఎవరో అమ్మాయి శవం సముద్రం ఒడ్డున పడి ఉందని. వెంటనే అక్కడికి వెళ్ళి చూసాం. ఆ అమ్మాయి హాండ్ బాగ్, చెప్పులు ఒడ్డున వదిలి ఉన్నాయి. అందులో వస్తువుల ఆధారం గా వాళ్ళ వాళ్ళకి కబురు చేసాము. ఆమె ఇంట్లో వాళ్ళని అడిగితే 9 గం. లకి ఏదో ఫోన్ వస్తే ఫ్రెండ్ ని కలిసి వస్తాను అని చెప్పి హడావిడిగా బయల్దేరిందని చెప్పారు. ఆ అమ్మాయి ఫోన్ పరిశీలిస్తే తన దాంట్లో చివరగా వచ్చిన ఫోన్ నీ నెంబర్ నుండే ఉంది. అంటే ఆ అమ్మాయి నిన్ను కలవడానికే బయటకి వచ్చింది నిజమేనా? అని గదమాయించాడు. తనకి నేను 9 గం. ల సమయం లో ఫోన్ చేయడం నిజం, ఒక గంట సేపు ఫోన్ మాట్లాడి పెట్టేసాను. అంతే కాని ఆ అమ్మాయి ని నేను బయటకి రమ్మనలేదు. అయినా నేను ఉండేది విజయవాడ లో. తను ఉంది చీరాలలో. తనని ఆ టైం లో ఎలా కలవగలను సార్? అని జరిగింది చెప్పాను. కాని ఆ S.I మాత్రం నేను చెప్పేది నమ్మట్లేదు. ఇవన్నీ కాదు మీ అడ్రస్ చెప్పు కానిస్టెబుల్ ని పంపిస్తాను అన్నాడు. నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. మా ఇంటికి పోలీసులు వస్తే ఇంకేమైనా ఉందా? అసలు నేనేం తప్పు చేసాను. నేను తనతో కేవలం ఫోన్ మాట్లాడాను. అసలు నేను ఇంతవరకు ఆ అమ్మాయి మొహం కూడా చూడలేదు. ఆ అమ్మాయి చనిపోవడానికి నాకు సంబంధం ఏంటి. కాని ఇప్పుడు ఇంటికి పోలీసులు వస్తే మా పరువు మొత్తం పోతుంది. ఇంట్లో నన్ను హీనం గా చూస్తారు. వెంటనే లేదు సార్. నేనే ఉదయం కల్లా చీరాల కి వస్తాను. మిమ్మల్ని కలుస్తాను. దయ చేసి ఇంటికి ఎవరినీ పంపకండి.నిజం గా నేనే తప్పూ చేయలేదు. రేపు ఉదయం కల్లా మీ ముందు ఉంటాను అని చెప్పాను. అతనేమనుకున్నాడో ఏమో సరే ఉదయం కల్లా నా ముందు ఉండాలి లేదంటే మద్యాహ్నం కల్లా పోలిసులు మీ ఇంట్లో ఉంటారు అని నా వివరాలు తీసుకుని ఫోన్ పెట్టేసాడు.
నాకేమీ అర్ధం కావటం లేదు. సుధ చనిపోయిందన్న బాధ కన్నా నేను ఇందులో ఇరుక్కున్నాననే భయమే ఎక్కువగా ఉంది. ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పేదామనిపించింది. మళ్ళీ ఇప్పుడే చెప్తే కంగారు పడతారు. అనవసరం గా రార్దాంతం అవుతుంది. రేపు చీరాల వెళ్ళాక అక్కడి పరిస్థితులను బట్టి చెప్దాం అనుకున్నాను. ఆ రాత్రంతా నిద్రే పట్టలేదు. తెల్లవారు ఝామునే లేచి ఇంట్లో వాళ్ళకి పని మీద ఊరు వెళ్తున్నా అని చెప్పి బయల్దేరి చీరాల బస్ ఎక్కాను. ఏం జరుగుతుందో అని భయపడుతూనే ఉన్నాను. అసలు ఇదంతా ఒక కలలా ఉంది. అసలు సుధ తో పరిచయమే ఒక కలలా ఉంది.
ఆ రోజు మా ఫ్రెండ్ పుట్టిన రోజు. అందరం రెస్టారెంట్ కి వెళ్ళాం. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిశాం కదా బాగా ఎంజాయ్ చేయొచ్చనుకున్నాను. కాని అక్కడకి వెళ్ళాక ఎవడికి వాడు ఫోన్ లో మాట్లాడుకోవడమో, మెసేజ్ లు చేసుకోవడమో చేస్తున్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ గాళ్ ఫ్రెండ్స్ తో చాలా బిజీగా ఉన్నారు. నాకు పిచ్చ కోపం వచ్చి అందరినీ తిడుతున్నాను ఏరా ఈ మాత్రం దానికి రెస్టారెంట్ కి రావడం ఎందుకు. ఇళ్ళల్లో కూర్చుని సొల్లు వేసుకోవచ్చుగా అని అన్నాను. అంతలో నవీన్ గాడు ఏరా నువ్ మాట్లాడవా ఏంట్రా నీ గాళ్ ఫ్రెండ్ తో? తొక్కలో సలహాలు చెప్పకు అన్నాడు. నేను మీ లాగా సెల్ ఫోన్ లో సొల్లు కార్చే టైపు కాదు రా. అయినా నాకెవరూ గాళ్ ఫ్రెండ్స్ లేరు అని చెప్తున్నాను. అంతలో నా సెల్ కి ఏదో మెసేజ్ వచ్చి మెసేజ్ టోన్ వినబడింది. అంతే చా మరి ఇప్పుడు మెసేజ్ ఎవరు పంపారమ్మా? ఏది నీ ఫోన్ ఇవ్వు చూద్దాం అన్నాడు. ఏదో కంపెనీ మెసేజ్ వచ్చుంటదిలే అని వాడికి సెల్ ఇచ్చాను చూడమని. వాడు మెసేజ్ ఓపెన్ చేసి నా వైపు చూసి హాయ్ బంగారం ఏం చేస్తున్నావ్? అన్నాడు. అందరూ పడి పడీ నవ్వారు. వాడు చదివిన విధానానికి నాకు కూడా నవ్వొచ్చింది.
వెంటనే వాడి చేతిలో సెల్ తీసుకుని చూసాను. వాడు చదివింది నిజమే. అక్షరం పొల్లు పోకుండా అలాగే ఉంది. నెంబర్ చూస్తే నాకు తెలిసిన నెంబర్ లా లేదు. నవీన్ గాడు వెంటనే 'ఏరా మీరేమో బంగారం సింగారం అని మాట్లాడుకోవచ్చు, మేము మాట్లాడుకుంటే మాత్రం సొల్లా? అని అడిగాడు. అసలు ఈ నెంబర్ ఎవరిదో నాకు తెలీదు రా. ఎవరు పంపారో కనుక్కుందాం ఉండు అని వాళ్ళ ముందే ఆ నెంబర్ కి ఫోన్ చేసాను. ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అన్న మాట వినపడింది. ఆ ఒక్క మాటకే నా చెవుల్లో ఎవరో తేనె ఒంపినట్లనిపించింది. అంత తీయగా ఉంది ఆ స్వరం. తను హలో అన్న ఒక పది క్షణాల వరకు నాకేదో మైకం కమ్మేసినట్లనిపించింది. తర్వాత తేరుకుని హలో ఎవరండీ, నా నెంబర్ కి మెసేజ్ పంపారు? అని అడిగాను. నేనా నేనేం పంపలేదే అన్నది ఆ స్వరం. హాయ్ బంగారం ఏం చేస్తున్నావ్ అని మీ నెంబర్ నుండే మెసేజ్ వచ్చిందండి అన్నాను. తను వెంటనే ఓహ్, ఆ మెసేజ్ మీకు వచ్చిందా? నేను మా ఫ్రెండ్ స్వప్న కి పంపానండి. రాంగ్ నెంబర్ కి వెళ్ళినట్లుంది. సారీ అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసేసింది. అంతే అప్పటి దాకా వింటున్న ఇళయరాజా సంగీతం ఒక్కసారిగా మద్యలో ఆగిపోయినట్లనిపించింది. ఆక్సిజన్ అందక ఊపిరాగిపోతుందేమో అన్నట్లు వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేసాను ఆ కోకిల గొంతు వినడానికి. రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా మళ్ళీ ఫోన్ చేసారేంటి అని విసురుగా అంది. ఈ సారి ఇళయరాజా సంగీతం ఫాస్ట్ బీట్ విన్నట్లనిపించింది. ఏం లేదు మీ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది. మీ పేరేమిటి? ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారని అడిగాను. రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా. ఇంకెందుకు నా వివరాలు అని కసురుకున్నట్లు మాట్లాడింది. నేను ప్లీజ్ చెప్పండి అని వేడుకున్నట్లు అడిగాను. నా పేరు సుధ, మాది చీరాల అని చెప్పింది. అలా ఒకరికి ఒకరం పరిచయం చేసుకున్నాం. ఆ రోజు నుండి రోజు నేను గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు టైం తప్పకుండా మెసేజ్ లు పంపే వాడిని. మొదట్లో కొంచెం బెట్టు చేసినా తర్వాత తర్వాత తను కూడా మెసేజ్ లు చేయడం, ఫోన్ చేయడం మొదలు పెట్టింది.
తను చీరాల లో ఏదో ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తున్నానని, ఇంకా పెళ్ళి కాలేదని, నాన్న చనిపోయారని, తను వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటున్నారని చెప్పింది. తను పరిచయమయ్యి నెల రోజులైయ్యింది. ఈ నెల రోజుల్లో తనతో మాట్లాడకుండా ఉన్న ఒక్క రోజు కూడా లేదు. రోజుకి కనీసం అరగంటైనా ఫోన్ మాట్లాడకుండా ఉండే వాళ్ళం కాదు. రోజు రోజు కీ తన మీద ఇష్టం పెరిగిపోతుంది. ఒక్కసారి తనని చూడాలి అనిపించింది. అదే విషయం తనకి చెప్పి ఎప్పుడు కలుద్దామని అడిగాను. కుదిరినప్పుడు నేనే చెప్తాను. అప్పటి వరకు అడగకు అని చెప్పింది. నిన్న రాత్రి తన సెల్ నుండి మిస్స్ డ్ కాల్ వచ్చింది. వెంటనే తిరిగి కాల్ చేసాను. రోజూ లాగే ఫోన్ మాట్లాడుకున్నాం. ఎక్కడ ఉన్నావంటే ఇంటి దగ్గరలోనే ఉన్నాను అని చెప్పింది. మాటల మద్యలో ఎప్పుడు కలుద్దాం అంటే ఈ ఆది వారం నేను ఖాళీ గానే ఉంటాను. కుదిరితే రమ్మంది. తను రమ్మనడమే ఆలస్యం ఎప్పుడు వాలిపోదమా అన్నట్లు ఉన్న నాకు తన ఆహ్వానం నచ్చింది. కచ్చితం గా వస్తాను అని చెప్పి ఆనందం గా ఫోన్ పెట్టేసాను. కాని ఆ తర్వాత ఏం జరిగింది. తను ఎందుకు చనిపోయింది. అసలు బీచ్ దగ్గరకి ఎందుకు వెళ్ళింది ఆ టైం లో. నాకెందుకు ఇంటి దగ్గరే ఉన్నా అని అబద్ధం చెప్పింది అని అలోచిస్తుందగా ఫోన్ రింగ్ అయ్యింది. ఆ S.I కాల్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావ్ అన్నాడు. దగ్గరలోనే ఉన్నాను. బస్ లో ఉన్నాను అని చెప్పాను. సరే నేను బస్ స్టాండ్ లోనే ఉన్నాను. త్వరగా రమ్మని ఫోన్ పెట్టేసాడు. ఒక పది నిమిషాల్లో బస్ స్టాండ్ కి చేరుకున్నాను. బస్ దిగి కాల్ చేసాను.
ఖాకీ ఫ్యాంట్, తెల్ల చొక్క, నల్ల బూట్లు వేసుకుని ఒక వ్యక్తి నా ఎదురు నిలబడ్డాడు. చూడడానికి పోలీస్ లాగే ఉన్నాడు. వాడితో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడు. నా పేరు అడిగి నేనే అని ధ్రువీకరించుకుని తన జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డ్ చూపించి పద స్టేషన్ కి వెళ్దాం అన్నాడు. స్టేషన్ అనేసరికి నాకు కంగారొచ్చేసింది. సార్ నేను ఏ తప్పూ చేయలేదు. జరిగింది చెప్తాను వినండి అని బ్రతిమాలాను. వాడు కొంచెం ఆలోచించి సరే అని పక్కనే ఉన్న హోటల్ లోకి తీసుకెళ్ళి కూర్చుని చెప్పమన్నాడు. నేను గుక్క తిప్పుకోకుండా జరిగిందంతా పూస గుచ్చినట్లు వివరంగా చెప్పాను. అసలు తనని ఇంతవరకు చూడలేదనీ, తను చనిపోవడానికీ నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాను. నేను చెప్పినదంతా తాపీగా విని నువ్వు చెప్పేదంతా నిజమే అనిపిస్తుంది, కాని వాళ్ళ అమ్మ మాత్రం ఫోన్ వచ్చాకే బయటకెళ్ళింది నా కూతురు అని చెప్తుంది. తన ఫోన్ చూస్తే ఏమో నువ్వే చేసినట్లు ఉంది అని తన దగ్గర ఉన్న సుధ ఫోన్ లో నా నెంబర్ చూపించాడు. లేదు సార్ నిజం గా నాకేమి తెలియదు. నన్ను నమ్మండి. ఇప్పుడు అనవసరం గా ఈ కేసు లో ఇరుక్కుంటే నా జీవితం నాశనమవుతుంది. మా పరువు పోతుంది అని దాదాపు ఏడ్చినంత పని చేసాను.
అతను కాసేపాలోచించి తనతో ఉన్న వాడిని పక్కకి తీసుకెళ్ళి ఏదో మంతనాలు జరిపి మళ్ళీ ఇద్దరూ నా దగ్గరకి వచ్చారు. ఆ S.I నాతో నువ్వు చెప్పిందంతా వింటుంటే నిజమే అనిపిస్తుంది. కాని సాక్ష్యమేమో బలం గా ఉంది. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసాము. గవర్నమెంట్ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం జరుగుతుంది. అది జరిగాక కాని అది ఆత్మ హత్యో, లేక హత్యో తెలియదు. ఒక వేళ హత్య కేసు ఐతే మాత్రం నిన్ను ఎవరూ కాపాడలేరు అని చెప్పాడు. నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు. హత్య కేసు అనేసరికి ముచ్చెమటలు పోసేసాయి. నా భయం వాడికి స్పష్టం గా అర్ధమవుతుంది. అతను భయపడకు, ఒక పని చేస్తే నువ్వు ఈ కేసు నుండి బయటపడొచ్చు. కాని అది మాకు చాలా రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పాడు. నేను వెంటనే సార్ ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేయండి అని బ్రతిమాలాను. సరే ఐతే నువ్వు ఒక లక్ష రూపాయలు మా చేతిలో పెడితే ఈ సెల్ లో ఉన్న నీ నెంబర్ ని తీసేస్తాం. అప్పుడు నీకు ఈ కేసు కి ఏం సంబంధం ఉండదు అన్నాడు. లక్ష రూపాయలు అనేసరికి నాకేం చేయాలో అర్ధం కాలేదు. కాని ఎలాగైనా ఈ దరిద్రం వదిలించుకోవాలని సార్ అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు సార్. ఒక యాభై వేలైతే రేపటికి ఇవ్వగలను అని చెప్పాను. మొదట కాదు కుదరదన్నాడు.తర్వాత ఒప్పుకున్నాడు. కాని ఇప్పుడు ఒక పది వేలైనా ఇస్తేనే పంపిస్తానన్నాడు. ఇక చేసేదేమి లేక పది వేలు వాడికి ఇచ్చి రేపు ఇదే టైం కి మిగతా డబ్బులు ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి కదిలాను.
విజయవాడ చేరుకున్నాక తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అప్పు కోసం ప్రయత్నిస్తున్నాను. మా ఫ్రెండ్స్ కి కూడా విషయం చెప్పకుండా డబ్బులు కావాలి చాలా అవసరం అని చెప్పాను. ఎందుకు, ఏమిటి అంటే ఒక్కొక్కరికీ ఒక్కో కారణం చెప్పాను. మా ఫ్రెండ్స్ కి అనుమానమొచ్చి అందరూ కలిసి నా దగ్గరకొచ్చి ఏం జరిగిందో చెప్పమని నిలదీసారు. ఇక తప్పక వాళ్ళకి జరిగిందంతా చెప్పాను. మొత్తం విన్నాక 'అరేయ్, తను ఎలా చనిపోయిందో తెలియదు, అసలు తనని ఇంత వరకు నువ్వు చూడను కూడా చూడలేదు, నువ్వెందుకు భయపడుతున్నావ్. ఎందుకు యాభై వేలు వాడికి ఇవ్వాలి. వాడు కేవలం సుధ ఫోన్ లో నీ నెంబర్ చూపించి బెదిరిస్తున్నాడు. అసలు ఆ రోజు నువ్వు ఫోన్ చేసాక ఇంకెవరైనా ఫోన్ చేసారేమో కనుక్కుందాం ఉండు అని నవీన్ గాడు కాల్ సెంటర్ లో పని చేస్తున్న తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి సుధ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కి తను చనిపోయిన రోజు వచ్చిన కాల్స్ లిస్ట్ ఇవ్వమని అడిగాడు. ఒక అరగంటలో కాల్ లిస్ట్ వచ్చింది. 9 గం. లకి నా ఫోన్ వచ్చిన తర్వాత ఇంకెవరి ఫోన్ కైన కాల్స్ వెళ్ళాయా, లేక వచ్చాయా అని చూసాం. ఆశ్చర్యం, ఆ లిస్ట్ లో నా నెంబర్ కి కాకుండా ఇంకో నెంబర్ కి చాలా సార్లు కాల్స్ వెళ్ళినట్లు ఉంది. చివరగా నేను చేసాక కూడా అదే నెంబర్ కి కాల్ వెళ్ళింది. నేను చేయడానికి ముందు కూడా అదే నెంబర్ నుండి కాల్ వచ్చినట్లుంది. ఆ నెంబర్ ని చూడగానే వెంటనే గుర్తు పట్టాను. అది ఆ S.I నెంబరే. అదే విషయం మా ఫ్రెండ్స్ కి చెప్పాను. అంటే ఆ S.I గాడు సుధ కి ముందు నుండే తెలుసా? ఇందులో ఏదో మతలబు ఉంది. అసలు వాడు నిజం గా పోలీసేనా? అని మా ఫ్రెండ్ అడిగాడు. హా అవును రా, నన్ను కలిసినప్పుడు వాడి ఐ.డి కార్డ్ చూపించాడు, వాడి ఐ.డి నెంబర్ కూడా నాకు గుర్తుందని చెప్పాను. వెంటనే మా ఫ్రెండ్ చీరాల లో తనకి తెలిసిన వారికి ఫోన్ చేసి ఆ S.I  పేరు , నెంబరు చెప్పి అతని గురించి కనుక్కోమని చెప్పాడు. మేము ఆలశ్యం చేయకుండా అందరం చీరాల కి బయల్దేరాం. మా ఫ్రెండ్ కి తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళాం. ఆ రోజు న్యూస్ పేపర్ లో మొత్తం వెతికాము. ఎక్కడా బీచ్ సమీపం లో చనిపోయిన వార్త రాయలేదు.
వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి మూడు రోజుల నుండి చనిపోయిన వారి వివరాలు తీసుకున్నాం. సుధ అనే వారెవరూ చనిపోయినట్లు ఎక్కడా లేదు. పైగా పోస్ట్ మార్టం కేసులేవి లేవని చెప్పారు. ఇంతలో ఆ S.I వివరాలు తెలిసాయి. వాడు అదే స్టేషన్ లో పని చేసే వాడని, కాని ఒకసారి లంచం తీసుకుంటూ దొరికిపోయి సస్పెండ్ అయ్యాడని, ఇంకా కేసు కోర్టులో నడుస్తుందని, అంతే కాకుండా సస్పెండ్ అయ్యాక కూడా పోలీస్ లా అందర్ని బెదిరించి మోసాలు ఛేస్తున్నాడని చాలా కంప్లైంట్లు వచ్చాయంట అని చెప్పాడు. ఇవన్నీ విన్నాక నాకు దిమ్మ తిరిగింది. అంటే సుధ నిజం గా చనిపోలేదు, సుధ కి ఆ S.I గాడికి ఏదో సంబంధం ఉంది. ఇద్దరూ కావాలని నాటకమాడి నన్ను బ్లాక్ మయిల్ చేసి డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారన్న మాట. ఇంక నిమిషం కూడా ఆలశ్యం చేయకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి జరిగినదంతా చెప్పి కంప్లైంట్ ఇచ్చాం. పోలీసుల పధకం ప్రకారం ఏమీ జరగనట్లు వాడు చెప్పిన టైం కి వాడిని కలిసి డబ్బులు ఇస్తుండగా పోలీసులు వచ్చి వాడిని పట్టుకున్నారు. స్టెషన్ లో పెట్టి వాళ్ళ పద్దతిలో అడిగాక మొత్తం విషయం చెప్పాడు. సుధ అన్న అమ్మాయి అసలు పేరు రాణి అని, ఆమె వాడి భార్యే అని, తన భార్యతోనే ఇలా రాంగ్ నెంబర్ లకి ఫోన్ చేయించి అమాయకులని వలలో వేసుకుని డబ్బులు గుంజుతున్నారని, ఇప్పటికి పది మందికి పైగా వాళ్ళ బాధితులు ఉన్నారని మొత్తం వివరం గా చెప్పాడు. వాడు చెప్పిన ఆ రాణి అనే అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి స్టెషన్ కి తీసుకొచ్చారు. మేము అక్కడి నుండి బయటకి వెళ్తుంటే తనని అప్పుడే స్టెషన్ కి తీసుకొస్తున్నారు. ఆమె ని చూడగానే నాకు మా ఇద్దరి మధ్య జరిగిన ఒక సంభాషన గుర్తుకొచ్చింది. నువ్వు ఎలా ఉంటావు అని తనని అడిగితే 'నేనా నల్లగా పొట్టిగా మెల్ల కన్ను వేసుకుని చాలా అందం గా ఉంటాను అని చెప్పింది. అప్పుడు తను చెప్తుంటే ఆట పట్టించడానికి అబద్ధం చెప్పిందనుకున్న, కాని తనని చూసాక అర్ధమయ్యింది ఆమె మాటల్లోని నిజాయితీ. యాదృచ్చికం గా తను చెప్పినట్లు సరిగ్గా ఆదివారమే కలిసాము. ఈ విషయం లో కూడా ఆమె మాట తప్పలేదు.కాకపోతే తనని కలవడానికి పది వేలు ఖర్చయ్యింది అంతే. బయటకొచ్చాక మా ఫ్రెండ్స్ అందరూ సుధ ని కలిసిన శుభ సందర్భం గా పార్టీ ఇవ్వమని అడిగారు. పార్టీ నా తొక్కా, ఇప్పటికే పదివేలు బొక్క అన్నాను. అంతే అందరూ ఒకేసారి కోపం గా నా వంక చూసారు. ఆ చూపులో చాలా మీనింగ్ ఉంది. అమ్మాయి కోసమైతే యాభై వేలు ఇవ్వడానికి రెడీ అయ్యావు, మాకు పార్టీ ఇవ్వమంటే ఏడుస్తున్నావా అన్నట్లుంది వాళ్ళ చూపు.

8 comments:

  1. మీ కథలు చాలా రియలిస్ట్ గా ఉన్నాయి. చచ్చిపోతే కథ ఈనాటి యువత మనసుకి అద్దం పడుతోంది.

    ReplyDelete
  2. కూడలి లో నుండి మీ బ్లాగ్ కి వచ్చా. ఇక్కడే అతుక్కుపోయా. అంత బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీకు నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలు బాల గారు

      Delete
  3. Font size penchandi. and line ki line ki madhyalo koddia gap vachhelaa chudandi. chaduvadaaniki chaala ibbandhigaa undhi.

    ReplyDelete
  4. చాలా బావుంది

    ReplyDelete